23 మార్చి, 2016

తీపర్రు లోని గోదావరి


ఈరోజు పుష్కర స్నానానికని మా తణుకుకి దగ్గరలో ఉన్న తీపర్రు అనే ఊరికి వెళ్ళాను,నాకు బాగా ఇష్టమైన ప్రదేశాలలో ఇదొకటి.

తణుకు నుంచి తీపర్రు వెళ్ళేదారంతా చాలా అందంగా ఉంటుంది :)

రోడ్ పక్కనే విశాలంగా గోస్తనీ నది ప్రవాహం,,ఆ నదిగట్టుని ఆనుకుని విశాలంగా విస్తరించి ఉన్న  పెద్దపెద్ద చింతచెట్లు,గట్టునుంచి నీటిపైకి వంగి ఉండే అందమైన కొబ్బరిచెట్లు,నీటి అలలను నిరంతరం ముద్దుపెట్టుకుంటూ ఉండే  నిద్రగన్నేరు చెట్ల కొమ్మలు,,అధిక సంఖ్యలో పెంచబడుతున్న అరటితోటలు ఇలా ఎటు చూసినా పచ్చనిదనమే,సూర్యకాంతి కూడా ఆ దారిలో సరిగ్గా పడే వీలులేనంతగా గుబురుగా పెరిగి ఉంటాయి అక్కడి చెట్లన్నీ.కాకరపర్రు దాటాక తీపర్రు వచ్చేంతవరకూ వరకూ పచ్చగన్నేరు పూల వాసన అక్కడక్కడా వస్తూ ఉంటుంది.అందుకే అక్కడి ప్రకృతి,ఆ వాతావరణంలోని నిర్మలత్వం,అక్కడి ప్రశాంతతని అనుభవించడానికి ఎప్పుడు నేను మా తణుకు వచ్చినా తప్పకుండా ఈ గోదావరి రేవుకి వెళ్తూ ఉంటాను :)

అలాగే ఈరోజు కూడా అక్కడికి వెళ్ళాను,గోదావరి గట్టుకి వెళ్ళేదారంతా మొత్తం అరటి తోటలే,ఎంత బాగుందో అక్కడ గోదావరి కూడా ,,కొబ్బరినీళ్ళ రంగులో ఉన్నాయి గోదావరి నీళ్ళన్నీ,, ఆ నీళ్ళలో కొంత దూరం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాను...గోదావరి నీళ్ళు నా నాభిప్రాంతం వరకూ తాకేలా ఓ చోట కూర్చుని 108 సార్లు గాయత్రీ మంత్ర జపం చేసుకున్నాను.

నిజం చెప్తున్నాను,కళ్ళుమూసుకుని అలా గాయత్రీ మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఏదో తెలియని గొప్ప ఆనందం కలిగినట్లైంది నాకు.

ఆ తెల్లటి ఇసుక మీదనుంచి వస్తూ గోదావరి నీళ్ళ చల్లదనాన్ని తనలో నింపుకున్న ఆ గాలి చెవులను తాకుతూ ఉంటే,,చెవిదగ్గర ఓ శంఖాన్ని ఉంచుకుని అందులోని ఖాళిలోంచి వచ్చే వింత శబ్దాన్ని విన్నంత గొప్ప అనుభూతిలా అనిపించింది నాకప్పుడు.

ఆ తొలి ఉషస్సు సమయంలో అలా సంధ్యా వందనం చెయ్యడం నిజంగా గొప్ప అనుభవం నాకు :)

శుభోదయం :)

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి