27 మార్చి, 2016

ఇంతకీ మారాల్సింది ఎవరు?




1907 రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ గారి వందేమాతర ఉద్యమ ప్రచారసభలో చిలకమర్తి
లక్ష్మీనరసింహంగారు అప్పటి బ్రిటీష్ పరిపాలన వల్ల మన దేశం పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఈ పద్యాన్ని చెప్పారు

" భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి " అని.

ఆ మహానుభావుడే ఇప్పుడుకనుక బ్రతికి ఉంటే మన వ్యవస్థని తమ స్వార్ధానికీ,,రాజకీయ ప్రయోజనాలకీ ఉపయోగించుకుని అమాయకప్రజలను ఆసరాగా చేసుకుని అడ్డంగా ఎదుగుతున్న నేతలను 
చూసి  బాధతో ఇలా అందురేమో...!!!

" భరతఖండంబు చక్కని పాడియావు
భారతీయులు లేగదూడలై ఏడ్చుచుండ
రాజకీయ నాయకులను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి " అని :(

( మొన్న తునిలో జరిగిన సంఘటన గురించి టీ.విలో చూసాక ఇదే అనిపించింది నాకు..ఎంత అమానుషం ఆ సంఘటన? 

రైల్ని బలవంతంగా ఆపి నిప్పంటిస్తారా దానికి ? " అందులోని ప్రయాణికులకి ఏమవుతుందో? "అనే కనీస స్పృహ కూడా లేకుండా రాళ్లదాడి చేస్తారా ఆ బోగీలపై? 

ఆలోచనలేని మూర్ఖులో,,పిచ్చివాళ్ళో తప్ప మానసిక ఆరోగ్యం బాగున్న వ్యక్తులెవరూ ఇలాంటి పనులు చెయ్యరుమరి...

ఈ ఘటనకి బాధ్యులని ఎవరిని నిందిద్దాం?

వాళ్ళనలా రెచ్చగొట్టిన నాయకులది తప్పందామా ? లేక " ఏం నష్టపోయాం " అని కనీసం తర్కించక ఆ సభలకి వెళ్ళి ఆవేశం (? ) పొంది ఏదో హిప్నాటికల్ ట్రాన్స్లో ఉన్న వ్యక్తుల్లా యుక్తాయుక్త విచక్షణ కూడా ఎరగకుండా పోలీస్ స్టేషన్ పై,,రైళ్ళపై గుంపుగా వెళ్ళి దాడి చేసిన ఆ జనాలది తప్పందామా ??

తప్పెవరిదైతే ఏమిటి? జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటోంది ఎప్పటికప్పుడు...

" ఈ వ్యవస్థ ఇంతే...!! ఈ దేశపు రాజకీయాలింతే...!!! అనే నిర్లిప్తతకిలోనై మౌనంగా,,తమకేదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు మేధావులుకూడా ఇంకేంచెయ్యలేక...!!

" లేదు,,ఈ సమాజాన్నీ,,ఈ ఆలోచనా విధానాలనీ ఏదైనా మారుద్దామని" ప్రయత్నించిన వ్యక్తికి కనీస సహకారం ఉండదుసరికదా వాడినో పిచ్చివాడిగా,,అర్ధంలేని పనులు చేసే వ్యక్తిగా జమకడతారు జనం కూడా.... 

వ్యక్తిగతంగా మనకే ఓ ఆదర్శం,,స్పష్టమైన ఆలోచనా విధానం లేకుండా వ్యవస్థ మారాలనుకోవడం ఎంత చిత్రమోకదా???

ఇంతకీ మారాల్సినది మనమా??  వ్యవస్థా???

ఏది ముఖ్యం ముందుగా మన దేశానికెప్పుడూ ???

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి