నేను అప్పుడప్పుడూ కాకినాడ నుండి తణుకు ట్రైన్లో వస్తున్నప్పుడు తోటిప్రయాణికుల తాలూకు విచిత్రమైన ప్రవర్తన గమనిస్తూ ఉంటాను,
గోదావరి బ్రిడ్జ్ రావడం పాపం....
అందరూ ఏదో ఒక్కాసారిగా ఉద్రేకం పొందినట్లు తమ తమ దగ్గర ఉన్న చిల్లరనాణేలు బయటకి విసురుతూ ఉంటారు కిటికీలలోంచి గోదావరిలోకి పడేట్లు,
నా చిన్నప్పటినించీ చూస్తున్నాను నేను ఇదేరకమైన ప్రవర్తన జనాలది,అయినా కూడా ఇప్పటికీ నాకర్ధం కాలేదు " ఎందుకిలా చేస్తారో వారు? " అని.
ఆ డబ్బులు అలా వృధాగా నీళ్ళలో పడెయ్యటంలో ఏం ఆనందం వస్తుంది వాళ్లకి? ఆ డబ్బులతో గోదావరి నది ఏమైనా కొనుక్కుంటుందని వాళ్ల ఉద్దేశమా?
ఇక్కడే కాదు,3 సంవత్సరాల క్రితం తమిళనాడులోని " శ్రీపురం "లోని గోల్డెంటెంపుల్ కి వెళ్ళాను,అక్కడా అంతే.
అక్కడ అమ్మవారి గుడి ఓ కోనేటి మధ్యలో ఉంటుంది,ఆ కోనేరు నిండా కొన్ని వేల చిల్లర కాసులు.మొత్తం అంతా బరువుతూచితే కొన్ని వందల కేజీలు ఉంటుంది బహుశా,అదీ చాలక 100,500,1000 రూపాయల నోట్లు కూడా అందులో ఉండటం చూశాను,ఇంకా పరాకాష్ట ఏమిటంటే అందులో క్రెడిట్ కార్డ్లు కూడా కొన్నిటిని చూశాను,ఎందుకిలా పాడుచెయ్యటం డబ్బులని?
పోనీ అలా చెయ్యడం వల్ల ఒక్క ఉపయోగమైనా కలుగుతోందా? నష్టమే తప్ప?
ఎంతకాదనుకున్నా నాకిది ఎక్కడా భక్తిగా అనిపించక పిచ్చితనంగానే అనిపిస్తోంది.
ఎంతకాదనుకున్నా నాకిది ఎక్కడా భక్తిగా అనిపించక పిచ్చితనంగానే అనిపిస్తోంది.
ఒక్కోసారి కొంతమంది నాకు ఫోన్ చేసి " మా ఇంట్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉండకుండా కుడి వైపు ఉంది,ఇదేమైనా విపత్తు కలిగిస్తుందా?",, " పొద్దున్న నుంచీ నా ఎడమకన్ను బాగా అదురుతోంది,ఇదేమైనా కీడు కలిగిస్తుందా?",,, " ఉదయం నాపై బల్లి పడింది,ఫలితం ఏమిటి? " అని అర్ధంపర్ధంలేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు,
వాళ్ళ సందేహాలకి నవ్వాలో,ఏడవాలో అర్ధం కాదు నాకు,ఎవడు చెప్తున్నాడు వీళ్లకి ఇంత అజ్ఞానంలో ఉండాలని?
అయినా ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అది మన జీవన విధానానికి ఎందుకు అన్వయించుకోవాలి? అలా అన్వయించుకోవడం వల్ల అసలు ఏమిటి మనకి కలిగే ప్రయోజనం? ఇహలోకం సంగతి వదిలేస్తే అసలు ఈ లోకంలో మనకి ఆధ్యాత్మిక జీవన విధానం వల్ల మానసిక బలం ఎలా పెంపొందుతుంది ? ఇలాంటి పట్టుకోవాల్సిన అసలు విషయాలు పట్టుకోవడం మానేసి ఈ అర్ధంపర్ధంలేని విషయాలను ఎందుకు పట్టుకుని వేళ్ళాడుతారో ఈ జనాలు? అని కాస్త విసుగు వస్తుంది కూడా నాకు.ఈ చర్యలన్నీ చూస్తే " మేము భక్తులము " అని అనుకునే వారిలో చాలమందికి తర్కం ఉండదేమో... అని అనిపిస్తుంది,
" దేవుడు తాలూకు నమ్మకం " అంటే చాలు,ఇక దానిగురించి ప్రశ్నించి,ఆలోచించే అవసరం లేదు అని అనుకుంటున్నారు చాలామంది మనుష్యులు,
అందుకే ఇంత అజ్ఞానం మనుషుల చేష్టలలో,
జీవితంలో ప్రశ్నించి విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి,జ్ఞానం పట్ల ఆసక్తి కలిగిఉండాలి.
మీ మీ ఇళ్ళల్లో నాలాంటి బ్రాహ్మణులు కార్యక్రమాలు చేయించడనికి వచ్చినప్పుడు కార్యక్రమం చేయించేసుకుని మా సంభావనలు మాకిచ్చేసి పంపెయ్యడం మాత్రమే చెయ్యకండి,
మీ మీ సందేహాలు అడగండి.చేస్తున్న,పాటిస్తున్న ఆచారాలు వెనకనున్న అంతరార్ధాలు ఏమిటా? అని అడగండి.తప్పకుండా చెప్తాను నేనైతే,ఒక్కరైనా నన్ను అలా అడుగుతారేమో అని కొద్దిగా ఆశిస్తా,కానీ ఎప్పుడూ నిరాశే,
ఇది చదివాక కొందరైనా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ.......!!!!
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి