11 జులై, 2016

మిత్రుడి కోసం నేను రాసిపెట్టిన ఓ ప్రేమలేఖ




" నా లవర్కి పంపడానికి ఏమైనా మంచి కవితలు చెప్పు కిరణ్ " అని ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది నాకప్పుడప్పుడూ...

చాలా ఇబ్బంది ఎదురవుతుంది నాకప్పుడు..ఎందుకంటే నిజంగా నాకు కవిత్వం రాయడం రాదు...ఏదో అప్పటికప్పుడు నాకనిపించిన భావాలు ఇలా రాయడమేగానీ కవిత్వపు లక్షణాలుగానీ,,ఆ చందస్సులూ ఇవేమీ పెద్దగా తెలియవునాకు....పైగా కవిత్వం అనేది ఇలా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఇచ్చేసే కాఫీలాంటిది కాదు..అది వ్యక్తిగత అనుభూతివల్ల మాత్రమే ఏర్పడుతుంది ( చాలా సందర్భాలలో )...

ఆ వ్యక్తిగత అనుభూతి అనేది ఆ ఇద్దరిమధ్య జరిగిన సంఘటనల వల్లా,,వాళ్ళ వాళ్ల అనుభవాలవల్లా ఆధారపడి ఏర్పడుతుంది..

పోనీ ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా మనమేదో వాళ్ళకి రాసిచ్చామనుకోండి అది ఆ ఇద్దరు వ్యకుల సంస్కారానికీ,,అభిరుచులకీ,,అలవాట్లకీ పొంతన కుదిరే విషయంలా అనిపించాలి..లేకపోతే అందులోని ఆ కవితారసం ఉత్త అర్ధంలేని వ్యవహారంలా తోస్తుంది...

ఉదాహరణకి " పౌష్యమాసంలో తెలిమంచు సమయంలో తెరలను తొలగిస్తూ వచ్చే ప్రభాత సూర్యుని కిరణాలవంటి శరీరపు రంగు కలదానివి నువ్వు " అని రాశామనుకోండి..అది వీడి సొంతభావాలుగా వీడు  ఆ అమ్మాయికి  పంపితే ఆమె పొద్దున్న 10 గంటలవరకూ పక్క దిగని మహానుభావురాలైతే ఏమర్ధమవుతుంది ఆ పుష్యమాసపు ఉదయపు అందమూ,,అందులోని ఆనందమూనూ?

పోనీ ఆ అమ్మాయి వరకూ ఎందుకూ? అసలు ఋతువులెన్ని?? తెలుగు నెలలపేర్లేమిటి ??? అనే విషయాలేవీ తెలియని మహామేధావనుకోండి మనవాడు....అలాంటి విషయవిజ్ఞాని ఇలా మెసేజ్ పెడితే " ఎక్కడనుంచి ఎత్తుకొచ్చవ్ ఈ కవిత ? " అని వాడిని సులభంగా గేలి చేసి అదేదో నవ్వులాట విషయమైనట్లు మాట్లాడుంది ఆ అమ్మాయి వీడితో...

ఇక ఎంత గొప్ప కవిత్వం రాస్తే ఏం అక్కడ?? అదో పనికిమాలిన విషయంగా మారిపోయినప్పుడు ???

అందుకే " మీ మనసులో నిజంగా ఆమె గురించి ఏమనిపిస్తే అదే రాయండి..అంతకు మించిన గొప్ప కవితేదీ ఉండదు వాస్తవానికి...మీయొక్క ఆ మాటల్లోని నిజాయితీకి ఆమె తప్పకుండా కనక్ట్ అవుతుంది " అని తప్పించేసుకుంటూ ఉంటాను నేను చాలా సందర్భాలలో..

అయినా కొందరు " అవేంకాదురా,,నువ్వు మంచి కవిత పంపు చాలు,,మిగతావి నేను చూసుకుంటాను " అని బెదిరించి రాయించుకుంటారు నాచేత..

ఇదిగో అలా ఈమధ్య నా డిప్లమా ఫ్రెండ్ ఒకతను తన లవర్కి పంపించుకుంటానంటే ఇలా రాసిచ్చాను నేను..

" వరలక్ష్మీ,,

నిన్నూ,,నీ పేరుని తలుచుకున్నంత గొప్పగా నేను ఆ భగవంతుడిని తలుచుకుని ఉంటే ఈపాటికి స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసి
ఉంచేవాడేమో నాకోసం....!!!

అయినా నా పిచ్చి కానీ,
నిన్ను చూసినప్పుడూ , నిన్ను తలచినప్పుడూ నేను పొందే ఆనందం
ఏ స్వర్గం మాత్రం అందివ్వగలదు
చెప్పు?

సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే " సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు " అని పోతనగారు
భాగవతంలో వర్ణించినట్లుగా నా ముందు సాక్షాత్కరించినా నాకు నిన్ను చూసినప్పుడు కలిగేంత ఆనందం కలుగుతుందా చెప్పు ?

అంత గొప్పగా నా మనసు నీ వశమయ్యేట్లు ఏం మంత్రం ప్రయోగించావు నాపై నువ్వు వరలక్ష్మీ??? " అని...

ఎలా ఉందిది???



- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి