31 ఆగస్టు, 2016

నగరీకరణ వల్ల మారిన మనుష్యుల జీవితాల గురించి లేఖ ద్వారా స్నేహితునితో చర్చిస్తూ చేసిన వ్యాఖ్య



మనిషి తన జీవితకాలం మొత్తంలో దాదాపుగా 18 కేజీల దుమ్ముని శ్వాస రూపంలో తీసుకుంటాడట.. కానీ కాకినాడలో ఓ నెలరోజులుంటే అంతకన్నా ఎక్కువే దుమ్ము శ్వాసరూపంలో మనిషికి చేరుతుందని నా అభిప్రాయమయ్యా @ మనోజ్ పాయ్,,

ఎలా ఉంటున్నారయ్యా బాబూ మీరసలు ఇక్కడ? పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ పెట్రోల్ కంపే నిండిఉంటోంది గాలి నిండా... పైగా నిండా వేడి, ఎగసిన ధూళితో దరిద్రంగా ఉంది ఈ గాలి వాసన కూడా బాగా ఘాటుగా ఉండి... శ్వాసగా ఎలా పీల్చుకోగలుగుతున్నారయ్యా మీరు దీనినసలు ?

గుంపుగా ఉన్న జన సమూహాలలో కూడా ఎవడికి వాడికే ఓ సొంత మానసిక ప్రపంచాలలో ఇరుక్కుపోయి బ్రతికేస్తున్నారు సెల్ఫోన్లు చేతితో ఒత్తుకుంటూ,, ఇయర్ఫోన్స్ చెవులలో పెట్టేసుకుని వాళ్ళలో వాళ్ళే నవ్వేసుకుంటూ,, ఒకళ్ళతో మరొకరికి సంబంధంలేనట్లు ప్రవర్తిస్తూ...!!!

బాబోయ్ ఇంత సామాజిక ఒంటరితనమా ? అని చాలా భయమేసింది నాకైతే ఆ మనుష్యులని చూసినప్పుడు... హడావిడి,,ఆత్రం తప్ప మరేదీ కనపడట్లేదు చాలామంది మనుష్యుల ముఖాలలో ఇక్కడ.

ఇక కాకినాడ పేరులో కాకి ఉంది కానీ మచ్చుక్కి ఒక్క కాకీ కనపడలేదు నాకిక్కడ... అవునులే, అవి నివాసం ఉండడానికిగానీ, మనుగడ సాగించడానికిగానీ తగిన పరిస్థితులు ఎక్కడున్నాయిలే ఇక్కడ? మొత్తం కాంక్రీట్ కీకారణ్యంగా తయారయిపోయిందిగా కాకినాడ మొత్తం దాదాపుగా??

మనం డిప్లమా చదువుకున్న రోజుల్లో కూడా ఇంత దరిద్రంగా లేదు కదూ ఈ ఊరు?

మొన్నామధ్య ఓ 10 రోజులు ఉండాల్సి వచ్చింది ఇక్కడ దురదృష్టవశాత్తూ.. చక్కగా శ్రావణమాసపు శుక్లపక్ష రాత్రులు... చతుర్దశి నాటి చంద్రుడిని చూసి ఉత్సాహం తెచ్చుకుని " కాకినాడలోని చంద్రోదయ అందం ఇదీ...!!! " అని వర్ణిద్దామని మేడపైకెక్కాను ఓరోజు...

దీనమ్మా జీవితం...!!!

నగరంలోని విద్యుత్తు దీపాల కాంతి చంద్రుని చల్లదనాన్ని,, ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ వెన్నెల వెలుగునీ కూడా డామినేట్ చేసేంత ఎక్కువగా ఉంది...చల్లగాలి ముందేలేదు...రాత్రైనా పట్టపగలుగా అనిపించింది నాకు ఆ వెలుతురువల్ల..

నిరాశ చెంది కిందకి పోయి పోనీ పౌర్ణమినాడైనా పరిస్థితిలో చేంజ్ వస్తుందేమోననే వెర్రి ఆశతో మరుసటిరోజు రాత్రి మేడెక్కితే అప్పుడూ అలానే అనిపించింది నాకు...పదహారు కళలతో ఎంతో అందంగా కనిపించే ఆ పద్మసఖుడు కూడా కళావిహీనుడై వెలవెలబోయినట్లు అనిపించాడు నాకు ఈ కాంతికాలుష్యం వలన..

ఇక ఈ కవిత్వాలూ,, చంద్రోదయ వర్ణనలు, కావ్యాలలోని విషయాలూ ఏమెక్కుతాయి ఈ కాకినాడ ప్రజలకి అని అనిపించి కిందకి దిగి వచ్చేశాను...అసలు చంద్రుడనే వాడొకడు వస్తాడనే ఊసు ఒకటి గుర్తుందో లేదో వీళ్ళకి?

ఇలా ప్రకృతికీ,,జీవితానికీ మధ్య అంతరం పెరిగిపోవడంవల్లనే ఎంతో అద్భుతమైన మన సాహిత్యాన్ని మనం పట్టించుకోలేని,,ఆస్వాదించలేని ఓ దుస్థితి కలుగుతోంది ప్రస్తుతం...
" దానివల్ల జీవితంలో ఏం కోల్పోతున్నమో తెలుసా? " అని వివరించినా అర్ధం చేసుకోలేని స్థితికి చేరుతున్నారు మనుష్యులు క్రమక్రమంగా..

ఎంతో వాఖ్యానించడం ఎందుకు?

ఇప్పుడు పట్టణాలలో ఉన్న పిల్లలలో ఎంత మందికి మిణుగురు పురుగులంటే తెలుసు చెప్పు?

 నా ఉద్దేశంలో చాలామంది పిల్లలకి మిణుగురు పురుగులంటే ఏమిటో కూడా తెలిసుండదు...ఇక దాని ప్రత్యేకత ఇదీ అని,,దాని వెలుగు ఓ సారి వెలిగీ ఓ సారి ఆరీ చూసిన వాళ్ళకి ఇంత ఆనందాన్నీ,,ఆశ్చర్యాన్నీ కలగచేస్తుందంటే " ఓహో " అనుకుని చాలా క్యాజువల్గా ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తారేమోకూడా...

మిణుగురు పురుగులు ఎరగని బాల్యం రావడం నిజంగా దురదృష్టకరం కదూ ? :(

సహజత్వమే ఎరుగక బాల్యమే ఇంత మాములుగా ఉంటూ కేవలం బడిచదువులే జీవిత లక్ష్యంగా,సాంకేతికతే కాలక్షేపంగా గడుస్తూంటే ఇక బ్రతుకెంత కృత్రిమంగా ఉంటుందో కదూ?

ఏమంటావ్?

అభివృద్ది చెందుతున్న నాగరికత,,ప్రపంచీకరణ పరిస్థితుల దృష్ట్యా ఈ పరిస్థితి తప్పదంటావా?

ఒకవేళ అదేకనుక నిజమైతే అంతకన్న దౌర్భాగ్యపు స్థితి మరోకటి లేదు మన మనుష్యులకి...!!

- Kks Kiran

1 కామెంట్‌:

  1. Enjoyed reading the article above , really explains everything in detail,the article is very interesting and effective.Thank you and good luck for the upcoming articles
    Mind your sleep - this site also provide most trending and latest articles

    రిప్లయితొలగించండి