02 మార్చి, 2016

వసుచరిత్రలోని సంధ్యా సమయ వర్ణన



రామరాజభూషణ కవి రచించిన " వసుచరిత్ర " నాకెంతో ఇష్టమైన పుస్తకాలలో ఒకటి... అందులోని ఈ సంధ్యా సమయ వర్ణన చదవండి,,ఎంత సహజంగా చిత్రీకరించాడో కవి.

 " కాలవశం చేత సూర్యుడు తన తేజస్సు కోల్పోయి ప్రయాణం చేస్తున్నాడు..తన చేతులతో అలదించిన దుర్గములు సంధ్యారుణ ప్రభలతో వెలుగుతున్నాయి..

 అప్పుడు అపరదిశ యొక్క శక్తితో సూర్యుడు కృంగిపోయాడు.. పద్మిని మోము ముడుచుకుంది..సంధ్య మాత్రం సూర్యుని వెనుక వెళ్ళక వేరు మార్గాన్ని అనుసరించింది..

 అప్పుడు సంధ్య అతిలోక సౌందర్యంతో వెలిగిపోతోంది..కమలముల ఆలయమును మూసివేసి,,సూర్యుడి జాడ తిలకిస్తున్న పద్మలతలా ఉంది - సంధ్యాలక్ష్మి

 ఆకాశం అనే ఇనుపరేకు మీద కాటుకవంటి చీకటిని పట్టడానికిగాను పశ్చిమదిశ అమర్చిన దీపశిఖలాగ ఉంది - సంధ్యా జ్యోతి..

 పాంధగణములను విరహముతో పీడిస్తున్న యేనుగువంటి ప్రదోష కాలానికి చేసిన అలంకార రేఖలవలే ఉంది - సంధ్యావళి.

 పక్షుల కలకలం వల్ల భర్త ఇంటికి వచ్చే సమయం అయినదని తెలుసుకున్న ప్రదోషం నిశిరాత్రి ధరించిన కుంకుమ బొట్టులా మెరుస్తోంది - సంధ్య

 రాక్షసులు ఎత్తుకుపోకుండా దేవతలు దాచి ఉంచిన మాయా సీత అన్నట్లుగా పసుపుచాయ శరీరంతో వెలుగొందుతోంది - సంధ్య.

 తామరపూలు - అస్తమయం అవడంతోటే ముకుళించుకున్నాయి.. తుమ్మెదలు తమ్మి పూలను వదిలి వెళ్ళిపోతున్నాయి.. ఆ తుమ్మెదల వరస పొగలాగు కనిపిస్తుంది..

 చక్రవాకం వియోగంతో తపిస్తూ ఉండిపోయింది..

 ముఖంలో ముఖం చేర్చి ప్రేమాతిశయంతో బిగియార కౌగలించుకుని సెలవు తీసుకొంటూంది చక్రవాకం జక్కన దగ్గర.

 సంధ్యాసమయంలో నాట్యం చేస్తున్న శివుని తలమీదనుండి రాలిపడిన మాణిక్యం లాగ సూర్యుడు సముద్రగర్భంలో వెలుగుతూ అగుపిస్తున్నాడు  "

 అద్భుతంగా ఉంది కదూ ఈ సంధ్యా వర్ణన  ?

 శుభసాయంత్రం

 - Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి