22 ఏప్రిల్, 2020

తర్కానికి అందని అనుభూతి



" మనిషి తన ఉనికిని తాను మరిచిపోయేంత మైమరపుతో తనలో తాను లీనం అయిపోయి గొప్ప ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన చూసిన బయట వారికి బహుశా అది పిచ్చితనంగా అనిపిస్తుందేమో...!!! " అని అనిపిస్తూ ఉంటుంది నాకొక్కోసారి

********************

ఓ వర్షాకాలపు సాయంత్రం. ఆకాశం అంతా నల్లని కారుమేఘాలతో నిండి ఉండి పెద్దగా గాలులు వీస్తూ కుంభవృష్టిగా వర్షం పడడం మొదలైంది.


మా ఇంట్లో వాళ్ళందరూ బంధువుల ఇంటికి వెళ్ళారు పెళ్ళి ఉందని.

నేనొక్కడినే ఇంట్లో ఉండి, ఖాళీగా ఉండడం ఎందుకులే అని " సంగీత శాస్త్ర సుభోదిని " అనే పుస్తకం చదవడం మొదలెట్టాను.

అప్పుడొచింది ఓ చిన్న ఆలోచన,

" రోజంతా ఏదో అలా నోటికి వచ్చిన కీర్తనలు పాడుకుంటూ ఉంటాను కదా? అసలు నాకు పూర్తిగా ఎన్ని కీర్తనలు వచ్చో పాడి తెలుసుకుందామని " ఒక్కో పాట పాడడం మొదలెట్టాను ఓచోట కింద ఒక ఆసనం వేసుకుని అనువుగా కూర్చుని.

అలా నాకు వచ్చిన అన్నమాచార్యుల వారి కీర్తనలు కొన్నీ, త్యాగరాజ స్వామి వారి కృతులు , సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తనలూ కొన్ని రాగయుక్తంగా తాళం వేసుకుంటూ పాడటం మొదలెట్టాను స్వేచ్చగా

కొంతసేపటిలోనే అలా పాడడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయాను నేను...!!!

" శాస్త్రీయ సంగీతంలో ఉండే కృతులూ కీర్తనలలో ఉండే భావాన్ని అనుభూతి చెందుతూ ఆలాపించడం గొప్ప ఆత్మానందాన్ని కలగ చేస్తుంది. "

ఉదాహరణకి త్యాగరాజ కృతి " సాధించెనే ఓ మనసా " తీసుకుంటే ఆ పాటలో ఆరోహణ, అవరోహణ స్థాయిలను పాడేటప్పుడు ఒక్కో అనుభూతితో పాడాల్సి ఉంటుంది.

" సమయానికి తగు మాటలాడెనే " అన్నప్పుడు అకస్మాత్తుగా భగవంతుడిని ఏదో నిందిస్తున్నట్లు, " ముదంబున ముద్దు పెట్ట నవ్వుచుండ హరి మరి " అన్నప్పుడు హరి నవ్వుతుంటే ఆ దృశ్యాన్ని దర్శించి చూసి మనమూ నవ్వినట్లు, " హరే రామచంద్రా !! రఘుకులేశ మృదు స్వభావ " అన్నప్పుడు రాముడిని " ఏదో మన స్నేహితుడు అయినట్లు " పాడాలి.

అలా ఒక్కోచోట ఒక్కోలా అనుభూతి చెందుతూ పాడుతూ ఉంటే నాకంటి వెంట ధారాపాతంగా కన్నీరు కారుతూ ఉంది ఆనందం పట్టలేకపోవడం వల్ల.
దాదాపు ఆరోజు రాత్రి 8.10 నుంచి 11.15 వరకూ మొత్తం 73 కీర్తనలు పాడేసరికి నా మనసంతా అవ్యక్తమైన ఆనందపు భావనలతో నిండిపోయింది, అంతరాత్మకి అభ్యంగన స్నానం చేయించి మనోమలినాలను రూపుమాపుకొన్నంత ఓ నిర్మల స్థితి కలిగింది అప్పుడు.

నా జీవితంలో ఎంతో గొప్ప సంతోషంతో నేను గడిపిన సమయాలలో అది ఉత్తమమైన సమయం కూడా....!!!

ఆ తరువాతి రోజు ఉదయం మేలుకోగానే రాత్రి జరిగిన ఆ సంఘటన గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వు వచ్చింది " ఏమిటి రాత్రి అలా ప్రవర్తించాను అర్ధంపర్ధం లేకుండా? " అన్నట్లు అని

నా స్థితి నాకే అలా అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరి బయటవాళ్ళెవరైన నన్ను అప్పుడు చూసుంటే నా మానసిక పరిస్థితి పై ఏమని అభిప్రాయం ఏర్పరుచుకుని ఉందురో? అనే భయం వేసింది కూడా నాకు ఆ సమయంలో...

కొన్ని ఫీలింగ్స్ అంతే, " ఎందుకు అలా అనుభవించావు? " అని ఎవరైనా ప్రశ్నగా అడిగితే సరిగ్గా సమాధానం కూడా చెప్పలేం మనం . అది అవతలి వ్యక్తికి కూడా అనుభవంలోకి వస్తేగానీ అర్ధం కాదు కూడా....!!!

ఏమంటారు?

- Kks kiran

1 కామెంట్‌: