16 జూన్, 2016

మితిమీరుతున్న FlexBoardల పిచ్చి





ఫ్లెక్స్ లు.. ఫ్లెక్స్ లు... ఫ్లెక్స్ లు...

దేశంలో ఎక్కడ చూసినా మనుష్యులకన్నా ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుతం.పిల్ల పెద్దమనిషి అవ్వడం దగ్గరనుంచీ పితృకర్మల వరకూ ఇలా ప్రతీ విషయానికీ ఫ్లెక్ లు పెట్టెయ్యడం అవసరమా? అని అనిపిస్తుంది ఒక్కోసారి వీటిని ఎక్కడపడితే అక్కడ చూసినప్పుడల్లా... వీటివల్ల " ఫీలింగ్స్ ని నిజంగా ఫీల్ అయ్యి ఆనందపడడం మానేసి వాటిని నలుగురిముందూ ప్రకటించి సంతృప్తి పడే ఓ మానసిక బలహీనత ఎక్కువ అవుతోందేమో మనుష్యులలో " అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి.ఆ ఆ ఫ్లెక్స్ లను చూసేవాళ్ళకీ ఇక ప్రతీ విషయం ఓ క్యాజువల్గా భావించే ప్రవర్తన కూడా ఏర్పడుతోందేమో....!!!

ఎవడైనా మనిషి చనిపోతే వాడి ఇంటి దగ్గర " అశ్రునివాళి " అనే ఫ్లెక్స్ పెడితే అర్ధముంది కానీ ఊర్లో ఎక్కడపడితే అక్కడ,,ఎవరు పడితే వాళ్ళు " శోకతప్త నయనాలతో" అని ఫ్లెక్స్లు పెట్టడంలో అర్ధం ఏమిటి? " తప్తము " అంటే అర్ధం తెలియని వాళ్ళు కూడా ఇలా ఊర్లో ఎక్కడపడితే అక్కడ తమ ఫీలింగ్స్ ని " ప్రకటించెయ్యడం " అవసరమా ? ఆలోచించండి...

మొన్నామధ్య బస్లో వెళ్తూంటే ఓ ఊర్లో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫొటో కనిపిస్తోంది..ఎవర్రా బాబు ఈ అమ్మాయి?ఈ ఊర్లో అందాలపోటీ పెడితే ఈమెకానీ కొంపతీసి ఫస్ట్ రాలేదు కదా? అని బాధపడుతు కింద వివరం చూస్తే ఓ వార్డ్ మెంబర్ అని రాసుంది...ఓ వార్డ్ మెంబరే ఇన్ని ఫ్లెక్స్ లు పెట్టుకుని ఉంటే మరి ఊర్లో ఎన్ని వార్డ్లు ఉంటాయి?? ఆ ఆ వార్డ్ మెంబర్ల పేరిట ఇంకెన్ని ఫ్లెక్స్ లు నిండి ఉన్నాయో ఊరంతా? మీరే ఆలోచించండి..అదికాక మళ్ళీ ఎం.ఎల్.ఏ గారికి శుభాకాంక్షలు అని,,ఎం.పీ గారికి అభినందనలని ప్రకటించే ఈ రాజకీయనాయకుల తోకగాళ్ళు ఇంకెన్ని ఫ్లెక్స్ లు పెడ్తున్నారో ఆలోచించండి...ఫ్లెక్స్ లు తయారు చేసే వాళ్ళకి లాభం తప్ప ఇంకెవరికి లాభం వీటివల్ల??

ఇక మన యువతరం...తమ అభిమాన నటుడి కొత్త సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు...ఇక ఆ ధియేటర్ ఎక్కడుందో కూడా తెలియనంతగా వెర్రిగా కాగితాలు,,కటవుట్లూ ఏర్పాటుచేసేస్తారు...

" ఏమిట్రా ఉపయోగం ఇలా ఆ రోజు ధియేటర్ దగ్గర నీ ఫొటో ఎక్కడో చిన్నగా ఆ ఫ్లెక్స్ చివర్న వేసుకుని ఆ సినిమా విజయవంతం కావలని కోరుకుంటున్నాను అని ఏర్పాటు చెయ్యడం వల్ల నీకు?నీ అభిమాన హీరో కూడా నువ్వు తనకోసం అలా పెట్టావని గుర్తించడు కదా? మరెందుకురా అంత వందలూ వేలూ ఖర్చు చెయ్యడం ఆ మాత్రందానికి? అంటే " మరి ఫాన్స్ అయ్యి ఆ మాత్రం చెయ్యకపోతే ఎలారా? " అన్నాడు నా పరిచయస్తుడొకడు నాతో... " అభిమానం ఉంటే ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో మనమెలా పైకి రావాలని ఆలోచించాలి కానీ ఈ అర్ధంలేని పనులేమిట్రా? " అందామని అనుకున్నాను కానీ వాడికి అది ఆనందమిస్తుంటే కాదనడానికి నేనెవడిని? అని ఇంకేం అనలేదు...

" ఎటువంటి గుర్తింపూ తెచ్చుకోని వాళ్ళు తమ ఆత్మనూన్యతా భావాన్ని కప్పిపుచ్చుకోడానికీ,తాము గొప్పవారిమనే ఆధీక్యతాభావాన్ని నలుగురుముందు చాటుకోడానికీ,,మొత్తానికేదో విధంగా ఈ రకంగానైనా జనాలలో గుర్తింపుపొందాలని అనుకునే వాళ్ళే ఈ రకమైన పనులు చేస్తారు " అని అంటుంది సైకాలజి.

 " ఐడెంటిటీ క్రైసిస్ "గల వ్యక్తులు  ఇంతమందికి ఉన్నారా ఈ సమాజంలో? అని అనిపిస్తుంది మొత్తం మీద ఇన్ని ఫ్లెక్స్ లను చూస్తే,,

మీరేమంటారు దీని గురించి?



-  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి