14 జులై, 2016

చలం " స్త్రీ " పుస్తకంపై సమీక్ష


ఈమధ్య చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,,
చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది,,,ఏమిటా భావ విప్లవం? భావాలలోని అంత నూతనత్వం? తట్టుకోగలరా అంత నూతనత్వాన్ని ఈ మనుషులూ,సమాజమూ?

" యదార్ధవాది లోక విరోధి " అనే సామెత ఎందుకు నిజమో చలం జీవితాన్ని చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.చలం రచనల ఊసు ఎత్తినప్పుడల్లా అతిగా అతని రచనలు ద్వేషించే వాళ్ళూ,లేదా అతిగా అతని రచనలు అభిమానించేవాళ్ళూ కనపడుతూ ఉంటారు మనకి... ఎవరికి వారికి వాళ్ళకర్ధమైనంత వరకూ చలాన్ని విశ్లేషించగలరు తప్ప చలాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు...జీవితం తాలూకు అన్ని లోతులనూ కనేసుకున్నాడు చలం.

తరతరాల మన జీవన విధానంలోని లోపాలని ఎత్తి చూపుతాడు,జీవితంలో ఉండే మాధుర్యాన్ని మనకి పరిచయం చేస్తాడు,,లోకం తాలూకు సౌందర్యాన్ని పరిచయం చేస్తాడు,,మనలని మన నుంచే కాక మనం నమ్మే చాలా విషయాల నుంచి మనలని బయట పడేసి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం ఏమిటో ఆలోచించుకోమంటాడు.

మరి చాలాన్ని సమాజం ఎందుకు వెలివేసిందా? అని ఆలోచిస్తే నాకిలా సమాధానం తడుతూ ఉంటుంది.

" వ్యవస్థ ఎప్పుడూ చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.అది ఎప్పుడూ కొన్ని కొన్ని నమ్మకాలను నమ్ముతూ ఆ ఆ పద్దతులపైనే నడుస్తూ ఉంటుంది.ఆ పద్దతులలో లోపాలు ఉన్నా తనని తాను మార్చుకోడానికి ప్రయత్నించదు... "అలా కాదు,,ఈ పద్దతులు వదిలి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం నేను చెప్తాను " అని ఎవరైనా కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ సిద్దాంతంలోని లాజిక్ని వదిలేసి చెడునే పట్టుకుని ఆ మార్పుని తిరస్కరిస్తూ అలా మార్పుని ప్రతిపాదించిన వాడిని శిక్షిస్తూ ఉంటుంది ఎక్కడ తన మనుగడకి భంగం కలుగుతుందో అని " ..తరతరాల మన మానుష్య చరిత్ర మనకి నిరూపిస్తూ వచ్చిన సత్యమేగా ఇది?

బహుశా అదే కారణం అయ్యుంటుంది చలాన్ని అంతమంది అప్పటికీ,ఇప్పటికీ విమర్శిస్తూ ఉందాడానికి...తమ స్వార్ధానికి భంగం కలిగేలా భావాలని జనాలకి ప్రచారం చేస్తున్నాడాని. తమ ప్రవర్తన తాలూకు నగ్నత్వాన్ని భయటపెడుతున్నాడని.

" మన వ్యవస్థ కూడా సామాన్యులని తయారు చేసేలా ఉంటుంది.మనిషిలోని సృజనాత్మకతని చంపేసి మనిషిని ఇంతకన్నా ఉన్నతంగా ఎదగనీయకుండా తాను చెప్పినట్లు ఉండేలానే తయారు చేస్తోంది. ఉన్నత ఆదర్శాలు,,కోరికలు ఉంటే వెంటనే నిరుత్సాహపరిచి మనిషిని ఎదగనీయకుండా చేసే మనుషులు ఎక్కువ మన సమాజంలో. సామాజిక కట్టుబాట్లకి,,జీవన విధానాలకి బందీలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు....పక్కవాడు ఏమనుకుంటాడో అని  భయంతో మనసుకి నచ్చినట్లుగా బ్రతకకుండా ముఖానికో ముసుగు,,మనసుకో ముసుగు వేసుకుని బ్రతికే మానసిక బానిసలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు... " ఏదో జీవితం ఇలా గడిచిపోతే చాలు " అని అనుకునే వ్యక్తులే ఎక్కువ ఇందులో. "

అలాంటి వారికి జీవితంలో ప్రతీ కోణాన్ని అనుభవించి,,ఆస్వాదించి,అనుభూతి చెంది అందులో మమేకమయ్యి రాసిన చలం లాంటి వ్యక్తులు శత్రువులా కనపడడంలో వింతేముంది?



- Kks  Kiran​

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి