చలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

09 ఆగస్టు, 2017

చలం మాట


" జీవితం స్వప్నమైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం

ఈ దరిద్రంలోంచి,, భయం నుంచీ మేలుకొందాం...!!! "


ఠాగూర్ గారి గీతాంజలికి తెలుగనువాదం చేస్తూ ముందుమాటలో కవిత్వం గురించి చలం చేసిన ఓ వాఖ్య 👏


" కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం

కవిత్వం చదివిన తరువాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా !

నీకు తోచనిది, కనపడనిదీ కవి చెప్పిన తరువాత నీ అనుభవం లోనికి ఎంతో కొంత వచ్చేది, అదే నీకు సరి పడే కవిత.. "

06 ఫిబ్రవరి, 2017

జీవితం గురించి చలం మాటల్లో


" జీవితం అంటే అనుభవం.

గొప్ప అనుభవాలవైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యం..

అనుభవాలను గొప్పగా,, గాఢంగా తీసుకోగలగడం అనేది మన హృదయపు సున్నితత్వం మీద,, స్వేచ్ఛ మీద,, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది "

31 అక్టోబర్, 2016

గీతాంజలిలో నాకిష్టమైన మరో గేయం


ఉదయం విహంగం పాడుతోంది..ఇంకా తన శీతకరాళ వలయాలతో రాత్రి విషసర్పం ఆకాశాన్ని చుట్టుపెట్టుకుని ఉండగానే,,తెల్లవారుతోందనే వార్త ఆ పక్షికెట్లా చేరింది?

ఉదయ విహంగమా,,నాకు తెలియచెయ్యి..ఆకాశపు నలుపులోంచి,,చెట్ల ఆకుల పొరల చీకట్లలోంచి పూర్వదిశా సందేశహరుడు నీ కలల్లోకి ఎట్లా తోవచేసుకుని చేరాడో !!

ఉదయించబోతున్నాడు రవి. " రాత్రి అంతమయింది " అని నువ్వు అరచినప్పుడు లోకం నిన్ను నమ్మలేదు..

నిద్రితుడా,,మేలుకో..

ప్రభాత ప్రధమ తేజ ఆశీర్వాద నిరీక్షణాసక్తితో నీ ఫాలానెత్తి,హర్షపూరిత విశ్వాసాన ప్రభాత విహంగంతో గొంతు కలిపి గానం చెయ్యి

( రవీంద్రుని " గీతాంజలి " నుంచి సేకరణ )

శుభోదయం :)

- Kks Kiran

25 జులై, 2016

చలం ప్రేమలేఖల గురించి పరిచయ వాఖ్య



"" ఈమధ్య కాస్త ఎక్కువగానే వేదాంతపు రాతలు చదివాను నేను... ఆత్మా,పరమాత్మ,జీవాత్మ,ఘటాకాశం,మాయ,మిధ్యా ఈ కబుర్లు ఎక్కువున్నాయి అందులో... ఒక్కటీ వాస్తవిక జీవితానికి అన్వయించుకొని ఉపయోగించదగ్గ విషయాలలా తోచలేదు నాకు... అనవసరంగా బుర్రపోటు తెచ్చుకున్నాను ఈ పుస్తకాలు చదవి.. ఇంకా ఇవే చదువుంటే " జగమే మాయ - బ్రతుకే మాయ " అనే విషయ వైరాగ్యపు కీర్తనలు పాడుకుంటూ ఉప్పరసన్యాసిలా హిమాలయాలికిపోతానేమో అనే భయం కలిగింది... 
అందుకే ఈ స్థితి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి చలాన్ని ఆశ్రయిస్తేనే ఉత్తమమని చలం రాసిన " ప్రేమలేఖలు " పుస్తకం చదవడం మొదలెట్టాను మళ్ళీ చల్లని ఈ గాలీ,,వర్షపు చినుకుల చప్పుడుని ఆస్వాదిస్తూ చక్కగా నా గదిలోని కిటికీ దగ్గర కూర్చుని...
చలం గారు నిజంగా ఓ గొప్ప మాంత్రికుడు..ఆయన రాసిన పుస్తకాలు తెరిస్తే ఆయన తన శైలితో ముందు మనలని తన వశం చేసేసుకుని తర్వాత తన భావాలను,,అనుభవాలనూ,అభిప్రాయాలనూ ఒక్కొక్కటిగా మన పక్కనే ఆయన కూర్చుని వివరించీ చెప్తునట్లు ఉంటాయి ఆయన రాతలన్నీ..... ముఖ్యంగా ఈ ప్రేమలేఖల్లో అయితే మరీను...!!!
ఆయన మనో స్థితికి అత్యంత దగ్గరగా మనలని తీసుకెళ్ళి ఆయన పొందిన ఆనందాన్ని,,ఆ విరహాన్నీ మనచేత కూడా అనుభూతి చెందించేంత గొప్పగా రాసారు ఈ ప్రేమలేఖలన్నీ.. అందులోని ఆ తాజాదనము, ఆ సున్నితత్వమూ, ఆ సహజత్వమూ మనలని విపరీతంగా ఆకర్షించి ఆ పుస్తకం అయ్యేంతవరకూ మనలని ఎక్కడికీ కదలనియ్యకుండా కూర్చోపెట్టి ఏకధాటిగా చదివింపచేస్తాయి...
అంత అందంగా,అద్భుతంగా ఉంటాయి ఈ ప్రేమలేఖలన్నీ... ఇవి చదువుతూంటే చలం ప్రియురాలిపై ఈర్ష్యాభావం జనిస్తోంది నాకు..
" గత జన్మలో ఆయన ప్రియురాలిగా నేను పుట్టి ఉంటే ఎంత బాగుండునో " అనే అర్ధంలేని ఆశకూడా కల్గుతోంది నాకు ;) ""
శుభసాయంత్రం :)
- Kks Kiran


14 జులై, 2016

చలం " స్త్రీ " పుస్తకంపై సమీక్ష


ఈమధ్య చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,,
చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది,,,ఏమిటా భావ విప్లవం? భావాలలోని అంత నూతనత్వం? తట్టుకోగలరా అంత నూతనత్వాన్ని ఈ మనుషులూ,సమాజమూ?

" యదార్ధవాది లోక విరోధి " అనే సామెత ఎందుకు నిజమో చలం జీవితాన్ని చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.చలం రచనల ఊసు ఎత్తినప్పుడల్లా అతిగా అతని రచనలు ద్వేషించే వాళ్ళూ,లేదా అతిగా అతని రచనలు అభిమానించేవాళ్ళూ కనపడుతూ ఉంటారు మనకి... ఎవరికి వారికి వాళ్ళకర్ధమైనంత వరకూ చలాన్ని విశ్లేషించగలరు తప్ప చలాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు...జీవితం తాలూకు అన్ని లోతులనూ కనేసుకున్నాడు చలం.

తరతరాల మన జీవన విధానంలోని లోపాలని ఎత్తి చూపుతాడు,జీవితంలో ఉండే మాధుర్యాన్ని మనకి పరిచయం చేస్తాడు,,లోకం తాలూకు సౌందర్యాన్ని పరిచయం చేస్తాడు,,మనలని మన నుంచే కాక మనం నమ్మే చాలా విషయాల నుంచి మనలని బయట పడేసి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం ఏమిటో ఆలోచించుకోమంటాడు.

మరి చాలాన్ని సమాజం ఎందుకు వెలివేసిందా? అని ఆలోచిస్తే నాకిలా సమాధానం తడుతూ ఉంటుంది.

" వ్యవస్థ ఎప్పుడూ చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.అది ఎప్పుడూ కొన్ని కొన్ని నమ్మకాలను నమ్ముతూ ఆ ఆ పద్దతులపైనే నడుస్తూ ఉంటుంది.ఆ పద్దతులలో లోపాలు ఉన్నా తనని తాను మార్చుకోడానికి ప్రయత్నించదు... "అలా కాదు,,ఈ పద్దతులు వదిలి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం నేను చెప్తాను " అని ఎవరైనా కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ సిద్దాంతంలోని లాజిక్ని వదిలేసి చెడునే పట్టుకుని ఆ మార్పుని తిరస్కరిస్తూ అలా మార్పుని ప్రతిపాదించిన వాడిని శిక్షిస్తూ ఉంటుంది ఎక్కడ తన మనుగడకి భంగం కలుగుతుందో అని " ..తరతరాల మన మానుష్య చరిత్ర మనకి నిరూపిస్తూ వచ్చిన సత్యమేగా ఇది?

బహుశా అదే కారణం అయ్యుంటుంది చలాన్ని అంతమంది అప్పటికీ,ఇప్పటికీ విమర్శిస్తూ ఉందాడానికి...తమ స్వార్ధానికి భంగం కలిగేలా భావాలని జనాలకి ప్రచారం చేస్తున్నాడాని. తమ ప్రవర్తన తాలూకు నగ్నత్వాన్ని భయటపెడుతున్నాడని.

" మన వ్యవస్థ కూడా సామాన్యులని తయారు చేసేలా ఉంటుంది.మనిషిలోని సృజనాత్మకతని చంపేసి మనిషిని ఇంతకన్నా ఉన్నతంగా ఎదగనీయకుండా తాను చెప్పినట్లు ఉండేలానే తయారు చేస్తోంది. ఉన్నత ఆదర్శాలు,,కోరికలు ఉంటే వెంటనే నిరుత్సాహపరిచి మనిషిని ఎదగనీయకుండా చేసే మనుషులు ఎక్కువ మన సమాజంలో. సామాజిక కట్టుబాట్లకి,,జీవన విధానాలకి బందీలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు....పక్కవాడు ఏమనుకుంటాడో అని  భయంతో మనసుకి నచ్చినట్లుగా బ్రతకకుండా ముఖానికో ముసుగు,,మనసుకో ముసుగు వేసుకుని బ్రతికే మానసిక బానిసలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు... " ఏదో జీవితం ఇలా గడిచిపోతే చాలు " అని అనుకునే వ్యక్తులే ఎక్కువ ఇందులో. "

అలాంటి వారికి జీవితంలో ప్రతీ కోణాన్ని అనుభవించి,,ఆస్వాదించి,అనుభూతి చెంది అందులో మమేకమయ్యి రాసిన చలం లాంటి వ్యక్తులు శత్రువులా కనపడడంలో వింతేముంది?



- Kks  Kiran​

28 జూన్, 2016

చలం " మైదానం " పుస్తకంపై నా అభిప్రాయం




గుడిపాటి వెంకటాచలం రాసిన " మైదానం " అనే పుస్తకం చదివాను నేనీమధ్య... నిజం చెప్పుకోవద్దూ..!! నాకేం నచ్చలేదు ఈ పుస్తకం. 

" ప్రేమలేఖలు, మ్యూజింగ్స్, మరి ముఖ్యంగా " స్త్రీ " లాంటి గొప్ప పుస్తకాలు రాసిన ఆ చలమేనా ఈ పుస్తకం రాసింది? " అనే ఆశ్చర్యం కలిగింది నాకు ఈ పుస్తకం చదివాక...!!!

అసలీపుస్తకం చదవకముందు ఎంత గొప్పగా ఊహించుకున్నాన్నో " చలం రచనల్లో ఇదో మాస్టర్ పీస్ " అని మావాళ్ళందరూ ఊదరగొట్టేసరికి.. పుస్తకం కొంటున్నప్పుడు తెల్లటి వెన్నెల సముద్రపు కెరటాలలో పరావర్తనం చెందే ఆ దృశ్యం ఆ అట్టపై ఉండడం చూసి , వెనుక ఉన్న ఆ ప్రకృతి వర్ణనలు చదివి ఎప్పుడెప్పుడు చదువుతానా ఈ పుస్తకాన్ని? అని తెగ ఉత్సాహపడిపోయాను నేను. కానీ నా ఉత్సాహాన్నంతా నీరుగార్చేశాడు చలం.

కధకానీ , కధనంకానీ , పాత్రల ప్రవర్తన కానీ ఏమీ నచ్చలేదు నాకు.. స్వేచ్చపేరిట విశృంఖలత్వాన్ని వివరించాడు చలం ఈ రచనలో. 

కధానాయకురాలు " రాజేశ్వరి "ది మహోదాత్తమైన ప్రేమగా మొదట వర్ణించినా అసలు తన ఆలోచనలలో తనకే ఓ స్పష్టత లేక ఏది తోస్తే ఆ పని చేసేసి తనని తాను ఆత్మవిమర్శ చేసుకోక సమాజంలో ఉన్న ఆదర్శాలను విమర్శిస్తూ వాటికన్నా తన ఈ ప్రవర్తన చాలా సమర్ధనీయం అని సంతృప్తి పడుతూ ఉంటుంది ఆ పాత్ర ఇందులో. ఒక్క ఈ పాత్రనే కాదు ,,ఇందులోని ఏ పాత్రైనా ఆలోచనలలో పరిపక్వత ఉన్న వ్యక్తుల్లా ఏమనిపించవు నిజానికి...


" మరెందుకు చలం ఇలాంటి పుస్తకాలు,కధలు రాసి అనవసరంగా తన పేరుని చెడగొట్టుకున్నాడు ? " అని అనిపించింది నాకు ఈ పుస్తకం చదివాక...

నా ఉద్దేశంలో ఇలాంటి భావాలు అప్పటి సమాజంపై,ఆ జనాలపై వదిలితే కనీసం వాళ్ళు ఇరిటేట్ అయ్యి ఆ ఇరిటేషన్లోంచైనా " అసలేది కరక్ట్ ? ఏది కాదు ? " అని తర్కించి ( " కనీసం ఆలోచించి " అని అనవచ్చా? ) తాను చెప్పిన విషయాల్లో కొంతశాతం అయినా వాస్తవం గ్రహించి ఆచరిస్తారనే ఉద్దేశంతో రాశారేమో చలంగారు తన రాతలన్నీ ఇలా.....!!!!!!

ఏమంటారు?

- Kks Kiran
  


05 మే, 2016

చలంగారి ఆవేదన



" తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు,డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతీతులనుంచీ, ఇతరుల ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి." 

- గుడిపాటి వెంకటాచలం

24 మార్చి, 2016

కళాత్మక హృదయం లేని వ్యక్తుల గురించి



పొద్దున్న నా గదిలో కూర్చుని పిల్లలమర్రి పిన వీరభద్రుడు రాసిన " శృంగార శాకుంతలం " చదువుతూ ఉంటే తెలిసిన ఒకాయన వచ్చి నన్ను పలకరించి " ఏ పుస్తకం చదువుతున్నావురా కొత్తగా ? " అని అడిగితే " శృంగార శాకుంతలం " చదువుతున్నాను అని చెప్పాను నేను...వెంటనే ఆయన మొహంలో హావభావాలు మారిపోయి నా దగ్గరకి వచ్చేసి నేనేదో చదవకూడని పుస్తకం చదువుతున్నాను అన్నట్లుగామాట్లాడాడు నాతో... నా దగ్గర ఆ పుస్తకం తీసుకుని అట్ట చూస్తూ  " ఈ వయసులో నీకు శృంగారం గురించి ఎందుకురా? " అన్నట్లు తేలికగా మాట్లాడాడు..

ఆయనకి ఏమని సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు నాకు..  పుస్తకం పేరులో శృంగారం అని ఉన్నంతమాత్రాన అదో అసహ్యకరమైన పుస్తకంగా జమకట్టిన ఆయనకి ఈ పుస్తకం యొక్క గొప్పదనం గురించి ఎలా వివరించాలో తెలియలేదునాకు... " వాసకసజ్జనకి విప్రలబ్దకి ఉండే తేడా ఇదీ...!!! ఇదిగో ఈ భావం ఎంత అద్భుతంగా ఉందో చూడు...!!! " అని ఏమైనా చెప్తే అవి బూతులుగా పరిగణిస్తారేమో ఇలాంటి వ్యక్తులు...

అసలెంతో సునిశితమైన పరిశీలనా దృష్టి,,ఊహా ఉంటేకానీ వర్ణన చెయ్యడం అసాధ్యం.అలాంటిది సూర్యోదయం,,సూర్యాస్తమయం,,చంద్రోదయం,,ఋతు వర్ణన,,నాయకా,,నాయకి సౌందర్య వర్ణనలతో గొప్ప రసపుష్టిగల కావ్యం రాయడమంటే మాటలా??? అవిచదవడమే మన అదృష్టం అనుకోవాలికానీ అసలు అందులో ఏముందో కూడా తెలియకుండా ఒక్క ఊపులో ఆ కావ్యాన్ని ఆయన అర్ధంలేని విషయంగా మాట్లాడుతుంటే చలం మాటలు గుర్తొచ్చాయి... " ఆర్టిస్టిక్ సెన్స్ " పూర్తిగా నశించిన వ్యక్తుల గురించి ఇలా అంటాడు తన " మ్యూజింగ్స్ " లో

" ఏదో
తింటాం,కాపరిస్తాం,కంటాం,పెంచుతాం
,అనే మనుషులుగాక,ఈ లోకంలోని రసాన్ని
అందుకుంటామని ప్రయత్నించే వ్యక్తులు తక్కువ ఈలోకంలో..

" Dead Beauty " ని అనుభవిస్తున్నారు ఈ
ప్రజలు. ఆత్మల్ని నాశనం చేసి, స్వేచ్చ
కాళ్ళు విరగ్గొట్టి, కళేబరాల్ని
కావిలించుకుని సుఖపడుతున్నారీనాటి
ప్రజలు... వీళ్ళకి
'' Art " నశించింది.హృదయం
చచ్చిపోయింది. " అని....

మహా మహా పండితులతోనూ,,విద్వాంసులతోనైనా మాట్లాడడం పెద్ద కష్టం కాకపోవచ్చేమోగానీ " కళళెందుకు? కవిత్వాలెందుకు? " అన్నట్లుగా మాట్లాడే ఇలాంటి వ్యక్తులతో మాట్లాడడం మాత్రం చాలా కష్టమైన పనే...

ఏమంటారు?

-  Kiran

కళాత్మక హృదయం లేని వ్యక్తుల గురించి చలం ఏమన్నాడంటే?



చలం మ్యూజింగ్స్ చదువుతున్నాను నేను ప్రస్తుతం...

" ఆర్టిస్టిక్ సెన్స్ " పూర్తిగా నశించిన మనుష్యుల గురించి చలం ఎంత బాగా చెప్పాడో చూడండి తన " మ్యూజింగ్స్ " పుస్తకంలో..

" ఏదో బతుకుతూ ఉండడంతప్ప,ఒకటి కావాలనిగానీ,,,ఒక దానినుంచి తప్పించుకుందామనిగానీ గట్టిగా ప్రయత్నించడం చాలామంది మనుష్యులకి వింత...రోజూ చేసే పనులే అట్లా తిరిగి తిరిగి చేస్తూ ఉండడం,,ఏదైనా కష్టం వొస్తే ఏడవడం,,ఏమీ పట్టకుండా,,మనుష్యుల సంగతీ పరిస్థితుల సంగతీ అర్ధంలేకుండా మాట్లాడడం ఇదే జీవితం.

రైళ్ళల్లో,,క్లబ్బులలో !! మనుష్యులు మాట్లాడుతూ ఉంటే ,, ఇంత ముఖ్యమైన సంగతినీ,,ఇంత ఘోరమైన సంగతినీ,,ఇంత గొప్ప కళనీ,,ఇంత అందమైన దృశ్యాన్నీ ఏదో తేలికగా మాట్లాడతారేమిటి? ఏమీ పట్టనట్లు.వీరు చాలా గొప్పవేదాంతులా అనిపిస్తుంది,,ఏమీ మనసుపై పొరల నుంచి కిందకి తీసుకోరు...

...ఈ కూరలో ఉప్పెక్కు...ఈ కూరలో ఉప్పెక్కువైంది,,లోకంలో క్షామం ఎక్కువైంది "

" షర్ట్ చాకలి తెల్లగా ఉతికాడు...ఈ ఉదయం ఉషాకాంతి గొప్పగా ఉంది "

" బండివాడు,,ఒక అణా అన్యాయంగా కాజేశాడు...యుద్ధంపేర దేశానికి యాభైకోట్ల అప్పయింది "

" సినిమాలో మావారు తాసీల్దార్...బావుంది.... కృష్ణశాస్త్రిగారి ' వెదకి వేసారిబాగుంది "

ఈ వాక్యాలన్నిటికీ ఒకటే విలువ ఇచ్చి మాట్లాడతారు..

ఇట్లా బతకడం తప్ప,,సుఖంలో బాధలో కూడా గొప్పగా జీవించడం అంటే ఏమిటో కూడా అర్ధంకాదు... అందువల్లనే గొప్ప మోహాన్నిగానీ,,ప్రేమనిగానీ చూసినప్పుడు అర్ధంకాక తమకి అర్ధమయ్యే కామం,,ధనం,మదం,,చపలత్వం ఇట్లాంటి కారణాలు ఆరోపిస్తూ మాట్లాడతారు..

ఏదో మనసులో గొప్పగా బ్రతుకుతున్నామని,,వీడు రాసినవీ వాడు రాసినవీ లేకపోతే సూత్రాలూ,,వేదాంతాలూ మాట్లాడుకుంటో తిరుగుతారు...నీతి,,పాతివ్రత్యం అనే మాటల అర్ధాలు ఏమాత్రం తెలీకనే చాలా గొప్ప నీతిపరులమనుకుంటో బ్రతుకుతారు...

మర్యాదలూ కుటుంబాలూ కూడా ధనమూ,,కీర్తీ,,విలువలూగాక వేరే విలువలతో బతికే మనుష్యులు ప్రపంచానికి శత్రువులూ,,ఉన్మత్తులూ అయినారు...

ఏ ఆశయానికో,,అన్వేషణకో,,కళకో జీవితాన్నర్పించేవాడు పిచ్చివాడు....పెదవి విరిచి గొప్పగా చిరునవ్వుతో తోసేస్తారు అట్లాంటి మనుష్యులని...

రోజూ రొటీన్లోశవాలమల్లే బతకకుండా ఏదైనా సుఖానికి ప్రయత్నించారా మండిపడతారీ మనుష్యులు.. ఏ బాధని తీసెయ్యడమన్నా,,కొత్త సుఖాన్నియ్యడమన్నా ఎంత కోపం వీరికి ? "

( చలం గారికి _/\_ )

-  Kiran