06 ఫిబ్రవరి, 2017

మా ఊర్లో నాకిష్టమైన ప్రదేశాలు



ప్రతీ ఒక్కరికీ వాళ్ళ సొంత ఊరులో వాళ్ళకంటూ ఇష్టమైన కొన్ని ఫేవరేట్ స్పాట్లు ఉంటాయి...

అక్కడికెళ్తే మనసు చాలా తేలికవుతుందనో, చాలా ఆనందం కలుగుతుందనో, లేదా హాయిగా కబుర్లు చెప్పుకునేందుకు ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుందనో అనుకునే ప్రదేశాలు కొన్నైనా ప్రతీ మనిషికీ ఉంటాయి ( అలా లేకపోతే లైఫ్ని చాలా నిస్సారంగా గడుపుతున్నట్లు లెక్క నా దృష్టిలో)

అలా నాకు మా తణుకు పరిసర ప్రాంతాలలో ఇష్టమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

నేనెప్పుడు మా తణుకుకి వచ్చినా తప్పకుండా వెళ్ళే ప్రదేశాలు

1. తీపర్రు, కాకరపర్రులలోని గోదావరి ఒడ్డు ( సంధ్యా సమయాన సూర్యుని బంగారపు కాంతి మేటగా వేసిన ఇక్కడి ఇసికమీదా,, గోదావరి నీళ్ళలోనూ ప్రతిబింబిస్తూ ఉండగా సాయంత్రాలు ఇక్కడ గడపడం అద్భుతమైన అనుభవం )

2. వేల్పూరులోని రమణాశ్రమం

3. రేలంగిలోని గోస్తనీ నదీ పిల్లకాలువ ( బోలెడు అరటి తోటలమధ్య ఉంటుంది ఇది, ఇక్కడికి రాగానే మానసికంగా చిన్నపిల్లాడినైపోయి హాయిగా స్నానంచేస్తాను కేరింతలు కొడుతూ మా బాచ్ తో కలిసి నేను 😊 )

4.కావలిపురం దాటాక రోడ్ మలుపులో గోస్తనీ నదినానుకుని ఉన్న రుద్రగన్నేరు చెట్టు

( దీని కొమ్మలు గోస్తనీ నదిని తాకకుండా మధ్యవరకూ వంగి ఉంటాయి ఇక్కడ, దీనిపై కూర్చుంటే నది మధ్యలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. కబుర్లు చెప్పుకోడానికిది అద్భుతమైన ప్లేస్ నాకిది )

5.జుత్తిగ ఉమా వాసుకీ రవి సోమలింగేశ్వర స్వామి ఆలయం ( చాలా విశాలమైన ప్రాంగణంతో,, రకరకాల దేవతా వృక్షాలతో వెళ్ళినవెంటనే మనసుకి హాయినిచ్చి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలగచేసేలా ఉంటుంది ఈ ఆలయం )

6. నత్తారామలింగేశ్వర స్వామి ఆలయం ( చక్కగా ఊరికి దూరంగా , పంటచేలూ,, పిల్లకాలవలకీ దగ్గర్లో,, గోపురంపై వాలిన పావురాల మూల్గులు, రెక్కల విదిలింపు చప్పుడూ కూడా స్పష్టంగా వినిపించేంత నిశబ్దంగా ,, కృష్ణతులసీ పచ్చగన్నేరు పారిజాతాల సువాసన గుప్పుమని నాసికను తాకేంత స్వచ్చమైన గాలి వీస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందీ గుడి )

మచ్చుక్కి నేనేదో కొన్ని చెప్పానుకానీ ఇంకా చాలానే ఉన్నాయి నా లిస్ట్లో, ఇవి మాత్రం ప్రధానం.

నాసంగతి పక్కన పెడితే మీకూ ఇలాంటి ఫేవరెట్ స్పాట్లు ఏమైనా ఉన్నాయా మీ ఊళ్ళో?

మీకభ్యంతరం లేకపోతే మీ అనుభవాలను కూడా ఇక్కడ కామెంట్ గా రాయండి 

శుభోదయం 😊 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి