అట్లతద్ది వస్తోందంటే చిన్నప్పుడు ఎంత సంతోషంవేసేదో నాకు..అసలిది పూర్తిగా ఆడపిల్లల పండగే..,కానీ మనం బాగా చిన్నపిల్లలగా ఉన్నప్పుడు ఆడామగా అనే బేధాలు లేకుండానే ఆడుకుంటాం కదా??? అసలా తారతమ్యాలు ఎరుకలోకే రాక ఈ ప్రపంచంలోని ఆనందం అంతా మనదే అన్నట్లు ప్రవర్తిస్తాం మనము చిన్నతనంలో... నిజానికి నాకా రోజులేం గుర్తుకులేవు పెద్దగా చెప్పాలంటే,,,,కానీ పల్లెటూరిలో అప్పటి సందడి మాత్రం ఇంకా కొంత గుర్తుంది నాకు...అదే రాస్తున్నాను ఇలా ఇక్కడ..
" " నాకు గుర్తున్నంతలో,,,తెల్లారిగట్లే నాలుగు ఆ సమయానికి మొహం కూడా కడుక్కోకుండా నిద్ర లేచిన వెంటనే వీధిలోకి పరిగెత్తుకుపోయి గుంపుగా మా పిల్లలం అందరమూ కలుసుకునేవాళ్ళం ఓ చోట...అంతకుముందురోజే మాకు ఈరోజుకి కావాల్సిన ఏర్పాట్లేవో చేసేసుకుని ఉండేవాళ్ళం మేము.....
తాటి వెన్నుకి పేడ రాసిన పీలిక గుడ్డేదో చుట్టి ( ఉప్పుపొట్లం అనుకుంట దాని పేరు ) ఆ పొట్లానికి మధ్యలో ఓ పురుకోస తాడు కట్టి తాటి వెన్ను చివర్లన నిప్పు పట్టేలా వెలిగించి తాడుని పైకెత్తి గిరగిరా గాలిలో త్రిప్పితే వాటి నుంచి ఎర్రటి నిప్పురవ్వలు రాలిపడుతూ ఉండేవి క్రిందకి...
అప్పుడు ఒకేసారి ఉద్రేకం వచ్చిన వ్యక్తుల్లా దొరికినవాడు దొరికిన దిక్కువైపు ఒళ్ళుతెలియని ఉత్సాహంతో పరిగెడుతూ
" అట్ల తద్దోయ్,,ఆరట్లోయ్...
ముద్దపప్పోయ్....మూడట్లోయ్..
పీటకింద పిల్లల్లారా లేచి రండోచ్చ్...!!! లేచి రండోచ్చ్ ...!!!! "
అని అల్లరిచేస్తూ,,గంతులేస్తూ,, పాడుకుంటూ ఊరంతా తిరిగేవారం ఆ చీకట్లోనే...అది ఆ రోజు పిల్లల సందడి...
అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలలో కొందరు ఉండ్రాళ్ళతద్దె కూడా ఈరోజే సాయంత్రం నోచుకుని ఉపవాసం ఉండి,, చంద్రుడు రాకమునుపే చెరువుగట్ల దగ్గర దీపాలొదిలి పూజలూ,,తాంబూలాలిచ్చుకోవడంలో హడావిడిగా ఉండేవారు..
ఇక కన్నెపిల్లలు,,,,
ముందురోజే తమ కాళ్ళకీ,,లేత తమలపాకుల్లాంటి తమ అరచేతులకీ గోరింటాకు పెట్టుకుని రాత్రి అలానే పడుక్కునేవాళ్ళు పక్కపై...తెల్లారి లేచి నీటితో శుభ్రం చేసుకున్నాక " ఎవరి గోరింటాకు బాగా పండిందా?? " అని ఒకరి అరచేతులు మరొకరు పోల్చి చూపించుకుంటూ ఉంటే మా మామ్మ బాగా గోరింటాకు పండిన అమ్మాయిని అభినందిస్తూ " నీకు గోరింటాకు బాగా పండిందే,,నీకు మంచి మొగుడొస్తాడు అయితే " అని అంటే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తన అరచేతిని చూసుకుంటూ నవ్వడం,,మా మామ్మ మాట విని మిగతా అమ్మాయిలు కూడా ఆ అమ్మాయికేసి చూస్తూ గేలిచేస్తూ ఆ అమ్మాయిని ఏడిపించడం ఇంకా గుర్తుంది నాకు...
నిజం చెప్పాలంటే అమ్మాయిలకి ఈ పట్టు పరికిణీలు,,లంగావోణీలు ఎక్కడలేనీ అందాన్నీ,,ఆకర్షణనీ,గౌరవ భావాన్నీ తీసుకొచ్చేస్తాయి...వాళ్ళు లంగావోణీలు కట్టుకుని ఓ మూర మల్లెపూలో,,కనకాంబరంపూలో వాళ్ళ జడగంటలు ఉన్న జడలో దోపుకుంటే అబ్బాయిలకి ఎక్కడలేని మెంటలూ ఎక్కేస్తుంది...అందులోనూ 16 ఏళ్ళు దాటిన ఆ ముగ్ధలు సిగ్గు,,భయం,,బెదురుచూపులు కలిగిన హావభావాలు వాళ్ళకి తెలియకుండానే ప్రకటిస్తూ ఉంటే పురుషుడికి ఆకర్షణను మించిన ఆసక్తి కలుగుతుంది ఆ స్త్రీపై...
ఆలోచించండి....అలాంటి అమ్మాయిలు పొద్దున్న పూజ అయ్యాక తమ స్నేహితురాళ్ళందరితో కలిసి చింతచెట్టుకి ఓ ఊయల వేసుకుని ఒక్కొక్కరిగా ఊగుతూ ఉంటే ఎలా ఉంటుందో...!!!
తలస్నానం చెయ్యడంవల్ల తేలికగా ఎగిరేపడే జుట్టుని ముందుకీ వెనకకీ తోసుకుంటూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఊయలలు ఊగే ఆ అమ్మాయిల అందాన్ని ఏ కవి మాత్రం సరిగ్గా వర్ణించగలడు చెప్పండి ???
ఇదిగో ఈ అందాన్ని పింగళి సూరనగారు తన " కళాపూర్ణోదయం "లో " తమి బూదీగెల తూగుటుయ్యలల...... బ్రాయంపు గుబ్బిగుబ్బితల " అంటూఎంత బాగా వర్ణించారో చూడండి....!!!
అంటే " ఎత్తయిన వక్షోజాలుగల ఆ ఆడపిల్లలు చెట్లకొమ్మలకి కట్టిన ఉయ్యాలలు ఊగుతున్నప్పుడు పరికిణీ పైకి లేచిన కాళ్ళు ఆకాశంవైపు దూసుకుపోతూ దేవలోకంలోని అప్సరసలతో యుద్ధానికి తొడగొట్టి వెళ్తున్నట్లు ఉన్నాయి " అని.. ఎంత గొప్ప వర్ణనో కదా??? " "
అసలివన్నీ ఇప్పుడేమీ లేవనుకోండి,,,అది వేరే విషయం :(
నాగరికతపేరిట కొంత,,సాంకేతికత పేరిట ఇంకొంత,,హేతువాదంపేరిట మరికొంత ఈ ఈ పండగల వెనకుండే సున్నితత్వాలనీ,,ఆనందాలనీ కోల్పోయాము మనం :(
పరికరాల చేతిలో పరికారలమయిపోయి జీవితాన్ని యాంత్రికత చేసుకుంటూ జీవితాన్ని ఏదో గడిపేస్తున్నాం ఇలా బానే నైమిత్తికకర్మ యోగుల్లా... ఇక ప్రత్యేకించి ఏముంటుంది ఈ పండగ గురించి చెప్పడానికి ?? అని ఊరుకునేవాడినే ఈరోజుకూడా నేను..కానీ పొద్దున్న ఓ అమ్మాయి ఫేస్బుక్లో నాకిలా మెసేజ్ పెట్టింది
" కిరణ్ !!! అట్లతద్ది అంటే ఏమిటి ? " అని..
" ఇదిగో,,అట్లతద్ది అంటే ఇదమ్మా...!!! వేరే గ్రహం వారిదెవరిదో కాదీ పండగ...మన పండగే.. ఆ పండగ వెనకున్న అనుభవాలూ,,అనుభూతులూ ఇవీ " అని ఆమెకి వివరించే ప్రయత్నంలో ఇదంతా రాశాను...మీకేమైనా అర్ధమయితే సంతోషమే...
శుభరాత్రి
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి