" సత్యం అంటే ఏమిటి? " అనే ప్రశ్నని మనం తర్కిస్తే దానికి రెండు రకాల నిర్వచనాలు లోకంలో చెలామణీలో ఉన్నట్లు అనిపిస్తుంది..
అవి,,
1. వ్యావహారిక సత్యం 2. వాస్తవిక సత్యం
వ్యావహారిక సత్యం వాస్తవం కాకపోవచ్చు,,కానీ వాస్తవిక సత్యంతో పోలిస్తే వ్యావహారిక సత్యంతోనే లబ్ది ఎక్కువ కలుగుతుంది లోకానికి సాధారణంగా..
ఉదాహరణకి " సూర్యుడు తూర్పున ఉదయించును,,పశ్చిమాన అస్తమించును " అనేది మనకి వ్యావహారిక సత్యం...దానిననుసరించే మనం పగలూ,,రాత్రి అని కాలాన్ని విభజించుకుని మనుగడ సాగిస్తూ ఉంటాం...
కానీ నిజానికి సూర్యుడు ఉదయించడం ఏమిటి? అస్తమించడం ఏమిటి? ఈ రెండూ జరగనే జరగవు నిజానికి..సూర్యుడు చుట్టూ భూమి భ్రమించడం వల్ల అలా జరుగుతున్నట్లు అనిపిస్తోంది మనకంతే...!!!
ఇలా భూపరిధిని దాటి ఆలోచిస్తే దిశలు,దిక్కులు,,సమయం,కాలం అని మనం నిర్వచించుకున్న నిర్వచనాలూ,,లెక్కలు ఉత్త అర్ధంలేనివన్నట్లు అనిపిస్తాయి..ఏదీ స్థిరమైన విషయాలలా తోచవు...
లోకంలో విలువలూ,,సత్యాలు అని మనం నిర్దేశించుకున్న విషయాలన్నీ చాలామటుకు ఇలానే అనిపిస్తాయి కాస్త పై స్థాయిలోకి వెళ్ళి ఆలోచిస్తే..కానీ ఇవన్నీ అసత్యాలని కొట్టి పారేసి మనుగడ సాగించగలమా???
మరి సత్యం అంటే ఏమిటి??
" సత్యము " అని నిర్వచించబడ్డ విషయాలన్నీ సత్యం తాలూకు ప్రాధమిక విచారణలో తేలిన విషయాలలా అనిపిస్తాయి ఒక్కోసారి ఈ విషయమై లోతుగా ఆలోచించినప్పుడు..
మన మనుష్యుల మనస్సు అర్ధంకాని విషయాలన్నిటినీ ప్రశ్నించి సమాధానం కొరకు విపరీతంగా ప్రయత్నిస్తుంది..అది దాని సహజ స్వభావం,,లక్షణమునూ...
ఎంతకీ సమాధానం తట్టని కొన్ని ప్రశ్నలు దానికెదురైనప్పుడు అది శ్రమించి అలిసిపోయిన ఓ సరిహద్దులో ఓ సిద్ధాంతాన్ని నిర్వచించి అదే సత్యం అని ప్రతిపాదిస్తుంది..ఆ స్థాయి దాటి ఆలోచించే పరిస్థితి రానంతవరకూ అదే సత్యంగా పరిగణింపబడుతుంది లోకంలో సాధారణంగా...
( ఉదాహరణకి " ఈ సృష్టి ఎలా ఏర్పడింది? " అనే ప్రశ్ననే తీసుకుందాం...
" సృష్టికి పూర్వం అంధకారం అంధకారంతో ఆవృత్తమై ఉంది..యావత్తూ గుర్తించలేని వెల్లువయై ఉందప్పుడు..సమస్తాన్నీ తనలో ఇముడ్చుకున్నవాడుగా,,శూన్యంతో ఆవృత్తమైన వాడుగా ఏకాకిగా ఏ భగవంతుడు ఉన్నాడో ఆయన తపోమహిమవల్ల తనని తాను అభివ్యక్తం చేసుకుని ఈ సృష్టిని సృష్టించడం జరిగిందంటాడు " ఒకానొక ఋషి ఋగ్వేదంలోని నాసదీయసూక్తంలో.
" ఒకానొక ధనాత్మక,ఋణాత్మక శక్తులు రెండూ ఏకమై శూన్యాన్ని ఏర్పరిచాయి..ఆ శూన్యం నుంచి ఈ సృష్టి ఉద్భవించింది " అని అంటారు కొందరు...
" పదార్ధం విపరీతమైన పీడనంతో ఒక బంతివలె దగ్గరగా కుచించుకుపోయినట్లు ఉండేది మొదట్లో..అది విస్పోటనం చెందడం వల్ల ఈ సృష్టి ఏర్పడింది " అంటారు మరికొందరు...మరి పదార్ధం ఎలా ఏర్పడిందంటే సమాధానానికి తడుములాడతారు వాళ్ళు...
ఇదిగో ఇప్పుడు " దైవ కణం ( హిగ్స్ - బోసోన్ ) " కారణం అనుకునే స్థాయి వరకూ వచ్చాము ప్రస్తుతం మనం..
ఇంతకన్నా పై స్థాయికి వెళ్ళి ఆలోచించగలిగితే ఇంకోటి ఏదో సత్యంగా తోచవచ్చు త్వరలోనే మనకి.. )
సత్యాన్వేషణకున్న ఈ సంక్లిష్టతను చూసేనేమో వేదాంతులు " సత్యం ఒక్కటే,దానికి పండితులు ఇచ్చే నిర్వచనాలు అనేకం " అని అనేసి ఊరుకున్నారు 😊
మీరేమంటారు దీనిగురించి?
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి