24 మార్చి, 2016

ఇంతేనా జీవితం అంటే?




" సంసారం ఓ ఊబి, అందులో దిగితే ఇక పైకి తేలడం చాలా కష్టం " ఇలాంటి వేదాంతాలు చదివినప్పుడు ఏమిటీ రాతలు ఇలా ఉన్నాయి? అని అనుకునేవాడిని.

కానీ కాస్తంత జీవితంలో అనుభవం వచ్చేసరికి అలాంటి రాతల్లో కాస్తంతైనా నిజం ఉందని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ సరదాగా ఆలోచించే సమయాలలో..

సమాజంలో నాకంటూ ఓ స్థాయి, కాస్త ఎక్కువగానే గుర్తింపు వస్తోంది ఈమధ్య. చాలా వరకూ రోజంతా పనులతోనే గడిచిపోతోంది...

అందువల్ల ఒకప్పటిలా వెన్నెల రాత్రులను ఆనందించడం.,మంచి మంచి పుస్తకాలు చదవడం ఇలాంటి చర్యలన్నీ తగ్గిపోయాయి నాకు... 8 నెలలుగా డైరీ కూడా సరిగ్గా రాయట్లేదు. మొత్తానికి నాతో నేను గడుపుకునే సమయం చాలా తగ్గిపోయింది బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగేకొద్దీ....

అదే భయమేస్తుంది ఒక్కసారి నాకు.,,

నేను కూడా ఓ సొంత ఇల్లూ, చెప్పిన మాట వినే భార్య,ప్రతీ సంవత్సరం పై క్లాస్కి వెళ్ళే కొడుకూ, ముద్దుముద్దుగా మాట్లాడే బొద్దుకూతురు, మంచి బ్యాంక్ బ్యాలన్స్ ఇలాంటి కోరికలు నెరవేరితే చాలు, ఇంకేం కావాలి జీవితానికి?  అని తృప్తి పడే సగటు సంసారిలా అయిపోతానేమో అని.

ఇంత చింతనా ఇప్పుడెందుకు కలిగిందంటే రేపు నా పుట్టినరోజు... అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయాయంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. గొప్ప కలలా గడిచిపోయింది జీవితం అంతా... జీవితంలో ఇప్పటి వరకూ కోల్పోయిందేం లేదు. ముందు ముందు జీవితం కూడా చాలా ఆశావహంగా ఉంది. ఓ బ్రాహ్మణుడిగా జీవితాన్ని చాలా ఆనందిస్తున్నాను ప్రస్తుతం నాకు తృప్తి కలిగేటట్లు. . నాకంటూ ఓ స్పష్ఠమైన జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నాను,బహుశా ఏ 4 సంవత్సరాల తర్వాతో ఈ విద్యార్ధి దశ వదిలి ఇంట్లో చూపించిన అమ్మాయితో పెళ్ళి అయి నేనూ ఓ సంసారిని అవుతాను. ఏమిటి అప్పుడా జీవనానికి అర్ధం అని అనిపించింది ఇందాక.

మనం చూస్తుండగానే  పెళ్ళిచూపులు,తాంబూలాలు,విందులు,పల్లకీలు,పెళ్ళిళ్ళు,ఆళ్ళు,చూళ్ళు,వేవిళ్ళు,పురుళ్ళు,ఉయ్యాళ్ళు,మళ్ళీ మళ్ళీ పురుళ్ళు, రెళ్ళు, మూళ్ళు, వాళ్ళ బళ్ళు,వాళ్ళ ముక్కుచీముళ్ళు ఇంకేముంది గర్వకారణం?అక్కడితో మన చరిత్ర సమాప్తం...!!!

ఇంతేనా జీవితం?? ఇంతకిమించి ముందు గొప్ప అని భావించడానికి ఇంకేం లేదా? అనే భావన కలిగింది... " ఇహ సంసారే బహు ధుఖారే " అని అంటూ సర్వం మాయ అనే సన్యాసిని అస్సలు అవ్వను కానీ జీవితంలో ఇంతకు మించి ఏదో ఉంది,,, అదేమిటో ఇంకా అవగతం కావట్లేదు నాకు.

ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు? అంటారు సిరివెన్నెలగారు.

ఆ రేపే ఎలా ఉండబోతోందా అనేదే గొప్ప సస్పెన్స్.

ఏమైనా జీవితం గొప్ప మిస్టరీ కదూ?

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి