ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22 ఏప్రిల్, 2020

ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ?




" ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ? " అనే ప్రశ్నకు " Quora " లో నేను రాసిన సమాధానమిది - ఇది రెండేళ్ళ క్రితమే ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసాను - అప్పుడు చదవని వారికోసం మరలా పోస్ట్ చేస్తున్నాను - ఆసక్తి ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి 👇

"" తాము ఇష్టపడ్డ వ్యక్తి దక్కకపోవడం వల్ల లవ్ ఫేల్యూర్ అయిన వ్యక్తులు ఒకప్పుడు తమ చేతులను బ్లేడ్ లతో కోసుకోవడం,, విపరీతంగా ఏడవడం ,, సిగరేట్ - మందులాంటి వ్యసనాలకు బానిసకావడం, లేక బంధాలు అంటే నమ్మకం లేనట్లు మాట్లాడడం చేసేవారు.. మరీ డీప్ ఎమోషన్ తో బాధపడే వ్యక్తులైతే అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు...

ఇప్పుడు ట్రెండ్ మారింది.. లవ్ ఫేల్యూర్ అయితే వెంటనే వాట్సాప్ స్టేటస్లు లను తరుచుగా సాడ్ గా అప్డేట్ చేయడం,, ఫేస్బుక్లో విషాదాన్ని వ్యక్తపరుచు వాక్యాలతో కూడిన పిక్స్ ని తమ వాల్పై షేర్ చేయడం చేస్తున్నారు ఇప్పటి జనాలు...

తరాలు మారి బాధను,, దానిని ప్రకటించే విధానాలలో మార్పు కొంత కలిగుండచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండూ శుద్ధ బొక్క పనులే.. ఏం ఉపయోగం వీటివల్ల? తాను బాధపడుతూ ఇది తెలిసిన ఆ ప్రేమించిన వ్యక్తినీ,, కుటుంబసభ్యులను ఏడిపించడం తప్ప??

********************************************************

నా ఈ వ్యాసాన్ని చదువుతున్న వ్యక్తులలో ఎవరైనా లవ్ ఫేల్యూర్ కాండిడేట్లు ఉంటే కనుక మీరనుకోవచ్చు,, " మనమెంతో ఇష్టపడి ,, కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది అని ఆశించిన వ్యక్తి మనకి దక్కకపోతే ఆ బాధ వర్ణనాతీతం... ఎన్నున్నా ఏదో లోటుగా ఉన్నట్లు అనిపిస్తుంది జీవితానికి... నిన్నమొన్నటివరకూ " ఒకే ఆత్మ - రెండు జీవితాలు " అన్నట్లు ఉన్న వ్యక్తితో అకస్మాత్తుగా అపరిచితుల్లా ప్రవర్తించాలంటే ఎంత కష్టమైన పనో ?? నరకమనేది ప్రత్యక్షంగా ఇక్కడే అనుభవిస్తున్నట్లుంటుంది ఆ ఫీల్ " అని ..

నిజమే..

అది చాలా బాధాకరమైన విషయమే.. కాదనట్లేదు.. నేనూ అలాంటి కేసులెన్నో చూశాను.. అమ్మాయిల విషయం నాకంతగా తెలీదుకానీ అబ్బాయిల తాము ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల తమకి దక్కకపోతే వెక్కి వెక్కి ఏడవడం ప్రత్యక్షంగా నేనెరుగుదును నా ఫ్రెండ్స్ లో కొందరినలా చూడడంవల్ల...

వాళ్ళనప్పుడు ఎలా ఓదార్చాలో అర్ధమయ్యేది కాదు నాకు .. ఏం చెప్పి వారిని కుదుటపర్చాలో తెలిసేది కాదు... కళ్ళనిండా ఎర్రని జీరలతో,, బాధా - ఆందోళనతో కూడిన ఆలోచనలవల్ల నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ ఏ పనిపైనా ఆసక్తీ ,, శ్రద్ధా లేకుండా విచారమైన వదనంతో తేజోవిహీనమైనట్లు తయారయ్యే వాళ్ళను చూస్తే నిజంగానే ఒక్కోసారి భయమేసేది నాకు " వీళ్ళను ఒంటరిగా వదిలేస్తే ఏం అఘాయిత్యం చేసుకుంటారో " అని..

ఎంత గొప్ప బాధకైనా కాలమే మందనుకోండి.. కానీ ఆ కాలం భారంగా గడిస్తున్నట్లు అనిపించే ఆ కొంతకాలాన్ని గడపడమెలా ? మళ్ళీ ఆ బాధని మరచిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించడం ఎలా? అనే ఇలాంటి అంశాలపై వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చేవాడిని నేను అప్పట్లో...

అవి మీకేమైనా ఉపయోగపడతాయనుకుంటే చదవండి ఇలా..

1. వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోగలగడానికి ప్రయత్నించండి .. మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి ... అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి ... అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా " నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా " అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి... సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు ... మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి... తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి... అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి... మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి... ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

ఇదంతా చదివాక " బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం కిరణ్ ? " అని మీరడగవచ్చు నన్ను ... ఇవన్నీ నే చెప్పింది ఇలా చెస్తే బాధ తగ్గుతుందని కాదు.. మరింత బాధలోకి మీరు నెట్టబడకుండా సాధ్యమైనంతవరకూ అందునుంచి బయటపడతారనే..

బాధలో ఉన్నప్పుడు మీరు మరింత బలహీనమయితే బ్రతుకే అర్ధంలేదనిపిస్తుంది... అలాంటి స్థితికి చేరకుండా ఉండేందుకు ఇవి కాస్తైనా ఉపయోగపడవచ్చు.. అందుకే కాస్త ఈ సూచనలు చేశాను

ఇంతా చెప్పినాకూడా ఇంకా ఒకటి మాత్రం కొసరు మాటగా చెప్పాలనిపిస్తోంది నాకిలా..

" జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు - సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి ""


- Kks Kiran

10 ఆగస్టు, 2017

Awesome MomenT In College Life 😂


మన అబ్బాయిలకుండే వెధవ దుర్లక్షణాలలో ఇదొకటి అని నా ప్రగాడ నమ్మకం 😉 అదేంటంటే,,

' పొరపాటున మన ఫ్రెండ్ ఎవడైనా ప్రేమలో ఉన్నాడని తెలిస్తే వాడి లవర్ కనిపిచ్చినప్పుడల్లా వాడికన్నా మనం అత్యుత్సాహం కనపర్చడం 😛 '

ఇదేం దిక్కుమాలిన లక్షణమో మన అబ్బాయిలలో తెలీదుకానీ పొరపాటున మనవాడెవడైనా మనతో " నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా ....!!! " అని మనతో చెప్పడం పాపం ఇక ఆ అమ్మాయి గురించి All Updates ( అంటే ఎక్కడెక్కడకి వెళ్తోంది? ఏమేం చేస్తోంది వగైరా వగైరా ) ఆ అబ్బాయికి ఇస్తూ ఆ అమ్మాయి ఇక మనవాడి పెళ్ళమే అని ఫిక్స్ అయ్యి ,, వాడి పెళ్ళి దగ్గరుండి చేసే బాధ్యత మనదే అన్నట్లు బిహేవ్ చేస్తారు మన అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు 👥

దీనివల్ల బానే లాభాలున్నట్లు కనపడుతుంది కానీ ఒక్కోసారి ఈ అత్యుత్సాహం దూల దీర్చి బేడ మిగులుస్తుంది పాపం మనోడికి 💇

దీనికుదాహరణగా నేనెరిగిన ఓ సంఘటన చెప్తాను ఇప్పుడు,, చదవండి ❤

"" నేను కాలేజీలో చదువుతూ ఉండగా మావాడొకడు పక్క బ్రాంచ్ లో చదివే ఓ అమ్మాయికి లైనేసేవాడు 😘

General గా అబ్బాయిలు ప్రేమలో పడితే ఆ అమ్మాయికి తప్ప మిగతా ప్రపంచానికంతా చాలా ఈజీగా తెలిసిపోతుంది,, సో ఆవిధంగా మా వాడి Issue మా ఫ్రెండ్స్కి అర్ధమై మావాడికిి Help చేస్తూ వాడి లవర్ మా బ్రాంచ్ మీదుగా వెళ్తూనప్పుడల్లా మావాడి పేరుని గట్టిగా అరుస్తూ,, మావాడిని కుదిపేస్తూ తెగ అత్యుత్సాహం ప్రదర్శించేవాళ్ళు..

అమ్మాయిలకి సహజ జ్ఞానం ఎక్కువ మన అబ్బాయిలతో పోలిస్తే,, తనకా మేటర్ అర్ధమై ఓ దుర్ముహూర్తాన ( అదే రాఖీపండగ రోజున,, అంతకన్నా భయంకరమైన రోజు ఏముంటుంది మన అబ్బాయిలకి :p ) ఓ రాఖీ తీసుకొచ్చి ( చచ్చింది గొర్రె 💘 ) " రాఖీ కట్టించుకో అన్నాయ్యా " అని మావాడి కుడిచేయి పట్టుకొని ( పాపం !! పాణీగ్రహణం అప్పుడు పట్టుకోవాలని మావాడు ఆశపడిన చెయ్యది 😭 ) రాఖీ కట్టేసింది 👎

( అమ్మాయిలు బయట అబ్బాయికి రాఖీ కట్టారంటే దానర్ధం వాడిపై అవ్యాజమైన సోదరప్రేమ పొంగి కాదు,, దాని అసలర్ధం నే చెప్పనా?

'' ఓరి వెధవా....!!! నేను నీతో బాగా మాట్లాడతా, , ఫ్రీగా మూవ్ అవుతా,, చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాను కూడా,,

అది నువ్వు అలుసుగా తీసుకొని ప్రేమ, పెళ్ళి లాంటి ప్రసక్తి నా దగ్గరకు తెస్తావేమో....!!! ఆ Chance నీకివ్వకుండా నీ తోక కత్తిరించి నిన్ను అదుపులో పెట్టేందుకే నిన్ను " అన్నయ్య " ని చేస్తున్నాను ఈ విధంగా " అని దాని అసలంతరార్ధం 😏 )

దానితో ఇంకేమంటాడు మావాడు ' అన్నయ్యా ' అంత అంత ఆప్యాయత ఒలకపోతూ ఆమె అలా రాఖీ కట్టాక 😶 హుతాశుడైపోయాడు ఏం మాట్లాడాలో,, ఏ విధంగా Respond అవ్వాలో అర్ధంకాక ,, పాపం 😥

ఆ Scene గుర్తొచ్చింది నాకు ఇందాక ఈ పిక్ చూసాక ,, అందుకే సరదాగా నా శైలిని కాస్త పక్కనపెట్టి రాసా దీనిని 😂

శుభసాయంత్రం 😂

- Kks Kiran

27 మే, 2017

ముల్లు ఆకు మీద పడినా ఆకు ముల్లు మీద పడినా పోయేది ఆకే,, ఉండిపోయేది ముల్లే 😜


కాలేజీలో చదివే చాలామంది అబ్బాయిలు విపరీతమైన ఆశాపరులు,, ఊహాత్మక జీవులు 😘 

ఎవరైనా అమ్మాయి కాసేపు కలివిడిగా మాట్లాడితే చాలు,, " తమకి త్వరలో పుట్టబోయే పిల్లలకి ఈ ఈ పేర్లు పెట్టాలని " ఇప్పటినుంచే ఆలోచించి ఆనందించి మురిసిపోయే రకాలెక్కువమంది ఉంటారు సాధారణంగా ఆ ఏజ్లో 😍 

అలా కేవలం ఊహలను వాస్తవాలుగా భావించి ప్రేమ కలల్లో తేలిపోయే అబ్బాయిలను ఉద్దేశించి కాస్త ఆలోచింపచేసేలా,, బలంగా వారి మనసునందు ముద్రపడేలా ఏదైనా రాద్దామని కొన్నేళ్ళ క్రితం ( నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ) రాసానిది కాస్త నా రచనా శైలిని పక్కనపెట్టి సరదాగా, కాస్త విభిన్నంగా 😜

ఆ వ్యాసం ఇదిగో 😂 

********************************************

" ముల్లు ఆకు మీద పడినా ఆకు ముల్లు మీద పడినా పోయేది ఆకే,, ఉండిపోయేది ముల్లే. "

ఆకు అనగా అమ్మాయి, ముల్లు అనగా అబ్బాయి... పోయేది ఆకే అంటే ఫైనల్గా యూ.ఎస్.ఎ పోయేది అమ్మాయే,, ఇక్కడ ఉండిపోయేది ముల్లు అంటే అబ్బాయి...

దీని అర్ధమేమిటంటే ,,చదువుకునే రోజుల్లో అబ్బాయిలూ,, అమ్మాయిలూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు 😘 సరదాగా గడుపుతారు...

అయితే కాలేజ్ అయ్యాక,, ఇంటికెళ్ళిపోయాక అమ్మాయిలు చదువు ధ్యాసలో పడిపోతారు...బాగా మార్కులు సంపాదిస్తారు,,ఇంటర్యూలో సెలక్ట్ అయ్యి అమెరికా పోతారు,,లేదా అబ్బాయిలతో పోలిస్తే జి.ఆర్.ఇ లాంటి పరీక్షలలో 30-40 శాతం తక్కువ స్కోర్ వచ్చినా అమెరికాలో మంచి యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి అమెరికా పోయేది ఆకే !! లేదా అమెరికాలో సెటిల్ అయిన ఒక స్మార్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ని మేరేజీ చేసుకుని ఆకు అమెరికాకి పోతోంది !! ఐ.టీ రంగంలో కూడా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు... ఉండిపోయేది ముల్లే 😒 

సాయంత్రందాకా కాలేజీలో చెప్పుకున్న సోది కబుర్లను ఇంటికెళ్ళి 4 గంటలపాటు గేదెలా నెమరేసుకుని,,ఏవేవో పిచ్చిపిచ్చిగా ఇష్టమొచ్చినట్లు ఊహించుకుని,, మన బేవార్స్ ఫ్రెండ్స్ అందరితోనూ ఓ ఉప్పర్ మీటింగ్ పెట్టి,, పార్టీలిచ్చేసి రాత్రి పుస్తకంపై ధ్యాస పెట్టక పరీక్షలలో చీదుతున్నారు మన అబ్బాయిలు..

కొంతమందైతే అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడితే చాలు,,పుట్టబోయే కొడుకుకి పేరు కూడా పెట్టేసుకుంటున్నారు 😜 

అమ్మాయిలతో మాట్లాడిన విషయాలూ,, గడిపిన సమయం,, చెప్పుకున్న సొల్లుకబుర్లు సూర్యచంద్రులవలె శాశ్వతమైనవని భావించి సప్లిమెంటరీ ఎగ్జాంస్ రాసుకుంటూ కాలేజీలోనే ఉండిపోతోంది ముల్లు... ఇంతా చేస్తే వాడిచ్చే బోడి పార్టీ ముష్టి 10 రూపాయల కూల్డ్రింక్... దానికోసం మరో 10 మంది తమ జీవితాలనూ,, కాలాన్నీ " కాయ్ రాజా కాయ్ " అని పణంగా ఒడ్డి సర్వ నాశనం చేసుకుంటున్నారు...

కాబట్టి అబ్బాయ్ !!! 

సొల్లు కబుర్లూ, పిచ్చిపిచ్చి వేషాలూ వేస్తే నీ కళ్ళెదురుగానే అమ్మాయిలు దేశాలన్నీ చుట్టొచ్చేస్తూంటే నువ్వు మాత్రం పిచ్చోడిలా,, వెర్రి వెంగళప్పలా, బేవార్స్లా గాలి తిరుగుడు తిరుగుతూ అందరిచేతా ' చీ ' కొట్టించుకుంతూ పరమ దరిద్రమైన,, నీచ,నికృష్ఠమైన కమీనా కుక్క బ్రతుకు గడపవలసి వస్తుంది...

Kks Kiran రాసిన ఈ ఒక్క పోష్టూ Skip చేస్తే సరిపోతుందనుకుంతున్నావేమో,, ఖబడ్దార్!!!

" సొల్లు మాటలు కట్టి పెట్టోయ్ గట్టి భవితను తలబెట్టవోయ్..

చొంగ కార్చుట మానవోయ్ అమ్మాయిలకి పోటీగా చదవవోయ్...!!! "

అందుకే చెప్తున్నా...

" మగువతో చదువు,చనువు, తగవు,తెగవు,తగవు "

ఇక తర్వాత నీ కర్మా,,నీ ఇష్టం,,నేను చెప్పాల్సినవి చెప్పాను మరి...!!!

స్వస్తి _/\_

- Kks Kiran

24 జనవరి, 2017

బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు


" ప్రేమంటే ఇద్దరూ కలిసి ఊహాలోకంలో విహరించడం కాదు,,

ఈ లోకంలోనే ఆనందంగా బ్రతకడం ఎలా? అని తార్కికంగా ఆలోచిస్తూ దానిని ఇద్దరూ కలిసి అమలులో పెట్టడం 😜 " 

చివరగా ఓ ముక్క :- " బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు, అది ఒట్టి కాలక్షేపం మాత్రమే "

- Kks Kiran

07 జనవరి, 2017

ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఒకటి చదవండి 😊



 ***** త్యాగం *****

"" పదేళ్ళ జాన్, తన చెల్లితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది.

 జాన్ ది  ఆ గ్రూప్ రక్తం "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నాడు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. 

తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమక్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను"అన్నాడు .

ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.

"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని.

డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నవా!" అని అడిగాడు

"అవును"

డాక్టర్ గొంతు వణికింది."అనుకునే ఇచ్చావా?' అన్నాడు కంపిస్తూ... ""

- Yandamoori Veerendranath గారి " విజయానికీ ఆరో మెట్టు " నుంచి సేకరణ

- Kks Kiran

24 ఆగస్టు, 2016

రాఖీపండగ సందర్భంగా నా చెల్లెలికోసమై నేను నా స్వంతదస్తూరీతో రాసి తనకిచ్చిన ఓ " ప్రేమలేఖ " ఇది...




" @ నమ్రతా,,

చాలాకాలం వరకూ నా తర్కానికీ,,నా మేధస్సుకీ అర్ధంకాని విషయాలలో ఇదొకటి...!!!
అదేంటంటే " ప్రేమ అనేది ప్రకటిస్తేనే తెలుస్తుందా? లేక తనకి తానుగా అర్ధం చేసుకోబడుతుందా ? " అని...

" ప్రేముంటే అది అప్పుడప్పుడూ ప్రకటించాలి,,లేకపోతే అది అవతలివారికెలా అర్ధమవుతుంది? " అని అంటారు కొందరు...అందుకే ఈ గ్రీటింగ్ కార్డ్లూ,,బహుమతులతో అవతలివారిని " నువ్వంటే నాకింత ఇష్టం " అని తెలియచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోకంలో చాలామంది...

కానీ నిజంగా ప్రేముంటే మనుష్యులమధ్య ఇన్ని ఆర్భాటాలూ అక్కర్లేదేమోనే...!!! అవతలివారితో నువ్వొక్కముక్క మాట్లాడకపోయినా నీ తాలూకు ప్రేమ చిన్న చిన్న చర్యల ద్వారాకూడా అవగతమైపోతూ ఉంటుంది నిజానికి.

ఆ లెక్కన నేనెంత అదృష్టవంతుడినే...!!! ఎంత ప్రేమ వ్యక్తమైంది మనమధ్య మన చిన్నతనం నుంచీ?

చలికాలంలో ఉదయాన ఆరుబయట ఓ చోట గడ్డిపరకలను పేర్చుకుని చలిమంటాగా చేసి దానిచుట్టూ మనం కూర్చుని మధ్యమధ్యలో " టప్ " అని పేలిన వరి కంకుల పేలాలను అపురూపంగా భావించి ఆత్రపడి తినడం గుర్తుందా నీకు? 

వేసవి కాలపు రాత్రులలో హాయిగా మన మేడపై పడుక్కుని ఆ చంద్రుని చల్లదనాన్నీ,,మిణుకుమిణుకుమనే నక్షత్రపు కాంతినీ,,తేలిపోయే తెల్లటి మేఘాలనీ చూస్తూ,,కొబ్బరి ఆకుల మీదనుంచి వచ్చే సంగీతాన్ని వింటూ ఏ చీకూచింతా లేకుండా సామాన్యమైన విషయాలనే ఎంతో ఆనందంగా చెప్పుకుంటూ అర్ధరాత్రీ దాటేవరకూ నిద్రని నిర్లక్షం చెయ్యడం మర్చిపోగలమా చెప్పు? 

ఇప్పుడు తలుచుకుంటే చాలా స్టుపిడ్గా అనిపిస్తుందికానీ దాదాపు మనం 10 క్లాస్ అయ్యేంతవరకూ ఇంకా చిన్నపిల్లల్లా మషాలదెయ్యం అనీ,,నేలాబండా అనీ,,సబ్జావిండోర్ అనీ,,కబాడీ అనీ సాయంత్రాలు గడపడం మర్చిపోవసాధ్యమా? హూం?

ఇక ఆ ---- విషయంలో ఎంత సాయం చేశావే నాకు నువ్వు? ఇప్పుడంటే నిజంగా నాకు చాలా నవ్వు వస్తుంది అవతల వ్యక్తియొక్క వ్యక్తిత్వమూ,,ఆలోచనా విధానం ఏమిటో తెలుసుకోకుండానే ప్రేమించడమేమిటి నా పిండాకూడులా అని? దానినే సైకాలజీలో ఇంఫాట్యువేషన్ అని ఒకడూ,,ఐడెంటిటీక్రైసిస్ అని మరో మానసిక శాస్రవేత్తా అంటాడు కానీ అప్పుడవేవీ నాకు తెలియదు కదా?

ఆ వయసులో నేను దానివైపు చూడడమూ,,చూసి మురిసిపోవడమూ చేస్తుంటే దాని తాలూకు Updates ఎన్ని ఇచ్చి నాకు సాయం చేశావే? అది ఎక్కడెక్కడికి ఎప్పుడు వెళ్తుంది,, ఏమేం మాట్లాడిందో ఆ వివరాలన్నీ నాకు పూసగుచ్చినట్లు చెప్తూనే నా గురించి దాని దగ్గర బాగా గొప్ప చేస్తూ చెప్పిన ఆ విషయాలకీ,,ఆ మాత్రపు సాయానికీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలనే నేను నీకు? కుబేరుడి దగ్గర ఆ వెంకన్న బాబు ఎంత రుణపడ్డాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీకు ఈ విషయంలో చాలా రుణపడ్డట్టే అనిపిస్తుంది ఈ విషయం తలుచుకుంటే మాత్రం నాకెప్పటికీనూ ;)

నీకు తెలుసా నమ్రతా? మొన్నామధ్య సంక్రాంతికి అమ్మమ్మావాళ్ళ ఊరికొచ్చినప్పుడు మనం అందరం సర్పవరం భావనారాయణ స్వామి గుడికీ,,కోరంగి మడ అడవులకీ,,కాకినాడ బీచ్కీ వెళ్ళి సాయంకాలం బస్లో తిరిగివస్తూంటే నువ్వు నాపక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఆ ప్రయాణపు బడలిక చేత మాటల్లోనే నిద్రపోయావు నా భుజంపై నీ తలనాంచుకుని...

అమ్మాయివై ఉండడంవల్ల నువ్వీ విషయం ఎరగకపోవచ్చు నమ్రతా.. ఒక స్త్రీ మగవాడి భుజంపై తన తలనాంచుకుని పడుక్కుందంటే అది ఆ మగవాడిపై తనకుండే ప్రేమకీ,,నమ్మకానికీ,,అతను తనకివ్వగలిగే భద్రతకీ పరాకాష్ట అని అర్ధం...అలాంటిది నువ్వలా నా భుజంపై పడుక్కునేసరికి ఆ ఒక్క క్షణంలో నేనభవించిన ఆనందానికీ అంతేలేదంటే నువ్వు నిజంగా నమ్మవు...!! స్వర్గలోకపు ఆధిపత్యం నాకాసమయంలో ఎవరైనా వరంగా ఇచ్చినా దానికంటే ఇదే ఉత్తమమని నేను వదిలేద్దునుకూడా ఆ అవకాశాన్ని..అంత ఆనందం కలిగింది నాకాసమయంలో :)

ఎప్పుడూ మనలని మనం ఆటపట్టించుకుంటూ,సరదాగా తిట్టుకుంటూ కాలాన్ని గడిపామేకానీ ఏనాడైనా " నేను నిన్ను ప్రేమిస్తున్నాను " అని కానీ,, " నువ్వంటే నాకిష్టం " అనికానీ చెప్పుకున్నముటే??? కానీ ఈ ఒక్క చర్యా చాలదూ ప్రేమని వ్యక్తీకరిచడానికీ భాషకానీ,,మాటలుకానీ అవసరంలేదూ ప్రేమపూర్వకమైన స్పర్శ ఒక్కటీ చాలనీ??

అప్పుడే నాకర్ధమైంది నాకు నీవల్ల ఈ విషయం " ప్రేమ అనేది ప్రకటించకపోయినా అర్ధం చేసుకోబడుతుంది " అని..

అంత గొప్ప ప్రేమని నాకిప్పటికీ ఏలోటూ లేకుండా అందిస్తున్నందుకూ చాలా టాన్క్సే నీకు ( అయిపోయిన Cinimaకి Wallposterlu వెయ్యడం ఎందుకే? అని ఇప్పటికీ నేను నవ్వుతూ మొత్తుకుంటున్నా వినక " మా వదిన కనిపించిందిరా,,మా వదిన ఇలా అందిరా " అని ఇప్పటికీ దానితాలూకు Details నాకందిస్తూ నన్ను సరదాగా ఆటపట్టిస్తున్నందుకు కూడా అనుకో ;) )

చెప్తే చాలా మెలోడ్రమెటిక్ వాక్యంలా ఉంటుందని ఇంతకాలం నేను నీకిది చెప్పలేదుకానీ - నీకంటే పెద్దోడిగా నేను పుట్టి నీచేత నోరారా కమ్మగా ఇలా " అన్నయ్యా " అని పిలిపించుకునే అదృష్టం పొందినందుకు నిజంగా గత జన్మలో ఏవో గొప్ప తపస్సులూ,పుణ్యకార్యాలూ నేను చేసుండుంటానే..!!! లేకపోతే ఇంత గొప్ప అవకాశం నాకు దక్కేనా చెప్పు???

రాఖీపండగ శుభాకాంక్షలు :)

- అన్నయ్య "

25 జులై, 2016

చలం ప్రేమలేఖల గురించి పరిచయ వాఖ్య



"" ఈమధ్య కాస్త ఎక్కువగానే వేదాంతపు రాతలు చదివాను నేను... ఆత్మా,పరమాత్మ,జీవాత్మ,ఘటాకాశం,మాయ,మిధ్యా ఈ కబుర్లు ఎక్కువున్నాయి అందులో... ఒక్కటీ వాస్తవిక జీవితానికి అన్వయించుకొని ఉపయోగించదగ్గ విషయాలలా తోచలేదు నాకు... అనవసరంగా బుర్రపోటు తెచ్చుకున్నాను ఈ పుస్తకాలు చదవి.. ఇంకా ఇవే చదువుంటే " జగమే మాయ - బ్రతుకే మాయ " అనే విషయ వైరాగ్యపు కీర్తనలు పాడుకుంటూ ఉప్పరసన్యాసిలా హిమాలయాలికిపోతానేమో అనే భయం కలిగింది... 
అందుకే ఈ స్థితి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి చలాన్ని ఆశ్రయిస్తేనే ఉత్తమమని చలం రాసిన " ప్రేమలేఖలు " పుస్తకం చదవడం మొదలెట్టాను మళ్ళీ చల్లని ఈ గాలీ,,వర్షపు చినుకుల చప్పుడుని ఆస్వాదిస్తూ చక్కగా నా గదిలోని కిటికీ దగ్గర కూర్చుని...
చలం గారు నిజంగా ఓ గొప్ప మాంత్రికుడు..ఆయన రాసిన పుస్తకాలు తెరిస్తే ఆయన తన శైలితో ముందు మనలని తన వశం చేసేసుకుని తర్వాత తన భావాలను,,అనుభవాలనూ,అభిప్రాయాలనూ ఒక్కొక్కటిగా మన పక్కనే ఆయన కూర్చుని వివరించీ చెప్తునట్లు ఉంటాయి ఆయన రాతలన్నీ..... ముఖ్యంగా ఈ ప్రేమలేఖల్లో అయితే మరీను...!!!
ఆయన మనో స్థితికి అత్యంత దగ్గరగా మనలని తీసుకెళ్ళి ఆయన పొందిన ఆనందాన్ని,,ఆ విరహాన్నీ మనచేత కూడా అనుభూతి చెందించేంత గొప్పగా రాసారు ఈ ప్రేమలేఖలన్నీ.. అందులోని ఆ తాజాదనము, ఆ సున్నితత్వమూ, ఆ సహజత్వమూ మనలని విపరీతంగా ఆకర్షించి ఆ పుస్తకం అయ్యేంతవరకూ మనలని ఎక్కడికీ కదలనియ్యకుండా కూర్చోపెట్టి ఏకధాటిగా చదివింపచేస్తాయి...
అంత అందంగా,అద్భుతంగా ఉంటాయి ఈ ప్రేమలేఖలన్నీ... ఇవి చదువుతూంటే చలం ప్రియురాలిపై ఈర్ష్యాభావం జనిస్తోంది నాకు..
" గత జన్మలో ఆయన ప్రియురాలిగా నేను పుట్టి ఉంటే ఎంత బాగుండునో " అనే అర్ధంలేని ఆశకూడా కల్గుతోంది నాకు ;) ""
శుభసాయంత్రం :)
- Kks Kiran


16 జులై, 2016

ఆషాడమాసపు విరహం





ఆషాడం వల్ల విరహపడుతున్న కొత్త దంపతుల ఉచ్ఛ్వాస,నిశ్వాసాలలోని  వేడిని సూర్యుడు కొంత అప్పుగా తీసుకున్నాడేమో..!!!

అందుకే పొద్దున్న పూటైనా సరే ఇంత వేడిగా ఉంది వాతావరణం ;)

శుభోదయం :)

- Kks Kiran

11 జులై, 2016

మిత్రుడి కోసం నేను రాసిపెట్టిన ఓ ప్రేమలేఖ




" నా లవర్కి పంపడానికి ఏమైనా మంచి కవితలు చెప్పు కిరణ్ " అని ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది నాకప్పుడప్పుడూ...

చాలా ఇబ్బంది ఎదురవుతుంది నాకప్పుడు..ఎందుకంటే నిజంగా నాకు కవిత్వం రాయడం రాదు...ఏదో అప్పటికప్పుడు నాకనిపించిన భావాలు ఇలా రాయడమేగానీ కవిత్వపు లక్షణాలుగానీ,,ఆ చందస్సులూ ఇవేమీ పెద్దగా తెలియవునాకు....పైగా కవిత్వం అనేది ఇలా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఇచ్చేసే కాఫీలాంటిది కాదు..అది వ్యక్తిగత అనుభూతివల్ల మాత్రమే ఏర్పడుతుంది ( చాలా సందర్భాలలో )...

ఆ వ్యక్తిగత అనుభూతి అనేది ఆ ఇద్దరిమధ్య జరిగిన సంఘటనల వల్లా,,వాళ్ళ వాళ్ల అనుభవాలవల్లా ఆధారపడి ఏర్పడుతుంది..

పోనీ ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా మనమేదో వాళ్ళకి రాసిచ్చామనుకోండి అది ఆ ఇద్దరు వ్యకుల సంస్కారానికీ,,అభిరుచులకీ,,అలవాట్లకీ పొంతన కుదిరే విషయంలా అనిపించాలి..లేకపోతే అందులోని ఆ కవితారసం ఉత్త అర్ధంలేని వ్యవహారంలా తోస్తుంది...

ఉదాహరణకి " పౌష్యమాసంలో తెలిమంచు సమయంలో తెరలను తొలగిస్తూ వచ్చే ప్రభాత సూర్యుని కిరణాలవంటి శరీరపు రంగు కలదానివి నువ్వు " అని రాశామనుకోండి..అది వీడి సొంతభావాలుగా వీడు  ఆ అమ్మాయికి  పంపితే ఆమె పొద్దున్న 10 గంటలవరకూ పక్క దిగని మహానుభావురాలైతే ఏమర్ధమవుతుంది ఆ పుష్యమాసపు ఉదయపు అందమూ,,అందులోని ఆనందమూనూ?

పోనీ ఆ అమ్మాయి వరకూ ఎందుకూ? అసలు ఋతువులెన్ని?? తెలుగు నెలలపేర్లేమిటి ??? అనే విషయాలేవీ తెలియని మహామేధావనుకోండి మనవాడు....అలాంటి విషయవిజ్ఞాని ఇలా మెసేజ్ పెడితే " ఎక్కడనుంచి ఎత్తుకొచ్చవ్ ఈ కవిత ? " అని వాడిని సులభంగా గేలి చేసి అదేదో నవ్వులాట విషయమైనట్లు మాట్లాడుంది ఆ అమ్మాయి వీడితో...

ఇక ఎంత గొప్ప కవిత్వం రాస్తే ఏం అక్కడ?? అదో పనికిమాలిన విషయంగా మారిపోయినప్పుడు ???

అందుకే " మీ మనసులో నిజంగా ఆమె గురించి ఏమనిపిస్తే అదే రాయండి..అంతకు మించిన గొప్ప కవితేదీ ఉండదు వాస్తవానికి...మీయొక్క ఆ మాటల్లోని నిజాయితీకి ఆమె తప్పకుండా కనక్ట్ అవుతుంది " అని తప్పించేసుకుంటూ ఉంటాను నేను చాలా సందర్భాలలో..

అయినా కొందరు " అవేంకాదురా,,నువ్వు మంచి కవిత పంపు చాలు,,మిగతావి నేను చూసుకుంటాను " అని బెదిరించి రాయించుకుంటారు నాచేత..

ఇదిగో అలా ఈమధ్య నా డిప్లమా ఫ్రెండ్ ఒకతను తన లవర్కి పంపించుకుంటానంటే ఇలా రాసిచ్చాను నేను..

" వరలక్ష్మీ,,

నిన్నూ,,నీ పేరుని తలుచుకున్నంత గొప్పగా నేను ఆ భగవంతుడిని తలుచుకుని ఉంటే ఈపాటికి స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసి
ఉంచేవాడేమో నాకోసం....!!!

అయినా నా పిచ్చి కానీ,
నిన్ను చూసినప్పుడూ , నిన్ను తలచినప్పుడూ నేను పొందే ఆనందం
ఏ స్వర్గం మాత్రం అందివ్వగలదు
చెప్పు?

సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే " సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు " అని పోతనగారు
భాగవతంలో వర్ణించినట్లుగా నా ముందు సాక్షాత్కరించినా నాకు నిన్ను చూసినప్పుడు కలిగేంత ఆనందం కలుగుతుందా చెప్పు ?

అంత గొప్పగా నా మనసు నీ వశమయ్యేట్లు ఏం మంత్రం ప్రయోగించావు నాపై నువ్వు వరలక్ష్మీ??? " అని...

ఎలా ఉందిది???



- Kks Kiran

04 జులై, 2016

మగవాడి ప్రేమలో ఉండే అసూయ



తొలి ప్రేమలో అబ్బాయిల మనసు చాలా చిత్రంగా ఉంటుంది...


తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఏ అబ్బాయితోనూ తిరగకూడనిదీ,,మాట్లాడకూడనదీ అయ్యుండాలని కోరుకుంటాడు..

మరి అలా ఏ అబ్బాయితోనూ తిరగనిదీ మాట్లాడనిదీ వీడికి మాత్రం ఎలా లభ్యమవుతుంది?
కాబట్టి ఆ అమ్మాయి వీడొక్కడితోనే తిరగాలి,మాట్లాడాలని భావిస్తాడు..

అలా ఆ అమ్మాయి ప్రవర్తిస్తే ఆమెని మంచిదనో పతివ్రత అనో అంటాడు...అలా కాకుండా వేరే విధంగా ఆ అమ్మాయి ప్రవర్తించిందా?? వీడి హృదయం భగ్గుమంటుంది...ఆమె చాలా దుర్మార్గురాలవుతుంది వీడి దృష్టిలో...ఇక ఆమె చేసే పనులన్నీ దోషాలులా అగుపిస్తాయి వీడికి....

ఎంత కాదనుకున్నా 16-19 ఏళ్ళ వయసులో ప్రతీ మగవాడూ ఇలానే ఆలోచిస్తాడేమో...!!!

అందుకే చాలా సార్లు రాశాను నేను " మగవాడి ప్రేమ ఎంతో కొంత అసూయతో నిండి ఉంటుందని..... "

ఏమంటారు?

10 జూన్, 2016

ప్రేమంటే?





ప్రేమించడంవేరు,,ప్రేమించానని అనుకోవడం వేరు.. ఈ రెండూ ఒకటే అనుకుంటారు అందరూ సాధారణంగా...కానీ నక్కకీ,,నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది ఈ రెండిటిమధ్యా..


*********************************************************************************


నేనెరిగినంతలో ఇప్పటి ప్రేమజంటల్లో చాలామంది ప్రేమించానని అనుకుంటున్నారేతప్ప నిజంగా ప్రేమించడం ఎరగరు...

వీళ్ళలో చాలామంది నిజంగా ప్రేమించడంకన్నా " అవతలి వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను " అనే భావాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ మురిసిపోతూంటారు..

గంటల తరబడి ఫోన్లలో మాట్లడుకోవాడాలూ,లేట్ నైట్ టెక్స్ట్ లు,ఇంట్లోవాళ్ళకి తెలియకుండా దొంగతనంగా కలవడం,,కలిసి తిరగడం ఇవన్నీ తెలియని త్రిల్ల్ ని తనువంతా నింపుతూ ఉండడంవల్ల అదే ప్రేమ అనుకుంటున్నారుకానీ నిజానికి వాళ్ళు ఇష్టపడుతున్నది ఆ ప్రాసెస్ని మాత్రమే...దురదృష్టవశాత్తూ వయసుతాలూకు వుద్రేకమూ,,ఆ ఆకర్షణ ఈ ప్రాసెస్నే ప్రేమ అనుకునేలా చేస్తోంది ఇలాంటివాళ్ళకి వాళ్ళ భావాన్ని బలంగా సమర్ధించేలా..

అమ్మాయిలలో ఆధారపడే గుణమూ,,అబ్బాయిలలో " ఓ రాయివేసి చూద్దాంలే...!! " అనే మనస్తత్వమూ లేకపోతే ఇటువంటి ప్రేమలు పుట్టనే పుట్టవసలు..

" సరే,,ఈ సొల్లంతా మాకెందుకూ? ప్రేమ అంటే నిర్వచనమేమిటో నువ్వు చెప్పు ? " అని గట్టిగా గదమాయించి మీరు నన్ను అడిగితే నేనూ చెప్పలేననుకోండి దీనికి సరైన సమాధానం...

కానీ నాకనిపించేదేంటంటే ప్రేమ అనేదో తదాత్మత. అది మొదలైనప్పుడు ఎలా ఉన్నా తుది వరకూ అంతకిమించి ఆకర్షణతో నిలబడి ఉండాలేకానీ ఆ స్థాయికి తగ్గి పడిపోకూడదు..పడిపోతే అది ప్రేమకాదు - కేవలం అవసరం మాత్రమే...

కోరికనుంచి కాంక్షకి - కాంక్షనుంచి ఆరాధనా భావానికీ ఆ బంధం చేరుకుంటే అదే ప్రేమ.

( కోరికకీ కాంక్షకీ తేడా ఏమిటి?? అంటే దానికి అనుభవపూర్వకమైన సమాధానం ఏదీ లేదు నా దగ్గర.

" కేవలం శారీరక అవసరం కోసమే ఆ వ్యక్తిని దగ్గరకి తీసుకుంటే అది కోరిక...

కాంక్ష అనేది కోరికకి పై మెట్టు.

సీతాకోక రెక్కలకి అంటి ఉండే పొడిని కొనగోటితో అంటించుకుని ఆమె కనురెప్పలపై దానిని మృదువుగా అద్ది ఆమె చెంపలపై చేతులేసి ఆమె ముఖాన్ని నీ దగ్గరగా తీసుకుని ఆ కన్నులను ముద్దు పెట్టుకోవాలనిపిచడం కాంక్ష...సాంబ్రాణిపొగవల్ల సువాసన పొందిన ఆమె కురులలో నీ ముఖాన్ని దాచుకుని ఆ కురులు కలిగించే కితకితలనూ,,ఆ సువాసననూ ఆస్వాదిస్తూ,,ఆనందిస్తూ ఆమెతో మాట్లాడాలనుకోవడంకూడా కాంక్షే...

భౌతికపరమైన ఈ ఆకర్షణలని మించిన ఇష్టం ఆ వ్యక్తిపై నీవు కలిగి ఉంటే అది ఆరాధనా భావం " అని నా భావన )

ఏమంటారు?

- Kks Kiran

25 మార్చి, 2016

మగవాడి ప్రేమ - అసూయ



" మగవాడిప్రేమ కామంతో నిండి ఉంటుందనుకుంటారు చాలామంది." అది చాలా తప్పుడు అభిప్రాయం. మగవాడి ప్రేమ నిజానికి ఎంతో కొంత అసూయతో నిండి ఉంటుంది...

" ప్రేమ ఉన్నచోట అసూయ ఉండదు " అని అంటారు కొందరు. అది బహుశా ఏ అమ్మాయినీ ప్రేమించనివాడో లేక నాలాంటి నిష్కామకర్మయోగో సృష్టించిన మాట అయ్యుంటుంది... పట్టించుకోకండి అటువంటి మాటలను.

ఇప్పుడంటే 21 ఏళ్ళు వచ్చేసి " జీవితంలో వ్యక్తిగత ప్రేమ అనేది ఓ చిన్న భాగం మాత్రమే,, జీవితాన్ని ప్రేమించడం, చక్కగా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం " లాంటి స్టేటెమెంట్లు ఇచ్చేస్తాం కానీ,,, మన కౌమారపు ప్రారంభ దినాలు గుర్తు తెచ్చుకోండోసారి...

అంటే 13-17 వయసు మధ్యలో ఉన్న రోజులు. " నాకూ మీసం వచ్చేస్తోంది " అని అప్పుడప్పుడూ అద్దం ముందు చూసుకుని గర్వపడి మురిసిపోయే రోజులవి.

ఆకర్షణకి, ప్రేమకి తేడా ఏమిటో తెలియని రోజులవి..

కచ్చితంగా ఎవరో ఓ అమ్మాయి ఆకర్షణీయంగా అనిపిస్తుంది మనకి(నాలాంటి ఋష్యశృంగులకి తప్ప)...

ఆమె నవ్వు,, ఆమె ప్రతీ కదలిక ఏదో తెలియని వెర్రి ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది మన హృదయంలో...

తను " మన తెలివితేటలు,గొప్పదనం గుర్తించి మనమంటే చాలాగొప్ప " అనే అభిప్రాయం ఏర్పరుచుకోవాలని తెలియకుండానే ఆశించే రోజులవి....

కలల్లో, ఊహల్లో ఆమె గురించి ఏవేవో అందమైన ఆలోచనలు,,మనకప్పుడు భావుకత్వం, కవిత్వంలేకపోయినా సరే... ( కొందరు అబ్బాయిలు ఐతే " మాకు పెళ్ళి అయ్యాక అబ్బాయి పుడితే ఈ పేరు, అమ్మాయి పుడితే ఈ పేరు అని ఇప్పటినుంచే నిశ్చయించేస్తూ ఉంటారు కూడా.....!!! )

ఆమె మాటలు,ఆమె నవ్వు,ఆమె స్నేహం అన్నీ మనకే దక్కాలని,మనకోసమే అయ్యుండాలని తీవ్రంగా కోరుకుంటాము...

అలాంటి సమయాలలోనే నక్షత్రకుడిలా ఎక్కడనుంచీ ఊడిపడతాడో కానీ ఎవడో ఓ దుర్మార్గుడు (ఆ వయసులో వాడు మనకి అలానే కనపడతాడు మరి) వస్తాడు.....మనం ఇష్టపడే అమ్మాయితో  నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటాడు.......

వాడిని అస్తమానూ చూస్తే ఒళ్ళు మంట మనకి. " అయినా వాడు ఆ అమ్మాయికి ఏ సోదరుడి వరసో అయ్యుంటాడు, లేకపోతే ఆమె అలా మాట్లాడుతుందా వాడితో " అని అనుకోకపోతేకానీ శాంతిలేదు మన హృదయాలకి అప్పట్లో.......!!!

వాడు నవ్వుతూ తుళ్ళుతూ కాకుండా ఇంకా ఎక్కువగా ఏమైనా ఎగస్ట్రాగా ప్రవర్తిస్తూ ఉంటే మన హృదయం భగ్గుమంటుంది....

" వాడిని ఒంటరిగా దొరికినప్పుడు కుమ్మేద్దామా? లేక గుంపుగా మనోళ్ళందరినీ తీసుకెళ్ళి కుమ్మేద్దామా? " అని ఎందుకాలోచిస్తాం అప్పుడు???

మగవాడి ప్రేమంటే అంతే మరి.... అసూయతో అలానే ఉంటుంది మరి....

గమనిక:- మగవాడి ప్రేమ అసూయతో నిండి ఉంటుంది కదా? అని నీకు ఆ అమ్మాయి దక్కకపోతే ఆ అమ్మాయిని చంపెయ్యడం, యాసిడ్ దాడులు చెయ్యడం అవి సరి కాదు..అదసలు ప్రేమే కాదు. పైశాచికత్వం.

నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్ళి జరిగిందా? నీఅంత అదృష్టవంతుడెవడూ లేడు ఈ భూప్రపంచంలో అని సన్మానాలు సత్కారాలు జరిపించుకునే ఏర్పాట్లు చేసుకో...

దక్కలేదా?  ఇంకా మంచిది...జీవితంలో సాదించాల్సింది ఎంతో ఉంది కదా???

నిజంగా ప్రేమ కలిగి ఉంటే ఆ అమ్మాయి ఎందుకు???  ఆ అమ్మాయి జ్ఞాపకాలు చాలుగా???వాటితో నీ జీవితాన్ని ఆనందంగా గడిపే డ్యూడ్...

అంతే...ఇక చెప్పేందుకేం లేదు..

- Kks Kiran

24 మార్చి, 2016

వ్యసనం నుంచి వ్యక్తిత్వంవైపు



ప్రేమలో విఫలం అయినా , లేదా మానసికంగా ఆరోగ్యం బాగాలేకపోతే సిగరెట్లు,మందు లాంటి వ్యసనాలు అంటించుకుని మెదడుని ఇంకా పాడు చేసుకోవడంకన్నా మంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకుంటే నిజమైన ఆనందం,జ్ఞానం కలుగుతాయి.

అవి సిగరెట్ కన్నా ఎక్కువ కిక్ ఇస్తాయి , మందు కన్నా మనసుపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.


- Kiran

18 నవంబర్, 2014

శృంగారం మానసికం కూడా



ఓ ముఖ్య గమనిక :- ఈ పోష్ట్ లో శృంగారం గురించి,, దానిని ఆనందించే పద్దతులు గురించీ రాశాను కొంత... మరీ పచ్చిగా,, చదవడానికి ఇబ్బందికరంగా అనిపించేలాకాక సాధ్యమైనంతవరకూ సంస్కారవంతంగానే రాశాను.... ఒకవేళ మీకు ఇలాంటి విషయాలు ఇలా రాయకూడదని అనిపించినా,,, చదవడానికి ఇబ్బందిగా తోచినా చెప్పండి,,, వెంటనే ఈ పోష్ట్ని రిమూవ్ చేసేస్తాను....

అసలు నేను రాయడానికెంచుకున్న ఈ అంశంపై ఎంతోకొంత ఆలోచనా,, అవగాహనే ఉంది తప్ప అనుభవమేదీ లేనే లేదు నాకు.... అయినాకూడా ఈ పోష్ట్ రాస్తున్నానంటే అందుకు కారణం " సెక్స్కీ,, శృంగారానికీ చాలా తేడా ఉంది " అని నాకు అనిపించడం చేతా,,, అదీకాక గొప్ప రసపుష్టిగల మన కావ్యాలనీ,, వాటి గొప్పతనాన్ని ఇంకొంతమందికి ( ముఖ్యంగా మా యువతరానికి ) పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో రాస్తున్నాను ఈ రాతలను... తప్పులుంటే నా అజ్ఞానాన్ని మన్నించి చదవండి దీనిని 👇👇

"" లైఫ్లోనూ,, రొమాన్స్ లోనూ మంచి టేస్ట్ ఉండాలి. కొందరి ఇళ్ళళ్ళో పడక గదులు చూడండి. దుమ్మూ,, మకిలి పట్టిన బొంతల వాసనలతోనూ,, సరిగ్గా గాలీ,, వెలుతురూ కూడా రాక చాలా దరిద్రంగా ఉంటాయి. ఆ గదిలోని గోడలమీద వాళ్ళ తాత ముత్తాతల ఫొటోలు ఏవో ఉంటాయి. రొమాన్స్ సంగతి పక్కనపెడితే అసలు అలాంటి గదులలో మనుష్యులు ఎలా నిద్రపోతారా? అనే ఆశ్చర్యం వేస్తుంది మనకి...

అలా జీవితంలో ఏ అనుభూతి అక్కర్లేదని శృంగారం విషయంలో ఉత్త పశుకామం చూపేవారిని పక్కనపెడితే " జీవితంలో ప్రతీ అనుభవం నుంచీ గొప్ప అనుభూతిని పిండుకోవాలి " అని అనుకునే వాళ్ళలో మీరు ఒకరైతే తప్పకుండా మీరు మన భారతీయ సాహిత్యం చదవండి. కావ్యాలలో ఎంత బాగా రాశారో శృంగారం గురించి...!!! ఆ ఆ కావ్యాలలో శృంగార వర్ణనలు కూడా మన శరీరంపై పనిచెయ్యడం కాకుండా మన మనసుపై పనిచేసేలా ఉంటాయి..

ఉదాహరణకి " శ్రీహర్షనైషదం "లోని ఈ వర్ణన చూడండి...

" నలుడికీ, దమయంతికీ మధ్య "సిగ్గు" అనే నది ప్రవహిస్తూ వుందట. అతడిని చేరాలంటే ఆమె దాన్ని దాటక తప్పలేదు. ఏం చేస్తుంది పాపం? ఈత రానివాడు కుండలను కట్టుకుని నదిని దాటినట్లు - తన రొమ్ములందు యౌవనంవల్ల నూతనంగా యేర్పడుతున్న కుంభముల జంట సాయముతో లజ్జ అనే నదీ మార్గాన్ని దాటి అతడి హృదయ సామ్రాజ్యాన్ని అధిష్టించిందట.. "

ఎంత సునిశితమైన పోలికో చూడండి ఇది.. ఇలాంటివే ఎన్నో ఉన్నాయి మన సాహిత్యంలో.
వాత్సాయనుడు ,, కొక్కోకుడు రాసిన శాస్త్రాలు ఒక ఎత్తైతే వసుచరిత్ర,, శృంగార శాకుంతలం ,, మేఘసందేశం , గాధాసప్తసతి లాంటి మహా కావ్యాలు మరో ఎత్తు  
ఇవి చదివిన పాఠకుడికి చక్కగా చిలిపిదనం,, భావుకత్వం పెరిగి ఎంతో ఆహ్లాదకరంగా,, ఆనందంగా అనుభవిస్తాడు తన రొమాన్స్ ని...

" ఏదో తింటాం, కాపరిస్తాం, కంటాం, పెంచుతాం అనే మనుషులుగాక ఈ లోకంలోని రసాన్ని అందుకుంటామని ప్రయత్నించే ఏ మనిషికైనా శృంగారాన్ని మించిన అనుభవం లేదు... సృష్టి ఇచ్చిన కామాన్ని సబ్లిమేట్ చేసుకుని మానవుడు స్వయంగా తాను సృష్టించున్న భూతల స్వర్గమే శృంగారం " అని అంటాడు గుడిపాటి వెంకటాచలం... తాను రాసిన " స్త్రీ " అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించాడు స్త్రీ పురుష్యులు తమ శృంగార జీవితాన్ని ఎలా గడపాలో అని ఇలా.

" ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు వెన్నెలరాత్రుల, సముద్ర తీరాల, నదీతీరాల, చల్లగాలిలో, తెల్లని యిసుకమీద, నీళ్లచప్పుడులో లేక అందమైన అడవులలో, పచ్చిక బయళ్లమీద తమ దేహాన్ని దాచుకునే అవసరమూ అసహ్యమూ లేక, జతలుగా విహరిస్తూ, ఆడుతూపాడుతూ స్వేచ్చగా నిర్మలాకాశం కింద, పువ్వుల వాసనలో, భూమే శయ్యగా తిరిగి కలుసుకునే అవకాశం యెప్పుడు కలుగుతుందో కదా...!!!!

ఈ మందులూ, కషాయాలూ, చమటా, రహస్యమూ, అందవికారమూ, తొందరా, బలహీనత్వమూ, తిండివల్లా, బట్టల్లేని బొమ్మలవల్లా కలిగే కుహనా ఉద్రేకమూ, దొంగమాటలూ, అనుమానాలూ, ఆగ్రహాలూ, నీరసాలూ యెప్పటికి పోతాయో? అసలు పోనే పోవో?

భార్యాభర్తలు పొద్దున్నా, సాయంత్రమూ, వెన్నెల్లో, చల్లని శుభ్రమైన గాలిలో షికార్లు పోవాలి. ఆటలాడాలి. పుస్తకాలు చదవాలి. క్లబ్బుల్లో,సొసైటీల్లో మెంబర్లయి ఎవరి పనులమీద వారుండాలి. అనేక సిట్యువేషన్లలో పరిచయాలు కావాలి. అనేక స్త్రీ పురుష స్నేహితులతో కలవాలి. తామే లోకంలోకల్లా ఒకరికొకరమని ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ వుంటే త్వరగా ఒకరినొకరు ఎన్నడూ చూసుకోడానికి ఇష్టంలేకుండా అయిపోతారు. మొదట్లో ఒకరికిఒకరం చాలమా అనిపిస్తుంది. కానీ ఆ అభిప్రాయాన్ని నమ్మితే చాలా మోసం. అనేక పనులలో ధ్యాసలలో కాలం గడిపి కామం మరిచిపోవాలి. ఇతరుల్ని తన ఇంటికి పిలవాలి. తామితరుల ఇళ్లకి వెళ్లాలి. కామం వల్లగాక ఇతర విధాల ఒకరినించి ఒకరు ఆనందం పొందే పధ్ధతులు తెలుసుకుని అనుభవించాలి. కవిత్వం, సంగీతం, కళాభిరుచి, సృష్టి సౌందర్యం, గ్రంథపఠనం - వీటిలో ఐక్యం కావాలి. ఒకరినొకరు చూస్తే చాలు, వేలు తాకితే చాలు, పరవశమయ్యేట్టు మనసుని వుంచుకోవాలి. అప్పుడప్పుడు ఒకరినొకరు మళ్ళీ కలుసుకోడం మంచిది. " అని..."

దగ్గరదగ్గరగా భర్తృహరి కూడా ఇలానే మారే ఋతువు,, కాలం,, ప్రకృతికి అణుగుణంగా మనిషి తన శృంగార జీవితాన్ని ఎంత గొప్పగా గడపవచ్చో తన " శృంగార శతకం " లో అత్యద్భుతం చెప్పాడు....

ప్రస్తుతం శరదృతువు కదా? ఈకాలంలో దంపతులు ఎలా గడపాలో ఈ విధంగా సూచించాడు....

" శరత్కాలంలో దంపతులు ఏకాంతంగా మేడమీదకి చేరుకోవాలి... అర్ధరాత్రి వరకూ కాలక్షేపం చేయాలి... చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది.. అప్పుడు రతి ప్రారంభించాలి...
పురుషుడు,, తన స్త్రీ కింది పెదవిలో దాగిన మధ్యాన్ని తనివితీరా ఆస్వాదించాలి. భర్త అలసటను గమనించిన భార్య అతనిని కౌగిలించుకుని తానే రతి చేయాలి.. అప్పటికి పూర్తిగా అలసిపోయిన పురుషునికి వీర్యవృద్ది కలిగించే " హంసజలాన్ని " స్త్రీ తెచ్చి ఇవ్వాలి (హంసజలం అంటే పగలంతా సూర్యకిరణాలకి కాగి,, రాత్రి చంద్రకిరణాలకు చల్లబడుతూ రాత్రింబవళ్ళు ఉండే నీరు ...ఇది రతి శ్రమని పోగొడుతుంది,, శీతలత్వాన్ని ఇస్తుంది.. ముఖానికి కాంతినిస్తుంది... సంభోగ సామర్ధ్యాన్ని పెంచుతుందట)

ఈ విధంగా శరదృతువు గడవని పురుషుడు దురదృష్టవంతుడు... " అని చివర్లో ఓ మాట అనేశాడు కూడా భర్తృహరి...
చూసుకోండి మరి...!!!

శరదృతువు అప్పుడే సగం అయిపోయింది 😏  అయినా పర్లేదులెండి,, దగ్గర్లో కార్తీకపున్నమి ఉందిగా 😉
ఇంకేం మరి 😉
ఇక నిర్ణయాలు మీ మీ వ్యక్తిగతం 😉 ""

శుభరాత్రి 😉

- Kks Kiran