07 ఏప్రిల్, 2017

తప్పెవరిది?


మొన్న రాత్రి 12.30 కి మా ఊళ్ళో ఉన్న ఓ ధియేటర్లో కాటమరాయుడు మూవీ బెన్ ఫిట్ షో వేస్తారని తెలిసి జనాలు తండోపతండాలుగా ఆ ధియేటర్ దగ్గరకి వెళ్ళి టికట్ల కోసమై ఎగబడ్డారు..

తమ సంస్కారాన్ని మరచిపోయి ఒకరినొకరు తోసుకుంటూ,, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ,, తిట్టుకుంటూ క్యూ లైన్ల దగ్గర పడిగాపులు పడుతూ ఉన్న ఆ జనాల వెర్రిని చూసిన ఆ ధియేటర్ యజమానికి ఎక్కడలేని ఉత్సాహమూ,, సంతోషమూ కలిగిందేమో...!!! ఆ సందర్భంగా ఒక్కో టికట్టూ కౌంటర్ దగ్గరే 400 రూపాయల ధరగా నిర్ణయించి అమ్మారు...

" 20 రూపాయల టికెట్ని దానికి 20 రెట్లు పెంచి ఇలా అమ్మడం అన్యాయం కదా? ఇటు సినిమా చూసిన ప్రేక్షకుడినీ,, అటు సరైనా టాక్స్ కట్టకుండా గవర్నమెంటునూ మోసం చేసినట్లు అవుతుంది కదా ఈ చర్యవల్ల? " అని గట్టిగా కాకపోయినా కనీస ప్రశ్న కూడా వేసే వ్యక్తి ఒక్కరూ లేరక్కడ... " టికెట్ ఏదోవిధంగా సాధించి ఈ షోని ఎలాగైనా అందరికంటే ముందే చూసేయాలి " అనే అర్ధంలేనిలేని ఆత్రం, ఆరాటం ఉన్న వ్యక్తులే ఉన్నారు మొత్తం అక్కడ.. అలాంటివాళ్ళు అడుగుతారా ఈ ప్రశ్నలని?? అసలు వాళ్ళకంత ఆలోచన రాదనుకుంట ఆ సామాజిక ఉద్రేక పరీస్థితులలో...

పైకి సూటిగా చెప్పకపోయినా ' తెలివైనవాడెప్పుడూ తెలివితక్కువైనవాళ్ళ మూర్ఖత్వాన్నీ ,, బలహీనతలనూ ,, నమ్మకాలనూ,, వెర్రినీ తనకనుగుణంగా మార్చుకుని లాభపడతాడు ' అని చెప్తాయి వాణిజ్యశాస్త్రాలు... ఆ సూత్రాన్ని నిజం చేసేట్టు ఆ ధియేటర్ యాజమాన్యం మొత్తం 2000 మందికిపైనే టికట్లను అమ్మి లాభపడే ప్రయత్నం చేసింది మనసులో విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తూ..

అదే వారిపాలిట శాపమైంది పాపం..!!!

12.30 కి వేస్తానన్న షో గంటైనా ఇంకా మొదలవ్వకపోయేసరికి మొదట ప్రేక్షకులలో అసహనం మొదలైంది.. గట్టిగా గోలలు చేస్తూ,, ధియేటర్ వాళ్ళను బండబూతులు తిడుతూ కేకలెయ్యడం మొదలెట్టారు వాళ్ళు ఈ ఆలస్యవ్యవధిని మేము భరించలేమన్నట్లు...

ఇంకో గంట గడిచింది... అయినా మూవీ వెయ్యకుండా ఆ సినిమా బదులు చిరంజీవి నటించిన " ఖైదీ నం.150 " మూవీ వేసేసరికి ప్రేక్షకుల సహనానికి హద్దులు తెగిపోయి ధియేటర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు " ఆ సినిమా కాక ఈ సినిమా వేస్తున్నారేమిటి? " ఇప్పుడని...

" ఆ సినిమా ప్రింట్ మాకింకా రాలేదు,, అందుకే దానిబదులు అందాక ఇది వేస్తున్నాం " అని క్షమార్ధనా భావాన్ని మాటల్లో నింపుకుని ప్రేక్షకులకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు ఆ ధియేటర్ ఓనరు..

అదే అతను చేసిన పెద్ద తప్పైంది... ఎందుకంటే,,

" విపరీతమైన ఆశలు పెంచుకున్న ఓ విషయం తాననుకున్నట్లు నెరవేరకపోతే మనిషికి అయితే భరించేలేని నిరాశైనా కలుగుతుంది లేదా విపరీతమైన విసుగు కలిగి తాననుకున్న పనిని సఫలీకృతం కానివ్వకుండా చేసిన పరిస్థితులపై తిరుగుబాటు చెయ్యాలన్న తెగింపును తీసుకొస్తుంది "... 

దురదృష్టవశాత్తూ ఇక్కడ వ్యక్తులు ఒకరు కాదు.. కొన్ని వందలమంది..

దాంతో అదో బలమైన ఉద్యమోద్రేకస్థితిగా అప్పటికప్పుడు పరిణామం చెంది ఆ ధియేటర్లోని బల్లలనూ,, కుర్చీలనూ,, సౌండ్ బాక్స్లనూ,, సినిమా తెరలనూ, ప్రొజెక్టర్లనూ ప్రేక్షకులు ధ్వంసం చేసి, చించి, పాడుచేసేంతవరకూ వరకూ చేరింది... ఆ తర్వాతెప్పుడో పోలీసులు వచ్చారేకానీ అప్పటికే జరగాల్సినంత ఆస్తినష్టం జరిగిపోయింది ఆ ధియేటర్లో...

ఈ భయోత్పాత సంఘటన గురించీ మా ఊర్లో నిన్న జనాలు చర్చించుకుంటూంటే దీనికి బాధ్యులుగా ఎవర్ని నిందించాలో నాకు సరిగ్గా అర్ధం కాలేదు..

" మొదటి ఆటే ఈ మూవీని చూసేయాలనే విపరీతమైన ఆర్దుదతో అక్కడకి చేరుకుని తమ వ్యక్తిత్వాన్నీ,, సంస్కారాన్ని మర్చిపోయేలా ప్రవర్తించిన ఆ ప్రేక్షకులది తప్పనాలా? 

లేక ఆశాపిశాచబద్ధుడై జనాలను దోచుకోచూసిన ఆ ధియేటర్ యజమానికి తగిన శాస్తే జరిగిందని సంతోషిస్తూ తప్పు అతనిదే అని అనాలా??

లేక విశ్వనాధ సత్యనారాయణగారు వాపోయినట్లు కధనందు కానీ , సంగీతమునందు కానీ ఓ నీతికానీ,, ఓ రసజ్ఞతకానీ లేక ఎంత అపభ్రంశముగా ప్రవర్తిస్తే అంత జనాకర్షణ పెరుగుతోందని వికారభినయాలు, వికారసంవిధానములు,, అసభ్యవేషములూ కధలలో కల్పించి ప్రజలలో దుష్టసంస్కారం ప్రబలింపచేస్తున్న సినిమావారిది తప్పనాలా??? "" అనే విషయం మాత్రం అస్సలర్ధం కాలేదు నాకు నిన్న..

మీరేమంటారు దీనిగురించి ?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి