22 ఏప్రిల్, 2020

ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ?




" ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ? " అనే ప్రశ్నకు " Quora " లో నేను రాసిన సమాధానమిది - ఇది రెండేళ్ళ క్రితమే ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసాను - అప్పుడు చదవని వారికోసం మరలా పోస్ట్ చేస్తున్నాను - ఆసక్తి ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి 👇

"" తాము ఇష్టపడ్డ వ్యక్తి దక్కకపోవడం వల్ల లవ్ ఫేల్యూర్ అయిన వ్యక్తులు ఒకప్పుడు తమ చేతులను బ్లేడ్ లతో కోసుకోవడం,, విపరీతంగా ఏడవడం ,, సిగరేట్ - మందులాంటి వ్యసనాలకు బానిసకావడం, లేక బంధాలు అంటే నమ్మకం లేనట్లు మాట్లాడడం చేసేవారు.. మరీ డీప్ ఎమోషన్ తో బాధపడే వ్యక్తులైతే అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు...

ఇప్పుడు ట్రెండ్ మారింది.. లవ్ ఫేల్యూర్ అయితే వెంటనే వాట్సాప్ స్టేటస్లు లను తరుచుగా సాడ్ గా అప్డేట్ చేయడం,, ఫేస్బుక్లో విషాదాన్ని వ్యక్తపరుచు వాక్యాలతో కూడిన పిక్స్ ని తమ వాల్పై షేర్ చేయడం చేస్తున్నారు ఇప్పటి జనాలు...

తరాలు మారి బాధను,, దానిని ప్రకటించే విధానాలలో మార్పు కొంత కలిగుండచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండూ శుద్ధ బొక్క పనులే.. ఏం ఉపయోగం వీటివల్ల? తాను బాధపడుతూ ఇది తెలిసిన ఆ ప్రేమించిన వ్యక్తినీ,, కుటుంబసభ్యులను ఏడిపించడం తప్ప??

********************************************************

నా ఈ వ్యాసాన్ని చదువుతున్న వ్యక్తులలో ఎవరైనా లవ్ ఫేల్యూర్ కాండిడేట్లు ఉంటే కనుక మీరనుకోవచ్చు,, " మనమెంతో ఇష్టపడి ,, కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది అని ఆశించిన వ్యక్తి మనకి దక్కకపోతే ఆ బాధ వర్ణనాతీతం... ఎన్నున్నా ఏదో లోటుగా ఉన్నట్లు అనిపిస్తుంది జీవితానికి... నిన్నమొన్నటివరకూ " ఒకే ఆత్మ - రెండు జీవితాలు " అన్నట్లు ఉన్న వ్యక్తితో అకస్మాత్తుగా అపరిచితుల్లా ప్రవర్తించాలంటే ఎంత కష్టమైన పనో ?? నరకమనేది ప్రత్యక్షంగా ఇక్కడే అనుభవిస్తున్నట్లుంటుంది ఆ ఫీల్ " అని ..

నిజమే..

అది చాలా బాధాకరమైన విషయమే.. కాదనట్లేదు.. నేనూ అలాంటి కేసులెన్నో చూశాను.. అమ్మాయిల విషయం నాకంతగా తెలీదుకానీ అబ్బాయిల తాము ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల తమకి దక్కకపోతే వెక్కి వెక్కి ఏడవడం ప్రత్యక్షంగా నేనెరుగుదును నా ఫ్రెండ్స్ లో కొందరినలా చూడడంవల్ల...

వాళ్ళనప్పుడు ఎలా ఓదార్చాలో అర్ధమయ్యేది కాదు నాకు .. ఏం చెప్పి వారిని కుదుటపర్చాలో తెలిసేది కాదు... కళ్ళనిండా ఎర్రని జీరలతో,, బాధా - ఆందోళనతో కూడిన ఆలోచనలవల్ల నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ ఏ పనిపైనా ఆసక్తీ ,, శ్రద్ధా లేకుండా విచారమైన వదనంతో తేజోవిహీనమైనట్లు తయారయ్యే వాళ్ళను చూస్తే నిజంగానే ఒక్కోసారి భయమేసేది నాకు " వీళ్ళను ఒంటరిగా వదిలేస్తే ఏం అఘాయిత్యం చేసుకుంటారో " అని..

ఎంత గొప్ప బాధకైనా కాలమే మందనుకోండి.. కానీ ఆ కాలం భారంగా గడిస్తున్నట్లు అనిపించే ఆ కొంతకాలాన్ని గడపడమెలా ? మళ్ళీ ఆ బాధని మరచిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించడం ఎలా? అనే ఇలాంటి అంశాలపై వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చేవాడిని నేను అప్పట్లో...

అవి మీకేమైనా ఉపయోగపడతాయనుకుంటే చదవండి ఇలా..

1. వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోగలగడానికి ప్రయత్నించండి .. మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి ... అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి ... అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా " నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా " అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి... సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు ... మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి... తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి... అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి... మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి... ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

ఇదంతా చదివాక " బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం కిరణ్ ? " అని మీరడగవచ్చు నన్ను ... ఇవన్నీ నే చెప్పింది ఇలా చెస్తే బాధ తగ్గుతుందని కాదు.. మరింత బాధలోకి మీరు నెట్టబడకుండా సాధ్యమైనంతవరకూ అందునుంచి బయటపడతారనే..

బాధలో ఉన్నప్పుడు మీరు మరింత బలహీనమయితే బ్రతుకే అర్ధంలేదనిపిస్తుంది... అలాంటి స్థితికి చేరకుండా ఉండేందుకు ఇవి కాస్తైనా ఉపయోగపడవచ్చు.. అందుకే కాస్త ఈ సూచనలు చేశాను

ఇంతా చెప్పినాకూడా ఇంకా ఒకటి మాత్రం కొసరు మాటగా చెప్పాలనిపిస్తోంది నాకిలా..

" జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు - సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి ""


- Kks Kiran

2 కామెంట్‌లు:

  1. అన్ని చేయగలమా లేదా అనేది తీసేస్తే దేని గురించైనా అందరూ అందరికి చెప్పుకొనేలా ఉండాలని సూచించారు. బాగుంది కిరణ్ గారు...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి