11 జూన్, 2016

సుఖనిద్రకై కొన్ని సూచనలు



ఈ ప్రపంచంలోకేల్లా గొప్ప అదృష్టవంతుడెవరో తెలుసా??

" పక్క మీదకి చేరిన 5 నిముషాలలోనే ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నిద్రపోయేవాడు... "


ఇలా చెప్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఆలోచించండి,, ఎవడు పడుక్కోగలడు అలా?

ఏ రుణబాధలూ లేనివాడూ,,ప్రేమలో పడనివాడూ,,రేపేమవుతుందో అనే బెంగ,భయమూ లేనివాడూ,,పరీక్షలకై ఆ దిక్కుమాలిన ట్రిగ్నామెట్రీ లెక్కలను బట్టీ పట్టనివాడైతేనే తప్ప మామూలు మనిషికి సాధ్యమా అలా?

అందుకే చాలామంది పక్కమీదకెళ్తారేకానీ అర్ధంలేని ఆలోచనలతో,,ఆందోళనలతో,ఆతృతలతో శవాసనాలు వేస్తూ ఉంటారు నిద్రలేమితో బాధపడుతూ...

దీని నుంచి బయటపడాలంటే మన జీవనవిధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది...

మొట్టమొదటగా తిండి...

ఉద్వేగాన్ని కలగచేసేలా ఉండే ఆహారపదార్ధాలకి సాధ్యమైనంత దూరంగా ఉండి తేలికగా అరిగేలా,మితంగా ఆహారాన్ని రాత్రిళ్ళు తీసుకుంటే మంచిది... అలాగే పడుక్కునే ముందు గోరు వెచ్చటి పాలు త్రాగడం అలవాటుగా చేసుకుంటే అది కూడా చక్కగా నిద్రపట్టడానికి దోహదపడుతుంది...

ఇక రెండో విషయం మానసికపరమైన ఉద్వేగం....


దీనికి దోహదపడుతున్న విషయాలేంటయ్యా? అంటే అందుకు ప్రధానకారణం " ఆధునిక జీవన శైలే " అని చెప్పవచ్చు...


నిద్రలో ఉండే దశలలో ఒకటైన గాఢనిద్రలోకి మనిషిని పోనివ్వకుండా ఈ సెల్ఫోన్ల కాంతి అడ్డుకుంటోందట..ఇది కలతనిద్రకి కారణమవుతోందని పలు సర్వేలు ఈమధ్యనే విషయాన్ని తేల్చి చెప్పాయి.. మనిషి గాఢనిద్రలోకి జారుకోకపోతే మెదడులో జరగాల్సిన రసాయనిక చర్యలలో అసతుల్యత ఏర్పడి అతనికి జ్ఞాపకశక్తి లేకపోవడం,సరిగ్గా ఏకాగ్రత చూపించలేకపోవడం,నీరసంగా,ఏ పనీయందూ ఆసక్తి లేనట్లు ప్రవర్తిచడం మొదలైన దుష్ప్రభావాలకి కారణమవుతుందట..కనుక సాధ్యమైనంతవరకూ పడుక్కునే ఓ గంట ముందునుంచైనా ఈ ఎలక్టానిక్ వస్తువులకి దూరంగా ఉంటే మంచిది...

అనుభవం మీద చెప్తున్నా,,ఉదయం నుంచీ ఎన్ని పాటలు విన్నా రాత్రి మనసుకి హాయిని,ప్రశాంతతని ఇచ్చే సంగీతాన్ని వినడం అలవాటు చేసుకుంటే కలత నిద్రలేని చక్కటి నిద్ర కలుగుతుంది...


బేహాగ్,కఫీ,తోడి,అభోగీ లాంటి హాయినిచ్చే రాగాలు వింటే మనసూ,,శరీరం చాలా తేలికైనట్లు అనిపించి చక్కటి నిద్రపట్టడమే కాకుండా మరుసటి రోజూ చాలా ఉత్సాహంగా మనలని ఉంచేలా చేస్తాయికూడా ఇవి...


పోనీ శాస్త్రీయ సంగీతం వినడం బోర్ అనుకుంటే నెట్లో మనకి చక్కగా సముద్రపు అలల చప్పుడు,,అడవిలో వర్షం పడుతున్నప్పుడు ఆకులు చేసే సవ్వడి,,సాయంత్రాన నిశ్చలమైన సరస్సు దగ్గర ఉండే ప్రశాంత వాతావరణం తాలూకు శబ్దాలన్నీ కూడా దొరుకుతున్నాయి...లేకపోతే బీ..వీ పట్టాభిరాం లాంటి హిప్నాటిస్ట్లచే రూపొందించబడిన రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా దొరుకుతున్నాయి... ఇవి వింటూ పడుకున్నా హాయిగా నిద్ర పడుతుంది..

ప్రయత్నించి చూడండి..

శుభరాత్రి :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి