" ప్రపంచంలో ఎంత గొప్ప కవి అయినా సరే ఓ చిన్నపిల్లాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు?,ఎలా అర్ధం చేసుకుంటున్నాడు ఈ ప్రపంచాన్ని?" అనే విషయం గురించి వివరించి సరిగ్గా రాయలేడేమో...!!! "
లోకంలో కనిపించే ప్రతీది ఏమిటిలా ఉంది? అని ఆశ్చర్యంతో పరికిస్తూ, ఎందుకిలా ఉంది ఈ లోకం? అనే ఆలోచన అప్పుడప్పుడే కలుగుతూ ఉన్న ఆ దశ ఉంది చూశారా? చాలా గొప్ప దశ అది.ప్రపంచంలోని ప్రతీ సంఘటనా సాధారణ విషయాలుగా తోచదు మనసుకి ఆ దశలో.
ఎంత కుతూహలం ఉంటుందో ఆ దశలో..!! ప్రతీదీ తెలుసుకుని జీవితానికి అన్వయించుకోవాలనే ఓ ప్రవర్తన అసలు ఎలా ఏర్పడుతోందో పిల్లల్లో? నీరు ఎందుకు క్రిందకే పారుతోంది?(అసలు క్రింద అంటే ఏమిటి?),,మెరుపులు వస్తే కనపడే ఆ కాంతి ఏంటి? అదొచ్చాకే తర్వాతెప్పుడో శబ్దం వినపడుతోందే? ఇలా ప్రతీదీ పరిశీలన ద్వారా ప్రశ్నించుకుని కారణం దొరికేంతవరకూ ఆలోచించి మనసుని సమాధానపరుచుకునే బుద్ధి ఎలా కలుగుతోందో అసలు పిల్లల్లో?
నా మటుకు నాకైతే చాలా చిత్రంగా అనిపించేది ఈ ప్రపంచం.అప్పటి నా నమ్మకాలు,నా ప్రవర్తనలు తలుచుకుంటే ఇప్పుడెంతో సిగ్గు వచ్చే విషయాలుగా అనిపిస్తాయి కూడా నాకు..
" అత్తిపత్తి మొక్క ముట్టుకుంటే ఆకులు ఎందుకు ముడుచుకుపోతున్నాయో తెలిసేది కాదు..మళ్ళీ ఎలా తెరుచుకుని ఆ ఆకులు సాధారణ స్థితికి వస్తున్నాయో అర్ధమయ్యేది కాదు.తినడానికి ఏమైనా పదార్ధాలు ఇంట్లోవాళ్ళు ఇచ్చినప్పుడు " ఎక్కడవివి ? అని అడిగితే "ఇదిగో !! ఎలక ఈ కన్నంలోంచి ఇచ్చింది " అని వాళ్ళంటే నాకు ఆకలేసినప్పుడలా ఆ కన్నం దగ్గర అడిగేవాడిని నాకు కావాల్సిన పదార్ధాలు అన్నీ.అవేం వచ్చేవి కాదు కాబట్టి ' ఒహో వీళ్ళు మోసం చేస్తున్నారు నన్ను,వీళ్ళు చెప్పేవి ఏమీ జరగవు అన్నమాట ' అని అనుకునే వాడిని.
నెల నెలా ఇంట్లో ఆడవ్వాళ్ళు బైటున్న సమయాల్లో వారి దగ్గరకెళ్ళినప్పుడల్లా ఏదో ఉపద్రవం వచ్చినవారిలా " నన్ను ముట్టుకోకూడదు " అని దూరంగా నెట్టేసేవాళ్ళు నన్ను..విషయం తెలియక ఏం? ఎందుకంటే? అంటే పాపం ఏం చెప్పాలో తెలియక వాళ్ళు "నన్ను కుక్క ముట్టుకుంది" అనేవాళ్ళు.. ' నాకు తెలియకుండా కుక్క ఇంట్లోకి ఎప్పుడొచ్చింది? అయినా కుక్క ముట్టుకుంటే నేను ముట్టుకోకూడదా వీళ్ళని ? ' అని తెగ డవుట్ వచ్చి అడిగితే " ఛీ వెధవా! అవన్నీ నీకెందుకు,చెప్పింది చేయ్ " అని కసురుకునే వాళ్ళు.
అంతవరకూ రోజూ ఎత్తుకుని,ముద్దాడుతూ,నవ్వించి,ఆ పిట్టలు పూవులు చూపించి ఒక్క క్షణం కూడా విడవని వాళ్ళు ఎందుకిలా నన్ను దూరంగా పెడుతూ నాపై కోప్పడుతూ అరుస్తున్నారో ? అని అనిపించేది చాలా చిత్రంగా..ఇలాంటి ప్రవర్తనలే పిల్లలని చాలా ఇబ్బంది పెడతాయి పసితనంలో,,తాను ప్రేమిస్తున్న మనుషుల ప్రవర్తన తనకి అర్ధంకాకపోవడం చాలా అయోమాయానికి గురిచేస్తుంది పిల్లలని.
అలాగే ప్రతీ చిన్న చిన్న విషయాలకి కూడా ఆనందపడేవాడిని అప్పట్లో...
బూరుగుపత్తి కాయలు ఎండకి పగిలినప్పుడు అందులోని విత్తనాలు గాలిలో తేలుతూ ఎగురుతూ పోతూ ఉంటే వాటిని అందుకోవాలనే ఆత్రంతో ఓ తెగ పరుగెట్టేవాడిని వాటి వెనుక అర్ధంపర్ధంలేకుండా...మా ఇంటిదగ్గర్లోని నేరేడు చెట్టుకొమ్మల్లో కోయిల కూస్తూ ఉంటే దానితో పోటిగా అచ్చందానిలానే అరుస్తూ ఉంటే కొంతసేపటికి అది కూయడం మానేస్తే ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఫీల్ అయ్యేవాడిని.కనకాంబరం పూల విత్తనాలు నీటి తడి తగిలినప్పుడు పేలి విచిత్రమైన శబ్దాన్ని ఇస్తాయని తెలిసి ఆ విత్తనాలు అన్నీ కోసి తెచ్చుకుని నీటిలొ పడేసి అవి పేలినప్పుడల్లా ఏదో కొత్త విషయం కనుకున్న శాస్రజ్ఞుడిలా నన్ను నేను భావించుకునే వాడిని.అయ్యో పాములు తేళ్ళు ఉంటాయనే భయం కూడా లేకుండా రాత్రిపూట మిణుగురుపురుగులను పట్టుకోడానికి ఆరాటపడేవాడిని.మా గేది మీద ఎక్కి దానితోపాటుగా అలా పురవిహారం చేసేవాడిని సాయంత్రంపూటాప్పుడప్పుడూ ;) ...
సమాజం ఏమనుకుంటుందో నేను చేసే పనులను చూసి? అనే ఆలోచన అస్సలు వచ్చేది కాదు అప్పట్లో. ఇంటిదగ్గర ఉన్న కొండవాగులో చేపలను ఓ గిన్నెలో పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటే మా ఇంట్లో వాళ్ళు తెగ తిట్టేవారు నన్ను " వెధవా మనం బ్రాహ్మణులం రా..అలా చేపలు అవీ ముట్టుకోకూడదు " అని ఆ నీళ్ళు వంపేసేవారు బయట కాలువలో,ఏం బ్రాహ్మణులైతే చేపలు ఎందుకు ముట్టుకోకూడదు? అనే విషయం అర్ధమయ్యేది కాదు...మా ఇంటికి చాకలి బట్టలకై వచ్చినప్పుడు తన 13 ఏళ్ళ పిల్లను కూడా తీసుకొని వచ్చి నేను ఎక్కువ అల్లరి చెయ్యకుండా ఉండడం చూసి " ఎంత బుద్దిమంతుడో మీ అబ్బాయి " అని మా వాళ్ళతో అని నా కూతురుని పెళ్ళి చేసుకుంటావా? అనేది నన్ను చూసి...అసలు పెళ్ళి అంటే ఏమిటో కూడా తెలియదు కదా అప్పట్లో?"సరే చేసుకుంటాను మీ అమ్మాయిని నేను " అంటే అందరూ తెగ నవ్వేవాళ్ళు నన్ను చూసి,,ఎందుకో అర్ధమయ్యేది కాదు...
ఒక్కోసారి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా అందులో తెగ ఆనందం కలిగేది ఎందుకో.... ఎక్కువగా గాలి వీస్తూ వర్షపు చినుకులు ఆరారా పడే సమయాలలో తోటి పిల్లలతో కలిసి ఓ వరుసలో రైలుబండిలా నుంచుని అందరూ అలా కదులుతూ " వానా వానా వెల్లువాయే,పక్కింటోడి పెళ్లాం పోయే ,,రేపు తద్దినాం,ఎల్లుండి భోజనాం " అని ఏవేవో అర్ధంపర్ధంలేని పాటలను పాడుకుంటూ గుంపుగా గెంతులేసేవాళ్లం వీధుల్లో అలా పరిగెడుతూ...మళ్ళీ అంతలోనే చూరునుంచి వర్షం ధారగా పడుతూంటే అలా చూస్తూ ఉండేవాళ్లం ఏమిటా ఇది? ఎందుకిలా శబ్దం చేస్తోంది కిందపడుతున్నప్పుడు? అని.ఉరుమొస్తే" అర్జునా ఫల్గుణా కిరీటి శాతవాహనా " అనే శ్లోకం చదవాలని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో..ఇక పిడుగు శబ్దం అయినప్పుడల్లా ఆ శ్లోకం అప్పచెప్పేసి పెద్దల మెప్పు పొందాలనే వెర్రి కోరిక కలిగేది అప్పట్లో...
పాలికాపరితో కలిసి మా ఆవు పాలు పితికినా,,సీమచింతకాయలను ఎవరికీ పెట్టకుండా నేనొక్కడినే తినేసినా,," పుస్తకంలో నెమలికన్ను పెట్టుకంటే ఇంకో పిల్ల పెడుతుంది అది " అని ఎవరో అంటే నిజమేనేమో అని నేనూ పుస్తకంలో నెమలీక పెట్టుకుని " పిల్ల పెట్టిందేమో? " అని తరచి తరచి ఆ పుస్తకం తెరిచి చూసుకున్నా,ఎడ్లబండిపై ఊరేగుతున్నా ఎందుకు కలిగేదో ఆనందం మరి ఆ వయసులో?
ఎంత బాగుండేవో ఆరోజులు ?(ఇప్పుడు రోజులేవో బాలేవని కాదు,,ఇప్పుడూ బానే ఉంది )..అమాయకత్వం,అజ్ఞానం ఇచ్చినంత ఆనందం మనిషికి చాలాసార్లు జ్ఞానం ఇవ్వలేదేమో...!!! అలా అని జ్ఞానాన్ని రాకుండా ఆపలేం కదా?
విషయజ్ఞానం పెరిగేకొద్దీ మనిషికి అసలు ఈ కృత్రిమత్వం ఎలా అలవడుతోందో? జ్ఞానం పెరిగేకొద్దీ నేనింకా ఎంత బాగుండాలి? ఎలా ఆనందించడం నేర్చుకోవాలి? అనే ఆలోచన కలగకుండా వ్యక్తిగా పతనం చెందడం అనేది ఎందుకు కలుగుతోందో అర్ధం కాదు మనుష్యులలో? ఇదే విషయం మొన్నామధ్య మా చెల్లితో చర్చకి వచ్చినప్పుడు ఇలా అన్నాను నేను..
" చిన్నప్పుడు మనకి ఉండే అనుభవాలు తక్కువే,,అందుకే అంతలా అనుభూతి చెందుతాం ప్రతీ చిన్న విషయానికీ... అప్పట్లో ఈ లోకం చాలా గొప్పది,,ఈ మనుష్యులు కూడా ఎంతో మంచివాళ్ళు అనే ఆలోచనా విధానం ఉండడం వల్ల ప్రపంచంలో ప్రతీది మంచిగానే తోస్తుంది మనకి..కానీ పెద్దయ్యేకొద్దీ మనకి అనుభవాలు పెరుగుతూ ఉంటాయి..ఈలోకం తీరూ,మనుష్యుల తాలూకు ద్వందప్రవృత్తి అన్నీ గమనింపులోకి రావడంవల్ల మన మనసుకీ క్రమక్రమంగా కృత్రిమత్వం అలవడుతుంది...అందుకే ప్రతీ చిన్న విషయానికి అనుభూతి చెంది ఆనందించే విధానాన్ని కోల్పోతాం మనం రాన్రానూ... " అంటే " నిజమేరా నువ్వు అన్నది ...!!! " అని అంది మా చెల్లి నాతో... "
దీనినే పరిణామక్రమం అని సద్దుకుపోదామా మరి? చెప్పండి?
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి