రఘువంశంలోని ఇందుమతీ స్వయంవరంలోని ఈ చక్కని వర్ణన చూడండి,అద్భుతంగా ఉంది,
" ఇందుమతీ దేవి స్వయంవరం జరుగుతోంది,అనేకమంది రాజులూ, రాకుమారులూ ఆమెను దక్కించుకోవాలనే ఆశతో విచ్చేశారు స్వయంవరానికి.
నిర్ణీత సమయానికి ఆ రాకుమారి ఒక చెలికత్తె తనతో వచ్చి, ఆహూతులైన రాచవారి వివరాలు తెలుపుతూ ఉండగా వరమాలను పట్టుకొని వారి ముందు నించి నడిచి వెడుతోంది. ఆ సన్నివేశం లో ఆ రాకుమారినీ, ఆయా రాజవంశీయులనూ కవి కాళిదాసు వర్ణించాడు ఇలా:
” సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం సస భూమిపాల “
- ఆ స్వయంవర సభలో ఇందుమతి నడుస్తున్న దీపశిఖ లా ఉందట. చీకట్లో రాజవీధిలో ఓ దీపశిఖ నడిచిపోతూ వుంటే ఒక్కో రాజభవనపు గుమ్మం, జ్వాల దగ్గరవుతున్నకొద్దీ ప్రకాశమానమవుతూ, జ్వాల దాటి పోగానే చీకట్లో మునిగిపోతున్నట్లుగా ఒక్కో రాజు ముఖం ఇందుమతి సమీపిస్తూ ఉంటే ప్రకాశిస్తూ, తనను దాటిపోతుంటే నల్లబడిపోతోంది.
వీధులను రాత్రిపూట కాంతివంతం గా ఉంచడానికి నాటి కాలం లో దివితీలను పట్టుకొని పహారా కాచేవారు. ఆ పనిచేసే వారు దివిటీ పట్టి నడిచిపోతున్నప్పుడు అతను ఏ ఇంటిముందు ఉంటే ఆ ఇల్లు దివిటీ కాంతికి ప్రకాశవంతం గా కనబడేది. ఆ యింటిని ఆ వ్యక్తి దాటి వెళ్లి పోయేక తిరిగి ప్రకాశ హీనమయ్యేది.
ఎంతగా దీన్ని మనసులో ఉంచుకున్నాడో, మహాకవి కాళిదాసు గారు, ఈ విషయాన్ని పై శ్లోకం లో రాకుమారి ఇందుమతిని దీపశిఖ గాను, వెలిగి ఆరిపోతున్న్ ఇండ్లను ఆమె తమను దాటి వెళ్లిపోతుంటే వివర్ణమవుతున్న రాజుల ముఖాలతోనూ పోల్చి చెప్పాడు - ఎంతైనా ఉపమాలంకారానికి పేరుగాంచిన కవి కదా కాళిదాసు !
ఈ ఉపమానం చెప్పడం వలన ఆయన్ని 'దీపశిఖా కాళిదాసు' అనేవారట! ఈ శ్లోకం ఉన్న కావ్యం రఘువంశం.
3 నెలల క్రితం చదివాను ఈ పుస్తకాన్ని,చాలా బాగుంది,ఇందులో వర్ణనలు అతి సహజంగానూ,అద్భుతంగానూ ఉంటాయి...సాహితీప్రియులు తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది..
శుభోదయం.
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి