సాధారణంగా మనం చేసే రైలు ప్రయాణాలలో అమ్మాయిలు మనకి తారసపడడమే చాలా తక్కువ..అందులోనూ ఓ అందమైన అమ్మాయి మనం ఎక్కిన బోగీయే ఎక్కి మనకి కనపడేలా కూర్చోవడం ఇంకా అరుదు..ఒకవేళ అలాంటి అదృష్టం మనకి లభ్యమైనా ఆ అమ్మాయి పక్కనే వాళ్ళ అమ్మో,,నాన్నో ఉంటారు సప్తమ గ్రహాల్లా...
అసలే చంటిపిల్లల ఏడుపులతోనూ,,సీట్లకోసం కొట్టుకుచచ్చే ప్రయాణికుల గ్రాంధికభాషతోనూ,,,మాట్లాడుకునే విషయాలపై పెద్దగా,,లోతుగా అవగాహనలేకుండా అర్ధంపర్ధంలేని కబుర్లు చెప్పుకునే కొందరి తోటి ప్రయాణికుల మాటలతోనూ,,, " పక్కవాడికేమైనా ఇబ్బంది అవుతుందేమో "అనే కనీస స్పృహకూడా లేకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకుని వినే వ్యక్తులతోనూ విసుగ్గా అనిపించే ఆ రైలు ప్రయాణాలు ఇంకా విసుగుగా అనిపిస్తాయి మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక ఎక్కువసేపు రైల్ని ఒకే చోట ఆపేస్తే ఆ బాధ వర్ణనాతీతం...
అలాంటి బాధ నేను ఓసారి 3 ఏళ్ళక్రితం మా రెడ్డిగారి చెల్లెలి పెళ్ళికని అనపర్తికి వెళ్తూ అరగంటకుపైగా నిడదవోలులో సింహాద్రీ ఎక్స్ప్రెస్ నిలిపేయడంచేత అనుభవించాను..చేతిలో ఉన్న పుస్తకం చదవడానికి కూడా ఏకాగ్రత కుదరనంత గోల ఆ బోగీలో..పైగా పల్లీలు అమ్ముకునేవాళ్ళ అరుపులూ,,రైలుకూతలూ,,ఎండవేడిమీ,,తిరగని ఫ్యానూ ఇంకా ఇబ్బంది పెట్టేశాయి నన్ను అప్పుడు..ఆ సమయంలో నాకు అనుకోకుండా భాగ్యాధిపతి శుక్రుడు కరుణించినట్లు ఓ అందమైన అమ్మాయి కనిపించింది ;)
అసలే అప్పుడప్పుడే చలంగారి పుస్తకాలూ,,ప్రభంధాలు చదవడం మొదలెట్టిన రోజులవి...అందులోనూ అంతకుముందురోజే " శ్రీహర్షనైషదం " చదివి ఉండడంచేత అందమైన వర్ణనలు చేయడానికి ఏ అవకాశం దొరుకుతుందా? అని నాలో నాకే అప్పటివరకూ తెలియని ఓ రచయిత గోతికాడ నక్కలా ఆశపడుతున్న రోజులవి...అలాంటిది ఇంత గొప్ప అవకాశం వస్తే వదులుతానా???
నరకతుల్యమైన ఆ 3 గంటల ప్రయాణాన్నీ ఆనందమయంగా మార్చుకుని సరదాగా ఆ అమ్మాయిని నా కధాంశంగా చేసుకుని తొలిప్రేమలో,,ఆకర్షణలో అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండే మొహమాటమూ,,సిగ్గూ వల్ల ఏర్పడే ప్రవర్తనలూ,,ఆ మాట్లడలేకపోవడాలూ,,ఆ మౌనసంభాషణలూ ఇవన్నీ రాశానిలా సరదాగా....
ఇప్పుడిలా రాయమన్నారాయనుకానీ నాకు 19 ఏళ్ళున్నప్పుడు ఇలా రాసానని అనుకుంటే మాత్రం చాలా గర్వంకలుగుతోంది..ఆ రాతలివిగో...!!!
*************************************************************** ***
" 14వ తారీకున నా ఫ్రెండ్ Mavvsn Reddy ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్దామని ఆ రోజు ఉదయం 11.30కి తణుకు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి , సీట్ దొరికాక బుద్దిమంతుడిలా మొక్కపాటి వారు రాసిన " బారిస్టర్ పార్వతీశం " పుస్తకం చదువుతూ కూర్చున్నాను.
నిడదవోలు రైల్వే స్టేషన్లో 40 నిముషాలు ఆపాడు బండిని.
అంతవరకూ పుస్తకం చదవడంలో నిమగ్నం అయిపోయిన నేను ' ఇంతసేపు ఆపాడు ఏంటి ఇక్కడ? ' అని తల ఎత్తి చూస్తే నా కుడివైపు ఉన్న సీట్ కు 2 సీట్ల ముందర కూర్చుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది.
ఎంత అందంగా కనపడిందో నా కళ్ళకి?
బహుశా ఆ అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి అనుకుంట.
ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు,పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు,బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి..
అమ్మాయిలకి నిజమైన అందం ఈ అలంకరణల వల్ల ఏదీ రాదనుకుంట....!!!
కాస్తంత మొహమాటం,సిగ్గుపడుతూ మొహంలో ప్రస్ఫుటంగా పలికించే హావభావాలు ,సన్నని చిరునవ్వు ఇవి చాలు అమ్మాయిలకు అందాన్ని ఇనుమడింపచెయ్యడానికి..
ఆ అమ్మాయివైపు నేను చూడటం,తను కొంచెం ' నేను గమనిస్తున్నాను ' అనే విషయం గుర్తించి బయటకు ఎటో చూస్తున్నట్లు చూస్తూ మధ్యమధ్యలో నావైపు తిరిగి చూడటం, అది గుర్తించి నేనేదో హఠాత్తుగా ఏదో పని ఉన్నవాడిలా పక్కకి దృష్టి మరల్చడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూడటం...
ఇలా నా చేస్టలు అన్నీ ఆ అమ్మాయికి " నాకు నీమీద బోల్డంత ఆసక్తి ఉంది సుమా !!! " అన్నట్లు తోచాయి కాబోలు ,
ఏ అమ్మాయికైనా ' తన అందం ఇంకొక అబ్బాయి గుర్తించి తన మెప్పుకోసమే ఆరాటపడుతున్నాడని అనిపిస్తే కించిత్ గర్వం కలుగుతుంది ' అనుకుంట...
అలాగే తను నేను చూస్తున్నననే విషయం గ్రహించి కొంచం గర్వంగా తన పెదాలను బిగపట్టి పొంగి బయటకు రాబోతున్న నవ్వుని ఆపే ప్రయత్నం చేసింది,కాని కొంత ఆ ప్రయత్నంలో విఫలమైంది ..
నోటికి అడ్డంగా తన చేతి వేళ్ళు అడ్డంపెట్టి నవ్వే ఆ నవ్వుని చూస్తే నాకు " వేళ్ళు మధ్య వెలుతురులా అంత అందంగా ఎలా వస్తోంది నవ్వు ఈ అమ్మాయికి ?"అని అనిపించింది.
' నేను చేసే చేష్టలు ఆ అమ్మాయి గుర్తించి అలా ప్రవర్తిస్తోంది ' అనే భావం అబ్బాయికి కలిగితే ఇంకా సంబరపడిపోతాడు అబ్బాయి.
కానీ నేను ఇలా కుదర్దనిచెప్పి కాసేపు నా మొబైల్లో పాటలు వింటూ కూర్చున్నాను.తను ఆ చర్యతో నొచ్చుకుందేమో...!!
తనుకూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తన ఎడమచేతిని పద్మంలా ముడిచి ఆ చేతివేళ్లను పైకి దగ్గరగా చేసి ఆ వేళ్ళను చూస్తూ ఏదో గొప్ప నాటకంలో కళాకారిణిగా అభినయించింది.
మాటిమాటికీ నుదిటిపై ముందుకు పడే తన ముంగురులను సరిచేసుకుంటూ వికసిస్తున్న పువ్వులా అందంగా నవ్వే అమ్మాయిని చూస్తూ ఉంటే " దేవకన్యలకైనా ఇంత అందం ఉంటుందా ? " అని అనిపించింది.
ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని? వాడేవడో ఈ అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు అని అనిపించింది.
ఎందుకో అమ్మాయిని చూస్తే " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా? అని అనుమానం కలిగింది.
అలా ఆ దేవకన్యను ఆరాధనాపూర్వకంగా నేను చూస్తూ ఉంటే , ఎక్కడనుంచి వచ్చారోకాని 4గురు మనుష్యులు మామధ్య అడ్డంగా నుల్చున్నారు యమదూతల్లా ,
అయినా ' ఆ అమ్మాయిని చూద్దాం ' అని నేను ప్రయత్నిస్తూంటే కదలరే ఆ కర్కసులు?
అయినా దొరికినకొద్దీ వాళ్ళు కదులుతున్నప్పుడు ఏర్పడే ఖాళీ జాగాలోంచి తనని నేను చూసే ప్రయత్నం చెయ్యడం,నా చూపుకోసం ఆ అమ్మాయి చూసే ఎదురుచూపులు ఇలా ఇలా కొంతసేపు అలా ఆ ప్రహసనం జరిగింది.
నా కుడిప్రక్క కూర్చున్న కొంతమంది వృద్దులు నేను పడే ఆరాటాన్ని గమనిస్తూ ఉన్నారు.
నేను ఓ అక్కర్లేని చిరునవ్వు వాళ్ల మొహానపడేసి ఆ అమ్మాయిని చూడటం ఎలా? అనే ప్రయత్నాలలో నిమగ్నం అయి ఉన్నాను.
మొత్తానికి ఈ యమదూతలు ఏదో పని ఉందని కదిలారు అక్కడనుంచి,మళ్ళీ మా చూపులు కల్సుకున్నాయి.
నా ఎడమపక్క వికృతంగా చీరకట్టుకుని ఉండి,తన బిడ్ద కిటికిలోంచి బయటకు చూస్తూ ఆశ్చర్యంతో అడిగే ప్రశ్నలకు విసుగ్గా మొహంపెట్టి ,ఆ పిల్లలో ఉన్న ఆసక్తిని అంతా చంపెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఆ బిడ్దతల్లిని చూసి నాకసలు కోపమే రాలేదు అప్పుడు. పక్కనే ఉన్న తన కుటుంబంతో మాట్లాడడం మానేసి ఎదుటి ప్రయాణికులతో ఈ వ్యవస్థ ఉద్ధరింపబడాలంటే పాటించాల్సిన ముఖ్య సూత్రాలు చెప్తున్న ఆ బిడ్డ తండ్రిని చూసి నాకసలు విసుగే అనిపించలేదు ఆ క్షణాన.
అప్పటికే మా మధ్య మౌనసంభాషన జరుగుతోంది కంటిచూపుల ద్వారా,ఆ సమయంలో ప్రపంచంలో ఏ ఏ విషయాలు జరిగితే నాకేం?
గోదావరి బ్రిడ్జ్ పైనుంచి మేం వెళ్తున్న రైలు కూలిపోయి నీళ్లలో పడినా ఆ అమ్మాయిని కాపాడడానికి నేనెలానో ఉన్నాను కదా??? :p
ఇంకెందుకు వేరే అర్ధంపర్ధంలేని భయాలూ,విషయాలూ? అని అనిపించింది నాకప్పుడు.
మరి అంత " ధైర్యవంతుడిలా కాపాడేద్దాం " అని అనుకున్న నేను సాహసం చేసి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదో? అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది.
కాని ఆ అమ్మాయి నాకోసమో అన్నట్లో లేక అది తన సహజమైన ప్రవర్తనో తెలియదుకానీ " మాటలద్వారా కాకుండా హావభావాలు ప్రదర్శించడం ద్వారా,అది కూడా ముఖ్యంగా తమ మొహంలో కనపడేట్టట్లు ప్రదర్శిస్తూ ఉంటే స్త్రీలు ఇంత అందంగా ఉంటారా ?" అని నేను ఆశ్చర్యపోయేలా రకరకాల హావాభావాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది.
అంటే గడ్డం క్రింద కుడిచేతిని ఆనుంచుకుని బయటకు చూస్తూ,వివిధ రకాల మనుషుల ప్రవర్తనని చూస్తూ ఆశ్చర్యపడుతూ అలా కూర్చుని ఉంది.
ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కు ఎంత అందంగా ఉందో తెలుసా?
ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కుకి బహుశా ఈ చిన్ని సంఘటన కారణం అయి ఉండవచ్చు.
" బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని సృష్టిస్తున్నప్పుడు తాను తయారు చేసిన ఈ అందానికి తానే ముచ్చటపడి,ఆ బొమ్మని తన ఎదురుగా తేరిపారా చూడటానికి వీలుగా తన కుడిచేతి మధ్యవేలుతో పట్టుకుని చూసి ఉంటాడు ఆ గడ్డం కింద,
దానితో ఆయన వేలు నొక్కుపడి అంత అందంగా ఏర్పడి ఉంటుంది ఆ అమ్మాయి గడ్డంకింద నొక్కు. "
అంతటి సౌందర్యాన్ని నేను తన్మయత్వంతో ఆస్వాదిస్తూ ఉంటే ఇంతలో నేను దిగాల్సిన " అనపర్తి " రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది,
ఎప్పుడూ భగవంతుడిని అంతలా ప్రార్దించని నేను , ఈసారి చాలా తీవ్రంగా వేడుకున్నాను ' ఎలాగైనా అమ్మాయి దిగల్సిన స్టేషన్ కూడా అనపర్తే చెయ్యి, నేను వెళ్ళాల్సిన పెళ్ళికే తనని కూడా వచ్చేట్టు చూడు ' అని.
కాని ఈ దేవుడు అంత నిర్దయుడు ఇంకెవరూ ఉండరనుకుంట ఈ విశ్వంలోనే .
ఆ అమ్మాయి దిగాల్సిన స్టేషన్ అనపర్తి కాకుండా చేశాడు,
పోనీ కొంచెం ఆలస్యం అయినా పర్లేదు పెళ్ళికి వెళ్ళడానికి.ఈ అమ్మాయి దిగే స్టేషన్ వరకూ వెళ్దామని అనిపించింది,కానీ ఆ రోజు తెలంగాణ విభజనకి వ్యతిరేకంగా జరుపుతున్న బంద్ గుర్తొచ్చింది.
వాహనాలు ఏమీ తిరగట్లేదు,వెంట వెళ్ళినా తిరిగి రావడం ఎంతో వ్యయప్రయాస అవుతుందనిపించి మొట్టమొదటిసారి ఈ వ్యవస్థపైన,అందులోని నాయకులపై విసుగేసింది ,
కాని ఏమీ చెయ్యలేని నిస్సాహయత నడుమ మొత్తానికి రైలు దిగుదామని అనిపించి దిగాను,
చెప్పుకోవద్దూ...!!!
దిగాలంటే ఎంతో దిగులేసింది,కాని ఏం చెయ్యలేని పరిస్థితి నాది,
అలా రైలు దిగి ఆ రైలు వెళ్లేంత వరకు నిశ్చేస్టుడినై నిలుస్తూ ఉన్నాను అంతే,
ఆ రైలు ఎంతో నిర్దయగా కూతపెట్టి గమ్మున్న వెళ్ళిపోయింది,తనతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయింది :(
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి