25 మార్చి, 2016

ద్వందప్రవృత్తి



నేనెప్పుడు లైబ్రరీకి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు స్వాతి పత్రికలో 40,41 పేజీలు చాలా ఇంట్రెస్టింగా చదువుతూ ఉండడం గమనిస్తూ ఉంటాను..ఆ సమరంగారి సలహాలు చదవడం
తప్పు అని నేనట్లేదు,,కానీ వాళ్ళు చదివే విధానం గొప్ప నవ్వు పుట్టించే విధంగా ఉంటుంది ;)

" ఎవరూ గమనించట్లేదు కదా అని ఆ ఆ పేజీలు ఓపెన్ చేసి చదవడం, ఇంతలో ఎవరైనా ఆ పక్కగా వెళ్తే గబుక్కున త్రిప్పేసి మామూలు పేజీలు చదవడం,మళ్ళీ ఎవరూ చూడట్లేదు అని అనుకున్నప్పుడు ఆత్రంగా ఆ పేజీలకోసం వెతకడం, ఒకవేళ పక్కన ఎవరైన కూర్చొని ఉంటే ఏదో యధాలాపంగా మామూలు పేజీలు చదువుతున్న వాడిలా నటిస్తూ కాస్త ఆ బొమ్మలు కనపడనీయకుండా పేపర్ని మడిచి ఆ ఆ విషయాలు చదవడం " ఇలాంటి చేష్టలన్ని వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు పడే ఆ పాట్లని చూసి వికటాట్టహాసం చేసి మరీ నవ్వాలనిపిస్తుంది నాకు.

ఎందుకీ ద్వంద ప్రవృత్తి? మనసొకలా చెప్తూంటే బయటకి మాత్రం ఏదో " నీతిమంతుడిని నేను " అన్నట్లు ప్రవర్తించడం దేనికి? మళ్ళీ ఇలాంటి వాళ్ళే స్కాండల్స్,పుకార్లు అవీ పుట్టిస్తూ ఇతరులకన్నా తామే నైతిక విలువలు అధికంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.

బహుశా మన సమాజంకూడా ఒకానొక కారణమేమో ఈ ద్వందప్రవృత్తి మనుష్యులలో కలగడానికి...

లైంగికపరమైన విద్య అంటే ఇక అదేదో నేర్చుకోకూడని విషయం అన్నట్లు భావించేవాళ్ళు అనేకం మన సమాజంలో..పిల్లలకి ఈ విషయాలు తెలిస్తే చెడిపోతారని (?) అర్ధంలేని భయాలు పడేవారెక్కువ మన సమాజంలో. పిల్లలకి మాత్రం వీళ్ళు చెప్పరు కానీ ఏదో అద్భుతాలు జరిగి పిల్లలకే ఆ విషయాలు తెలుస్తాయనే నమ్మకం వీరిది...

ఇలా ఈ ఈ విషయాలు మాట్లాడుకోలేని రహస్యాలుగా భావించడంవల్లే పిల్లలకి ఇంకా ఆత్రాలు పెరుగుతాయి. " వీళ్ళు మన దగ్గరనుంచి దాస్తున్నారంటే ఏదో ఉంది ఇందులో తెలుసుకోడానికని "  ప్రయత్నిస్తూ ఫ్రెండ్స్ దగ్గరా పరిచయస్తులదగ్గరా చాలా ఆసక్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు,,వీడికెంత తెలుసో వాళ్ళకీ అంతే తెలుసు....దానితో లేనిపోని భయాలు పెంచుకుంటూ ఉంటారు సరైన శాస్రీయ జ్ఞానం లేక.అలా కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోబోయిన ఓ వ్యక్తి గురించి ఈమధ్యనే తెలిసింది కూడా నాకు.ఆ విషయం గురించి తర్వాత ఎప్పుదైనా రాస్తనులేగానీ

ఈ కోణాన్ని కాసేపు పక్కన పెడితే , " ఆడవారిపై లైంగికదాడులు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి మన దేశంలో ? అనే విషయాన్ని ఆలోచిస్తే ఒకానొక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకనిపించిన విషయం ఇది.

ఈ ద్వందప్రవృత్తే అందుకు కారణం అని అనిపిస్తోంది.." నాకు తెలియనిది ఏదో తెలిసేసుకోవాలనే ఆత్రమే ఇలా పైశాచిక ప్రవృత్తులని  ప్రేరేపిస్తోందని నా భావం.
ఏమంటారు దీని గురించి మీరు ?

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి