29 మే, 2017

అమ్మవారి దరహాస ప్రభావం


దాసాయ మాన సుమ హాసాకదంబ వాసా కుసుంభ సుమనో
.............................................................
.............................................................

నాసామణి ప్రవర భాసా శివ తిమిర మాసాదయే దుపరతిం !!

భావార్ధ వివరణ :- కవి కాళిదాసు ఈ శ్లోకంలో అమ్మవారి దరహాస ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు.

ఎప్పుడూ సుగంధ భరిత కదంబవనంలో సంచరించే ఆ తల్లి దివ్య మందహాసం ( చిరునవ్వు ) వికసించిన దేవతా పుష్పాల శోభని త్రోసిరాజని శాశ్వతానందాన్ని భక్తులకి ప్రసాదిస్తోంది.. ఆ కారణం చేతనే ఆ పుష్పాలన్నీ ఎప్పుడెప్పుడు ఆ తల్లి పాదాల చెంతకి చేరి దాస్యం చేద్దామా? అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాయట.. అమ్మ కృపవల్ల ఎన్నటికీ వాడని పరిమళాన్ని తమ సొంతం చేసుకోవాలని వాటి ఆశట :)

ఆ తల్లి లోకోత్తర వీణాగానాన్ని చేయటంలో నేర్పరి. చెలికత్తెలతో కలిసి లీలా వినోదంగా తన మధుర కంఠస్వరానికి తోడుగా వీణాగానాన్ని చేస్తూ ఉంటుంది . ఆ గాన మాధుర్యంలో ఈ లోకాలన్నీ పరవశమవుతాయి.

చైత్రమాసంలో అరవిరిసిన అరవిందాల శోభని మించిపోయే ఆ గానానికి పరవశులై సదా ఆ తల్లి చేతులతో ఉండే వరాన్ని కోరుకుని పద్మాలు ధన్యమయ్యాయి. ఆ పద్మాలపై వాలటానికి వచ్చిన తెమ్మెదలు పద్మినీ జాతికి చెందిన ఆ తల్లి ముఖపద్మాన్ని చూసి అసలు పద్మాలని వదిలిపెట్టి అమ్మవారి చెంతనే ఉండిపోవాలని కోరుకున్నాయట.

ఆ తల్లి దయ ధారావర్షంలా కురిసే ఆ దయామృత ధారలో తడిసిన భక్తులందరూ పునర్జన్మ రహితులై పునీతులవుతున్నారు.

మంగళప్రదురాలైన ఆ పార్వతీ దేవి ముక్కెరను భూషణంగా దాల్చిందట. ఆ ముక్కెరలోని మణులు ఆ తల్లి దరహాసం చేసే సమయంలో విచిత్రమైన కాంతులను వెదజల్లుతున్నాయట. ఆ వెలుగులో భక్తులు తమ అజ్ఞానమనే చీకట్లను చీల్చుకుని ముక్తిమార్గం వైపు పయనిస్తారు.

అంతటి మహిమాన్వితమైన అమ్మవారి మందహాస కటాక్షాలు భక్తులందరిపైనా ప్రసరించే వరాన్ని ప్రసాదించమని వేడుకొంటున్నాడు ఆ తల్లిని ఈ శ్లోకంద్వారా కాళిదాసు ఎంతో అద్భుతమైన తన కవితాత్మక ధోరణిలో.

శుభసాయంత్రం :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి