మా ఇంటికి అప్పుడప్పుడూ ఇతర మతస్తులు కూడా వస్తూ ఉంటారు ముహుర్తాలు అడగడానికీ,,మంచి తెలుసుకోడానికి.వాళ్ళని చూస్తే ఒక్కోసారి అర్ధంకాదు నాకు " వీళ్ళు చూస్తే వేరే మతం వాళ్ళు,,కానీ పాటించేవన్నీ హిందుధర్మాలు..ఈ మాత్రందానికి మతం మారడం ఎందుకా? " అని ఆలోచిస్తే ఒక సమాధానం తడుతూ ఉంటుంది నాకు.
" వాళ్ళు సమాజంలో కులం పేరిట వివక్షకి గురవుతున్నారు... ఆ వివక్ష తప్పించుకోడానికే ఇలా ఇంకో మతాలలోకి మారుతున్నారు తప్ప మరేమీ కాదని.. "
కులం పేరిట వివక్ష ఇంకా కొనసాగుతోందా? అని మీరనుకోవచ్చు...పల్లెల్లోకి రండి మీకు ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో చూపిస్తాను....కులం తాలూకు మౌలిక భావనలను,,అది సమాజాన్ని ఎలా ఆర్ధికంగా,,సామాజికంగా చైతన్య పరుస్తుంది అనే మూలభావనలను వదిలేసి " వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ " అనే బేధాలుతో,,మానసిక అంతరాలను నిర్మించుకుని ప్రవర్తించే మనుష్యులు బోలెడుమందున్నారు మన సమాజంలో ఇంకా...
కేవలం తమ శాఖకి చెందిన అమ్మాయిని కాకుండా వేరేశాఖ అమ్మాయిని చేసుకున్నాడని ఆ కుటుంబాన్ని వదిలేసిన అన్నతమ్ములను చూశాను నేను...దాదాపు 100 కోట్లకి పైనే ఆస్తి ఉన్నా కేవలం శాఖాంతరం చేసుకున్నాడని అదో నేరంగా భావించి ఆ వ్యక్తిని ఎందుకు వెలివేశారో అతని కుటుంబసభ్యులు? అని ఈనాటికీ అర్ధంకాలేదు నాకు. ( శాఖాంతరం చేసుకుంటే అదేదో చెట్టుమీద పితరుల ఆత్మలు తిరగబడిపోతాయట )....
మీరు నమ్మరు,, నాకు తెలిసిన ఒక ఆసుపత్రి ఉంది...అక్కడి డాక్టర్లు అందరూ నిమ్నకులం వారని ఆ హాస్పటల్నుంచి ఇంటికి వచ్చాక బట్టలన్ని ఇప్పి తడుపుకుని స్నానం చేసి కానీ ఇంటిలోపలకి రాని అనేకమంది వ్యక్తులని చిన్నప్పటినుంచీ ఎన్నోసార్లు చూశాను నేను. వాళ్ళని ముట్టుకుంటేనే మనమేదో భస్మీపటలం అయిపోతాం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళు.అలా ప్రవర్తిస్తున్న ఒకతన్ని మంటెక్కి అడిగాను నేను ఒకసారి ఇలా " వైద్యోనారాయణో హరి " అని అంటారుకదా? అంటే " వైద్యుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయుణితో సమానము " అని కదా అర్ధం? మరి నీతాలుకు ఈ ప్రవర్తన ఏమిటి? అని అడిగితే ఏదో సొల్లు చెప్పాడు తన మూర్ఖపు చేష్టలను సమర్ధిస్తూ... " నిప్పుకోళ్ళు " అనే పుస్తకంలోని వాక్యాలు గుర్తొచ్చాయి నాకు అప్పుడు.
" పుస్తకం తొక్కితే, తీసి కళ్ళకద్దుకుంటాం. అది బూతు పుస్తకం అయినా సరే.
ఎందుకని?
పుస్తకమన్నా,కాగితమన్నా అది సరస్వతి స్వరూపం అని.
ఎందుకని?
పుస్తకమన్నా,కాగితమన్నా అది సరస్వతి స్వరూపం అని.
అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది తొక్కినా కళ్ళకద్దుకుంటాం.
అడుగడుగునా కనిపించే ఈ దైవస్వరూపం తోటి మనుషులలో ఎందుకు కనిపించడంలేదు?
మన చర్యలలో పాపం మన దృష్టికి ఎందుకు రావడంలేదు?
భగవంతుడిపై అపారనమ్మకం ఉన్న మనిషి, తోటి మనిషికి అపకారం ఎలా చెయ్యగలుగుతున్నాడు?
మన మనసునే భగవంతుడు చదవగలడని నమ్మినపుడు మన చేతలు ఆయనకి తెలుస్తాయనే ఆలోచన ఎందుకు రావట్లేదు? " అని....
మన చర్యలలో పాపం మన దృష్టికి ఎందుకు రావడంలేదు?
భగవంతుడిపై అపారనమ్మకం ఉన్న మనిషి, తోటి మనిషికి అపకారం ఎలా చెయ్యగలుగుతున్నాడు?
మన మనసునే భగవంతుడు చదవగలడని నమ్మినపుడు మన చేతలు ఆయనకి తెలుస్తాయనే ఆలోచన ఎందుకు రావట్లేదు? " అని....
ఏం చేస్తాం? కొందరు మనుష్యులు అంతే..." మన మూర్ఖత్వం ఇదిరా...మార్చుకోవాలి దీనిని...లేకపోతే మారుతున్న పరిస్థితులు,,కాలానితో కలిసి పరిగెత్తలేము మనం " అని మనం అంటే మనం చెప్పిన సిద్ధాంతాలలోని లాజిక్ని వదిలేసి అందులోని చెడునే పట్టుకుని మార్పుని వ్యతిరేకిస్తూ " మా మూర్ఖత్వంలోని గొప్పదనం ఇదీ,,నువ్వు చెప్పే విషయం అర్ధంలేనిదని " ఓ తీర్మానం చేసేసి తాము అధిక నైతిక విలువలు కలిగినవాళ్ళమన్నట్లు,,మిగతావాళ్ళకి వాస్తవిక జీవితం అంటే అర్ధమే తెలియదన్నట్లు ఓ సుపీరియారిటీ భావనపొంది అలా చెప్పినవాడిని " చెడ్డవాడు " అనో " లేక " అక్కర్లేని పనులురా ఇవన్నీ " అని వాడినికూడా తమలా మార్చే ప్రయత్నాలు చేస్తూ సంతృప్తిపడుతూ ఉంటారు ఇలాంటివాళ్ళు....
వీళ్ళింతే మారరని వదిలెయ్యాలా? లేక మన పని మనం చూసుకుంటే చాలు ఎందుకీ అక్కర్లేని తాపత్రయాలు??సమాజం ఎలా ఉంటే మనకే??? మనకి జరుగుబాటు అవుతోందా లేదా అని మన దారి మనం చూసుకుంటే చాలా?
ఏమంటారు దీనిగురించి?
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి