03 మార్చి, 2016



మా అమ్మగారు (కె.శ్రీదేవి) ఆవిడకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రకృతిపై రాసిన కవిత ఇది.

" ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం.

నిశిరక్కసి అసికోరల్లో చిక్కుకుని అల్లాడిపోయిన

జీవజాలం ఉషోదయ ఆగమనంతో ఏవో వింత సోయగాలను సంతరించుకుంటూ

ఉషారుగా జగత్తుని మేలుకొలుపును.

ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం.!


తుషారమౌక్తిక స్పర్శతో పులకించి విరబూసే సుగంధసుమగంధాలతో

మెల్లగావీచు మలయమారుతస్వనంతో ఆనందభైరవి ఆలకిస్తూ మెల్లగా

తలలూపు చిగురుల అందం ఏమని చెప్పగలము?

ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం..!!

పచ్చనిచెట్లతో,పసిమిచాయ పంటలతో,సజీవవనరులతో

వసంతాలతో,కులుకొలుకు సెలయేర్లసవ్వడిత

నదీనదుల నిస్వనంతో,శాకుంతలాల కిలకిలలతో

కవి హృదయాన్ని మెల్లగామీటే వీణియలా కనపడే ఆనందం,అందం ఏమని చెప్పగలం? ఎలా వర్ణించగలము?

ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం...!!!

నీలాలనింగినుండి చల్లగారాలిపడే వానచినుకు చల్లచల్లగా ఎదను చుంబిస్తే ,

చిర్రుమని నడినెత్తిని తాకే ఎండ ఠారెత్తిస్తే ,సన్ననైన వెన్నెల వేడిని కలిగిస్తూ సేదదీరమంటూ ఉంటే

చల్లని పిల్లగాలి కవ్విస్తూ ఉంటే " రవికాంచనిది కవిగాంచున్ " అనే మాట నిజమైనట్టు నాకు తోస్తోంటే ఏమని చెప్పను?

ఆ అద్భుతకావ్యం ,ఎంతని వర్ణించగలము ఆ దృశ్యకావ్యం.

ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం....!!!!


జగత్తుని మైమరపించే ఇంద్రజాలం ప్రకృతి.

విశ్వాన్ని విబ్రాంతిలో,విలయంలో ముంచేదే ప్రకృతి..

జీవనాన్ని అందించే అద్భుతవరం ప్రకృతి...


ప్రకృతి ఎంత రమణీయం ఎంత కమనీయం.....!!!!! "

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి