23 జూన్, 2016

వర్షాకాలపు ఉదయం యొక్క అందం



వర్షం వెలిశాక వచ్చే ఉదయాలెంత అందంగా ఉంటాయో కదా?

మట్టినుంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది..ఊరంతా పచ్చగా,పరిశుభ్రంగా అగుపిస్తూ ఉంటుంది అప్పుడు...చెట్ల ఆకుల్లోంచి నీటి బిందువులు కింద నిలిచిన నీళ్ళల్లో నెమ్మదినెమ్మదిగా జారుతూ లయబద్దంగా శబ్దం చేస్తూ ఉంటాయి.. చల్లని తాజాగాలి రానా వద్దా అన్నట్లు నెమ్మదిగా వీస్తూ ఉంటుంది ఆప్పుడప్పుడూ..తడిసిన తాటిపళ్ళ వాసన కొడ్తూ ఉంటుంది పొలాలవైపు వెళ్ళినప్పుడల్లా.కర్రలపై,దుంగలపై నిల్చుని పక్షులు తమ రెక్కలకంటిన నీటిని విదిల్చుకుంటూ విసుక్కొంటూ ఉంటాయి...చినుకులింకా ఆరారా పడుతూ ఉంటాయి,,మళ్ళీ వర్షం తప్పదన్నట్లు ఉరుముల శబ్దం వినపడుతూంటుంది తీవ్ర్ర ధ్వనితో మధ్యమధ్యలో..రోడ్లపై రేవడిమట్టి బురదవల్ల చిన్న చిన్న తటాకాలు ఏర్పడి ఉంటాయి..

ఇక ఆకాశంలో సూర్యుడు రాత్రి వర్షం పడుతున్నప్పుడు పడిన పిడుగులశబ్దానికి జడిసి చాలా ఆలస్యంగా వస్తాడు..అంతవరకూ ఆకాశపు రంగు ఎంత బాగుంటుందో కదా?? శివుడి గరళకంఠాన్ని పోలిన రంగుగల మబ్బులు ఆకాశమంతా విస్తరించి వింతకాంతిని భూమి మీదకి  ప్రసరింపచేస్తూ ఉంటాయి...

జేష్ఠమాసం మొదలైతే గ్రీష్మఋతువొస్తుంది వాస్తవానికి..కానీ ఈ మాసపు శుక్లపక్షపు రోజులంతా విపరీతంగా వానలు పడడంవల్ల ఇది వర్షఋతువేమో అని అనుకుంటారు ఈ విషయం ఎరుగని చాలామంది..

మీకు తెలుసా? ఆరుద్రకార్తె వచ్చేంతవరకూ చెరువుల దగ్గర పసుపురంగులో కొన్ని వందల సంఖ్యలో కప్పలు కనిపిస్తాయి...ఇవి ఎక్కడినుంచి వచ్చాయో,,ఆ తర్వాత ఎక్కడికిపోతాయో ఎవ్వరికీ తెలియదుకానీ ఇవి తెల్లారగట్ల గుంపుగా  అరుస్తాయి చెరువుగట్లకింద అన్నీ కూడుకుని దిబ్బుదిబుమని గంతులేస్తూ,,ఎగిరిపడుతూ...దగ్గరకెళ్ళిన మనిషికి వీటి అరుపులుతప్ప మరింకేది వినిపించనంత బిగ్గరగా శబ్దంచేస్తాయవి అలాగ...ఇలా కప్పలరిస్తే వర్షసూచన అని రైతులు గ్రహించి పొలంలోని తమ పంటలకు జాగ్రర్తలు పెట్టుకుంటారు..

కప్పల అరుపుల్లాగే కదంబంపూలు పూసినా అది వర్షానికి సంకేతమట...బాగా వర్షం పడుతుందన్నపుడే కదంబంపూలు విరగబూస్తాయట...విడిగా చూస్తే పెద్ద వాసన రావు ఈ పూలు.. కానీ ఈ చెట్టుకింద నుంచుంటే చాలా కమ్మగా వస్తుంది అదే పూలనుంచి సువాసన.లలితా సహస్రనామాలలోనూ,,కాళిదాసు శ్యామలాదండకంలోనూ అమ్మవారికి ఈ పూలంటే బాగా ఇష్టమనీ,,కదంబవనవాసినీ అని వర్ణించారు..అవును...ఈ కమ్మదనానికి మైమరచి ఇష్టపడనివారెవరుంటారు? ఇవి పూసిన తర్వాతరోజు వీటిలోని ఆ తెల్లని,పెద్దపెద్ద కేసరాలు గుట్టగా రాలిపడి ఉంటాయి ఆ చెట్టుకిందంతా...ఆ గుట్టని చూస్తే మబ్బులూ,,గాలి లేని మృగశిరాకార్తెలోని రాత్రులలో స్వచ్చంగా ప్రకాశించిన చంద్రుడు తన కిరణాలతో ఈ చెట్టుకింద పల్చగా తెల్లని అట్లేమైనా  వేశాడేమో అనిపిస్తుంది..

ఇదిగో,ఇప్పుడిప్పుడే కోడితురాయి పూలు అందంగా పూసి రహదారులకి కొత్త అందాన్ని కలగచేస్తునాయి..సింహాచలం సంపెంగపూలు బాగా దొరుకుతున్నాయి మా ఊళ్ళో..

వీలైతే తప్పకుండా రండి మా పిఠాపురానికి,,శ్రీనాధుడిచే కొన్ని వందల ఏళ్ళక్రితమే వర్ణింపబడినా ఇప్పటికీ ఆ అందాన్ని కోల్పోని చాలా ప్రదేశాలున్నాయి ఇక్కడ..

శుభసాయంత్రం :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి