సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27 జులై, 2019

వర్షాకాలపు అందం



వర్షం పడుతున్నప్పుడు ఉరుముల శబ్దం వినపడడం సహజం - దానిని గాధాసప్తసతిలో ఓ కవి ఎంత చక్కగా చమత్కరించాడో చూడండి ఓ గాధలో 👇

దానికి నా సరళనువాదమిది 👇👇

" కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా లాగలేకపోతున్నాడు.


అతనలా ప్రయత్నించీ ప్రయత్నించీ విఫలుడవుతూ ఆ అలసట చేత మధ్యమధ్యలో మూల్గుతున్నాడు - ఆ మూల్గుల యొక్క శబ్దమే ఈ ఉరుములు " 🌧. ⛈🌩🌨

- Kks Kiran

వర్షాకాలపు అందం



" వర్ష ఋతువులో గుమిగూడిన నల్లటి మేఘాలవల్ల కనపడకుండా పోయిన చుక్కలూ , చంద్రుడూ ఏమయ్యారో అనే రహస్యాన్ని చేధించడానికి కాలమనే జ్యోతిష్యుడు జ్యోతిష్యశాస్త్రాననుసరించి ఆకాశాన సుద్దముక్కతో గీసిన గణనా రేఖల్లా‌ ఉన్నాయి - ఒకే వరుసననుసరించి ఆకాశంలో‌ ఎగురుతున్న తెల్లటి కొంగల‌బారు 🕊 "

( గాధాసప్తసతిలో ఓ గాధకి‌ నా సరళానువాదమిది )


- Kks Kiran

10 అక్టోబర్, 2017

చలం మైదానం పుస్తకంపై ఓ విమర్శ

" ఇప్పుడు నేను నాకు మా ఆవిడ వల్ల సుఖం లేదు , నా ఫోర్సు తను తట్టుకోలేకపోతోంది . ఆమె వల్ల నేను జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాను ... అందుకే ఇంకొకామెకి తగులుకున్నాను .. మేమిద్దరం కలిసి సిటీ బయట ఏదైనా "మైదానం " వెతుక్కుంటున్నాము అని చెప్తే మీరు ఊరుకుంటారా ? చెప్పు తీసుకొని కొడతారా ??????

' స్త్రీ , పురుషుల లేదా భార్యా భర్తల సంబంధాలు కేవలం శారీరకం కాదనీ , అంతకు మించి ఎంతో ఉందనీ , రోత సుఖాల రొచ్చు లో పడి అయిన వాళ్ళ మెడకు ఉచ్చు తగిలించవద్దనీ , వీటికి అతీతం గా ఎదగమనీ ' చెప్తారా చెప్పరా ???????

ఇలా వ్యామోహాలలో పడి మైదానాల వెనక పడిపోతే ఆనక్కి ఎన్ని గోదానాలు చేసినా ఆ పాపాలు ప్రక్షాళన కావనీ , ఇది ఇంగితం కాదనీ కసురుతారా కసరరా ?

ఇలా సుఖం , స్వేచ్చ పేరుతో ఎవరికి కావాల్సిన దారిలో వాళ్ళు పోతే , పుట్టే పిల్లలకి నాన్న ఎవడో చెప్పలేని దీన స్థితికి ఈ సమాజం దిగజారుతుంది అనీ అది మంచిది కాదనీ విమర్శిస్తారా ? విమర్శించరా????

ప్రతీ స్వేచ్చ కీ ఒక హద్దు ఉంటుంది . హద్దులు దాటిన స్వేచ్చ అనర్ధాలకే దారి తీస్తుంది 


అపరిమితమైన స్వేచ్చని కోరి , అవసాన దశలో అరుణాచలం వెళ్ళే కంటే , పద్దతిగా జీవితం గడిపి ఉన్న ఊరిలో సింహాచలం వెళ్ళటం బెటర్ కదా ?

చలం అభిమానులకి ఎవరూ ఈ సంగతి చెప్పరేంటి ??

మనం నిక్కచ్చిగా మాట్లాడితే మొనగాడు అయిపోము .. వేరే వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడినప్పుడు తట్టుకోగలిగే శక్తి కూడా ఉండాలి

చలం చెప్పే స్వేచ్చని మన కూతుర్లకీ , కోడళ్ళకీ ఇవ్వలేనప్పుడు ఆయన గురించి పెద్దగా చెప్పుకోక పోవడమే బెటర్ "

- Sridhar Neelamraju గారి వాల్ నుంచి సేకరణ 

దీనిపై మీ అభిప్రాయం??

- Kks Kiran

' అశ్వమేధము ' అనే నవలలో భౌద్ధమతంలోని లోపాలను వివరిస్తూ పుష్యమిత్రుని పాత్ర ద్వారా విశ్వనాధ సత్యనారాయణ గారు చెప్పించిన ఓ విశ్లేషణ ఇది

"" మహారాజు బౌద్ధుడు. వాని గుర్రపు వాడు బౌద్ధుడు. మహారాజు తన గుర్రపువానికి నెలజీతమును మించి యీయడు. మహారాజు కుమార్తెను గుర్రపు వాని కుమారునికిచ్చి పెళ్లి చేయునా? వారొక వేళ ప్రేమించినచో నిద్దరును లేచిపోవలెను. 


అందరూ సమానులని చెప్పెడి ఏ సంఘమునందయిన ఏ దేశమునందైనను బరిస్థితి ఇదియే . 


బేధమేమనగా వీడు భోజనము చేయుచుండగా వాడు చూడవచ్చును ,, వానిని పక్కన కూర్చుండపెట్టుకొని వీడు భోజనము చేయడు ... వాని లౌకికమైన మర్యాదకి అది లోటు ...


మతసంబంధముగా చేయుటకు అభ్యంతరం లేదని చెప్పుదురు... లౌకికమైన బేధముల చేత అట్లు చేయరు... చేసినచో మర్యాద నష్టము ,, వారి గొప్పదనం పోవును...


లోకమునందు ఆ గొప్పదనమెట్టిది? మనోనిర్మితమైనదే కదా?


మతవిషయకమైన భేదమూ మనో నిర్మితమైనదే ...


ఈ మనోనిర్మితమైన భేదము మత సంబంధమన్నచో ద్వేష్యమా? లౌకికములయిన ధనాధికారముల విషయమయినపుడు స్వీకార్యమా?? ""


దీనిపై మీ అభిప్రాయం ??

చంద్రునిలో కనపడే నల్లటి మచ్చలను శ్రీనాధుడు తన భీమఖండంలో ఎంత చక్కగా వర్ణించారో చూడండి :)


"" రోహిణీ దేవిని గాఢంగా కౌగిలించుకొనగా ఆమె స్తనాలనుంచి అంటిన కస్తూరి ఏమో ఇది ....!

రాహువు కోర లోపల గ్రుచ్చుకొని పోవడం వల్ల ఏర్పడ్డ రంధ్రమేమో !!

చీకటినంతటినీ దిగమింగినందువలన సహజ నిర్మలమైన శరీరం లోపలనుంచి కనబడుతున్న నల్లని వన్నె ఏమో !!! 

జన్మవేళయందు మందరగిరి రాపిడి చేత కలిగిన గాయపు మచ్చ ఏమో....!!!!

విరహాగ్నిపాలై వేగుతున్న చక్రవాకాంగన కడకన్నుల నుంచి పుట్టిన అగ్ని చేత కమిలిపోయిన భాగమేమో ఇది అన్నట్లుగా కనిపించింది చంద్రబింబంలోని నడిమి మచ్చ " అని 👌

- Kks Kiran

వేయిపడగలు పుస్తకం గురించి ఓ చిరు పరిచయం


విశ్వనాధ సత్యనారాయణ గారు రాసిన " వేయిపడగలు " అనే నవల చదువుతున్నాను ప్రస్తుతం నేను.. 

ఈ పుస్తకం పంతొమ్మిదీ ఇరవయ్యో శతాబ్దాల సంధి చరిత్ర అని చాలామంది అభిప్రాయం. ఆ సమయంలో నూతనంగా సమాజంలో కలుగుతూ ,, సామాన్య విషయాలవలే సంఘంలో జరుగుబాటవడానికి ఆస్కారమవుతున్న అనేకానేక విషయాల గురించీ,, ఆ ఆ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాల గురించీ ఆనాడే హెచ్చరించిన గొప్ప వైజ్ఞానిక భవిష్యపురాణం ఇదని ఇంకొందరి అభిప్రాయం ...

ఆ రెండభిప్రాయాలూ చాలా నిజమని అనిపించేలా అనేకానేక వివరణాలూ, విశ్లేషణలూ ఉన్నాయి ఈ పుస్తకంలో,,

ఉదాహరణకు వివాహ వ్యవస్థ గురించి ఈ పుస్తకంలో కధానాయకుడైన ధర్మారావుతో రాధాపతి,, చక్రవర్తి అనే పాత్రలు చేసే ఈ వాదనలు చదవండి.. ఈ వాదన ద్వారా వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూనే శీలపోషణ,, మనో నియమము యొక్క ఆవశ్యకతనూ ,, స్వేఛ్ఛకీ - విశృంఖలత్వానికీ మధ్యగల తేడానూ ఎంత చక్కగా వివరించారో విశ్వనాధ వారు.

' వివాహమక్కర్లేకుండా సంఘంలో మనుష్యులు బ్రతకాలనీ , సెక్సే జీవిత పరమావధి అను ఉద్దేశముతో నైతిక విలువలకూ,, నాగరిక నియమాలకూ తిలోదకాలిచ్చినా పర్లేదను ' సిద్ధాంతాలతో ఉపన్యసిస్తూ,, ఫేస్బుక్లో పోస్ట్లు రాస్తూ తమని తాము మేధావి వర్గానికి చెందినవారిగా భావించుకొను కొందరు భ్రాంతిపరులకి ఈ మాటలు చెంపపెట్టులాంటివని నా అభిప్రాయం :)

ఆ వాదన ఇదిగో



"" రాధాపతి :- లోకములో స్త్రీ పురుషులందరునూ కామేచ్ఛ కలవారు .. ఎక్కడ చూచినను భర్తయు భార్యయు ఇతర స్థలములయందు సంచరించుచునే ఉన్నారు.. వివాహమన్నది ఆచారముగా చేసుకొనుచున్నారు గానీ,, ' ఇదిగో వీడు ఏకపత్నీవ్రతుడు, ఈమె పతివ్రత ' అని చూపించగల వారిని చెప్పుడు !

ధర్మారావు :- వీరి ప్రవర్తన బాగుగా ఉండలేదని మీరు చూపించుడు.

రాధా :- లక్షోపలక్షలు. మంచివారు నాకెచ్చటనూ కనుపించలేదు

ధర్మా :- మంచివారనగా ఏకపత్నీ వ్రతులు, పతివ్రతలు అనే కదా మీ యర్ధము. అట్టివారు మంచి వారైనప్పుడు అట్లుండట మంచిదనే కదా ! అట్లుందుట మంచి ,, ఇట్లుండుట చెడ్డ. ఇది మీరన్న మాటయే. వేరే వాదమక్కర్లేదు

చక్రవర్తి :- పండితులందరునూ చేయునది ఇదియే. మాటల అర్ధమును విరిచెదరు.. అది వాదన కాదు

ధర్మా :- అది వాదన అవునో కాదో తర్వాత. మీరు వాదించుడు ! లోకములో దాంపత్యము ఆదర్శప్రాయంగా లేదనుట వాదన కాదు. మనము కొన్ని మామిడిపండ్లు పుచ్చువైనచో చక్కని మామిడిపండే ఉండదని వాదించుట ఎట్లు? లోకమునందు ఏకపత్నీవ్రతులు ఉండరాదా?

రాధా :- లేదని నా ఉద్దేశ్యం 

ధర్మా :- ఆ మాట తప్పు. నేనున్నాను

రాధా :- మీకు పరస్త్రీ మీద బుద్ధియే ప్రసరించదా?

ధర్మా :- మీరు సరిగా మాట్లాడవలయును. ' మనసే ప్రసరించదా ' అని అనవలయును. మనస్సు వేరు - బుద్ధి వేరు. మనసు చంచలమైనది, బుద్ధి సిద్ధాంతరూపమైనది. పరస్త్రీ సంగమము దోషము కాదను బుద్ధి నాకు లేదు. మనస్సు ప్రసరింపవచ్చును . మనసు నిత్యము చంచలమైనది. దానిని ప్రయత్నముచే నియమించవలయును.

రాధా;- ఎందుకు నియమించవలయును? దాని ఇష్టం వచ్చినట్లు అది పోయినచో తప్పేమి?

ధర్మా :- మనము విద్య కావాలని చదువుకొనుచున్నాము. చదువుకుని కొంత నీతిగా ప్రవర్తించుచున్నాము. చదువుకొనకపోయిన నేమి? , నీతిగా ప్రవర్తించకపోయిన నేమి ? అనినచో సమాధానమేమియూ లేదు.

చదువుకోనివాడు జానపదుని వలె నాగరికులయందు చక్కగా ఎట్లు ప్రవర్తించలేడో, అట్లే అనియమితమైన మనస్సు మహావిషయములనందు అనాగరికమై ఉండును. ఆధ్యాత్మికమైన గౌరవము కలగదు..

నాగరికత అనగా నియమములకు ఒదిగియుండుట. మనము దగ్గర స్నేహితులతో ఉన్నప్పుడు యధేఛ్ఛగా మాట్లాదుదుము. సభలో ఉన్నప్పుడు ఒక నియమము అవలంబింతుము . దానిపేరే సభ్యత.

వాగ్నియమము ఎట్టిదో,, నలుగురిలో మర్యాదా ప్రవర్తనా ఎట్టిదో,, వానినుసరించి సభలో పురుషునకు యోగ్యత ఎట్లు కలుగునో,, అట్లే మనస్సునకు నియమావలంబనము చేత ఉత్తమ యోగ్యత కలుగును.

వాంఛ అణచని వానికి లఘుత , నియమించినవానికి గురుత. "" అని .

దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

- Kks Kiran​

అప్రత్యక్ష విషయాల గురించి విశ్వనాధ వారి వాఖ్య

"" మడి కట్టుకొనుమనుము ,, ' పరిశుభ్రంగా ఉండాలి కానీ మడిలో ఏముంది ? ' అని అందురు..

' పరిశుభ్రంగా ఉండుటలో మాత్రమేముంది ? అని అనిన ' అసహ్యంగా ఉన్నచో అన్నం సహించదు ' అని అందురు..

ఏల సహించదు ? ఏనాది వారు,, కొందరు నీచ జాతివారు అసహ్యమైన దేహములతో ,, గుడ్డలతో తినుట లేదా ? అని పశ్నించిన. -- ' వారు అనాగరికులు,, బుద్ధిమాలిన వారు : నేను నాగరికుడును,, నాకు పరిశుభ్రంగా ఉండవలయును ' అని అనును..

పరిశుభ్రంగా ఉండుట నాగరికత అయినచో భోజనం చేయువేళ మడిబట్ట యని ,, దానితో ఇంకెవరిని తాకనని నియమముగా ఉండుట మరియు నాగరకతేమో !! 

మురికి ఉండుట లేకపోవడంలలోని తారతమ్యము ప్రత్యక్షము : శుభ్రమైన వస్త్రమునకు మడిబట్టకూ కల తారతమ్యము అప్రత్యక్షము .

నీవు దేవుడున్నాడని అందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై ,, బుద్ధిమంతులు చేత ఊహింపబడునదియే మతము.. అదియే దివ్యము..

అది నీ సామాన్య జ్ఞానమును దాటి యుండును..

సద్విషయమును నీవాచరించవేని అది నీకే నష్టము .. సూర్యునిపై దుమ్ము చల్లిన కన్నులలో పడును ""

- విశ్వ‌నాధ సత్యనారాయణ గారు తన వేయిపడగలు పుస్తకంలో 👊

వేయిపడగలు పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన సూర్యోదయ వర్ణన 👌



" బయట తెల్లవారుచుండెను. తూర్పున ఉదయింపబోవు సూర్యుని కాంతి యెగదట్టెను... 

కొండచరియ ఎక్కలేని సప్తాశ్వముల కాలిగిట్టలు నునుపైన కొండ చరియలపై జారుతూ ఉండగా వడిగల అనూరుని కశాఘాతమునకు తాళలేక ఎగురుతూ నురుసులు క్రక్కగా,, ఆ నురువు కాంతి తూర్పు నందు అలికినట్లు ఉషః కాంతి ప్రజ్వరిల్లింది "

శుభోదయం 👌

గోవధ గురించి విశ్వనాధ వారి మాటలలలో



వేయిపడగలు పుస్తకంలోని కథానాయకుడి పేరు ధర్మారావు.. అతను తన గ్రామంలో ఒకనాడు తిరుగుతూ ఉండగా అతనికి చిక్కి శల్యమైన ఒక ముసలిఎద్దు కనపడుతుంది... అతను దాని పరిస్థితిని చూసి విచారిస్తూ ఉండగా ఆ సందర్భములో విశ్వనాధ సత్యనారాయణ గారు నాగరికత పేరిట పశుసంతతిని నిర్లక్ష్యం చేస్తున్న విధానము గురించి,, గోవధ గురించి ఈ విధంగా వాఖ్యానింపచేశారు ఆ పాత్ర చేత

"" ఇరువది యేళ్ళ క్రిందనున్న ఆబోతులకు దీనికి ధర్మారావునకు తారతమ్యము తోచెను. ఒకప్పుడు ఆబోతును అదిలించినవారు లేరు. కర్రతో కొట్టిన వారు లేరు. తన చిన్నతనములో ఒక ఆబోతు వచ్చి తెరచియున్న బస్తాలోని ధాన్యము తినుచుండెను . ఎవరు నేమియు అనలేదు. కొన్ని తిని ఆబోతు వెడలి పోవుచుండెను. తన తండ్రి కడవతో నీరు తెచ్చి ఆ బోతునకు పెట్టెను. ఆ ఆబోతునకు అక్కర్లేదన్నట్టు తొలగిపోయెను. పక్కనున్న యొక కాపు ' బాబుకి దాహం అగుట లేదు కాబోలు పోనీండని ' అనెను.

ఆ ఆబోతు విశాలమైన ఫాలభాగము, నేత్రములందు రాజాధిరాజులను పోలిన ఠీవీ,, సుందర మంధర యానము, కైలాసగిరి మీది యధేచ్ఛా విహారి. గిర్యుపత్యకల నుత్ఖాత క్రీడ వలన కొమ్ములు తగులుకొన్న రాజతచ్ఛవివోని, కొమ్ముల కాంతితో త్రిలోకాధిపతి వలె సంచరించుచుఉండెను.


బీళ్ళన్నియూ మాగానులు కాలేదు. వృషభరాజు పొలాల మీదకే పోలేదు. కాపు ఆవులను సంతలకు తోడుకొనిపోయి , మంచి కోవగల యాలను, దూడలను పరదేశములకి ఎగుమతి చేయుచుండిరి.. ఒంగోలు వృషభములు, పలనాటి ఎద్దులు సర్వమును సంతనపడి ఇతర దేశములకు పోయెను. దేశములో కోవగల దూడలేదు, ఆవు లేదు. 


జమిందారులు బీళ్ళన్నియూ మాగానులు చేసుకొనుచుండిరి. మాగాని చేయుట కమ్ముచుండిరి. మాగాని తృష్ణ ఎక్కువైపోయెను. పశువు నిలుచుటకు తావులేదు. క్రమముగా పొలాలు యంత్రములతో దున్నుకొందురు.. యంత్రములతో కోసికొందురు.


పశువెందుకు? క్షీరములు కావలయునా? ఆస్ట్రేలియా నుండి రానే వచ్చుచుచుండెను కదా !! ఇంగ్లీషావులను దిగుమతి చేసుకొందుము. అవి మన ఆవుల వలె కాదు.. ఒక్కొక్కటి పదిశేర్లిచ్చును. ఆ పాలకు వెల కూడా ఎక్కువ.

ఆబోతును ధర్మారావు పరిశీలించి చూచెను. దాని యొడలెల్లా కర్ర దెబ్బలు తేలియుండెను.. ధర్మారావునకు దుఖఃము వచ్చెను..


ఆహా !! ఒకనాడీ వృషభరాజు మా దేశమున దైవాధిదైవము . మహా శిల్పులు ఇతని కొమ్ములు, నడక తీరు, పండుకొనిన వైభవము వైభవము, దివారాత్రములు చూచి చూచి నందీశ్వరులను చెక్కుకొనిరి. ఇతడు దేవాలయములందు సమారాధనీయుడయ్యెను. ఇతడు వీధులలో నిలుచుండి పిల్లవాండ్ర చేత గంగడోలు గోకించుకొనెను. ఇతడు వీధులలో నిలుచుండగా బాలురతనితో ఆడుకొనిరి. ఇతని నడుము కింద నుండి దూరిపోయిరి. ఇతని వర్షణశీలమైన అవయవ స్పర్శ చేత గిలగిల నవ్వుకొనిరి. అతడును వారిని తన్నలేదు. పొడవలేదు..


ఆనాడు దేశములో ఇతడొక ఎత్తు , తక్కిన సర్వసృష్టి మరొక ఎత్తు. నాటి సంకులమైన 'కుంద శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర సంకాశములను, కాదంబ కాలేయ కాదంబినీ నీలజాల తమాలికా సన్నిభములును, ప్రౌఢ బంధూక పల్లవ సదృశములును, వికచకాంచన చంపక విస్పుటములైన వర్ణములొప్పనేత్రాభిరామ భంగి నలరారు గో కదంబములు ' లేవు. అవి సంచరించు వనములు లేవు.


గోవు అన్నది నశించిపోయింది. ఆబోతున్నది అదృశ్యమైపోయినది. ' గోబ్రాహ్మణేభ్య శుభమస్తు ' అన్న దేశములో , 'తేభ్యో శుభమ ' స్తన్న దుర్వాక్కే సర్వత్రా విజృంభించెను.. 


బ్రాహ్మణునకు గోవునకు దేశము బ్రతకరానిదయ్యెను. ఇంకను బ్రాహ్మణుడే నయము. ఇంటిలో నుండి త్రోసివేయగా వాసములయినను పట్టుకుని వ్రేళ్ళాడుతూ ఉన్నాడు. ' నాది కర్మభూమి. ఈ భూమిలో నుండి కర్మ పోదన్న ' పంటి బిగువ వానికి వదలలేదు. 


గోవు నోరులేని జంతువు. అది సభలు చేయలేదు. ' నా జాతి చచ్చిపోవుచున్నదో ' అని మొర పెట్టలేదు. పాపము నిమ్న జాతుల లోనను చేర్చుకొనలేదు. దానికి ఓటు లేదు. శాసనసభలకు తన ప్రతినిధులను ఏమి పంపించుకొనగలదు ! వలసపోయిన వారు, తాము పోయినచోటి జాతులను కూకటి వేళ్లతో కుద్దాలించినట్లు తనను కూడా ఎవరో కుద్దాలించిరి. తనకు పొలమునకు వలసవచ్చినది ఎవరు? ఎవరో కనిపించలేదు


ధర్మారావు ఆబోతు వంక మరలా చూచెను.ఆ అపర శివాకృతి ముఖము మీద నెత్తురు కనిపించెను. ఎవరో కర్రపెట్టి కొమ్ముల నడుమ మోపైన దెబ్బకొట్టెను. 


ధర్మారావు మరలా విచారించ ఆరంభించెను..


" గో రాజా ! నీ నెత్తురు కన్నుల చూచితిమి. ఆల పొదుగులు కోసుకొని త్రావితిమి. ఆవుల మాంసము సోల్జరులకు వండిపెట్టితిమి. మా జమిందారులును,మేమును పరమ నాస్తికులమైపోతిమి.


సర్వజంతు సంతానము నందు, వృక్షములందు ,పచ్చిగడ్డియందు ప్రాణం ఉన్నదన్న మా ఋషుల సిద్ధాంతములు నేడు పరాస్తమైనవి. పదార్థ విజ్ఞానశాస్త్రజ్ఞులు రుజువుచేసి చూపించినగాని మేము నమ్మము. మా ఆస్తిక భావములు మంగలములలో పెట్టి మలమల వేయించబడెను.


మా మతం దేవుడున్నాడని కాదు. ఆ దేవుడు ఉండనిమ్ము. చావనిమ్ము. సర్వమైన సృష్టియందును ప్రాణము, జీవము, ఆత్మ కలకలలాడుచున్నదని మా పూర్వ ఋషులు చూచిరి. సర్వ వస్తుగత ప్రాణమును సమారాధించిరి. అంతకన్నా భూతదయ లేదు. మా పూర్వులు గోవధ చేయలేదు. గోవులలో ప్రాణము పరమాత్మకు సన్నిహితమైయున్నది. గోక్షీరము నందు ప్రాణము నిబిడీకృతమై ఉన్నది. అంత ప్రాణశక్తి మరియొక దానియందు లేదు. 


నశించిపోతిమి. గడ్డి కరిచితిమి. మృతుల మైతిమి. "" అని...


ప్రస్తుత పరిస్థితులలో తీవ్రంగా దృష్టి సారించాల్సిన అంశము కదా ఇవి?


- Kks Kiran

సాహితీలోకంలో ప్రధానలోపం



సరుకు లేకుండా సర్వజ్ఞత ప్రదర్శించడం సాహిత్యంలో ఉన్నంతగా మరెక్కడా లేదు

- Kks Kiran

పుస్తక పఠనం యొక్క గొప్పతనం



" పుస్తక ప్రియుడు కానివాడు ఎప్పటికీ బుద్ధిమంతుడు కాలేడు  "


10 ఆగస్టు, 2017

పాఠకులకి నాదో సలహా


కొన్నికొన్నిసార్లు మన జీవితానికీ , ఆలోచనావిధానానికి పరస్పర విరుద్ధంగా ఉన్న వాదాలు వినడం కానీ చదవడం కానీ అలవాటు చేసుకోండి

దానివల్ల మనం నమ్మి అనుసరించే విషయాలలో లోతెంతో తెలిసి వాటిని పాటించాలా వద్దా? అనే విచక్షణ కలుగుతుంది,,

దానివల్ల మనలని మనం సంస్కరించుకోవడం సాధ్యమౌతుంది 

- Kks Kiran

09 ఆగస్టు, 2017

రచయిత - అనుభవం

రచయిత ఏదైనా ఓ విషయం గురించి రాసాడంటే దానికి అన్నిసార్లూ అతనికి అనుభవమే ఉండి ఉండాల్సిన పనిలేదు,, ఆలోచన చాలు నిజానికి

రైల్ వస్తున్నప్పుడు పట్టాలపై తల పెడితే పోయే Chance ఉందని తెలుసుకోడానికి అనుభవమే ఉండాలా ? ఆలోచన చాలదూ???

ఇదీ అంతే 

- Kks Kiran

ప్రస్తుతం నేను చదువుతున్న పుస్తకం


చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రతిష్టాత్మకమైన రచనలైన " రామచంద్ర విజయం " మరియూ " రాజరత్నము " అనే పుస్తకం చదువుతున్నాను ప్రస్తుతం నేను 😊

( ఈయన రాసిన గణపతి అనే నవల ,, ప్రహసనాలు అనే నాటికలు చదివాను నేనింతకుముందు . అప్పటినుంచీ ఈయన రచనలపై మహా ఇష్టం పెరిగింది నాకు,, 

సహజమైన హాస్యాన్ని సృష్టించి రచనలు చేయడం చాలా‌ కష్టం,, అలాంటి సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు ఈయన రచనలు తప్పకుండా చదవాల్సిందే,, అదీకాక ఒకప్పటి గ్రామీణ జీవన విధానం ,, అప్పటి మనుష్యుల స్వభావం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈయన రచనలు తప్పక చదివి తీరాల్సిందే....!!!! )

- Kks Kiran

17 జూన్, 2017

తమని తాము సంఘసంస్కర్తలనుకునే " తాత్కాలిక ఆలోచనా పీడిత విప్లవకారులు " తప్పక తెలుసుకుని తర్కించాల్సిన వాక్యాలివి 😂


"" మనోనియమమనేది కామధేనువు వంటిది. అది మోక్షమునకు సాధనము.

సంఘములోకానీ,, మతములో కానీ, మరొకదానిలోకానీ మీరెన్ని మార్పులైనా తేవచ్చును..

ఇంద్రియ నిగ్రహము,, మనో నిగ్రహము - తద్వారా భక్తియో,, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము ""

- విశ్వనాథ సత్యనారాయణ గారు తన వేయిపడగల పుస్తకంలో

( స్త్రీ పురుష సంబంధం గురించి స్వీయవిచార తర్కోష్ణత వల్ల సబబుగా అనిపించే విషయాలను తమ తమ అమోఘమైన విద్వత్తుతో అభిప్రాయాలుగా,, తప్పక పాటించాల్సిన విషయాలుగా సమాజానికి ప్రకటించి వివాహం లాంటి వ్యవస్థ అక్కర్లేదనే వాదాల దగ్గరనుంచీ,, పై పై అభిప్రాయాలతో మత విమర్శ,, సంఘ విమర్శ చేస్తూ ' ఇప్పుడున్న వ్యవస్థ అంతా అర్ధంలేనిది,, మొత్తం సమాజం ఇప్పటికిప్పుడే  మారిపోవాలనే ' నినాదాలు తరచూ మాటల్లో ప్రకటించే  కుహానా  మేధావులకీ,,  జ్ఞాన విసర్జకులకి చెంపపెట్టులాంటి మాటలివి 😜 

అలాంటి వారినుద్దేశించి మరో విశ్లేషణ కూడా రాసాడీయన ఈ పుస్తకంలోనే ఇంకోచోట సందర్భం వచ్చినప్పుడిలా 

" కొన్ని మహాసూత్రములు ప్రత్యల్ప విషయమునకు పట్టవు...

నాశనము మరల సృజనకు అనుగుణమైనచో మరలా సృజన కలుగును..

చెట్టుకొమ్మ విరిస్తే అది మరలా చిగురు వేయవచ్చును,, చెట్టును తగలబెడితే చిగుర్చుట ఎట్లు?

దుష్టమైన దానిని నాశనము చేసినచో మంచి పుట్టును, మంచిని నాశనము చేసినచో చెడ్డ పుట్టును.. పుట్టినది మంచియో చెడ్డయో విచారించుకొనవలయును..

ఏదో సృష్టి జరుగును జరుగునని ఉబలాటపడిన ఫలితము లేదు..

ఆ జరగబోవు సృష్టి ఇప్పటిదానికన్న ఉత్తమమైనచో ప్రస్తుతమైన దానిని నాశనము చేయుము,,

అంతేకానీ మొగలినీరు నమ్మి చెరువుకట్ట తెంచుకొనుట సరైన విషయము కాదు " అని... )

తమని తాము సంఘసంస్కర్తలనుకునే " తాత్కాలిక ఆలోచనా పీడిత విప్లవకారులు " తప్పక తెలుసుకుని తర్కించాల్సిన వాక్యాలివి 😂

- Kks Kiran

29 మే, 2017

అమ్మవారి దరహాస ప్రభావం


దాసాయ మాన సుమ హాసాకదంబ వాసా కుసుంభ సుమనో
.............................................................
.............................................................

నాసామణి ప్రవర భాసా శివ తిమిర మాసాదయే దుపరతిం !!

భావార్ధ వివరణ :- కవి కాళిదాసు ఈ శ్లోకంలో అమ్మవారి దరహాస ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు.

ఎప్పుడూ సుగంధ భరిత కదంబవనంలో సంచరించే ఆ తల్లి దివ్య మందహాసం ( చిరునవ్వు ) వికసించిన దేవతా పుష్పాల శోభని త్రోసిరాజని శాశ్వతానందాన్ని భక్తులకి ప్రసాదిస్తోంది.. ఆ కారణం చేతనే ఆ పుష్పాలన్నీ ఎప్పుడెప్పుడు ఆ తల్లి పాదాల చెంతకి చేరి దాస్యం చేద్దామా? అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాయట.. అమ్మ కృపవల్ల ఎన్నటికీ వాడని పరిమళాన్ని తమ సొంతం చేసుకోవాలని వాటి ఆశట :)

ఆ తల్లి లోకోత్తర వీణాగానాన్ని చేయటంలో నేర్పరి. చెలికత్తెలతో కలిసి లీలా వినోదంగా తన మధుర కంఠస్వరానికి తోడుగా వీణాగానాన్ని చేస్తూ ఉంటుంది . ఆ గాన మాధుర్యంలో ఈ లోకాలన్నీ పరవశమవుతాయి.

చైత్రమాసంలో అరవిరిసిన అరవిందాల శోభని మించిపోయే ఆ గానానికి పరవశులై సదా ఆ తల్లి చేతులతో ఉండే వరాన్ని కోరుకుని పద్మాలు ధన్యమయ్యాయి. ఆ పద్మాలపై వాలటానికి వచ్చిన తెమ్మెదలు పద్మినీ జాతికి చెందిన ఆ తల్లి ముఖపద్మాన్ని చూసి అసలు పద్మాలని వదిలిపెట్టి అమ్మవారి చెంతనే ఉండిపోవాలని కోరుకున్నాయట.

ఆ తల్లి దయ ధారావర్షంలా కురిసే ఆ దయామృత ధారలో తడిసిన భక్తులందరూ పునర్జన్మ రహితులై పునీతులవుతున్నారు.

మంగళప్రదురాలైన ఆ పార్వతీ దేవి ముక్కెరను భూషణంగా దాల్చిందట. ఆ ముక్కెరలోని మణులు ఆ తల్లి దరహాసం చేసే సమయంలో విచిత్రమైన కాంతులను వెదజల్లుతున్నాయట. ఆ వెలుగులో భక్తులు తమ అజ్ఞానమనే చీకట్లను చీల్చుకుని ముక్తిమార్గం వైపు పయనిస్తారు.

అంతటి మహిమాన్వితమైన అమ్మవారి మందహాస కటాక్షాలు భక్తులందరిపైనా ప్రసరించే వరాన్ని ప్రసాదించమని వేడుకొంటున్నాడు ఆ తల్లిని ఈ శ్లోకంద్వారా కాళిదాసు ఎంతో అద్భుతమైన తన కవితాత్మక ధోరణిలో.

శుభసాయంత్రం :)

- Kks Kiran

27 మే, 2017

మతం గురించి విశ్వనాధ సత్యనారాయణ గారి మాటల్లో


"" మతమెప్పుడును వ్యక్తి విషయము... సంఘ విషయము కాదు.

దుర్జనులు సంఘ విషయమని భ్రమింపచేసి స్వలాభ పరాయణులగుచున్నారు ""

- విశ్వనాధ సత్యనారాయణ గారు తన వేయిపడగలు పుస్తకంలో

08 ఏప్రిల్, 2017

కాళిదాసు కుమారసంభవంలోని చంద్రోదయ వర్ణన


అబ్బబ్బా...!!! ఎంత అందంగా ఉందో చూడండి ఆరుబయట వెన్నెలకాంతి

ఫాల్గుణమాసపు ఈ పౌర్ణమి చంద్రుడ్ని చూస్తూంటే కాళిదాసు రాసిన " కుమారసంభవం " లోని చంద్రోదయ వర్ణన రాయాలనిపిస్తోంది నాకు....

పార్వతీదేవితో వివాహం అయ్యాక పరమశివుడు అత్తవారి ఇంటినుంచి వీడ్కోలు తీసుకుని సురతక్రీడకై పార్వతీదేవితో కలిసి " మలయపర్వతం" పై విహరిస్తూ ఉంటాడు...

అక్కడా చంద్రశేఖరుడు ఆ పర్వతరాజ పుత్రికతో క్రీడిస్తూ ఒకనాటి సాయంసంధ్యావేళ " గంధమాదవనం " లో ప్రవేశించి బంగారుశిలలపై కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తాడు పార్వతీదేవితో కలిసి...ఆ తర్వాత శివుడు సంధ్యావందనం చేసుకోడానికని బయటకువెళ్ళి కాసేపటితర్వాత తిరిగి పార్వతీదేవి దగ్గరకు వచ్చే సమయానికి పార్వతిదేవి ప్రియుడు ఎడబాసివెళ్ళాడని అలిగి కోపంతో మాట్లాడకుండా కూర్చుని ఉంటుంది... అప్పుడు శంకరుడు ఆమెను పలకరించి అనునయంగా,,ప్రేమగా మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో ఎదురుగా కనిపించిన చంద్రోదయాన్ని చూసి ఇలా వర్ణిస్తాడు...

" రాత్రి చీకటిని పారద్రోలడానికై తూర్పు దిశన చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొగలిపూలు విచ్చినట్లు ప్రాగ్దిశన తొలిరేకులు విచ్చుకుంటున్నాయి.

నక్షత్రయుక్తమైన ఈ రాత్రి, ఇంతవరకూ మందరపర్వతంలో దాగిఉండి ఇప్పుడే ఉదయించిన చంద్రునితో కలిసి, నీవు నీ సఖులతో కూడి నాతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తున్నది !

చంద్రుడు వెన్నెల నవ్వు నవ్వుతున్నాడు చూశావా? ఈ లేత వెన్నెల వెలుగులు కొనగోళ్ళతో త్రుంచి నీకు కర్ణాభరణాలు చేయవచ్చు సుమా ! వ్రేళ్ళతో కురులను సవరిస్తున్నట్లు చంద్రుడు తన కిరణాలతో చీకటిని తొలగత్రోసి, ముకుళిత పద్మలోచన అగు రాత్రి ముఖాన్ని ముద్దాడుతున్నాడు !!

పార్వతీ ! ఆకాశంవంక ఒకమాటు చూడు ! చంద్రుని లేత వెన్నెలలో చీకటి తెరలు తొలగిపోగా ఆకాశం, ఏనుగులు కలచివేసిన పిమ్మట నిశ్చలంగా ఉన్న మానససరోవరంలా కనిపిస్తున్నది ! ఉన్నత ప్రదేశాలలో వెన్నెల వెలుగులు అలముకున్నాయి. పల్లపు ప్రాంతాలలో చీకట్లు పరుచుకున్నాయి, అవునుమరి, గుణదోషాలను బట్టి సృష్టికర్త ఉచ్చనీచలు కల్పిస్తూ ఉంటాడు !!!

చెట్టు కొమ్మల సందులగుండా,ఆకుల మధ్యగుండా పువ్వులవలే నేల వ్రాలుతున్న చంద్రకిరణ కోమలరేకలను, వ్రేళ్ళతో పట్టి నీ మ్రుంగురులకు కట్టివేయవచ్చు సుమా !!!! "

అని అంటూ ఇంకా చక్కటి వర్ణనలతో వివరిస్తాడు శివుడు పార్వతీదేవికి ఆ చంద్రోదయం తాలూకు సౌందర్యాన్ని ..ప్రస్తుతానికి ఇంత వరకూ వర్ణనే పోష్ట్ చేస్తున్నాను...మిగతాది ఇంకెప్పుడైనా వివరంగా రాసి పోష్ట్ చేస్తాను,

కాళిదాసు రాసిన ఈ వర్ణన చదువుతూంటే ఆ చంద్రోదయం మన కళ్ళముందే కనపడుతున్నట్లు,దానిని ఆస్వాదిస్తునట్లు ఉంది కదూ?

అదీ కాళిదాసు గొప్పదనం...కవిత్వం రుచి మరిగేట్లు చెప్పడంలో ఇతనిని మించిన కవిలేడంటే అతిశయోక్తి కాదుకూడా....తప్పకుండా చదవండి అతని రచనలు సాహిత్యంపై ఇష్టం ఉంటే.. !!! 

శుభరాత్రి 😊 

- Kks Kiran

😛😜😛😜😛😜😝😝


" ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే...!!! " అని అనవసరంగా వారిని ఆడిపోసుకుంటారెందుకు??

" మగవాడి ఊహలకు అంతాలే లేవులే...!!! " అని భావించుకోవచ్చుగా? ?? 😛😜😛😜😛😜😝😝

#JustRandomThought

- Kks Kiran

07 ఏప్రిల్, 2017

ఆముక్తమాల్యదలో వసంత ఋతువర్ణన


వసంతఋతువు మొదలీరోజు నుంచి 😊 చక్కగా ఋతువర్ణన చేస్తూ ఓ వ్యాసం రాద్దామనుకున్నాను నేను.. కానీ ఏం రాసినా ఈ ఋతువులో ముందు శ్రీకృష్ణదేవరాయల వారిని తలుచుకోవడం భావ్యమనిపించింది.... ఋతువర్ణనలను ఎంత సహజంగా,, సుందరంగా చేశారో ఆయన తాను రాసిన " ఆముక్తమాల్యద " లో...

ముఖ్యంగా వసంతఋతువును ఎంత అందంగా వర్ణించారో చూడండి అందులో 

***************************************

"" ఆముక్త మాల్యద విరహ తాపం ఎక్కువైందని , దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి 
చేరటంతో వసంతం ఆరంభమయింది .

ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగలేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట . విరహం అనే బాటసారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండాపై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది . హేమంతచలి యువతుల్ని కావలించింది .

వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట . చలాకీ చంద్రుడు సూర్య కిరణాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంతరుతువు అనే మంత్రిని , కొత్తగా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలిలాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహంతో కోస్తున్నాయి .

శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించటానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి , చివుళ్ళుగా వేలుస్తున్నాయట. భూదేవి కడుపులోంచి పుట్టిన వృక్షములనే పిల్లలకు పాలపళ్ళు , దంతాలు మొలిచినట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి . వనలక్ష్మి రాబోయే మాధవుని అలంకరించటానికి సింగారించుకొందిట .”

దేవత్వం సిద్ధిన్చినా , మధుపానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకు పంచత్వం రారాదని పంచమ స్వరంతో కోయిల కూస్తోంది . మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .

మధుమాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి కమ్మని వాసనలనిస్తోంది .

తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారుతోందట . యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా చనుదోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .

భృగుమహర్షి తన్నినా నవ్వేసిన విష్ణుమూర్తి వెంకటేశ్వరుడై పద్మాతిని పెళ్ళాడాడు . ఆమె సత్యభామగా మారింది . స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .

మాధవుడు రసాతలాన్ని మకరంద వర్షంతో , భూమిని పూలతో , ఆకాశాన్ని పుప్పొడితో జయించి త్రిలోక విక్రముడైనాదట . చిలకకు జామపళ్ళు మేతగా ఇచ్చిన వసంతుడు ప్రేయసీప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనెలిచ్చి , వసంతలక్ష్మికి వెచ్చని కౌగిలి ఇచ్చి పక్షపాతం లేదని పించాడట ""

అద్భుతంగా ఉన్నాయి కదూ ఈ వర్ణనలు??

శుభోదయం 😊 

వసంతాగమన దిన శుభాకాంక్షలు 😊 😊 😊 

- Kks Kiran