14 మార్చి, 2016




రవీంద్రనాధ్ ఠాగూర్ గారు రాసిన " గీతాంజలి "లోని నాకు ఇష్టమైన గీతాలలో ఇదొకటి..

"" పెంపుడుపక్షి పంజరంలో ఉంది.స్వేచ్చావిహంగం అడవిలో ఉంది.

సమయం కాగానే రెండూ కలుసుకున్నాయి.విధి అట్లా రాసి ఉంది..

" ప్రియతమా,,అడవిలోకి ఎగిరిపోదాం రా " అంది స్వేచ్చావిహంగం...
" ఇట్లా రా. ఇద్దరం ఈ పంజరంలో నివసిద్దాం " అంది పెంపుడు పిట్ట.

" ఈ ఊచల మధ్య రెక్కలు చాచుకోడానికి స్థలం ఎక్కడ ఉంది ? " అని అడిగింది అడివిపిట్ట..

" అమ్మో !! ఆకాశంలో ఎక్కడ కూచోను ? " అని అడిగింది పెంపుడుపిట్ట..

" నా ముద్దుగుమ్మా,, అరణ్యసీమల పాటలు పాడు " అంది స్వేచ్చావిహంగం...

" నా పక్కన కూచో,, పండితుల వాక్కు నేర్పుతాను నీకు " అంది పెంపుడు పిట్ట.

" లేదు.. పాటలు ఒకరు నేర్పితే వచ్చేవి కావు " అంది అడివిపక్షి..

" నా ఖర్మ,, అరణ్యగానాలు నాకు రావు " అంది పంజరంలోని పక్షి...

కాంక్షతో నిబిడీకృతమై ఉంది వారి ప్రేమ.. కాని రెక్కకి రెక్కనానించి అవి ఎన్నటికీ ఎగరలేవు..

పంజరపు ఊచల సందులనుంచి అవి చూసుకుంటాయి...కానీ ఒకరినొకరు తెలుసుకోవాలనే వారి కోరిక అసంభవం..రెక్కలని వాంఛతో కొట్టుకుని " ఇంకా చేరువగా రా ప్రియతమా " అని పాడతాయి...

" అది వీలుపడదు..మూసిన తలుపులంటే నాకు భయం " అంటుంది స్వేచ్ఛా విహంగం..

" ఏం చెయ్యను? నా రెక్కలకి బలంలేదు.. అవి నిర్జీవమైనాయి " అంటుంది పంజరపు పక్షి..  ""

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి