" @ నమ్రతా,,
చాలాకాలం వరకూ నా తర్కానికీ,,నా మేధస్సుకీ అర్ధంకాని విషయాలలో ఇదొకటి...!!!
అదేంటంటే " ప్రేమ అనేది ప్రకటిస్తేనే తెలుస్తుందా? లేక తనకి తానుగా అర్ధం చేసుకోబడుతుందా ? " అని...
" ప్రేముంటే అది అప్పుడప్పుడూ ప్రకటించాలి,,లేకపోతే అది అవతలివారికెలా అర్ధమవుతుంది? " అని అంటారు కొందరు...అందుకే ఈ గ్రీటింగ్ కార్డ్లూ,,బహుమతులతో అవతలివారిని " నువ్వంటే నాకింత ఇష్టం " అని తెలియచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోకంలో చాలామంది...
కానీ నిజంగా ప్రేముంటే మనుష్యులమధ్య ఇన్ని ఆర్భాటాలూ అక్కర్లేదేమోనే...!!! అవతలివారితో నువ్వొక్కముక్క మాట్లాడకపోయినా నీ తాలూకు ప్రేమ చిన్న చిన్న చర్యల ద్వారాకూడా అవగతమైపోతూ ఉంటుంది నిజానికి.
ఆ లెక్కన నేనెంత అదృష్టవంతుడినే...!!! ఎంత ప్రేమ వ్యక్తమైంది మనమధ్య మన చిన్నతనం నుంచీ?
చలికాలంలో ఉదయాన ఆరుబయట ఓ చోట గడ్డిపరకలను పేర్చుకుని చలిమంటాగా చేసి దానిచుట్టూ మనం కూర్చుని మధ్యమధ్యలో " టప్ " అని పేలిన వరి కంకుల పేలాలను అపురూపంగా భావించి ఆత్రపడి తినడం గుర్తుందా నీకు?
వేసవి కాలపు రాత్రులలో హాయిగా మన మేడపై పడుక్కుని ఆ చంద్రుని చల్లదనాన్నీ,,మిణుకుమిణుకుమనే నక్షత్రపు కాంతినీ,,తేలిపోయే తెల్లటి మేఘాలనీ చూస్తూ,,కొబ్బరి ఆకుల మీదనుంచి వచ్చే సంగీతాన్ని వింటూ ఏ చీకూచింతా లేకుండా సామాన్యమైన విషయాలనే ఎంతో ఆనందంగా చెప్పుకుంటూ అర్ధరాత్రీ దాటేవరకూ నిద్రని నిర్లక్షం చెయ్యడం మర్చిపోగలమా చెప్పు?
ఇప్పుడు తలుచుకుంటే చాలా స్టుపిడ్గా అనిపిస్తుందికానీ దాదాపు మనం 10 క్లాస్ అయ్యేంతవరకూ ఇంకా చిన్నపిల్లల్లా మషాలదెయ్యం అనీ,,నేలాబండా అనీ,,సబ్జావిండోర్ అనీ,,కబాడీ అనీ సాయంత్రాలు గడపడం మర్చిపోవసాధ్యమా? హూం?
ఇక ఆ ---- విషయంలో ఎంత సాయం చేశావే నాకు నువ్వు? ఇప్పుడంటే నిజంగా నాకు చాలా నవ్వు వస్తుంది అవతల వ్యక్తియొక్క వ్యక్తిత్వమూ,,ఆలోచనా విధానం ఏమిటో తెలుసుకోకుండానే ప్రేమించడమేమిటి నా పిండాకూడులా అని? దానినే సైకాలజీలో ఇంఫాట్యువేషన్ అని ఒకడూ,,ఐడెంటిటీక్రైసిస్ అని మరో మానసిక శాస్రవేత్తా అంటాడు కానీ అప్పుడవేవీ నాకు తెలియదు కదా?
ఆ వయసులో నేను దానివైపు చూడడమూ,,చూసి మురిసిపోవడమూ చేస్తుంటే దాని తాలూకు Updates ఎన్ని ఇచ్చి నాకు సాయం చేశావే? అది ఎక్కడెక్కడికి ఎప్పుడు వెళ్తుంది,, ఏమేం మాట్లాడిందో ఆ వివరాలన్నీ నాకు పూసగుచ్చినట్లు చెప్తూనే నా గురించి దాని దగ్గర బాగా గొప్ప చేస్తూ చెప్పిన ఆ విషయాలకీ,,ఆ మాత్రపు సాయానికీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలనే నేను నీకు? కుబేరుడి దగ్గర ఆ వెంకన్న బాబు ఎంత రుణపడ్డాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీకు ఈ విషయంలో చాలా రుణపడ్డట్టే అనిపిస్తుంది ఈ విషయం తలుచుకుంటే మాత్రం నాకెప్పటికీనూ ;)
నీకు తెలుసా నమ్రతా? మొన్నామధ్య సంక్రాంతికి అమ్మమ్మావాళ్ళ ఊరికొచ్చినప్పుడు మనం అందరం సర్పవరం భావనారాయణ స్వామి గుడికీ,,కోరంగి మడ అడవులకీ,,కాకినాడ బీచ్కీ వెళ్ళి సాయంకాలం బస్లో తిరిగివస్తూంటే నువ్వు నాపక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఆ ప్రయాణపు బడలిక చేత మాటల్లోనే నిద్రపోయావు నా భుజంపై నీ తలనాంచుకుని...
అమ్మాయివై ఉండడంవల్ల నువ్వీ విషయం ఎరగకపోవచ్చు నమ్రతా.. ఒక స్త్రీ మగవాడి భుజంపై తన తలనాంచుకుని పడుక్కుందంటే అది ఆ మగవాడిపై తనకుండే ప్రేమకీ,,నమ్మకానికీ,,అతను తనకివ్వగలిగే భద్రతకీ పరాకాష్ట అని అర్ధం...అలాంటిది నువ్వలా నా భుజంపై పడుక్కునేసరికి ఆ ఒక్క క్షణంలో నేనభవించిన ఆనందానికీ అంతేలేదంటే నువ్వు నిజంగా నమ్మవు...!! స్వర్గలోకపు ఆధిపత్యం నాకాసమయంలో ఎవరైనా వరంగా ఇచ్చినా దానికంటే ఇదే ఉత్తమమని నేను వదిలేద్దునుకూడా ఆ అవకాశాన్ని..అంత ఆనందం కలిగింది నాకాసమయంలో :)
ఎప్పుడూ మనలని మనం ఆటపట్టించుకుంటూ,సరదాగా తిట్టుకుంటూ కాలాన్ని గడిపామేకానీ ఏనాడైనా " నేను నిన్ను ప్రేమిస్తున్నాను " అని కానీ,, " నువ్వంటే నాకిష్టం " అనికానీ చెప్పుకున్నముటే??? కానీ ఈ ఒక్క చర్యా చాలదూ ప్రేమని వ్యక్తీకరిచడానికీ భాషకానీ,,మాటలుకానీ అవసరంలేదూ ప్రేమపూర్వకమైన స్పర్శ ఒక్కటీ చాలనీ??
అప్పుడే నాకర్ధమైంది నాకు నీవల్ల ఈ విషయం " ప్రేమ అనేది ప్రకటించకపోయినా అర్ధం చేసుకోబడుతుంది " అని..
అంత గొప్ప ప్రేమని నాకిప్పటికీ ఏలోటూ లేకుండా అందిస్తున్నందుకూ చాలా టాన్క్సే నీకు ( అయిపోయిన Cinimaకి Wallposterlu వెయ్యడం ఎందుకే? అని ఇప్పటికీ నేను నవ్వుతూ మొత్తుకుంటున్నా వినక " మా వదిన కనిపించిందిరా,,మా వదిన ఇలా అందిరా " అని ఇప్పటికీ దానితాలూకు Details నాకందిస్తూ నన్ను సరదాగా ఆటపట్టిస్తున్నందుకు కూడా అనుకో ;) )
చెప్తే చాలా మెలోడ్రమెటిక్ వాక్యంలా ఉంటుందని ఇంతకాలం నేను నీకిది చెప్పలేదుకానీ - నీకంటే పెద్దోడిగా నేను పుట్టి నీచేత నోరారా కమ్మగా ఇలా " అన్నయ్యా " అని పిలిపించుకునే అదృష్టం పొందినందుకు నిజంగా గత జన్మలో ఏవో గొప్ప తపస్సులూ,పుణ్యకార్యాలూ నేను చేసుండుంటానే..!!! లేకపోతే ఇంత గొప్ప అవకాశం నాకు దక్కేనా చెప్పు???
రాఖీపండగ శుభాకాంక్షలు :)
- అన్నయ్య "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి