ఈరోజు ఉదయం ఓ కార్యక్రమం చేయించడానికని రంపచోడవరం వెళ్ళాను...కార్యక్రమం 9.30కి అయితే నేను ఉదయం 5 గంటలకే వెళ్ళిపోయాను ఆ ఊరు చూద్దామని....
చాలాబాగుంది ఈ ప్రాంతమంతా..
చుట్టూ పెద్ద పెద్ద కొండలు పెట్టని కోటగోడల్లా ఉన్నాయి ఈ ఊరికి...అవి ఎంత పొడుగ్గా ఉన్నాయంటే వాటిని చూసిన కొత్తవాళ్లెవరైనా అవో దట్టమైన నల్లనికారు మేఘాలని అనుకుంటారేతప్ప " నిజంగా అవి కొండలే " అని ఇక్కడవాళ్ళు చెప్పినా ఓ పట్టాన నమ్మరేమో...!! అంత పొడుగుగా,,విశాలంగా ఉన్నాయవి...
శిశిర ఋతువు మొదలై అప్పుడే ఐదు రోజులైనా ఇంకా ఆ ప్రభావమేదీ అంతగా పడినట్లులేదు ఇక్కడిచెట్లపై... చక్కటి లేలేత పత్రహరితపు రంగుతో ప్రకాశిస్తున్నాయి ఇక్కడిచెట్ల ఆకులన్నీ...ఆ కొమ్మల చివర్లన చాలా సంఖ్యలో కోతులు గెంతుతూ,,వేళ్ళాడుతూ,,ఆడుకుంటూ కనిపించాయి...వాటి అల్లరి ఎంతలా ఉందంటే ఇళ్ళల్లోకి వచ్చేసి సామానులు పట్టుకుపోతున్నాయని వాటికి జడిసి పగలు కూడా తలుపులేసుకుని ఉంటున్నారు ఇక్కడి జనాలు....
మరీ దట్టంగా కాదుకానీ కాస్త ఎక్కువగానే పొగమంచు అలుముకుని ఉంది ఈరోజు ఉదయాన ఈ ప్రాంతంలో...సూర్యుడు ఆ మసక తెరలను కరిగించే పనిలో నిమగ్నుడై విఫలుడవుతున్నాడు మాటిమాటికీ. ఆ మంచు తెరల చాటున ఆ ఉదయభానుని లేలేత కాషాయపురంగు కాంతి కిరణాలూ,,వాటి మాటున దాగున్న పుష్పాల సోయగాలూ,,ధవళవర్ణాన్ని అద్దుకున్న అడవీ ఇలా ప్రతీదీ ఓ అద్భుతంలానే తోచింది నామనసుకి ఈ ప్రాంతంలో.....
" ఊరు నుంచి ఓ 3 కిలోమీటర్లు అడవి లోపలకి వెళ్తే ఓ జలపాతం ఉంది " అని మా బాబాయ్ అంటే అక్కడికీ బయల్దేరాను నేను... "బండి తీసుకుని వెళ్ళరా " అంటే వద్దని నడుచుకుపోయాను అలా...
చాలా నిర్మానుష్యంగా ఉంది ఆ దారంతా... పక్షుల కిలకిలారావాలు,,కీటకాల గోల తప్ప మరే శబ్దమూ వినపడనంత ప్రశాంతంగా ఉంది ఆ దారంతా... జువ్వి,,పనస,ఇండువ చెట్లెక్కువ ఉన్నాయిక్కడ...జీడిమామిడి పూల ఘాటు ముక్కుపుటాలను ఎగరేసేంత ఎక్కువమొత్తంలో కలిసిపోయుంది ఇక్కడి గాలిలో..అక్కడక్కడా విసిరేసినట్లుగా ఇళ్ళు ఉన్న ఆ దారిమధ్యలో చోళ్ళరాజుల కాలంలో నాగ వంశస్తులచే నిర్మించబడిన ఓ శివాలయం ఉంది ..అక్కడ దర్శనం చేసుకుని కొండ ఎక్కడం మొదలెట్టాను నేను...
జలపాతం అక్కడినుంచి కనపడట్లేదుకానీ ఆ హోరు మాత్రం కిందవరకూ వినిపిస్తోంది....గుబురుగా పెరిగిన చెట్లమధ్యలోంచి వర్షపుచినుకులు పైనుంచి కిందకి పడుతూంటే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ ధ్వని..దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ నడిచి కొండ పైకెక్కితేకానీ కానీ కనపడలేదు ఆ జలపాతం... ఆ జలపాతాన్ని చూసి చూడగానే " ఇంత గొప్ప సౌందర్యాన్నీ ఇప్పటివరకూ చూడక ఎంత అన్యాయం చేశాను నా కళ్ళకి ? " అని అనిపించింది నాకు...వయ్యారాల వంపుసొంపులతో ప్రకృతిచేతిలో రూపుదిద్దుకున్న పదహారేళ్ళ పడుచు సొగసులా కులుకులొలుకుతూ మలుపులతో జోరుగా సాగుతూ అంత ఎత్తు మీద నుంచి ఆ కఠినమైన,,ఆ నల్లని శిలలపైకి ఉరుకుతూ తన అందాన్ని ఆరబోస్తోంది ఆ నీటిప్రవాహం...చూసినవారికి చూసినంతగా కనువిందు చేస్తుంది ఆ అందం..ఇక ప్రత్యేకించి ఏమి వర్ణించను ఆ సౌందర్యాన్ని? ఎంత అనుభూతికి అంత ఆనందం అని అననా?
నిజం చెప్తున్నాను,,ప్రతీ ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది...అరుదైన,,అద్భుతమైన,,అపురూపమైన ప్రకృతి అందాలు ఇక్కడ మీకు స్వాగతం పలుకుతూ గొప్పగా కనువిందుచేస్తాయి..ఎంత చూసినా తనివి తీరదు,,చూడకపోతే మనసూరుకోదు..అదీ ఇక్కడి ప్రత్యేకత..
వీలైతే తప్పకుండా మీరూ సందర్శించండి ఈ ప్రదేశాన్ని... " రవిగాంచని చోట కవిగాంచునులే "అని మీరెంత వర్ణిస్తారో పరవసించేలా ఉన్న ఇక్కడి ప్రకృతిని చూసి ప్రేరణపొంది ...!!!
శుభసాయంత్రం :) :) :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి