" నాకు తెలిసిన ఒకతను తాను వేరే కులపు అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో చెప్పాడు.. అదృష్టవశాత్తూ వాళ్ళ ఇంట్లోవాళ్ళు ఈ నిర్ణయాన్ని తిరస్కరించక వాళ్ళ అబ్బాయి ప్రేమిస్తున్న అమ్మాయితో పెళ్ళి చెయ్యడానికి ఒప్పుకున్నారు... అమ్మాయి ఇంట్లో కూడా అతి కష్టం మీద ఎలాగైతేనేమి చివరికి ఈ పెళ్ళికి తలూపారు..
చేసేవాళ్ళకీ,,చేయించుకునే వాళ్ళకీ ఏ ఇబ్బందీ లేదుకానీ వాళ్ళ బంధువర్గంలో వాళ్ళు మాత్రం ఈ నిర్ణయంపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు...
గత రెండు రోజులనుంచీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇదే చర్చ జరుగుతోంది తీవ్రంగా.. దురదృష్టవశాత్తూ నిన్న నా ఆ బాల్యస్నేహితునియొక్క బంధువుల ఇంటికి నేను వెళ్ళాల్సివచ్చినప్పుడు నా చెవిని పడేశారు వాళ్ళు ఈ వార్తను అదేదో అతి ఘోరమైన పనైనట్లు ఆత్రపడి మరీ చెప్తూ...
" ఓహ్,అవునా? ఇంతకీ పెళ్ళెప్పుడు నిర్ణయించారు మరి ? " అని అన్నాను నేను అదేదో సాధారణవిషయంగా భావించి...
" ఏమో,,ఇంకా నిర్ణయించలేదనుకుంట,,కానీ వాడంతపని చేస్తాడని నేనస్సలు ఊహించలేదు..చాలా షాక్ తిన్నాను వాళ్ళ అమ్మ నాకీ న్యూస్ చెప్పినప్పుడు " అని అన్నాడు ఒకతను అందులో..
" ఇందులో అంత షాక్ అవాల్సినదేముంది? వాడూ,,ఆ అమ్మాయీ సంపాదనాపరులే,ఒకళ్ళ వ్యక్తిత్వం మరొకరికి నచ్చి,ఇష్టపడి పరస్పర అవగాహనతో జీవితాంతం మేమిలా ఆనందంగా ఉంటాం,,అందుకే పెళ్ళి చేసుకుంటాం " అని నిర్ణయం తీసుకోవడంలో తప్పేముంది నిజానికి ? " అని అన్నాను నేను ఆ మాటలకి సమాధానంగా..
" తప్పా? తప్పున్నరా? వేరే వర్ణపు అమ్మాయిని చేసుకుంటే ఇక ఆ కూడు తినాలి వీళ్ళు.. మడీ,,ఆచారం అంత మంటగలుస్తుంది ఇక " అన్నారు అందులో ఇంకొకరు.
" సరే,,నువ్వు ద్విజుడివి కదా? మూడుపూటలా కాదు,,కనీసం ఒకపూటైనా సంధ్యావందనం చేస్తున్నావా రోజూ మరి ? " అని అడిగాను నేనా వ్యక్తిని ఏమీ ఎరగనట్లు..
" అబ్బే,,నాకంత సమయం కుదరట్లేదు.అందుకే ఎప్పుడో మానేశాను " అన్నాడావ్యక్తి.
" మరి షట్కర్మలలో ఒకటీ పాటించని నీకు నీ వర్ణపు లక్షణం ఎలా ఉందని చెప్పగలం? లక్షణాలబట్టీ వర్ణంకానీ పుట్టుకబట్టీ కాదని శాస్త్రమే చెప్తోంది కదా? కావాలంటే స్తృతులు చదువు... నువ్వే పాటించనప్పుడు నీకన్నా ఆచారవిషయమై అధ్వానస్థితిలో వాడికి ఈ అడ్డులేమిటి? వాడి ఆనందంకోసం వాడు చేసుకుంటూంటే ఆశీర్వదించడం మానేసి ఇలా విషయచర్చలు పెట్టుకోవడం భావ్యం కాదు కదా మనకి ? " అన్నాను నేను...
" ఒరే,,నువ్వు తెలివైనవాడివేకానీ ఒక్కోసారి వాస్తవాన్ని ఎరగకుండా మాట్లాడతావురా...!! సమాజంలో ఇబ్బంది కదరా వాళ్ళ తల్లితండ్రులకి ఇలాంటి వివాహం వల్ల? " అని అడిగాడు అతనే..
" పల్లెల్లో అంటే ఒకళ్ళకొకరు గౌరవమర్యాదల కోసం బ్రతుకుతారుకాబట్టీ అక్కడా పట్టింపులు ఎక్కువకానీ పట్టణాలలో నువ్వెవరో నీపక్కింటివాడికే తెలియదు,,అలాంటిచోట ఇబ్బందేముంటుంది నిజానికి ? అయినా సమాజం అంటే ప్రత్యేకించి వేరెవరో కాదు...మనమూ సమాజంలో అంతర్భాగమేగా? మనం మటుకు మన విలువలకి భంగం అని భావిస్తే ఆ పెళ్ళికి వెళ్లడం మానెయ్యాలి... " కాదు పర్లేదులే " అనుకుంటే వెళ్ళి కాస్త అక్షింతలు వేసి మనస్పూర్తిగా వాళ్ళను ఆశీర్వదించి మన పెద్దరికాన్ని,బంధుత్వాన్నీ నిలుపుకోవడమే..అంతే మనం చెయ్యగలిగేది నిజానికిందులో..
అంతేకానీ ఆ పిల్లపై,,వాళ్ళ తరపు బంధువులపై వివక్షచూపడం,,తక్కువచేసి మాట్లాడడం,విలువల పేరిట ఇలా అడిగినా అడగకపోయినా ఎదుటివారిని ఉద్దేశించి వుపన్యసించడం చెయ్యకర్లేదు..ఏది నైతికం? ఏది అనైతికం? అని చర్చావాదాలూ జరపక్కర్లేదు ఈ విషయమై..
" విలువలైనా,,ధర్మమైనా తనకి ఆనందాన్ని ఇవ్వకుండా చేస్తున్నప్పుడు వాటిని అతిక్రమించి మనిషి తన వ్యక్తిగత విచక్షణతో తనకేది న్యాయం అనిపిస్తే ఆ పని చెయ్యడం తప్పేమికాదు నిజానికి... " ఇది అర్ధంచేసుకుంటే మనమూ ఆనందంగానే ఉంటాము,,వాళ్ళూ ఆనందంగానే ఉంటారుకదా? కనుక ఇబ్బందేముంది ఇందులో ? " అన్నాను నేను..
" అయితే విలువలు ఏం ఉండక్కర్లేదంటావ్? అలా అయితే స్త్రీ పురుషుడు సంబంధం అనేది కేవలం సృష్టి మనుగడకోసమే కదా? అలాంటప్పుడు తల్లీ,,చెల్లీ అనే వావివరసలు మనమెందుకు పాటిస్తాం? అలానే ఇదీనూ " అన్నారో ముసలాయన
" ఇక్కడ మనం జాగ్రత్తగా విశ్లేషించాల్సిన విషయమేంటంటే " నైతిక విలువలనేవి మొత్తం మానవజాతి తాము ఆరోగ్యకరమైన జీవనవిధానం గడపడానికి ఉద్దేశించి ఏర్పరుచుకున్నవి..కులం అనేది అలా కాదు..కులం అనేది కార్యవిభాగంతో ఏర్పడిన వ్యవస్థ..అది కేవలం కొన్ని సమూహాలు కలిసి ఏర్పరుచుకున్న కట్టుబాటు మాత్రమే... "
కట్టుబాటు అనేది కొన్ని కొన్ని ఉద్దేశాలతో కాలాన్ని,,వ్యక్తుల జీవన విధానాన్నీ అనుసరించి ఏర్పరుచుకునేవి,,ఇవి కాలంతోపాటు మార్పుచెంది ఎప్పటికప్పుడు మారచ్చుకానీ నైతికవిలువలు అలా కాదు.. వాటికీ వీటికీ చాలాతేడా ఉంది... " అని వివరించాను నేను.
వాళ్ళకేమీ అర్ధంకాలేదు నేనెంత హేతుబద్ధంగా ఈ విషయాన్ని వివరించినా..నా అభిప్రాయాలు కొట్టిపాడేస్తున్నట్లుగానే మాట్లాడారు చాలాసేపు...నేనూ పెద్దగా పొడిగించలేది ఇక ఈ వాదనని,,ఎలాగో మావాడి పెళ్ళి ఈ డిసంబర్లో అయిపోవచ్చు...మహా అయితే చాటుగా ఇంకో రెండు,మూడు రోజులు బంధువులు ఈ విషయాలగురించి మాట్లాడుకుంటారుకానీ తర్వాత వచ్చే ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఎలాగో మార్చుకునే మసులుకుంటారుగా ఒకళ్ళకొకరు?
కానీ ఈ సంభాషణంతా ఎందుకు రాశానంటే కేవలం పై పై అభిప్రాయలతోనే ఒక వ్యక్తిని విశ్లేషించడంకానీ,,పరిస్థితులు,సంఘటనల యొక్క మంచి చెడులు నిర్ణయించడంకానీ చెయ్యద్దూ...!!! అని చెప్పడంకోసమే..
మన వ్యవహారాల్లో చాలామటుకు " తప్పు " అని భావించే చాలా విషయాలు ఎందుకు తప్పో? వివరించేంత లోతుగా అభిప్రాయాలు మనం కలిగి ఉండకుండానే తప్పని నిర్ణయించి ఉద్రేకపడే,బాధపడే,బాధపెట్టే మనుష్యులెక్కువ మనలో...
ఎందుకు మనుష్యులు ఇలా సహేతుకమైన కారణాలు లేకుండానే తమ ప్రవర్తనలతో తమనీ,తమ దగ్గరవాళ్ళని బాధపెట్టుకుంటూ బ్రతుకుతారు? అని ఆలోచిస్తే ఎవడి విషయపరిధిబట్టి వాడలానే ప్రవర్తారనిపిస్తుంది...
డేవిడ్ వెక్కెన్ అనే జెనెటిసిస్ట్ అనేదేంటంటే మనిషి ప్రవర్తన,,వాడి ఆనంద విషాదాలు అతని తల్లితండ్రుల పెంపకం,ఇంట్లోనూ,,చుట్టూ వాతావరణం బట్టే 90 శాతం నిర్ణయింపబడుతుంది అని.
ఈ పరిధిని దాటి చాలామంది మనుష్యులు ఆలోచించకుండానే తమ ప్రవర్తనని నిర్దేశించుకుని చాలామటుకు తమ కష్టాలకి తామే కారణభూతులవుతున్నారు.
అలా ఉండకుండా ఎప్పటికప్పుడు మీ విషయపరిధిని పెంచుకుంటూ,,మార్పుని అవగాహన చేసుకుని దానిని జీవితంలో భాగంగా చేసుకుని జీవితాన్ని ఆనందంగా బ్రతకమని కోరుకుంటూ "
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి