హేమంత ఋతువు మొదలై అప్పుడే పదకొండు రోజుల పైనే అయ్యింది....ప్రకృతి ఎంత గొప్పగా తనని తాను మార్చేసుకుందో గమనించారా? ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది మా పల్లెలో..
" తెలారగట్ల విపరీతంగా మంచు కురుస్తోంది... పొగమంచు బాగా పట్టుకుని పీడించేస్తోంది మా పల్లెని...కొందరు రైతులు ఉదయాన్నే వేసుకునే చలిమంటదగ్గర మాత్రమే కాస్త ఆ పొగమంచు కరగి అక్కడి వస్తువులూ,,కట్టడాలూ కనపడుతున్నాయితప్ప 7.30 వరకూ అసలేదీ కనపడనంత పొగమంచు దుప్పట్లో పల్లె బద్దకంగా జోగుతోంది నిశబ్దంగా...
పొగమంచుతో నిండి ఉన్న ఉదయాలు ఎంత అందంగా ఉంటాయో కదా?
దండలు దండలుగా విచ్చిన మందారపుపూలు ఆ మంచు గాలికి తమ మెడలను ఊపుతూంటే చూడడం చాలా బాగుంటోది....తామరాకుమీద నిలిచి ఉన్న నీటి బొట్లు ఏ విధంగా అయితే తెల్లటి కాంతిని తమలోప్రతిఫలింపచేస్తూ మెరుస్తూ ఉంటాయో అదే అందం మీకు ఈ సమయాల్లో బొప్పాయి ఆకులమీదా కూడా కనిపిస్తుంది...సాలిగూడులోని సన్నని దారాలకి మంచుబిందువులు అంటుకుని వేళ్ళాడుతూ ఉన్నప్పుడు తొలి ఉషస్సు సమయంలో సూర్యుడి నుంచి వచ్చే మెత్తటి సింధూరపురంగుగల కాంతి ఈ గూడుని వెలిగిస్తూ వర్ణశోభితం చేసినప్పుడు చూడాలి....లోకంలో ఇంత చిన్న విషయాల్లో కూడా ఇంత ఆనందం,,సౌందర్యం ఉందా ? అని అనిపిస్తుంది మనకు...
లేత తేగలు అమ్మకానికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే...ఇక ఈ కాలంలోనే ఎక్కువగా గొబ్బిపూలూ,,నాగ నందివర్ధనాలూ,,హంసపూలూ,,డిశంబరం పూలూ దొరుకుతాయి....దేవకాంచనాలు కూడా విపరీతంగా పూస్తున్నాయి ఉదయాన్నే...నిద్రపోతున్న దేవకాంచనం మొక్కనెప్పుడైనా వెన్నెల వెలుగులో చూడండి...కనకాంబరంపూలమీద వాలి అందులోని తేనె తీయదనాన్ని జుర్రుకొనే సీతాకోక రెక్కలాగ తన ఆకులను దగ్గరకు ముడుచుకుని మరీ నిద్రపోతుంది ఈ మొక్క....మకరందంకోసం వచ్చి పుప్పొడి ఎక్కువగా పీల్చడంవల్ల మూర్చపోయి పడుకున్న తుమ్మెద అవస్థలా తోస్తుంది ఈ మొక్కనలా చూస్తే...పాపం వెన్నెల వెలుగు ఎక్కువగా జుర్రుకుని అలా మూర్చిల్లి పడుక్కున్దేమో...!!!
ఇక చామంతులూ,,బంతిపూలూ ఈమధ్యనే ఎక్కువగా పూయడం మొదలెట్టాయి నా తోటలో...భూమికి బంగారుపూత పూసినట్లు పసుపురంగులో మెరుస్తూ కంటికి ఎంతో ఇంపుగా కనిపిస్తున్నయి అవి....
ఇక పారిజాతాలు..ఏమని వర్ణించను వీటి గురించి???
వీటికోసం శ్రీకృష్ణుడు దేవేంద్రునితో యుద్ధం చేశాడని నందితిమ్మన తన " పారిజాతాపహరణం " లో రాశాడంటే అవేమీ అతిశయోక్తి మాటలేమీకాదు...అంత అద్భుతమైన సౌందర్యం,,సువాసనా వీటి సొంతం...ఈ పూలను కాస్త పరిశీలనగా చూడండి..." చిన్ని చిన్ని మంచుబిందువులను దగ్గరగా కుక్కేసి ఈ పూరేకులను తయారు చేశాడేమో ఆ సృష్టికర్త " అని అనిపిస్తుంది వాటినలా చూస్తే...మళ్ళీ ఆ కాషాయపురంగు కాడ ఎలా ఏర్పడిందో ఈ పూలకి చివరన??? ఆ విషయం అస్సలర్ధంకాదు... ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని చెప్పి దేవకన్యలు ఎవరైనా దిగుతున్నారేమో రోజూ నా తోటలోకి రాత్రిపూట...తీరిగ్గా పూలన్నీ కోసి ఆ రహస్యమేమిటో? అని పరిశోధించి ఏ విషయమూ అర్ధం కాక మళ్ళీ స్వర్గలోకానికి పోతున్నారేమో తెల్లారిగట్ల...లేకపోతే అన్నిపూలు ఎవరూ కోయకుండానే ఎలా కిందపడి ఉంటాయో మీరే చెప్పండి...!!! ఆ దేవకన్యలు నాకు కనపడితే " నన్ను అడగకుండా ఎందుకు నా తోటలోని ఈ పూలన్నీ ఇలా కోసేస్తున్నారు మీ ఇష్టంవచ్చినట్లు ? " అని కోపంతో అడగాలనుకుంటాను..కానీ కోసేసిన ఆ పూలన్ని అందంగా గడ్డికొసలన అలంకరించి మరీ మాయమైపోతున్నారు వాళ్ళందరునూ...ఉదయాన్నే సూర్యోదయపువేళ వాటి మీదనుంచి వీచే నునివెచ్చని గాలితాకగానే ఆ కోపమంతా ఎక్కడికో మటుమాయమైంపోతోంది ఏదో మంత్రించినంత చిత్రంగా...భలే చిత్రమైన అనుభూతి అది :)
రైతులు ఇప్పుడిప్పుడే తమ తమ పొలాల్లో శనగ విత్తనాలు జల్లుతున్నారు...ప్రత్తి కాయలు బాగా కళ్ళు విచ్చుకున్నాయి....
ధనుర్మాసం కదా ఇప్పుడు?? పనులు ఉన్నాయని పొద్దున్నే 5 గంటలకి బండిమీద బయటకి బయల్దేరి వెళ్తున్నప్పుడు రావిచెట్టుమీద గుంపుగా నిలబడిమరీ నిద్రపోయే కొంగలని చూస్తూ ఉండిపోతున్నాను ఒక్కోసారి...ఈ పత్తికాయల దూది ఏమైనా గాలికి ఎగిరి ఈ కొమ్మల చివరన అతుక్కుందా లేక మొన్నామధ్యే వెళ్ళిన శరత్కాలంలోని శరన్మేఘం ఒకటి ఈ రావి చెట్టుని ఢీకొని అందులోని ఆ తెల్లదనమంతా విడివడి ఇలా ఈ కొమ్మల చివర్లన ఉండిపోయిందా ? అని చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఆ కొంగలను అలా చూస్తున్నప్పుడు నాకు...
మొన్న కార్తీకమాసమంతా రోజూ ఊళ్ళో ఉదయం 4 గంటలనుంచీ 6 గంటలవరకూ కొందరు భజనకారులు " హారేరామా హారే రామ రామరామ హారేహారే..హారే కృష్ణా హారే కృష్ణా కృష్ణకృష్ణా హారేహారే " అని అనుకుంటూ " నగర సంకీర్తన " నిర్వహించుకునేవాళ్ళు...ఇప్పుడు ఈ మార్గశిరంలో ఏకాదశిపూట " ఏకాహాలు " నిర్వహిస్తున్నారు... పల్లెలో ఆడవాళ్ళు,,అమ్మాయిలు పొద్దున్నే తల స్నానం చేసి శుభ్రంగా తయారయ్యి గుడిలోనూ,,చెరువుగట్లదగ్గరా దీపాలు వదిలి పూజలేవో చేసుకుని ప్రసాదాలు తీసుకుని గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ వస్తూంటే చాలా ఆనందం కలుగుతోంది వాళ్ళని అలా చూస్తుంటే ఎందుకో...పాపం ఇంత చలిలో పూజలు చేసుకుని ఏకాదశి తిధి పోయేంతవరకూ ఎలా ఉపవాసాలు ఉంటున్నారో ఈ సుకుమారమైన అమ్మాయిలు ? అని జాలి వేస్తోంది కొంతమంది ముగ్దలను చూస్తూంటే.....శ్రీకృష్ణదేవరాయలు రాసిన " ఆముక్తమాల్యద " మళ్ళీ చదవాలనిపిస్తోంది వీళ్ళనలా చూస్తూంటే ;) "
ఇంకా చాలా అందాలే ఉన్నాయి ఇక్కడ...వీలున్నప్పుడూ,,ఋతువు మారినప్పుడల్లా రాస్తాలేండి ఇక్కడి విశేషాలన్నీ...కానీ ఆలోచించండి ఒక్క ఉదయంలోనే ఇంత సౌందర్యం,,ఇన్ని అనుభూతులు ఇక్కడిలా కనిపిస్తోందంటే అసలు మొత్తం ఈ ప్రాంతమంతా ఇంకెంత సౌందర్యంతో నిండి ఉంటుందో అని..!! అసలు శ్రీనాధుడు ఎప్పుడో వర్ణించాడు ఈ ప్రాంతాలన్నిటినీ తన " భీమఖండం "లో...ఆ కావ్యం రాసి ఇన్ని వందలు సంవత్సరాలైనా ఇప్పటికీ ఇక్కడి అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు...
అలాంటి చోట నేను తిరగడం,,వేదం నేర్చుకోవడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం అనుకుంట...
శుభసాయంత్రం :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి