25 మార్చి, 2016

బాల్యవివాహాలు


కొంతమంది ఆడపిల్లలని చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంటుంది...పూర్తిగా జీవితం అంటే ఇదీ అనే అవగాహన వారికి కలగనప్పుడే వాళ్ళకి పెళ్ళి చేసి వారి కలలు,, ఆశయాలు,, జీవితాలను నాశనం చేసేస్తూ ఉంటారు కొందరు మూర్ఖులైన పెద్దలు...

ఇంకా ఇప్పుడు తక్కువ వయసులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? అని అనుకోవచ్చు మీరు,, కానీ నేను అలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో జరగడం చూసే ఇలా రాస్తున్నాను. .. పల్లెల్లో ఇప్పటికీ అమ్మాయిలకి 18 ఏళ్ళలోపులోనే పెళ్ళిళ్ళు  జరుగుతున్నాయి... ఇదేం దరిద్రమో ఈ మనుష్యుల్లో అర్ధంకాదు కానీ, స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే తమ స్వార్ధానికి అడ్డు అవుతుందని స్త్రీకి విద్య కొంతమాత్రమే చెప్పించి తర్వాత మానిపించే వెధవలు ఇంకా ఉన్నారు మన సమాజంలో ( చిత్రమేంటంటే " ఆడపిల్లలకి ఈ చదువులూ,,ఉద్యోగాలు రావడంవల్లనే మొగుడు చెప్పినట్లు వినడం తగ్గిపోయిందని,,కనుక ఆడపిల్లలని ఉన్నత చదువులను చదివించడం అనవసరం " అని భావించే మనస్తత్వం ఇంకా కొంతమంది మధ్యతరగతి మహిళలెంతమందిలోనో ఉంది,, వీళ్ళు స్త్రీకి వివాహమే గొప్ప ఆదర్శంగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో ఆనందాన్ని ఇచ్చే విషయాలు,,ప్రాపంచిక పరిస్థితుల గమనింపే లేకుండా :(  )

మా ఊరిలో ఆడపిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంటుంది నాకు...రెండు జడలేసుకుని గుండెలకి బొత్తిగా పెట్టుకున్న పుస్తకాలు,,అట్ట తాకేలా దగ్గరకి నొక్కి దానిని ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో ఏ జామకాయో తింటో,,లేక రేగిపిక్కలు తిన్నాక నోటితో బయటకి ఊస్తూ మొహం నిండా అమాయకత్వం వీడిపోని ఆ పిల్లలని చూస్తే నిజంగానే బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి నాకు " ఈ బుజ్జి పిల్లలని పసుపుబట్టలేసి పీటలపై కూర్చోపెట్టేసి పెళ్ళిళ్ళెలా చేసేస్తున్నారో...!!!" అని..

ఎవడో అంతగా పరిచయంలేని ఓ మగాడికి ఏకంగా మూడేసి లక్షలూ,,నాలుగేసి లక్షలూ కట్నంగా ఇచ్చి ఎంతో ఆర్భాటంగా అప్పులు చేసిమరీ ఘనంగా పెళ్ళిచేసి సంతృప్తి చెందే ఈ పెద్దలు ఆ డబ్బులో కనీసం పదోవంతైనా తమ కూతురి చదువుకి ఎందుకు కేటాయించరో?? అని కాస్త విసుగేస్తుంది వారిపై నాకు...

ఆడపిల్లలను పెంచే విధానంలోగానీ,,చూసే దృక్పదాల్లోగానీ ఇంకా వెనుకుబాటుతనమే ఉంది పల్లెలోని చాలామంది మనుష్యులలో.

ఈమధ్యనే ఓ సర్వే చదివాను నేను ఈ విషయమై...ఏడవ తరగతి దాటాక బడి మానేస్తున్న ఆడపిల్లలు 12 శాతం మంది ఉన్నారట మన దేశంలో..వాళ్ళు అలా బడి మానెయ్యడానికి కారణమేంటో తెలుసా???

స్త్రీకి సహజంగా అయ్యే నెలసరిని అదో అసహ్యపడే విషయంగా,,పరువు తక్కువ విషయంగా భావించడం వల్లనట ...సరైన నాప్కిన్స్ అవీ వాడటం మానేసి ఇప్పటికీ మన దేశపు స్త్రీలలో 83 శాతం మంది శారీరక శుభ్రతకై పీలిక గుడ్డలూ,,పాత గుడ్డలూ వాడుతూ ఉంటారట నెలసరి సమయాల్లో..దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ లైంగిక విధ్య,,శారీరక శుభ్రత గురించి అవగాహనలేక ఆడపిల్లలని చదువులు మానిపించేస్తున్నారట..

ఆ సర్వేలోని విషయాలు ఎంతవరకూ నిజమో తెలియదు కానీ,,నిజంగానే నేను చూస్తున్నా పల్లెల్లో 8 తర్వాతో,,10వ తరగతి తర్వాతో ఆడపిల్లలని పైచదువుల్లోకి పంపకపోవడాన్ని :(

ఇంటి దగ్గర ఖాళిగా కూర్చుని చేటలో బియ్యం చెరుగుతోనో,,నూనె జుట్టు చిక్కు తీసుకుంటూ పనికిరాని కబుర్లు చెప్పే కొందరాడపిల్లలని " ఎందుకిలా ఖాళీగా ఉంటున్నారు చదువుకోవడం మానేసి? కనీసం ప్రైవెట్గానైనా చదువుకోవచ్చు కదా? " అని అడిగితే " ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నయ్యా అంత దూరం పంపి చదివించడానికి... " అని అంటారు సమాధానంగా..

" తిరగబడండి,, లేదా ఏడిచైనా సరే చదువుకోడానికి,కాలేజీకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళను ఒప్పించే ప్రయత్నాలు చెయ్యండి " అని అందామనుకుంటాను కానీ ఏం చెయ్యను నేను మాత్రం ఈ విషయంపై??

మహిళా సంఘాలు,,స్త్రీవాదులు ఇలాంటి సునిశిత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపై ఒత్తిడి తేరెందుకో?? స్త్రీవాదం అంటే బట్టలు ధరించే విధానం గురించీ,,లైంగిక స్వేచ్చ గురించే చర్చలు పెడతారు టీవీలలో తప్ప ఇలాంటివి ఎందుకు పట్టించుకోరో??

- Kiran​

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి