02 మార్చి, 2016

గీతాంజలి " లోని ఓ కవిత



రవీంద్రుని " గీతాంజలి " లోని ఓ కవిత ఇది..

"" నేనేం అడగలేదు.. చిట్టడివి పంచన చెట్టు వెనుక నుంచున్నాను.

ఉషస్సు నయనాలపై అలసట బరువుగా నిలిచి ఉంది. గాలిలో మంచు అలముకుంది..

తడిసిన పచ్చిక సోమరి పరిమళం గాలిలోని పల్చని పొగమంచులో వేళ్ళాడుతోంది...

వెన్నమల్లే మెత్తగా ,, నవ్యమైన నీ చేతులతో మర్రిచెట్టు కింద ఆవుకి పాలు పితుకుతున్నావు....

నేను కదలక నుంచున్నాను.....

***************************************************

నేనొక్కమాట మాట్లాడలేదు.. పొదలోంచి తాను కనిపించకుండా పాడింది ఆ పిట్ట.

పల్లెబాటమీద మామిడిచెట్టు పూలని రాలుస్తోంది. తేనెటీగలు ఝుంకారం చేస్తో వొస్తున్నాయి ఒక్కొక్కటే..

చెరువుపక్కన శివాలయం తలుపులు తెరిచారు. పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించాడు...

ఒళ్ళో చెంబుపెట్టుకుని నువ్వు పాలు పితుకుతున్నావు....

ఖాళీలోటా పట్టుకుని నుంచున్నాను.....

***************************************************

నేను నీ దగ్గిరికి రాలేదు.

గుడిగంట శబ్దానికి ఆకాశం మేలుకుంది. పొలానికి తోలిన పసువుల గిట్టలనుంచి దుమ్ములేచింది..

నడుములమీద గలగలలాడే నీళ్ళ కడవలతో నదినించి వస్తున్నారు వనితలు...

నీ గాజులు గలగలమంటున్నాయి.. చెంబుపైకి నురుగుపొంగుతోంది....

పొద్దెక్కింది.. నేను నీగ్గరకి రానేలేదు.....

***************************************************

నేను దారివెంట నడుస్తున్నాను.. ఎందుకో నాకు తెలియదు.. ఆరోజు మధ్యాహ్నం దాటిపోయింది. వెదురుకొమ్మలు గాలిలో గలగలమంటున్నాయి.

పరుచుకున్న నీడలు జాచిన చేతులతో పరిగెడుతున్న కాంతి పాదాలని చుట్టేసి వేళ్ళాడుతున్నాయి..

పాటలుపాడి కోవెలలలు అలసిపోయినాయి...

నేను దారిపక్కన నడుస్తున్నాను ,, ఎందుకో తెలీకుండానే....

***************************************************

నీళ్ళపక్కన కుటీరం మీద ,, వొంగిన చెట్టునీద పడుతోంది.

ఆమె ఎవరిపనిలోనో నిమగ్నమై ఉంది , ఆ మూల. ఆమె గాజులు శ్రావ్యంగా మోగుతున్నాయి..

ఆ కుటీరం ముందు నుంచున్నాను. ఎందుకో తెలీదు...

ఆ సన్నని దారిలో ఎన్నో ఆవపొలాలలోంచి ,, మామిడితోపుల్లోంచి వంకర్లు తిరుగుతోపోతోంది....

ఆ ఊరి ఆలయం ముందునుంచీ ,, నదిరేవు పక్కన ఉన్న సంత ముందునుంచీ వెడుతుంది ఆ బాట.....

నేను ఆ కుటీరం ముందు ఆగాను. ఎందుకో తెలీదు......

***************************************************

ఎంతోకాలం కిందట - గాలులువీచే ఫాల్గుణమాసపు రోజులవి..ఏరు సోమరిగా చప్పుడు చేస్తోంది..మామిడిపూత దుమ్ములో రాలుతోంది.

చిన్న చిన్న అలలు చివరి మెట్టుమీద ఉన్న బిందెని తాకుతో వూయిస్తున్నాయి.ఆ ఫాల్గుణమాసపు గాలిరోజుని తలుచుకుంటాను..ఎందుకోమరి  !!

నీడలుచిక్కనవుటున్నాయి..ఆవులు మందకి చేరుకుంతున్నాయి. నిర్జనమైన పచ్చికబయళ్ళపై వెలుతురుమసకగా ఉంది...

ఊరివాళ్ళు బల్లకట్టుకోసం ఒడ్డున కాచుకుని ఉన్నారు....

వెళ్ళినతోవనే తిరిగి వొచ్చాను..ఎందుకో తెలియదు.....

***************************************************

తన సొంత పరిమళంతో పిచ్చెత్తి అడివినీడల్లో పరిగెత్తే కస్తూరి మృగంవలే ,, నేను పరిగెత్తుతాను.

ఆ రాత్రి నిండు వైశాఘమాసపు రాత్రి. గాలి,, అది దక్షిణమారుతం..

నేను తోవ తప్పి ,, ఒకటే తిరుగుతాను.. నాకు దొరకని దానికోసం వెతుకుతాను.. నేను వెతకనిది నాకు లభ్యమవుతుంది...

***************************************************

నా వాంచ రూపందాల్చి నా హృదయంలోంచి బైటకివచ్చి ,, నర్తిస్తుంది.

ఆ మెరిసే ఆకృతి దూరంగా, , దాన్నే గట్టిగా కావిలించుకోవాలని చూస్తాను.. కానీ అది నన్ను తప్పుదోవలకి లాగుతుంది..

నాకు దొరకనిదానికోసం వెతుకుతాను.. నేను కావాలని అనుకోనిది నాకు దొరుకుతుంది...

***************************************************

చేతులు చేతులు పెనవేసుకున్నాయి.. కళ్ళు కళ్లమీద నిలిచిపోయాయి.. ఆ విధంగా మన హృదయాల చరిత్ర ప్రారంభమైంది.

ఫాల్గుణమాసపు వెన్నెలరాత్రి.. గోరింటమధుర పరిమళం గాలిలో తేలుతో ఉంది.. నా వేణువు నేలమీద పడివుంది. నీ పూలమాల పూర్తికాలేదు..

నీకూ నాకూ మధ్య ఈ ప్రేమ ఓ పాటమల్లె లలితం...

***************************************************

నీ మేలిముసుగు పసుపువన్నె నా కళ్లకి మత్తెకిస్తోంది. నాకోసం నువ్వల్లిన మల్లెదండ నన్ను స్తుతిమల్లె ఆనందపరవశుణ్ణి చేస్తోంది.

ఇదో ఆట - ఇవ్వడం ,,తీసుకోవడం ,,స్పష్టంచెయ్యడం ,,దాచుకోవడం .. కొన్ని చిరున్నవ్వులు ,కొన్ని చిన్న చిన్న సిగ్గులు ,, ఎట్లాగూ నెగ్గని తియ్యని పెనుగులాటలు..

నీకూ నాకూ మధ్య ఈ ప్రేమ ఓ గీతంవలే సహజమైనది...

***************************************************

ఈ నిమిషాన్ని మించిన మర్మం లేదు, అసాధ్యమైన దానికై అర్రులు చాచడమనేదిలేదు. ఆకర్షణ వెనక నీడేలేదు.. చీకటిలోతుల్లోకి ఓ వెతుకులాటలేదు.

నీకూ నాకూ మధ్య ఈ ప్రేమ సులువుగా పాడేపాట మల్లెవుంది..

***************************************************

మాటలని దాటి శాశ్వత మౌనంలోకి తప్పిపోము.. దొరకనివాటికోసం శూన్యంలోకి చేతులుజాచము.

మనం ఏమిస్తామో,, మనం ఏమి తీసుకుంటామో అదిచాలు..

బాధా మధువుని పిండుకునేంత గట్టిగా మన ఆనందాన్ని నలగనియ్యలేదు...

నీకూ నాకూ మధ్య ఈ ప్రేమ గానమంత సహజమైనది... ""

( టాగూర్ గారి " గీతాంజలి " లోని ఆ కవితా సౌందర్యాన్నీ ,, ఆ విశాలత్వాన్నీ అద్భుతంగా తెలుగులోకి అనువదించిన "చలం " గారికి _/\_  )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి