01 సెప్టెంబర్, 2018

ఉండవల్లి గుహలు

మొన్నామధ్య ఓ పనుండి విజయవాడకి వెళ్ళిన నేను అక్కడ నా పని ముగిసాక అక్కడకు దగ్గరలోనే ఉన్న " ఉండవల్లి గుహలను " చూసేందుకై వెళ్ళాను. ఇవి విజయవాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

ఇవి ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా మలచిన నిర్మాణం.ఇది నాలుగు అంతస్తులగా నిర్మింపబడి ఉంది. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. ఇందులో ఉన్న శిల్పాలు గుప్తుల కాలంనాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలిలో ఉన్నాయి.

ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల తమ నివాసం కొరకు ఏర్పాటు చేసుకొన్నట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ నాలుగు అంతస్తుల గుహల్లో మొదటి అంతస్తులో బయటవైపు రుషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. లోపల ఉన్న మండపంలో నరసింహస్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు ఇంకా విష్ణుమూర్తి చుట్టూ చేరి ఆయనని ప్రస్తుతిస్తున్న దేవతల విగ్రహాలు గోడలపై ఉన్నాయి. అక్కడే ఉన్న స్తంభాల మీద కూడా రకరకాల జంతువులు, హైందవ పురాణ కధలలోని కొన్ని సందర్భాలు, సామాన్య ప్రజల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.

ఆ అంతస్తులోనే ఎడమవైపు లోపల ఓచోట శయనించి ఉన్న 'అనంత పద్మనాభస్వామి' విగ్రహం ఉంది. 25 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు గలిగి ఉన్న ఈ అనంత పద్మనాభస్వామి విగ్రహం అత్యద్భుతమైన కళారీతిలో ఒకే శిలపై చెక్కబడి ఉంది. నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు, పక్కన విష్ణు వాహనమైన గరుక్మంతుడు, తపస్సు చేస్తున్న ఋషులు, ఇంకా అనేక విగ్రహాలున్నాయి అక్కడ. రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి వుండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఈ గర్భాలయ ద్వారంపై జయ విజయుల విగ్రహాలున్నాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. అందులో ఎలాంటి విగ్రహాలు లేవు. 

అవన్నీ చూసాక ప్రభుత్వం ఇంకాస్త వీటిపై శ్రద్ధపెట్టి సరైన సదుపాయాలూ, ప్రచారాన్నీ కలిపిస్తే ఇదో గొప్ప పర్యాటక, వైజ్ఞానిక కేంద్రంగా అవుతుందనడంలో సందేహం లేదనిపించింది నాకు.

ఈసారెప్పుడైనా మీరు విజయవాడవైపు వెళ్తే కనుక అవకాశం ఉంటే తప్పకుండా ఈ గుహలని సందర్శించండి.

శుభసాయంత్రం

- Kks Kiran


































































































































































































































































































































1 కామెంట్‌: