11 జులై, 2016

బాల్య వివాహాల గురించి & స్త్రీ వాదం గురించి



       

ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నాప్పుడు ఒక్కోసారి అతను చెప్పే వాదం వినడానికి చాలా నిజం అని అనిపించినా ఎక్కడో అతని వాదనలో లోపం ఉన్నట్లు అనిపిస్తుంది,,కానీ అదెక్కడో సరిగ్గా వివరించి చెప్పలేము మనం..అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా మీకు?

********************************************************

" ఊళ్ళో బాల్యవివాహాలు ఎక్కువైపోతున్నాయండి..వాటినెలా అరికట్టాలో అర్ధంకావట్లేదు.. అంతకీ మా ఇంటికి ముహూర్తాలకై వచ్చేవాళ్ళల్లో ఎవరైనా బాల్యవివాహం అంటే కాస్త మందలింపుగా వాళ్ళతో " ముందు పిల్లలని చక్కగా చదివించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేంతవరకూ ఆగు,,అప్పుడే పెళ్ళికి తొందరేమొచ్చింది మీ పిల్లలకి " అని మాట్లాడి పంపించేస్తున్నాను నేను..

అయినా సరే కొందరు తల్లితండ్రులు " పెళ్ళే జీవితాశయం,, అంతకి మించి ఆడపిల్లలకి గొప్ప అచీవ్మెంట్ ఏదీ ఉండదన్నట్లు " ప్రవర్తిస్తున్నారు పల్లెల్లో,, మరి ఆలోచనలలో ఈ వెనుకబాటుతనమూ ఎందుకో అర్ధంకాదు కానీ చాలామంది ఆడపిల్లలు పదోతరగతి తర్వాత ఇక పై చదువులకి వెళ్ళట్లేదు ఇంట్లోవాళ్ళ నిర్ణయాన్ని అనుసరించి.. 

" కాలేజ్కి వెళ్ళి ఎక్కడ ప్రేమలో పడుతుందో?,, అయినా ఆడపిల్లలకి చదువులెందుకు? " అనే అర్ధంలేని భయాలూ,, స్వయంవిచార నిర్ణయాలతో చాలామంది వ్యక్తులు ఆడపిల్లలను చదివించడం మానేసి వాళ్ళకి పసుపుబట్టలు కట్టేసి పెళ్ళి పీటలెక్కించేస్తున్నారు చాలామటుకు ఇంకా పల్లెల్లో... వీళ్ళు సరిగ్గా ప్రపంచాన్ని చూడలేరు సరికదా తమ పిల్లలకీ ఆ ప్రపంచపు వెలుతురు కనపడకుండా చేస్తున్నారు ఇలా,,

విచారించదగ్గ విషయం ఏమిటంటే ముక్కూ మొహం తెలియని వాడెవడికో అన్నేసి లక్షలు కట్నంగా ఇచ్చి అంత ఆర్భాటంగా పెళ్ళి చేసేబదులు అందులో పదోవంతైనా కనీసం కేటాయించి తమ పిల్లని చదివించవచ్చుకదా? పిల్ల పెద్దమనిషి అవ్వడం పాపం,, ఎప్పుడు పెళ్ళి చేసేద్దామా అనే ఆత్రమే తప్ప ఆమెకో చక్కని వ్యక్తిత్వం,సంస్కారమూ నేర్పి జీవితంలో పైకి వచ్చేంతవరకూ సహకరిద్దామని ఉండదు వీళ్ళకి? నేను మాత్రం ఎంతవరకూ జోక్యం చేసుకోగలను వారి నిర్ణయాలలో...ఏమిటో ఈ తొందరుపాటు పనులు " అని నిట్టూరుస్తూ అన్నాను నేను నాకన్నా వయసులో 3 రెట్లు పెద్ద అయిన ఒకాయనతో ఈమధ్య...

" వాళ్ళ నిర్ణయంలో తప్పేముందయ్యా? ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో చూశావా ఈమధ్య? అస్సలు మాట వినట్లేదు... అయినా ఆడది,మగవాడూ ఇద్దరూ ఉద్యోగం చేస్తే మరి సంసారాన్నీ,,పిల్లలని ఎవరు చూస్తారో నువ్వే చెప్పు,, అందుకే స్త్రీ అవసరం మేరకు మాత్రమే ఉద్యోగం చెయ్యాలయ్యా...!!! ఆ అవకాశం ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు కదా ? " అని అన్నారు..నాతో ఇదే విషయమై చర్చిస్తూ మధ్యలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు ఆయన బాల్య వివాహలపై కూడా..

" పిల్లలకి 16 ఏళ్ళు దాటాక కామం కలుగుతుది... ఆ కామం కల్గించే మోహంలో ఎవరైనా అందంగానూ,,ఆకర్షణీయంగానే కనిపిస్తారు..అలా వాళ్ళ మనసు చలితం అయ్యి పక్కదోవపట్టకూడదనే ఒకప్పుడు బాల్యవివాహాలు చేసేసేసేవారు. 

నీకు తెలుసా? నాకు 16,,మా ఆవిడకి 11 ఏళ్ళ వయసున్నప్పుడు మాకు పెళ్ళి అయ్యింది...అది 14 ఏట పెద్దదైనప్పుడూ మా ఇంటికి కాపురానికి పంపారు వాళ్ళవాళ్ళు..దానికి 19 ఏడు వచ్చేసరికే అది మా ముగ్గురు పిల్లలకి తల్లి అయ్యిందికూడానూ " అని గర్వంగా చెప్పాడు ఆయన..

" 19 ఏళ్ళకే ముగ్గురుపిల్లల తల్లి అయ్యిందనే " ఆ మాట వింటేనే ఏమనాలో అర్ధంకాలేదు నాకు...మానసిక ఎదుగుదల అనే విషయ పక్కనపెడితే శారీరకపరంగా ఇంకా అభివృద్ది చెందని,, యవ్వనం అప్పుడప్పుడే అంకురిస్తున ఆ దశలోనే ఓ స్త్రీ ఆకర్షణ,అది కలిగించే అందమైన ఆత్రం అనుభవించకుండానే అప్పుడే బాధ్యతలు ఎత్తుకునే స్థితికి చేరుకుందంటే చాలా నీచమైన విషయంగా తోచింది నాకు..ఎంత రసహీన జీవితం గడిపి ఉంటారో ఇలాంటి స్త్రీలు అని అనుకుంటూ

సరే,,ఆ విషయమేదీ ఆయనతో ప్రస్తావించకుండా " ఒకప్పుడంటే అలా చెల్లింది కానీ ఇప్పటి ప్రాపంచికపరిస్థితులు వేరు కదాండి,,అయినా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికో,ఉపాధి కల్పనకో పరిమితమైన అంశంకాదు కదా? చదువు వల్ల సంస్కారము,,సరైన ఆలోచనా విధానం,,జీవితం పట్ల ఓ అవగాహనా కలుగుతాయి,,కనుక చదువనేది తప్పనిసరి...అందుకే ఆడపిల్లలను కూడా చదివించాలని అంటున్నాను " అని భర్తుహరి సుభాషితాలలోని " విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ " పద్యం గుర్తు చేశాను ఆయనకి సందర్భాననుసరించి..

ఆయనతో మాట్లాడిన మాటల్లోనే ఇలా కూడా అన్నాను నేను మధ్యలో

" స్త్రీలో ఆధారపడే గుణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు పురుషుడు..కానీ స్త్రీ ఒక్కసారి ఆధారపడడం మొదలెట్టిందా గొప్పగా లోకువ అయిపోతుంది పురుషుడికి...స్త్రీయొక్క శ్రమని గుర్తించి ఆమెతో గౌరవంగా ప్రవర్తించే మగవాళ్ళు తక్కువ మన వ్యవస్థలో... బయట తాను పడుతున్న కష్టంతో పోలిస్తే ఇంట్లో ఈమె కష్టం ఏపాటిదని స్త్రీని చులకనా భావంతో చూసే మనస్తత్వం మన మగవాళ్లలో ఇంకా పోలేదు... ఇలా ఉన్న మగవాళ్ళపై ఆధారపడి మొగుడెలాంటి వెధవపనులు చేసినా,,తననెంత హీనంగా చూసినా మౌనంగా ,పంటిబిగువున ఆ క్షోభని ఒకప్పుడు స్త్రీలు భరించారంటే అందుకు కారణం వారికి సరైన నిర్ణయ స్వేచ్చ లేకపోవడం వల్లనే...నిర్ణయస్వేచ్చ లేని మనుషులు క్రమక్రమంగా జడులౌతారు...ఆ నిర్ణయస్వేచ్చ ఆర్ధిక స్వేచ్చవల్ల చాలామటుకు కలుగుతుంది...కనుక స్త్రీ తన సొంత వ్యక్తిత్వం కోల్పోకుండానే మగవాడిపై ఆధారపడాలి వివాహం అయిన తర్వాత " అన్నాను నేను..

అప్పుడాయన " అయితే దీనికి పరిష్కారమార్గంగా ఏంచెయ్యాలంటే " పిల్లలకి 16 ఏళ్ళలోపులో పెళ్ళి చేసేసి ఆ తర్వాత వాళ్ళని విడివిడిగా ఎవరి ఇళ్ళళ్ళోనే వాళ్ళనుంచి చదివించాలి...చదువయ్యాక కాస్త జీవితంలో స్థిరపడ్డారు అని అనిపించాక అప్పుడు కాపురానికి పంపాలి..అప్పుడేమవుతుందంటే వీళ్ళు చదువుకునే రోజుల్లో మనసూ పక్కదారి పట్టదు ,,పిల్లలూ బుద్ధిగా ఉంటారు " అని అన్నాడు..

" ఇదెక్కడి వాదనండి బాబూ...చదువయ్యాక ఈ వ్యక్తి వద్దనిపిస్తే మరేం చెయ్యాలి? పొరింగింటిది పోరట్లు ఇస్తుందని మన ఇంట్లో అన్నం వండుకోవడం మానేసి నెయ్యి కాచుకుని కూర్చునట్లుంది ఇది. ఏదో జరుగుతుందని మనమే ఊహించేసుకుని ముందు జాగ్రత్త చర్యలుగా ఈ ఆంక్షలు విధించుకోవడమేమిటి ? అర్ధంలేకుండా,,దానిబదులు పిల్లలకే ప్రేమ అంటే ఇదీ,,ఆకర్షణ అంటే ఇదీ అని వివరించి జీవితంపై అవగాహన పెంచెలా మాట్లాడచ్చు తల్లితండ్రులు అని అన్నాను నేను విసుగెత్తి..

అందుకాయన నా మాటలను కొట్టిపారేస్తూ " నాకు తెలిసిన ఫలానా అమ్మాయి ఇలా వాడితో లేచిపోయింది,వాడు దీనినిలా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్ళి చేసుకునాడు " అని అర్ధంలేని ఉదాహరణలెన్నో ఇచ్చాడు ఆయన వాదాన్ని గట్టిగా సమర్ధించుకునేలా.ఆయన వాదన ఎలా ఉందంటే విన్నవాడు ఎవడైనా ఆయన అభిప్రాయాలతో తప్పక ఏకీభవించేంత నేర్పుగా చెప్పాడు..

ఆయన చెప్పిన ఆ వివరణలు వింటూంటే అది కరక్టే అనిపించేది కొన్ని కొన్ని పాయింట్లలో...కానీ అది సరైన విధానం కాదూ అని కూడా అనిపించేది కొన్నికొన్నిసార్లు...

ఎందుకంటే ఏవో కొన్ని ఉదాహరణలు పట్టుకుని మొత్తం వ్యవస్థ ఇలానే ఉందని నిర్ణయించడంకానీ,,దానిని తూర్పారపట్టడం ఎలా చెయ్యగలం మనం? కొన్ని కొన్ని సమస్యలకీ,,నిర్ణయాలకీ కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా ఓ పరిష్కారం,వ్యవస్థపరంగా ఓ పరిష్కారం ఉంటాయి కదా ..

ఆ విషయాన్ని గ్రహించకుండా అన్నిటినీ ఒకే గాటిన కట్టేసి " పరిష్కారమార్గం ఇదీ " అని ఎలా నిర్ణయించగలం దేనికైనా మనం?

ఈ విషయాలు ఆయనతో అందామని అనుకున్నానుకానీ ఆయన అప్పటికే నా మాట వినే స్థితిలో లేడు...ఒక సమస్యపై మేమిద్దరమూ భిన్న దృక్పదాలతో మాట్లాడుతున్నట్లు అనిపించింది నాకు.

మా ఇద్దరికీ ఏకాభిప్రాయం కలగాలంటే ఎవరో ఒకరి దృక్పదాన్ని ఒప్పుకోవాలి,,కానీ ఎలా ఒప్పుకోగలము? దృక్పదం మారాలంటే ముందు ఆ విషయంపై మా అభిప్రాయాలు మారాలి,,

అభిప్రాయాలు ఎలా మారతాయి? మన విషయపరిధివల్లా,మన తార్కిక జ్ఞానం వల్లా..

నేను చూసిన పరిస్థితులు,,సంఘటనలూ వేరు..ఆయన చూసిన పరిస్థితులు,సంఘటనలూ వేరు అయ్యుండడంవల్ల ఎవరివి వారివే నిశ్చితాభిప్రాయాలనే ఉద్దెశంతో ఇంతసేపూ వాదించుకుంటూ ఉన్నాము మేము.

ఇంక ఈ వాదన తెగదని,,పైగా వాదించీ ఉపయోగం లేదని అక్కడితో సరిపెట్టాను నేను..

వాదనలవల్ల అభిప్రాయాలు మారవు కదా? అభిప్రాయాలు మారేది కేవలం చేతలవల్లే..

ఎలగో నాకు చేతనైనంతలో చైతన్యం తీసుకువస్తున్నాను మా ఊరిలో,పొరుగూరిలోను బాల్యవివాహలను వ్యతిరేకిస్తూ,, చదువు మానేసిన ఆడపిల్లలను తిరిగి కాలేజీకి పంపేలా వాళ్ళ తల్లితండ్రులను ప్రోత్సహిస్తూ...

ఇప్పుడు ఈ వాదనలో ఓడిపోతేనేం?? దానివల్ల నాకు కలిగే నష్టమేదీ లేదు కదా నిజానికని నోరుమూస్కొని కూర్చున్నాను ఇక...

గొప్ప వాగ్ధాటితో మాట్లాడడం కన్నా క్లుప్తంగా మాట్లాడడమే ఉత్తమం కొన్నికొన్ని సార్లు...

ఏమంటారు?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి