ఉదయం నుంచీ వెధవ ఎండ అని ఎంత తిట్టుకున్నాకానీ సాయంత్రం 5 దాటేసరికి 6 వరకూ అదే ఎండ చాలా అందంగా ఉంటోంది ఈ వైశాఖంలో...
చక్కని ఆ ఎర్రటి సూర్యబింబము ఆకాశం నిండా ఎరుపునిరంగుని ఎగజిమ్ముతోంది ఆ సమయంలో... అన్నవరం కొండలమీదుగా వచ్చేగాలి ప్రాణాన్ని తేలికపరుస్తోంది...అదే సమయంలో రోడ్ల్ పై గుట్టగా పడి ఉన్న గానుగపూలనీ దొర్లిస్తోంది..గాలికలా గానుగపూలు కదుల్తూంటేచూస్తుంటే ముత్యాలు దొర్లుతున్నట్లే ఉంటోంది..
" సత్యనారాయణ స్వామి కళ్యాణం దగ్గరపడుతోందని ఆకాశంలోని దేవతలెవరైనా ఈ తోరణాలు పంపుతున్నారేమో అన్నవరానికి " అని చూసినవారిని ఒక్క క్షణం ఆశ్చర్యపడేట్టు చేస్తున్నాయి గుంపుగా పశ్చిమానికెగురుతున్న పక్షులు..
కావ్యాలలలో చాలామంది కవులు వర్ణించారు వసంత ఋతువొస్తే మన్మధుడూ దండయాత్రకి వస్తాడని...అతని సైన్యాద్యక్షులు చిలకలట,,అతని జైత్రయాత్రని కీర్తిస్తూ కోయిలలు మంద్రస్థాయిని మించి మరీ గొంతెత్తి అతని విజయగీతాలు గానం చేస్తాయట ఈ కాలంలో,,
ఇందులో నిజమెంతో తెలియదు కానీ నిజంగానే సాయంత్రంపూట చిలకలు,పిచుకలూ,కొంగలూ తెగ గోల చేసేస్తున్నాయి తమ అరుపులతో మా ఇంటికి దగ్గర్లో ఉన్న మర్రిచెట్టు దగ్గర...చెవులు చిల్లడిపోతాయేమో అటుగా వెళ్ళిన వాళ్ళకి అనేంతగా గట్టిగా గీతాలాలపిస్తున్నాయి అవి ఈ వసంతశోభని చూసి..
సూర్యుని ఎరుపు కాస్త సన్నబడ్డాక " గులాబీరేకులనెవరో మెత్తగా కొట్టి ఆ పొడిని ఇలా అద్దారేమో ఈ మేఘాలుగా " అన్నట్లుగా కనిపిస్తున్నాయి రంగు రంగు చారలు ...రాత్రి పూర్తిగా సంధ్యను ఆక్రమించుకొనేంతవరకూ చాలా అద్భుతంగా ఉంటోంది ఆ దృశ్యం..
ఇలాంటి అందమైన సాయంత్రాలకి గొప్ప కాలక్షేపంగా ఉండేవీ,,ఇంకా గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చేవి కేవలం పుస్తకాలో,,లేక సాహితీపరమైన చర్చలో...వేడి ఎక్కువగా ఉంది కాసిన్ని తాటిముంజులు పక్కన పెట్టుకుంటే ఉత్తమం.
పుస్తకాలు చదివే ఉద్దేశం ఉంటే అయితే అల్లసాని పెద్దనిగారి మనుచరిత్రో,లేక గుడిపాటి వెంకటాచలాధీశుని పుస్తకాలో చదవాలి ఈ టైంలో...
చలం అంటే గుర్తొచ్చింది...
ఈ రోజు సాయంత్రం మా అరుగుమీద కూర్చుని నా మిత్రులతో మాట్లాడుతూంటే ఎదురుగా మల్లెపూలు అమ్మే అతను కనపడ్డాడు..వెంటనే ఓ మూర మల్లెపూలు ముచ్చటపడీ కొనుక్కున్నాను అతనిదగ్గర..వాటినలా చేతిలో తీసుకుని ఆ వాసననీ,,ఆ తెల్లదనాన్నీ అనుభవిస్తూంటే చలంగారి " ప్రేమలేఖలు " గుర్తొచ్చాయి...
అందులో నాకెంతో ఇష్టమైన ఈ మల్లెపూల కవిత గుర్తొచ్చింది :)
"" మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!
విచ్చిన మల్లెపూలు!!
ఆ పరిమళం నాకిచ్చే సందేశం
యే మాటలతో తెలపగలను.!
సాయింత్రాలు స్నేహానికి
చల్లని శాంతినిచ్చే మల్లెపూలు.
అర్ధరాత్రులు విచ్చిజుట్టు పరిమళంతో కలిసి
నిద్ర లేపిరక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు
వొళ్ళమధ్య చేతులమధ్య
నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు
రోషాలూ నవ్వులూ
తీవ్రమయిన కోర్కెలతో
తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు
సన్నని వెన్నెట్లో
ప్రియురాలి నుదిటి కన్న తెల్లగా
యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో
గుండెపట్టి చీలికలు చేశే మల్లెపూలు
తెల్లారకట్ట లేచి చూసినా
యింకా కొత్త పరిమళాలతో
రాత్రి జ్ఞాపకాల తో
ప్రశ్నించే మల్లెపూలు
ఒక్క స్వర్గం లో తప్ప
ఇలాంటి వెలుగు తెలుపులేదేమో - అనిపించే మల్లెపూలు
అలిసి నిద్రించే రసికత్వానికి
జీవనమిచ్చే ఉదయపు పూలు
రాత్రి సుందర స్వప్నానికి సాక్షులు గా
అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు.... !!! "" అని
అద్భుతంగా ఉంది కదూ ఇది??
శుభసాయంత్రం :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి