15 సెప్టెంబర్, 2016

గోంగూరపచ్చడి గొప్పతనం


కొన్ని నెలలక్రితం నన్ను కలుసుకోవడానికి బెంగుళూర్ నుంచి నా ఫేస్బుక్ ఫెండ్ ఒకరు వచ్చారు... మాటలయ్యాక భోజనంవేళ మా ఇంట్లో వాళ్ళు అతనికి గోంగూర పచ్చడి వడ్డిస్తూంటే " అదేంటని ? " అడిగాడు అతను నన్ను.. 

మా ఇంట్లోవాళ్లకీ,, నాకూ ఏక కాలంలో ఆశ్చర్యం వేసింది " అమృతసమానమైన రుచి కలిగినదీ,, "ఆంధ్రశాకం " గా మన కవులచేత కీర్తించబడేదీ అయిన ఈ గోంగూర పచ్చడి గురించి తెలియని మనుష్యులు ఉన్నారా? " అని ( అందులోనూ అతను బ్రాహ్మణ వంశీయుడు కూడానూ...బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదం నేర్చుకోపోయినా వాళ్ళని వైదీకులు అనచ్చేమో కానీ గోంగూర పచ్చడి రుచీ,, నేతి బొబ్బట్ల కమ్మదనం ఎరుగలేదంటే అవైదీకుడి కిందే లెక్క వేసెయ్యాలి @ చారిగారూ ఇకనుంచి )

నా ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని " దీనిని గోంగూర పచ్చడి అని అంటారు ( ఖర్మ ఖర్మ,, ఇలాంటి రోజొకటి వస్తుందనుకోలేదు నేనసలు :( ) ,, అని దానియొక్క విశిష్టతనూ,, మరియూ దానిని తయారుచేసే విధానమునూ పూస గుచ్చినట్లు చెప్పానతనికి. 

అయినా దానినతను ముట్టుకోకుండా సంశయాత్మక మనస్కుడై " తినచ్చో లేదో...!!! " అన్నట్లు చూస్తూ ఉంటే ఒక ఆంధ్రుడిగా నాకెంతో భాదేసింది.. అందులోనూ మా ఊరిలో చాలా రుచికరమైన పుల్ల గోంగూర పండుతుందికూడానూ...అలాంటి ఆకులతో తయారైన ఆ పచ్చడి తినే అదృష్టం పట్టాలంటే ఆ మనిషికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగానీ దక్కదు....అలాంటిది ఇతను దానిని కనీసం స్పృశించడం కూడా చెయ్యకపోయేసరికి,,

ఇక ఎలాగైనా ఈ కర్నాటకవాసికి దీనిపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి తినేట్లు చెయ్యాలని గట్టిగా నా మనస్సున సంకల్పించుకుని మా ఊరి గోంగూర కాడలను ఓసారి నా మనస్సున ధ్యానించుకుని వాతావరణాన్ని తేలికచెయ్యడానికన్నట్లు,,ఈ పచ్చడి గొప్పతనం తెలిపేట్లు సరదాగా ఓ కధ చెప్పానిలా అతనికి

" పూర్వం దేవతలూ - రాక్షసులూ ముసలితనమూ,,చావూ తప్పించుకోవడానికై అమృతపానం చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకుని ఆ అమృతంకోసమై పాలసముద్రాన్ని మధింప పూనుకున్నారట.ఆదికూర్మాన్ని వేడుకుని కవ్వపుకొండకు అడుగున చుట్టకుదురుగా చేసుకున్నారట.. పాతాళం తాకే మూలభాగంగల మందర గిరిని కవ్వపు కొండగా చేసుకుని నాగరాజ వంశోత్తముడైన వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకుని ఆవహం,ప్రవాహం మొదలైన వాయుబేధాలను అడ్డత్రాళ్ళుగా అమర్చుకుని బలి నాయకత్వాన రాక్షసులు ఒకవైపూ,,దేవేంద్రుని నాయకత్వాన దేవతలందరూ మరోవైపూ నిలవబడి క్షీరసాగర మధనం ప్రారంభించారట..

అప్పుడు సముద్రమధ్య నుంచి భువనగోళాన్నీ,,దిక్కులనూ కబళిస్తూ చెవులు బ్రద్దలు చేసే ఘమఘమ ధ్వని పుట్టిందట..

అలా సముద్రమధనం అంతకంతకూ తీవ్రస్థాయి అందుకొంటూ ఉండగా మొదట వానకారు మబ్బు వన్నెతో హాలాహల విషం ఉద్భవించిందట..ఆ విషాగ్ని జ్వాలలకు దేవాసురులు బెంబేలెత్తిపోయి పరమేశ్వరుడిని ప్రార్ధిస్తే ఆయన వీరిని కరుణించి ఆ విషానంతటినీ చాలా అవలీలగా గుట్టుక్కున మ్రింగేశాడట.

ఆపద తప్పిందని మళ్ళీ వాళ్లందరూ అమృతంకోసమై పాలకడలిని మధిస్తూంటే వరుసగా చంద్రుడూ,,కల్పవృక్షమూ,,అప్సరసలూ,కౌస్తుభమణీ,ఉచ్చైశ్రవమనే గుర్రమూ,,ఐరావతమూ,,ఇంకా సమస్త కోరికలూ తీర్చే పదార్ధాలూ,,లక్ష్మీ దేవి ఆ తర్వాత అమృతకలశహస్తుడై మహానుభావుడైన ధన్వంతరీ ఉదయించారట..

వెంటనే రాక్షసులు ధన్వంతరి చేతిలోని ఆ అమృతకలశాన్ని లాక్కొని పారిపోతూ ఉండగా నారాయణుడు మోహినీ రూపందాల్చి ఆ రాక్షసులను వంచించి ఆ అమృతకలశాన్ని గ్రహించి దేవతలందరికీ ఆ అమృతాన్ని పంచాడట..

అలా పంచేశాక మిగిలిన ఆ అమృతపు కుండని భూమి మీదకి జారవిడిచేశాడట ఆ విష్ణుమూర్తి..

అది కాస్తా మా పిఠాపురం పరిసర ప్రాంతాలలోని గోంగూర తోటల్లో పడింది...

అందుకే అప్పటినుంచీ ఈ గోంగూరకి అమృతతుల్యమైన ఈ రుచి అబ్బింది :p " అని అంటే అతను విపరీతంగా నవ్వుతూ మొత్తానికి తిన్నాడు.

తిని " నిజంగానే నువ్వు చెప్పినట్లు చాలా బాగుంది కిరణ్ " అని ఇంకాస్త ఓ చిన్న డబ్బాలో వేసుకుని వాళ్ళ ఇంటికి పట్టికెళ్ళాడు కూడా వెళ్తూవెళ్తూ :)

అదీ గోంగూర పచ్చడి గొప్పదనమంటే ;)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి