22 ఏప్రిల్, 2020

యుగానికి ఒక్కడు



తమిళనాడు వైపు ఆలయాలు చూసినవారికి చోళులంటే విపరీతమైన అభిమానం కలుగుతుంది - ముఖ్యంగా రాజరాజ చోళుడు , మొదటి రాజేంద్ర చోళుడంటే విపరీతమైన గౌరవం కలుగుతుంది ( చాలామంది తమిళుల ఇళ్ళల్లో రాజరాజచోళుని ఫొటో తప్పకుండా ఉంటుందని తంజావూరులో నాకు పరిచయమైన కొంతమంది చెప్పారు మాటలసందర్భంలో )

అటువంటి గొప్ప చరిత్ర , పాలనా దక్షత , శౌర్యం , ఔదార్యం గల చోళుల సామ్రాజ్యం ఏవిధంగా క్షీణించి పతనావస్థకి చేరుకుందో తెలుపుతూ సెల్వరాఘవన్ తీసిన ఈ సినిమా నిజంగా ఓ మాస్టర్ పీస్ అసలు 👌

సెకండాఫ్లో బాగా విసిగించినట్లు ఉండే స్క్రీన్ ప్లే , స్లో నేరేషన్ , అర్ధం కానట్లు , సరిగా అతికీ అతకనట్లు ఉండే కొన్ని సన్నివేశాలవల్ల , ప్రేక్షకుడు సంతృప్తి అవ్వనట్లు ఉండే క్లైమాక్స్ వల్ల ఈ సినిమా ఎందుకో హిట్ అవ్వక ఫ్లాప్ అయ్యింది కానీ నా ఉద్దేశంలో సెల్వరాఘవన్ తీసిన సినిమాలలో ఇదో గుర్తుంచుకోదగ్గ గొప్ప సినిమా అని నా అభిప్రాయం 👏

ఈ మూవీకి సెకండ్ పార్ట్ వస్తే బాగుండును అని కోరుకుంటాను నేనైతే ఎప్పుడు ఈ మూవీ చూసినా


తర్కానికి అందని అనుభూతి



" మనిషి తన ఉనికిని తాను మరిచిపోయేంత మైమరపుతో తనలో తాను లీనం అయిపోయి గొప్ప ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన చూసిన బయట వారికి బహుశా అది పిచ్చితనంగా అనిపిస్తుందేమో...!!! " అని అనిపిస్తూ ఉంటుంది నాకొక్కోసారి

********************

ఓ వర్షాకాలపు సాయంత్రం. ఆకాశం అంతా నల్లని కారుమేఘాలతో నిండి ఉండి పెద్దగా గాలులు వీస్తూ కుంభవృష్టిగా వర్షం పడడం మొదలైంది.


మా ఇంట్లో వాళ్ళందరూ బంధువుల ఇంటికి వెళ్ళారు పెళ్ళి ఉందని.

నేనొక్కడినే ఇంట్లో ఉండి, ఖాళీగా ఉండడం ఎందుకులే అని " సంగీత శాస్త్ర సుభోదిని " అనే పుస్తకం చదవడం మొదలెట్టాను.

అప్పుడొచింది ఓ చిన్న ఆలోచన,

" రోజంతా ఏదో అలా నోటికి వచ్చిన కీర్తనలు పాడుకుంటూ ఉంటాను కదా? అసలు నాకు పూర్తిగా ఎన్ని కీర్తనలు వచ్చో పాడి తెలుసుకుందామని " ఒక్కో పాట పాడడం మొదలెట్టాను ఓచోట కింద ఒక ఆసనం వేసుకుని అనువుగా కూర్చుని.

అలా నాకు వచ్చిన అన్నమాచార్యుల వారి కీర్తనలు కొన్నీ, త్యాగరాజ స్వామి వారి కృతులు , సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తనలూ కొన్ని రాగయుక్తంగా తాళం వేసుకుంటూ పాడటం మొదలెట్టాను స్వేచ్చగా

కొంతసేపటిలోనే అలా పాడడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయాను నేను...!!!

" శాస్త్రీయ సంగీతంలో ఉండే కృతులూ కీర్తనలలో ఉండే భావాన్ని అనుభూతి చెందుతూ ఆలాపించడం గొప్ప ఆత్మానందాన్ని కలగ చేస్తుంది. "

ఉదాహరణకి త్యాగరాజ కృతి " సాధించెనే ఓ మనసా " తీసుకుంటే ఆ పాటలో ఆరోహణ, అవరోహణ స్థాయిలను పాడేటప్పుడు ఒక్కో అనుభూతితో పాడాల్సి ఉంటుంది.

" సమయానికి తగు మాటలాడెనే " అన్నప్పుడు అకస్మాత్తుగా భగవంతుడిని ఏదో నిందిస్తున్నట్లు, " ముదంబున ముద్దు పెట్ట నవ్వుచుండ హరి మరి " అన్నప్పుడు హరి నవ్వుతుంటే ఆ దృశ్యాన్ని దర్శించి చూసి మనమూ నవ్వినట్లు, " హరే రామచంద్రా !! రఘుకులేశ మృదు స్వభావ " అన్నప్పుడు రాముడిని " ఏదో మన స్నేహితుడు అయినట్లు " పాడాలి.

అలా ఒక్కోచోట ఒక్కోలా అనుభూతి చెందుతూ పాడుతూ ఉంటే నాకంటి వెంట ధారాపాతంగా కన్నీరు కారుతూ ఉంది ఆనందం పట్టలేకపోవడం వల్ల.
దాదాపు ఆరోజు రాత్రి 8.10 నుంచి 11.15 వరకూ మొత్తం 73 కీర్తనలు పాడేసరికి నా మనసంతా అవ్యక్తమైన ఆనందపు భావనలతో నిండిపోయింది, అంతరాత్మకి అభ్యంగన స్నానం చేయించి మనోమలినాలను రూపుమాపుకొన్నంత ఓ నిర్మల స్థితి కలిగింది అప్పుడు.

నా జీవితంలో ఎంతో గొప్ప సంతోషంతో నేను గడిపిన సమయాలలో అది ఉత్తమమైన సమయం కూడా....!!!

ఆ తరువాతి రోజు ఉదయం మేలుకోగానే రాత్రి జరిగిన ఆ సంఘటన గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వు వచ్చింది " ఏమిటి రాత్రి అలా ప్రవర్తించాను అర్ధంపర్ధం లేకుండా? " అన్నట్లు అని

నా స్థితి నాకే అలా అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరి బయటవాళ్ళెవరైన నన్ను అప్పుడు చూసుంటే నా మానసిక పరిస్థితి పై ఏమని అభిప్రాయం ఏర్పరుచుకుని ఉందురో? అనే భయం వేసింది కూడా నాకు ఆ సమయంలో...

కొన్ని ఫీలింగ్స్ అంతే, " ఎందుకు అలా అనుభవించావు? " అని ఎవరైనా ప్రశ్నగా అడిగితే సరిగ్గా సమాధానం కూడా చెప్పలేం మనం . అది అవతలి వ్యక్తికి కూడా అనుభవంలోకి వస్తేగానీ అర్ధం కాదు కూడా....!!!

ఏమంటారు?

- Kks kiran

ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ?




" ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ? " అనే ప్రశ్నకు " Quora " లో నేను రాసిన సమాధానమిది - ఇది రెండేళ్ళ క్రితమే ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసాను - అప్పుడు చదవని వారికోసం మరలా పోస్ట్ చేస్తున్నాను - ఆసక్తి ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి 👇

"" తాము ఇష్టపడ్డ వ్యక్తి దక్కకపోవడం వల్ల లవ్ ఫేల్యూర్ అయిన వ్యక్తులు ఒకప్పుడు తమ చేతులను బ్లేడ్ లతో కోసుకోవడం,, విపరీతంగా ఏడవడం ,, సిగరేట్ - మందులాంటి వ్యసనాలకు బానిసకావడం, లేక బంధాలు అంటే నమ్మకం లేనట్లు మాట్లాడడం చేసేవారు.. మరీ డీప్ ఎమోషన్ తో బాధపడే వ్యక్తులైతే అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు...

ఇప్పుడు ట్రెండ్ మారింది.. లవ్ ఫేల్యూర్ అయితే వెంటనే వాట్సాప్ స్టేటస్లు లను తరుచుగా సాడ్ గా అప్డేట్ చేయడం,, ఫేస్బుక్లో విషాదాన్ని వ్యక్తపరుచు వాక్యాలతో కూడిన పిక్స్ ని తమ వాల్పై షేర్ చేయడం చేస్తున్నారు ఇప్పటి జనాలు...

తరాలు మారి బాధను,, దానిని ప్రకటించే విధానాలలో మార్పు కొంత కలిగుండచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండూ శుద్ధ బొక్క పనులే.. ఏం ఉపయోగం వీటివల్ల? తాను బాధపడుతూ ఇది తెలిసిన ఆ ప్రేమించిన వ్యక్తినీ,, కుటుంబసభ్యులను ఏడిపించడం తప్ప??

********************************************************

నా ఈ వ్యాసాన్ని చదువుతున్న వ్యక్తులలో ఎవరైనా లవ్ ఫేల్యూర్ కాండిడేట్లు ఉంటే కనుక మీరనుకోవచ్చు,, " మనమెంతో ఇష్టపడి ,, కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది అని ఆశించిన వ్యక్తి మనకి దక్కకపోతే ఆ బాధ వర్ణనాతీతం... ఎన్నున్నా ఏదో లోటుగా ఉన్నట్లు అనిపిస్తుంది జీవితానికి... నిన్నమొన్నటివరకూ " ఒకే ఆత్మ - రెండు జీవితాలు " అన్నట్లు ఉన్న వ్యక్తితో అకస్మాత్తుగా అపరిచితుల్లా ప్రవర్తించాలంటే ఎంత కష్టమైన పనో ?? నరకమనేది ప్రత్యక్షంగా ఇక్కడే అనుభవిస్తున్నట్లుంటుంది ఆ ఫీల్ " అని ..

నిజమే..

అది చాలా బాధాకరమైన విషయమే.. కాదనట్లేదు.. నేనూ అలాంటి కేసులెన్నో చూశాను.. అమ్మాయిల విషయం నాకంతగా తెలీదుకానీ అబ్బాయిల తాము ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల తమకి దక్కకపోతే వెక్కి వెక్కి ఏడవడం ప్రత్యక్షంగా నేనెరుగుదును నా ఫ్రెండ్స్ లో కొందరినలా చూడడంవల్ల...

వాళ్ళనప్పుడు ఎలా ఓదార్చాలో అర్ధమయ్యేది కాదు నాకు .. ఏం చెప్పి వారిని కుదుటపర్చాలో తెలిసేది కాదు... కళ్ళనిండా ఎర్రని జీరలతో,, బాధా - ఆందోళనతో కూడిన ఆలోచనలవల్ల నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ ఏ పనిపైనా ఆసక్తీ ,, శ్రద్ధా లేకుండా విచారమైన వదనంతో తేజోవిహీనమైనట్లు తయారయ్యే వాళ్ళను చూస్తే నిజంగానే ఒక్కోసారి భయమేసేది నాకు " వీళ్ళను ఒంటరిగా వదిలేస్తే ఏం అఘాయిత్యం చేసుకుంటారో " అని..

ఎంత గొప్ప బాధకైనా కాలమే మందనుకోండి.. కానీ ఆ కాలం భారంగా గడిస్తున్నట్లు అనిపించే ఆ కొంతకాలాన్ని గడపడమెలా ? మళ్ళీ ఆ బాధని మరచిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించడం ఎలా? అనే ఇలాంటి అంశాలపై వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చేవాడిని నేను అప్పట్లో...

అవి మీకేమైనా ఉపయోగపడతాయనుకుంటే చదవండి ఇలా..

1. వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోగలగడానికి ప్రయత్నించండి .. మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి ... అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి ... అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా " నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా " అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి... సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు ... మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి... తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి... అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి... మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి... ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

ఇదంతా చదివాక " బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం కిరణ్ ? " అని మీరడగవచ్చు నన్ను ... ఇవన్నీ నే చెప్పింది ఇలా చెస్తే బాధ తగ్గుతుందని కాదు.. మరింత బాధలోకి మీరు నెట్టబడకుండా సాధ్యమైనంతవరకూ అందునుంచి బయటపడతారనే..

బాధలో ఉన్నప్పుడు మీరు మరింత బలహీనమయితే బ్రతుకే అర్ధంలేదనిపిస్తుంది... అలాంటి స్థితికి చేరకుండా ఉండేందుకు ఇవి కాస్తైనా ఉపయోగపడవచ్చు.. అందుకే కాస్త ఈ సూచనలు చేశాను

ఇంతా చెప్పినాకూడా ఇంకా ఒకటి మాత్రం కొసరు మాటగా చెప్పాలనిపిస్తోంది నాకిలా..

" జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు - సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి ""


- Kks Kiran

Humans are attention seeking animals







మనుషులు Attention Seeking Animals అన్నాడు మా తమ్ముడు Surya Sitaram మాటల సందర్భంలో ఒకసారి నాతో


" ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ లాంటి వేదికలలో ఇలాంటి భావాలు గల మాటలను పెట్టి " తమ ప్రస్తుత స్థితి ఇదీ " అన్నట్లుగా ప్రపంచానికి దానిని ప్రకటించి దానితో సంతృప్తి పడే మనస్తత్వం మనలో ఎక్కువవుతోంది సోషియల్ మీడియా వినియోగం వల్ల - దానివల్ల వీసమెత్తు ఉపయోగం ఒనగూరదు సరికదా అది చూసిన జనాలు " ఏమైంది - ఏమి జరిగిందన్నట్లు " వీరిని ప్రశ్నిస్తే తమ బాధంతా ముక్కుమొహం ఎరుగని , ఆత్మీయులు కాని ( Facebook Friends చాలామంది అంతేకదా ) వారితో కూడా పూస గుచ్చినట్లు ప్రతీది చెప్పుకొని ఓదార్పు పొందాలనే కాంక్ష ఎక్కువవుతోంది " చాలామంది మనుష్యులలో మనకు ప్రస్తుతం సమాజంలో


తనతోనూ , తన కుటుంబంతోనో లేక స్నేహితులతోనో సరైన సత్సంబంధాలు లేక " ఎవరూ తననూ , తన నిజాయితీనీ , భావాలనూ అర్ధం చేసుకోరనే " ధోరణి కలిగి ప్రేమరాహిత్యంతో బాధపడేవారే ఇలా ప్రవర్తిస్తారు " అని వాడు సెలవిచ్చాడు ఇటువంటి తరహా భావాలను తరచూ వెల్లిబుచ్చేవారిని చూసి


ఇలాంటి స్థితి గల జనాలు ఎక్కువవ్వడం ఆందోళన కలిగించే అంశం అనంటూ వాడు దానినుండి బయటపడే సలహాలను సూచిస్తూ " Quora " లో రాసిన వ్యాసమిది


అవకాశం ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి


ఆ లింక్‌ ఇదిగో :- 


19 సెప్టెంబర్, 2019

వైకుంఠ పెరుమాళ్ దేవాలయం , కాంచీపురం 🙏

కంచిలో ఉన్న ప్రాచీనమైన ఆలయాలలో ప్రసిద్ధమైనది ఈ " వైకుంఠ పెరుమాళ్ దేవాలయం "

పల్లవ రాజులచే ఆరవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయం వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య క్షేత్రాలలో ఒకటి.. ఈ ఆలయంలో మొత్తం మూడు అంతస్తులున్నాయి

మొదటి అంతస్తులో విష్ణువు కూర్చున్న భంగిమలో ఉండగా , రెండవ అంతస్తులో నుంచుని ఉన్నట్లుగా , ఆ పై అంతస్తులో శయన రూపంలో దర్శనమిస్తున్నట్లుగా విగ్రహాలు రూపుదిద్దబడ్డాయి

కాలము వల్లనైతేనేమి , సరైన నిర్వహణ లేకపోవడం వల్లనైతేనేమీ చాలావరకు ఈ ఆలయం , అందులోని శిల్పాలు బాగా పాడయ్యాయి

అందుచేతే ఈ ఆలయంలో కేవలం మొదటి అంతస్తులోని మూర్తినే మనం దర్శించుకునే అవకాశం ఉంది

- Kks Kiran
































కైలాసనాధుని ఆలయం , కాంచీపురం 🙏

ఆలయాలు కేవలం‌ ఆధ్యాత్మిక అనుభవాలను అందించే ప్రదేశాలే కావు

అవి మన సంస్కృతి యొక్క గత వైభవానికి చిహ్నాలు - అప్పటి ప్రజల‌ కళాత్మక జీవనవిధానానికి ఓ మచ్చుతునకలు కూడా

అందుకు ఉదాహరణ కాంచీపురంలోని ఈ కైలాసనాధ్ ఆలయం 🙏

- Kks Kiran