* మనిషి మరణం నాలో మిగిల్చే ప్రశ్నలు 🤔
"" మనిషి మరణం నన్ను బాధ పెట్టదు కానీ కాస్త ఆలోచనలో మాత్రం పడేస్తుంది...
పుట్టినప్పటినుంచీ ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుంటాము... అనేకానేక అనుభూతులని, అనుభవాలని పొందుతాము... " ఇవన్నీ మరణంతో ఎలా ఆఖరు అయిపోతాయి? " అనే ఆశ్చర్యం మాత్రం కలుగుతూ ఉంటుంది నాకు మనిషి మరణాన్ని చూసినప్పుడు...
అసలు మరణం అంటే ఏమిటి? శరీరంలో జీవక్రియ ఆగిపోవడమేగా...
అంతవరకూ బాగానే నడిచిన జీవక్రియ ఎందుకు ఆగిపోతుంది ఒక్కసారిగా? అసలు ఆ జీవక్రియకి చైతన్యం ఎక్కడినుంచి కలుగుతోంది? చాలామంది నమ్మే ఆత్మే ఈ జీవక్రియకి చైతన్యం కలగచేస్తోందా నిజంగానే??
" జీవితం ఓ కలలాంటిది " అని అంటారు వేదాంతులు..
కలలో చూడండి... మనకి మనం ఎప్పుడూ కనపడం.. కానీ " నేను " అనే భావంతో అన్నిరకాల ఎమోషన్స్నీ అనుభవిస్తూ ఉంటాం కలలోనే...
ఒక్కోసారి ఏడుస్తాం, ఒక్కోసారి విపరీతంగా ఆనందపడతాం, ఒక్కోసారి ఉలిక్కిపడిలేచేంత విపరీతమైన భయాన్ని అనుభవిస్తాం..
మన కోరికలు, అసంతృప్తులు, ఇష్టాలు,, ఇష్టమైన వ్యక్తులు , ఇష్టంలేని వ్యక్తుల ప్రవర్తనలూ ఇలా అన్నీరకాలైన భావాలను మన మెదడుద్వారా కల్పింపబడితే అనుభవం చెందుతాం కలలోనే " ఇలా అనుభూతి చెందుతున్నాను " అనే సృహ కూడా ఎరగకుండా.
జీవితం కూడా జాగ్రదవస్థలో మనం కంటున్న కలలాంటిదేనేమో...!!!
" నేను " అనే భావంతో " నాది " అనుకునే స్వార్ధాన్ని, " నా " అనే మమకారాన్ని పెంచుకుని అన్నిరకాల ఎమోషన్స్నీ ఇక్కడ కూడా అనుభవించట్లేదూ మనం???
మనం మరణించాక మన ఆత్మ (?) తన ప్రయాణంలో ( ఎక్కడికి వెళ్తుంది? అసలు వెళ్తుందా?? )
" జీవితం కూడా ఓ కలలాంటిదే అనే విషయం ఎరక్క ఎన్ని తాపత్రయాలు పడ్డానో నేను నా జీవితమంతా ? ఎంత వేదన అనుభవించానో ఇంతవరకూ ?? ఇదంతా ఇప్పుడు పరిశీలిస్తూంటే ఓ అర్ధంలేని విషయంలా అనిపిస్తోంది ? " అని నవ్వుకుంటుందేమో...!!! లేక పశ్చాత్తాపపడుతుందా ?? " 😢 ""
( అసలు నేనిలాంటి వేదాంతపు ఆలోచనలు చెయ్యను ఎక్కువగా.. అవి జీవితాన్ని మూర్ఖం, అర్ధ విహీనత్వం అన్నట్లుగా చూపుతాయి చాలావరకూ...
జీవితం నిరాశాపూరితం, దుఖ్ఖమయం , " సుఖం అనేది ఓ భ్రాంతి " అని చెప్పే వేదాంతాలు ఎంత గొప్ప జ్ఞానానికి సంబందించినవైన విషయాలైనా సరే " వాస్తవ జీవితానికి ఏమాత్రం అన్వయించుకోబడని జ్ఞానం ఎంత మనం కలిగి ఉన్నా అది వృధానే " అనే ఆలోచనా విధానం కలిగి ఉండి పెద్దగా పట్టించుకోను నేను అలాంటి విషయాలని.
కానీ ఎవరైన దగ్గర మనిషి చనిపోయాడని తెలిస్తే అతని తాలూకు బంధువులు, స్నేహితులు వీళ్ళంతా ఆ శవం దగ్గర విషణ్ణవదనాలతో కొందరూ, పెద్దగా గుండెలు బాదుకుంటూ,దుఖ్ఖపడుతూ ఏడుస్తూ తమ సహజ స్థితికి దూరంగా ప్రవర్తిస్తూ ఉంటే " ఏమిటి ఏడుపులవల్ల, సానుభూతుల వల్ల కలిగే ప్రయోజనం? వీలైనంత త్వరగా ఆ బాధనుంచి బయటపడడానికి ప్రయత్నించాలిగానీ...!!! " అని చెప్దామని అనుకోబోయి చెప్పినా ఉపయోగం లేదని తెలిసి మౌనంగా ఉండిపోయే నా ప్రవర్తన ఇలాంటి రాతలు రాయించింది అంతే, అంతకి మించి విశేషం ఏమీలేదు ఇందులో 😏 )
మీరేమంటారు దీనిగురించి?
-Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి