కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
27 జులై, 2019
వర్షాకాలపు అందం

వర్షం పడుతున్నప్పుడు ఉరుముల శబ్దం వినపడడం సహజం - దానిని గాధాసప్తసతిలో ఓ కవి ఎంత చక్కగా చమత్కరించాడో చూడండి ఓ గాధలో 👇
దానికి నా సరళనువాదమిది 👇👇
" కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా లాగలేకపోతున్నాడు.
అతనలా ప్రయత్నించీ ప్రయత్నించీ విఫలుడవుతూ ఆ అలసట చేత మధ్యమధ్యలో మూల్గుతున్నాడు - ఆ మూల్గుల యొక్క శబ్దమే ఈ ఉరుములు " 🌧. ⛈🌩🌨
- Kks Kiran
వర్షాకాలపు అందం

" వర్ష ఋతువులో గుమిగూడిన నల్లటి మేఘాలవల్ల కనపడకుండా పోయిన చుక్కలూ , చంద్రుడూ ఏమయ్యారో అనే రహస్యాన్ని చేధించడానికి కాలమనే జ్యోతిష్యుడు జ్యోతిష్యశాస్త్రాననుసరించి ఆకాశాన సుద్దముక్కతో గీసిన గణనా రేఖల్లా ఉన్నాయి - ఒకే వరుసననుసరించి ఆకాశంలో ఎగురుతున్న తెల్లటి కొంగలబారు 🕊 "
( గాధాసప్తసతిలో ఓ గాధకి నా సరళానువాదమిది )
- Kks Kiran
#ఆషాఢమాసపుకవిత్వాలు 😏
" ప్రియురాలి ఎడబాటు వల్ల కళావిహీనమైన ప్రియుని ముఖము వలె తేజోవిహీనంగా ఉన్నాడు గ్రహణ చంద్రుడు 😜 "
#ఆషాఢమాసపుకవిత్వాలు 😏
- Kks Kiran
వర్షాకాలపు అందం

గోదావరి లోకి ఎర్ర నీరొచ్చి చేరింది
పిల్ల కాలవలు సైతం చాలా వడిగా ప్రవహిస్తున్నాయి గట్టును తాకేంత నిండైన ప్రవాహంతో
ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న గుర్రప్పుడెక్కల మొక్కలను పడవల్లా ఉపయోగించుకుంటూ కాకులు వాటిపై నుంచొని ప్రయాణం చేస్తున్నాయి ఎక్కడికో - వాటికిదేదో సాధారణమైన విషయం అన్నట్లుగా ఏ భయం లేకుండా చాలా నిశ్చింతగా
ఉదయాల్న ఇలాంటి దృశ్యాలు చూడడం వింతైన అనుభవం 😊
శుభోదయం 😃
- Kks Kiran
10 అక్టోబర్, 2017
సూర్యాస్తమయ వర్ణన
సంధ్యాసమయంలో నాట్యం చేసే పరమశివుని కిరీటం నుండి రాలిపడిన మాణిక్యంలా ఉన్నాడు అస్తమిస్తున్న సూర్యుడు 👌
శుభసాయంత్రం :)
- Kks Kiran
ఉషోదయ అందం
నిర్మలమైన ఆకాశగంగా నదీతరంగాలపై కొన్ని వేల బంగారు పద్మాలు వికసించినంత కాంతివంతంగా ఉంది ఆకాశంలో ఉషస్సు ఇప్పుడు 👌
శుభోదయం :)
- Kks Kiran
చంద్రునిలో కనపడే నల్లటి మచ్చలను శ్రీనాధుడు తన భీమఖండంలో ఎంత చక్కగా వర్ణించారో చూడండి :)
"" రోహిణీ దేవిని గాఢంగా కౌగిలించుకొనగా ఆమె స్తనాలనుంచి అంటిన కస్తూరి ఏమో ఇది ....!
రాహువు కోర లోపల గ్రుచ్చుకొని పోవడం వల్ల ఏర్పడ్డ రంధ్రమేమో !!
చీకటినంతటినీ దిగమింగినందువలన సహజ నిర్మలమైన శరీరం లోపలనుంచి కనబడుతున్న నల్లని వన్నె ఏమో !!!
జన్మవేళయందు మందరగిరి రాపిడి చేత కలిగిన గాయపు మచ్చ ఏమో....!!!!
విరహాగ్నిపాలై వేగుతున్న చక్రవాకాంగన కడకన్నుల నుంచి పుట్టిన అగ్ని చేత కమిలిపోయిన భాగమేమో ఇది అన్నట్లుగా కనిపించింది చంద్రబింబంలోని నడిమి మచ్చ " అని 👌
- Kks Kiran
సూర్యోదయ వర్ణన
రోజూ ఎనిమిది బారువుల బంగారాన్ని ఇవ్వగలిగే శక్తిగల శమంతకమణివలె వెలుగొందుతున్నాడు ఆకాశంలో ఉషాపతి ఈ ఉదయాన 👌
శుభోదయం :)
- Kks Kiran
వేయిపడగలు పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన సూర్యోదయ వర్ణన 👌
" బయట తెల్లవారుచుండెను. తూర్పున ఉదయింపబోవు సూర్యుని కాంతి యెగదట్టెను...
కొండచరియ ఎక్కలేని సప్తాశ్వముల కాలిగిట్టలు నునుపైన కొండ చరియలపై జారుతూ ఉండగా వడిగల అనూరుని కశాఘాతమునకు తాళలేక ఎగురుతూ నురుసులు క్రక్కగా,, ఆ నురువు కాంతి తూర్పు నందు అలికినట్లు ఉషః కాంతి ప్రజ్వరిల్లింది "
శుభోదయం 👌
09 ఆగస్టు, 2017
వర్షపు చినుకుల అందం
ఆకాశానికి భూమికీ మధ్య అల్లబడిన పెద్ద పెద్ద సాలెగూడు దారాల్లా ఉన్నాయి ఆరుబయట ఇప్పుడు కురుస్తున్న వర్షపు చినుకులు 👌
వర్షాకాలపు ఉదయపు అందం 👌
వర్షాకాలం వల్ల మంచి యవ్వనపుసిరి పొందిన పసిరి గడ్డికన్నెలు తాము మరింత అందంగా కనపడేందుకై కొసల్న సుందరంగా అలంకరించుకున్న కిరీటాలలా ఉన్నాయి ఆదిత్యుని తేజోవంతమన కిరణాల్లో మెరిసిపోతున్న మంచుబిందువులు ఇప్పుడు 👌
శుభోదయం 😹
- Kks Kiran
కదంబం పూల అందం
నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు ఉదయం ఎంత చక్కగా పూలు పూసిందో చూడండి మా ఇంటి దగ్గర ఉన్న కదంబం చెట్టు 🌻🌻🌻
చాలా ఘాటుగా,, మత్తు కలిగించేట్లు కమ్మటి వాసన వస్తోంది ఇప్పుడు వీటినుంచి 👌
అందుకేనేమో సీతాకోకచిలుకలు,, తేనెటీగలూ తెగ తిరుగుతున్నాయి ప్రస్తుతం ఈ పూలచుట్టూ 😘
ఈ పూలకుండే ఓ ప్రత్యేకత ఏంటంటే ఇవి కేవలం వర్షాకాలంలో మాత్రమే పూస్తాయి.. గుండ్రంగా,, బంతిపూలను అటూ ఇటూ అతికించినట్లు ఉంటాయివి ఆకృతిలో - తెల్లటి కేసరాలు పైనుండి :)
ఆ కేసరాలు కూడా ఆ తర్వాతి రోజే రాలిపోయి మళ్ళీ దగ్గరకి ముడుచుకుపోతుంది ఈ పూవు... ఆ కేసరాలన్నీ అలా గుట్టగా ఈ చెట్టుకింద పడి ఉండడం చూస్తే గాలీ వానా లేని వర్షాకాలపు రాత్రులలో స్వచ్చంగా ప్రకాశించే చంద్రుడు తన తెల్లని కిరణాలతో ఈ చెట్టుకింద పల్చని అట్లువేసాడేమో అన్నంత అందంగా అనిపిస్తుంది 🌙
ఇవి అకాలంలో పూసాయంటే అది పెద్ద వర్షానికి సంకేతమని ఒకప్పటి రైతులు గ్రహించి తమ పొలాలకి జాగ్రత్తలు పెట్టుకొనేవారట..
ఈ పూలంటే అమ్మవారికి బాగా ఇష్టమని ఆమెను " కదంబవనవాసిని " అని పిలుస్తూ లలితా సహస్రనామాలలోనూ అలాగే కాళిదాసు, శంకారాచార్యుల వారి స్తోత్రాలలలోనూ వర్ణించారు...
కనుక ఆమెకే ఈ పూలు అలంకరణగా ఇస్తే బాగుంటుందని భావించి నేనీరోజు ఉదయం వీటిని కాస్త ఎక్కువ మొత్తంలోనే కోసి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి ఆలయంలో పట్టుకెళ్ళి ఇచ్చాను..
ఆ పూల అలంకరణలో మా ఊరి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో _/\_ :)
శుభోదయం
- Kks Kiran
ఠాగూర్ గారి గీతాంజలికి తెలుగనువాదం చేస్తూ ముందుమాటలో కవిత్వం గురించి చలం చేసిన ఓ వాఖ్య 👏
" కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం
కవిత్వం చదివిన తరువాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా !
నీకు తోచనిది, కనపడనిదీ కవి చెప్పిన తరువాత నీ అనుభవం లోనికి ఎంతో కొంత వచ్చేది, అదే నీకు సరి పడే కవిత.. "
27 మే, 2017
సంధ్యాసమయ వర్ణన
" సూర్యుడు సంధ్యాదేవిని కూడటానికి వెళ్తూ వెళ్తూ విడిచిపెట్టిన తన కావిరంగు వస్త్రాలేమో ఈ మబ్బులన్నీ !!!!! " అన్నట్లున్నాయి రక్తారుణకాంతిని తమలో ఇముడ్చుకుని ఎర్రగా కనపడుతున్న మేఘాలు ఇప్పుడు ప్రస్తుతం ఆకాశంలో
చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం 👌
శుభసాయంత్రం 😊
- Kks Kiran
08 ఏప్రిల్, 2017
ఫాల్గుణమాసపు ఉదయపు అందం
"" పవనాత్మజుని గురువు ప్రాగ్దిశన ఉదయిస్తూ పొలాలపై పేరుకుని ఉన్న పొగమంచుని పారద్రోలే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు...
చక్కగా వరాకు కొసలపై పెసరగింజలంత పరిమాణంలో ఉండి మెరుస్తూన్న మంచు బిందువులను ముత్యాలనుకుని భ్రమసి ముక్కెట్టుకుని కెలుకుతున్నాయేమో అలా...!!! అని చూపరులు అనుకునేలా ఆహారాన్వేషణ చేస్తున్నాయి కొంగలు ప్రస్తుతం 😊 😊 ""
ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఆ దృశ్యం చూడడానికి 😊 😊
శుభోదయం 😊
- Kks Kiran
07 ఏప్రిల్, 2017
సంధ్యావందనం - నా అనుభూతి
నాకు ఉపనయనం అయినప్పటి నుంచీ క్రమం తప్పకుండా నిత్యం ఉదయం,సాయంత్రం సంధ్యావందనం చేస్తున్నాను.
గొప్ప మార్పు వచ్చేసింది నాలో అని సోత్కర్షగా చెప్పను కానీ,మార్పు వచ్చిన మాట కొంతైనా నిజం.
పొద్దున్న 6 గంటలలోపే సంధ్యావందనం చేసేసుకోవాలి కాబట్టి ఉదయం 5 గంటలకే లేవడం అలవాటయ్యింది నాకు.చీకటితోపాటే నిద్రలేవడం చాలా బాగుంటుంది.
అప్పుడే ప్రకృతి మేలుకునే సమయం కూడా,
సూర్యుడు కూడా ఇంకా రావడానికి సమయం ఉంటుంది,పువ్వులు కూడా పూర్తిగా విడిచి ఉండవు.ఆకులపై మంచు బిందువులు సమూహంగా ఏర్పడి ఉంటాయి అందంగా.ఆకాశంలో ఉషస్సు కనపడుతుందప్పుడు.అలాంటి సమయంలో ఏ భూపాల రాగమో వింటూ ఓ 5 నిముషాలు సంగీతం వింటూ అటూ ఇటూ అ మంచులో,ఆ చల్లని గాలిలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
మా ఇంటి దగ్గర గోస్తనీ నది ఉంది,ఆ నదీ గట్టుపై ఉన్న పెద్ద పెద్ద చెట్లపై దాదాపు 200కు పైగా కొంగలు నివాసం ఉంటూ ఉంటాయి.అవి పొద్దున్నే అక్కడే ఉన్న చెరువులో గుంపుగా స్నానం చేస్తూ ఉంటాయి.అప్పుడు చూడాలి ఆ దృశ్యాన్ని,నిజంగా ఎంత బాగుంటుందో అలా చూస్తూ ఉంటే,
అలా చాలా పక్షులు అల్లరి చేస్తూ ఉంతాయి తమ తమ గొంతు విప్పి ఎంతో స్వేచ్చగా ఎగురుతూ,నా అదృష్టం ఏంటంటే నా గది కిటికీకి ఆనుకునే నేను పెంచే తోట ఉంటుంది.నిద్రలేవడం అనేది నాకూ పక్షుల కూతలతోనే జరుగుతోంది.ఒకవేళ ఎపుడైనా కాస్త బద్దకించి ముసుగుతన్ని పడుకోవాలనిపించినా పక్షుల సందడితో మెలకువ వచ్చేస్తోంది.
నిత్యకృత్యాలు పూర్తి చేసి మడి బట్టలు కట్టుకుని తొలి తొలి సూర్యకిరణాలు ఒంటిని అభిషేకిస్తునట్లుగా తాకుతున్నప్పుడు గాయత్రీ మంత్రాన్ని కళ్లు మూసుకుని జపించడం అనేది నిజంగా గొప్ప అనుభవమే,
సాయంత్రం కూడా 6 లోపులో పూర్తి చెయ్యాలి కాబట్టి,ఎంత పనులలో ఉన్నా ఆ సమయానికి తయారైపోతున్నా,అందుకే గత 3 సంవత్సరాలుగా అనవసరంగా ఎక్కడికీ బయటకు వెళ్ళడం బాగా తగ్గిపోయింది.
గాయత్రీ మంత్రం చదివే వ్యక్తికి నిజంగానే స్థితప్రజ్ఞత అలవడుతుంది,చెప్తే సోత్కర్ష అనుకుంటారు కానీ నిజం చెప్తున్నా, ఈ 3 సంవత్సరాలుగా నా మనసుకి గొప్ప శాంతి అలవడిన మాట మాత్రం వాస్తవం,
వేద మంత్రాలకి ఉన్న శక్తి అలాంటిది.స్వరస్థానాలను అనుసరించి వాటిని ఉచ్చరిస్తే జపించిన వ్యక్తికి గొప్ప శాంతి కలుగుతుంది.
నాకు కలిగిన ఈ అనుభవం ఇంకొంతమందికి కూడా కలగచేస్తే బాగుండును అని అనిపించింది ఈ మధ్య నాకు,అందుకే నాకీమధ్య ఓ చిన్న కోరిక కలిగింది,
కనీసం నాకు 40 ఏళ్ళు వచ్చినప్పుడైనా ఆసక్తి ఉన్న వ్యక్తులకి కుల,మత బేధం లేకుండా కనీసం సంధ్యావందన విధానం అయినా దగ్గరుండి నేర్పాలని,చూద్దాం ఎంత వరకూ నా ఆకాంక్ష నెరవేరుతుందో,
శుభసాయంత్రం.
- Kks Kiran
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
























