14 అక్టోబర్, 2016

ఆలోచించాల్సిన విషయమే...!!!


( జగ్గీవాసుదేవ్ గారు రాసిన " సద్గురు సుభాషితాలు " నుంచి సేకరించిన ఓ వ్యాసంలోని భాగం ఇది... విషయచర్చ చెయ్యడం కోసం దీనినిక్కడ కొంత మార్చి ఇలా పోస్ట్ చేస్తున్నాను )

"" శంకర్ పిళ్ళై అనే వ్యక్తి కూతురు పెళ్ళికాకుండానే గర్భవతి అయ్యిందట...!!!

అతను కోపం పట్టలేక కూతురిని చావగొట్టి దీనికి కారణం ఎవరో చెప్పమని నిలదీస్తే ఆమె ఏడుస్తూ ఆ అబ్బాయి పేరు చెప్పింది..

వెంటనే శంకర్ పిళ్ళై తన తుపాకీ తీసుకుని సరాసరి ఆ అబ్బాయి ఇంటికి కోపంతో ఊగిపోతూ వెళ్ళాడు... పెద్దకోటలా ఉన్న ఆ ఇంటి తలుపుల్ని తన్నుకుని మరీ లోపలకి వెళ్ళి మంచమీద పడుక్కుని ఉన్న ఆ వ్యక్తి కణతకు తుపాకీని
ఆన్చాడు..

అప్పుడతను " తొందరపడకండి.. మనం నిదానంగా కూర్చుని ఈ విషయం గురించి మాట్లాడదాం " అని బ్రతిమాలాడు.

" నువ్వు పెద్ద బిజినెస్ మేన్ కావచ్చు. కానీ చిన్నపిల్లని ఏమార్చావ్.. నా చేతిలో నీకు ఈరోజు చావు రాసి ఉంది,, ఇది తధ్యం " అనంటూ గర్జించాడు శంకర్ పిళ్ళై..

అప్పుడతను " అయ్యా !! మీ అమ్మాయికి ఆడపిల్ల పుడితే పది లక్షలు ఇద్దామని నిర్ణయించుకున్నాను నేను "
అని అన్నాడు

" మరి అబ్బాయి పుడితే ? "

" ఇరవై లక్షలిస్తాను " అని బదులు చెప్పాడు ఆ వ్యక్తి..

వెంటనే శంకర్ పిళ్ళై తుపాకీని మడిచి సంచీలో పెట్టుకుని అతడి ఎదురుగా చేతులు కట్టుకుని మెలికలు తిరుగుతూ - " ఒకవేళ బిడ్డ దక్కకపోతే నాకూతురుకు మరొక చాన్స్ ఇస్తారా సార్ !! " అని అడిగాడు... "" :p

జాగ్రత్తగా ఆలోచించండి...

ఆస్తీ,అంతస్తూ మాత్రమే లక్ష్యంగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళకూ,, ఈ శంకర్ పిళ్ళైకి పెద్ద తేడా ఏముంది నిజానికి?

ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సరే... ఆస్తీ,చేతినిండా జీతం కేవలం ఈ రెండే జీవితానికి ముఖ్యం అనుకోవడం బాధపడవలసిన విషయంకాదా? కుటుంబపెద్దలు, చేసుకునేవాళ్ళ మనసుకి నచ్చిందా లేదా? అని ఆలోచించకుండా అంతస్తు మాత్రమే పట్టించుకుని పెళ్ళిళ్ళు చేస్తున్నందువల్లే ఈరోజుల్లో చాలా పెళ్ళిళ్ళు చేదు జ్ఞాపకాలుగా మారుతున్నాయి...

అవునా కాదా? ఏమంటారు మీరు దీనిగురించి?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి