07 ఏప్రిల్, 2017

వసంత ఋతువర్ణన


వసంతఋతువు వొచ్చి వారం రోజులపైనే అయ్యింది అప్పుడే ,, ఎంత అందంగా కనిపిస్తోందో మా ఊరు ఈ సమయంలో...

మామిడిపూలలోని పుప్పొడి గాలినిండా కమ్ముకుని ఉంటోంది ఉదయాన్నే. ఈ సువాసనాభరితమైన గాలిలో వేపపూల వాసనా, తెల్లని మునగపూల వాసనా కలిసిపోయి ఉదయాన్నే ఓ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

రావికొమ్మల కొనల్లో ఇప్పుడిప్పుడే ఎర్రటి లేలేత చిగురులు పుడుతున్నాయి... శిశిరంలో శోభ కోల్పోయిన మారేడు,,గానుగ మొదలైన వృక్షాలు ఇప్పుడిప్పుడే లేత పత్రహరితం నిండిన ఆకులను తమ కొమ్మలకి అలంకారంగా చేసుకొంటున్నాయి... పౌష్యమాసపు పొగమంచును తట్టుకుని మరీ మాడకుండా నిలిచిన మామిడిపూతలనుంచి పుట్టిన పిందెలు పెద్దవై గుత్తులుగుత్తులుగా వేళ్ళాడుతూ మామిడి చెట్లకి గొప్ప అందాన్నిస్తున్నాయి... లేత మామిడి చిగురుటాకులు తిన్న కోకిలలు నేరేడుచెట్ల కొమ్మలలో దాక్కుని అవ్యక్త మధురమైన కూతలు కూస్తున్నాయి తమ గొంతు విప్పి స్వేచ్చగా. మర్రిచెట్లపైన ఒకదానినొకటి తరుముకుంటూ పరిగెత్తే ఉడుతలు వాటికి తెలియకుండానే ఎర్రటి మర్రికాయలను నేల రాల్చేస్తున్నాయి తమ అల్లరితో.. గానుగుపూలు గుట్టలగా పడుండి గాలి గట్టిగా వీచినప్పుడల్లా తేలికగా కదుల్తూ ముత్యాల్లా దొర్లుతున్నాయి రోడ్లపై

రాజు వెళ్తూంటే అతనిని అనుసరించే సేనలాగ గేదెల వెనుక కొంగలు చాలా హడావిడిగా పరిగెడుతున్నాయి ఆ గేదెలపై ముసిరే పురుగులను తినడానికని... బూరుగుపత్తి చెట్లకొమ్మలపై పాలపిట్టలు దీర్ఘంగా ఏవో ఆలోచిస్తున్నాయి

ఊళ్ళో చాలామంది ఇళ్ళల్లో ఎర్రటి రాధామనోహరపూలు గుత్తులు గుత్తులుగా పూచి ఆ భారంతో తలలు కిందకి వేళ్ళాడేస్తూ కనపడుతున్నాయి. విష్ణుకాంతం పూలపై చిన్న చిన్న సీతాకోకచిలుకలు ఒకదానికొకటి అందీ అందకుండా తోసుకుంటూ,, తప్పించుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నాయి... పూరేడు పొదల్లో దూరి పిచుకలు చాలా అల్లరి చేస్తున్నాయి... దాదాపుగా ఎవరిళ్ళళ్ళో చూసినా నీలగోరింటపూలు కనపడుతున్నాయి ఈ కాలంలో..

ఈ ఋతువులో సూర్యోదయం ఎంత బాగుంటోందో తెలుసా?

మా ఇంటికి దగ్గరగా కొన్ని వందల ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజావారు త్రవ్వించిన సువిశాలమైన ఓ చెరువు 3 గ్రామాలను కలుపుతూ వంద ఎకరాలలో విస్తరించి ఉంది... అక్కడ చూడాలి ఈ సూర్యోదయపు అందాన్ని...

తొలిసంధ్యా సమయంలో సూర్యుని నుంచి వచ్చే మెత్తటి సింధూరపు రంగు గల కాంతి ఆ చెరువు నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటే " ఆంజనేయస్వామి ఇక్కడకి దగ్గరలో ఉన్న కత్తిపూడి కొండలపై ఓ కాలూ,, అన్నవరం కొండలపై మరో కాలూ వేసి సూర్యుని దగ్గర వేదం నేర్చుకుంటున్నాడేమో మళ్ళీను...!!! అందుకే కాబోలు,, ఆయన వంటి రంగు ఇలా ఈ నీళ్ళల్లో కనిపిస్తోంది...!!! అని అనిపిస్తూ ఉంటుంది....

సూర్యాస్తమయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందిక్కడ...

సూర్యుడు అవతలి గట్టుకీ, ఇవతల గట్టుకీ మధ్య స్వర్ణవారధి కడుతూంటాడు ప్రతీ సాయంత్రమూ తన కిరణాలతో... చూడటానికే కళ్ళు మిరుమిట్లుగొలిపేంత ప్రకాశవంతమైన బంగారపు రంగు కాంతి ఆ నీళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది అసురసంధ్యవేళ ఇక్కడ.. చూడటానికి చాలా అద్భుతమైన దృశ్యాల్లా తోస్తాయి ఇవి నాకు.

ఒక్క ఇవనే కాదు.... చూసి,, స్పందించి, ఆనందించే లక్షణం హృదయానికుండాలేగానీ ప్రతీది ఆనందం కలిగించే విషయంగానే తోస్తోంది నాకిక్కడ....

శుభసాయంత్రం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి