అబ్బబ్బా...!!! ఎంత అందంగా ఉందో చూడండి ఆరుబయట వెన్నెలకాంతి
ఫాల్గుణమాసపు ఈ పౌర్ణమి చంద్రుడ్ని చూస్తూంటే కాళిదాసు రాసిన " కుమారసంభవం " లోని చంద్రోదయ వర్ణన రాయాలనిపిస్తోంది నాకు....
పార్వతీదేవితో వివాహం అయ్యాక పరమశివుడు అత్తవారి ఇంటినుంచి వీడ్కోలు తీసుకుని సురతక్రీడకై పార్వతీదేవితో కలిసి " మలయపర్వతం" పై విహరిస్తూ ఉంటాడు...
అక్కడా చంద్రశేఖరుడు ఆ పర్వతరాజ పుత్రికతో క్రీడిస్తూ ఒకనాటి సాయంసంధ్యావేళ " గంధమాదవనం " లో ప్రవేశించి బంగారుశిలలపై కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తాడు పార్వతీదేవితో కలిసి...ఆ తర్వాత శివుడు సంధ్యావందనం చేసుకోడానికని బయటకువెళ్ళి కాసేపటితర్వాత తిరిగి పార్వతీదేవి దగ్గరకు వచ్చే సమయానికి పార్వతిదేవి ప్రియుడు ఎడబాసివెళ్ళాడని అలిగి కోపంతో మాట్లాడకుండా కూర్చుని ఉంటుంది... అప్పుడు శంకరుడు ఆమెను పలకరించి అనునయంగా,,ప్రేమగా మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో ఎదురుగా కనిపించిన చంద్రోదయాన్ని చూసి ఇలా వర్ణిస్తాడు...
" రాత్రి చీకటిని పారద్రోలడానికై తూర్పు దిశన చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొగలిపూలు విచ్చినట్లు ప్రాగ్దిశన తొలిరేకులు విచ్చుకుంటున్నాయి.
నక్షత్రయుక్తమైన ఈ రాత్రి, ఇంతవరకూ మందరపర్వతంలో దాగిఉండి ఇప్పుడే ఉదయించిన చంద్రునితో కలిసి, నీవు నీ సఖులతో కూడి నాతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తున్నది !
చంద్రుడు వెన్నెల నవ్వు నవ్వుతున్నాడు చూశావా? ఈ లేత వెన్నెల వెలుగులు కొనగోళ్ళతో త్రుంచి నీకు కర్ణాభరణాలు చేయవచ్చు సుమా ! వ్రేళ్ళతో కురులను సవరిస్తున్నట్లు చంద్రుడు తన కిరణాలతో చీకటిని తొలగత్రోసి, ముకుళిత పద్మలోచన అగు రాత్రి ముఖాన్ని ముద్దాడుతున్నాడు !!
పార్వతీ ! ఆకాశంవంక ఒకమాటు చూడు ! చంద్రుని లేత వెన్నెలలో చీకటి తెరలు తొలగిపోగా ఆకాశం, ఏనుగులు కలచివేసిన పిమ్మట నిశ్చలంగా ఉన్న మానససరోవరంలా కనిపిస్తున్నది ! ఉన్నత ప్రదేశాలలో వెన్నెల వెలుగులు అలముకున్నాయి. పల్లపు ప్రాంతాలలో చీకట్లు పరుచుకున్నాయి, అవునుమరి, గుణదోషాలను బట్టి సృష్టికర్త ఉచ్చనీచలు కల్పిస్తూ ఉంటాడు !!!
చెట్టు కొమ్మల సందులగుండా,ఆకుల మధ్యగుండా పువ్వులవలే నేల వ్రాలుతున్న చంద్రకిరణ కోమలరేకలను, వ్రేళ్ళతో పట్టి నీ మ్రుంగురులకు కట్టివేయవచ్చు సుమా !!!! "
అని అంటూ ఇంకా చక్కటి వర్ణనలతో వివరిస్తాడు శివుడు పార్వతీదేవికి ఆ చంద్రోదయం తాలూకు సౌందర్యాన్ని ..ప్రస్తుతానికి ఇంత వరకూ వర్ణనే పోష్ట్ చేస్తున్నాను...మిగతాది ఇంకెప్పుడైనా వివరంగా రాసి పోష్ట్ చేస్తాను,
కాళిదాసు రాసిన ఈ వర్ణన చదువుతూంటే ఆ చంద్రోదయం మన కళ్ళముందే కనపడుతున్నట్లు,దానిని ఆస్వాదిస్తునట్లు ఉంది కదూ?
అదీ కాళిదాసు గొప్పదనం...కవిత్వం రుచి మరిగేట్లు చెప్పడంలో ఇతనిని మించిన కవిలేడంటే అతిశయోక్తి కాదుకూడా....తప్పకుండా చదవండి అతని రచనలు సాహిత్యంపై ఇష్టం ఉంటే.. !!!
శుభరాత్రి 😊
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి