నాకు ఉపనయనం అయినప్పటి నుంచీ క్రమం తప్పకుండా నిత్యం ఉదయం,సాయంత్రం సంధ్యావందనం చేస్తున్నాను.
గొప్ప మార్పు వచ్చేసింది నాలో అని సోత్కర్షగా చెప్పను కానీ,మార్పు వచ్చిన మాట కొంతైనా నిజం.
పొద్దున్న 6 గంటలలోపే సంధ్యావందనం చేసేసుకోవాలి కాబట్టి ఉదయం 5 గంటలకే లేవడం అలవాటయ్యింది నాకు.చీకటితోపాటే నిద్రలేవడం చాలా బాగుంటుంది.
అప్పుడే ప్రకృతి మేలుకునే సమయం కూడా,
సూర్యుడు కూడా ఇంకా రావడానికి సమయం ఉంటుంది,పువ్వులు కూడా పూర్తిగా విడిచి ఉండవు.ఆకులపై మంచు బిందువులు సమూహంగా ఏర్పడి ఉంటాయి అందంగా.ఆకాశంలో ఉషస్సు కనపడుతుందప్పుడు.అలాంటి సమయంలో ఏ భూపాల రాగమో వింటూ ఓ 5 నిముషాలు సంగీతం వింటూ అటూ ఇటూ అ మంచులో,ఆ చల్లని గాలిలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
మా ఇంటి దగ్గర గోస్తనీ నది ఉంది,ఆ నదీ గట్టుపై ఉన్న పెద్ద పెద్ద చెట్లపై దాదాపు 200కు పైగా కొంగలు నివాసం ఉంటూ ఉంటాయి.అవి పొద్దున్నే అక్కడే ఉన్న చెరువులో గుంపుగా స్నానం చేస్తూ ఉంటాయి.అప్పుడు చూడాలి ఆ దృశ్యాన్ని,నిజంగా ఎంత బాగుంటుందో అలా చూస్తూ ఉంటే,
అలా చాలా పక్షులు అల్లరి చేస్తూ ఉంతాయి తమ తమ గొంతు విప్పి ఎంతో స్వేచ్చగా ఎగురుతూ,నా అదృష్టం ఏంటంటే నా గది కిటికీకి ఆనుకునే నేను పెంచే తోట ఉంటుంది.నిద్రలేవడం అనేది నాకూ పక్షుల కూతలతోనే జరుగుతోంది.ఒకవేళ ఎపుడైనా కాస్త బద్దకించి ముసుగుతన్ని పడుకోవాలనిపించినా పక్షుల సందడితో మెలకువ వచ్చేస్తోంది.
నిత్యకృత్యాలు పూర్తి చేసి మడి బట్టలు కట్టుకుని తొలి తొలి సూర్యకిరణాలు ఒంటిని అభిషేకిస్తునట్లుగా తాకుతున్నప్పుడు గాయత్రీ మంత్రాన్ని కళ్లు మూసుకుని జపించడం అనేది నిజంగా గొప్ప అనుభవమే,
సాయంత్రం కూడా 6 లోపులో పూర్తి చెయ్యాలి కాబట్టి,ఎంత పనులలో ఉన్నా ఆ సమయానికి తయారైపోతున్నా,అందుకే గత 3 సంవత్సరాలుగా అనవసరంగా ఎక్కడికీ బయటకు వెళ్ళడం బాగా తగ్గిపోయింది.
గాయత్రీ మంత్రం చదివే వ్యక్తికి నిజంగానే స్థితప్రజ్ఞత అలవడుతుంది,చెప్తే సోత్కర్ష అనుకుంటారు కానీ నిజం చెప్తున్నా, ఈ 3 సంవత్సరాలుగా నా మనసుకి గొప్ప శాంతి అలవడిన మాట మాత్రం వాస్తవం,
వేద మంత్రాలకి ఉన్న శక్తి అలాంటిది.స్వరస్థానాలను అనుసరించి వాటిని ఉచ్చరిస్తే జపించిన వ్యక్తికి గొప్ప శాంతి కలుగుతుంది.
నాకు కలిగిన ఈ అనుభవం ఇంకొంతమందికి కూడా కలగచేస్తే బాగుండును అని అనిపించింది ఈ మధ్య నాకు,అందుకే నాకీమధ్య ఓ చిన్న కోరిక కలిగింది,
కనీసం నాకు 40 ఏళ్ళు వచ్చినప్పుడైనా ఆసక్తి ఉన్న వ్యక్తులకి కుల,మత బేధం లేకుండా కనీసం సంధ్యావందన విధానం అయినా దగ్గరుండి నేర్పాలని,చూద్దాం ఎంత వరకూ నా ఆకాంక్ష నెరవేరుతుందో,
శుభసాయంత్రం.
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి