10 జూన్, 2016

శృంగార శాకుంతలంలో నాయికావర్ణన





యవ్వనంలో ఉన్న స్త్రీలను వర్ణించాల్సి వస్తే ప్రభంధకవులూ ప్రతీ ఒక్కరూ ఒకళ్ళతో ఒక్కళ్ళు పోటీపడి,, రెచ్చిపోయీ మరీ వర్ణనలు చేసేశారు...చాలా వరకూ ఈ వర్ణనలు అతిశయోక్తిగా అనిపించేవే.. కానీ " ఇవేమీ అతిశయోక్తి మాటలు కావేమో...!!! నిజంగానే ఈ కావ్యంలోని నాయక అంత గొప్ప సౌందర్యవతేనేమో " అని చదివిన పాఠకుడు స్థిర అభిప్రాయం ఏర్పరుచునేలా ఉంటాయి చాలావరకూ ఇటువంటి వర్ణనలు...

ఉదాహరణకి పిల్లలమర్రి పినవీరభద్రుడు రాసిన " శృంగార శాకుంతలం "లోని ఈ నాయికా వర్ణనలు చూడండి.... ఎంత అద్భుతంగా రాశారో ఆయన...!!!


"" దుష్యంతుడు తన పరివారంతో కలిసి వేటకై అరణ్యానికి బయలుదేరి అక్కడ ఓ లేడిపిల్లను వేటాడే ప్రయత్నంలో తన సేనకి దూరమై,,దారి తప్పి కణ్వాశ్రమానికి చేరుకుంటాడు..అక్కడ ఉన్న ఆశ్రమాలనూ,,పక్షులనూ,,వృక్షాలనూ,,జంతువులనూ,,ప్రకృతినీ,,ఆ పరిసరాలనూ చూస్తూ,,మురిసిపోతూ నడుస్తూంటే అతనికి మొక్కలకి నీళ్ళుపోస్తూ,,తన స్నేహితురాళ్ళతో పరాచకాలు ఆడుతూ,,కిలకిలమంటూ నవ్వుతూ అల్లరిచేస్తున్న శకుంతల కనపడుతుంది...మొదటి చూపులోనే ఒకళ్ళపై మరొకరికి అనిర్వచనీయమైన భావాలూ,, అపురూపమైన ఆకర్షణా,, అవ్యాజమైన ప్రేమా కలిగేస్తాయి..


సరే ,, కణ్వాశ్రమంలో అతిధి సత్కారం స్వీకరించాక దుష్యంతుడు తిరిగి తన సైన్యం ఉన్న చోటుకి చేరుకుంటాడు.. చేరుకున్నడన్నమాటేగానీ మనసంతా శకుంతల తాలూకు ఆలోచనలతో నిండిపోయి,, ఆమెని తిరిగి చూసే వీలు లేకపోవడంతో తీవ్రమైన విరహాన్ని అనుభవిస్తూ ఉంటాడు...


తమ రాజుయొక్క ఈ అవస్థని గమనించిన దుష్యంతుని విదూషకుడైన " మాండవ్యుడు " ఆ బాధ ఏమిటో చెప్పమని కోరతాడు...అప్పుడు దుష్యంతుడు మాండవ్యుడితో తన రహస్యాన్ని చెప్పి,, శకుంతల అందాన్ని ఇలా వర్ణిస్తాడు ..

"" శివునంతటి మహాముని కణ్వుని దర్శనం చేసుకుందామని ఆశ్రమానికి వెళ్ళాను..ఆశ్రమం ముంగిట ఒక సుందరాంగి కనిపించింది.

ఆమె వాలుకన్నుల చూపులు నీళ్ళల్లో చేపపిల్ల ఈదుతున్నట్లున్నాయి. నల్లని వెంట్రుకలు నదీ తరంగాలలా నొక్కుల ఉంగరాలు తిరిగున్నాయి.. ఆమె కంఠం నీడలు తేలే అద్దంలా ఉంది... మోము చంద్రబింబం కంటే స్వచ్చందంగా వెన్నెలలా ప్రకాశిస్తుంది.... ఆమె నడక మద గజాల నడకే.... ఆమె అధరాలలో అమృతం చిప్పిల్లితూంది... నడుమనేది ఉందో లేదో తెలియదు...

నిండు చంద్రునికి అద్దమంత నునుపూ,, పూరేకులంత మెత్తదనం కలిస్తే ఆమె ముఖానికి ఈడు కావచ్చు. ఏనుగుల కుంభస్థలాల మీద బంగారం రంగు పూస్తే ఆమె స్థనాలకి జోడనవచ్చు.. అరటి స్తంభాలకి మీగడంత మెత్తదనం,బాణాల మొనలంత వాడీ కలిస్తే ఆమె తొడలకి దీటు కావచ్చు... పద్మాలకి మంత్రశక్తీ,,చిగురాకులంత నేవళం అబ్బితే ఆమె పాదాలకి పోలిక కావచ్చు.. ఆ యువతి అందాలని వర్ణించడానికి ఈ ప్రకృతిలోని ఉపమానాలు ఏమీ చాలవు...

మన్మధుడు తన బాణాల ఇంద్రజాలశక్తితో సుడి తిప్పినట్లుంటుంది ఆమె నాభి. మోహమనే చూర్ణంతో నింపి మూతవేయబడిన బరిణెలు ఆమె కుచాలు.. యౌవనం అనే కల్పవృక్షం సాచిన ఊడలవంటివి ఆమె చేతులు... సౌందర్యసముద్రంలో పుట్టిన పాంచజన్య శంఖం వంటిది ఆమె కంఠం.... మోమనే కొలనులో పద్మాలే కళ్ళు.... ఆ కొలనులోని ముత్యాలే ఆమె పలువరస.... మన్మధ ప్రణయ సామ్రాజ్య సుఖభోగాలన్నిటికీ ప్రవేశద్వారం ఆమె నోరు...


" మనసనే పొలంలో,,యౌవనం అనే తొలకరి తరుణంలో,,మోహమనే విత్తులు జల్లడానికి ముందు మదనుడనే రైతు దున్నడానికి పట్టిన బంగారు నాగలిలా ఉంటుంది ఆ లావణ్యవతి నాసిక " ( ఎంత గొప్ప వర్ణనో చూడండి ఇది. )

కమలంవంటి ఆమె మోములో వెలిగే చంద్రజ్యోతులు కళ్ళు. ఆ జ్యోతులనుండి వెలువడిన కొడిపొగ మేఘాలే కనుబొమలనిపిస్తుంది... ఆమె పలుకులు మృదుమధుర సంగీత ధ్వనులే... ఆ శకుంతలను పోల్చడానికి పద్దెనిమిది ద్వీపాలలోనూ ఎవ్వరూ లేరు.

రామచిలుకలనే బ్రహ్మచారులు చదువుకునే పాఠశాలవంటిది ఆమె మోము. సంగీత పట్టభద్రులైన కోకిలలకు ఆమె పలుకులు ఉత్తమ గీతాపాఠాలు...

ఆ సుందరాంగిని సృష్టించడానికి బ్రహ్మదేవుడు ఎన్నెన్నో లెక్కలు గుణించినా తృప్తిపడివుండడు. ఇక - లావణ్యం అనే పాలసముద్రంలో,, మనసనే మంధరపర్వతాన్ని కవ్వంగా చేసి,, తారకలని గాలితో కలిపి త్రాడుగా పేని రామచిలుకలొకపక్క ,, కోయిలలు రెండోపక్క ఆ త్రాటికొనలు పట్టుకుని చిలికింపచేసి ఉంటాడు.. అప్పుడు ఆ విధంగా పుట్టిన లక్ష్మీదేవే శకుంతల.. ( ఎంత గొప్ప ఊహో చూడండి ఇది )


బ్రహ్మదేవుడు సకల సౌందర్యాలూ గల చిత్రపటం గీసి,,దానికి ప్రాణంపోసి శకుంతలని చేశాడని అనుమానించక్కర్లేదు.. ఎంత గొప్ప చిత్రానికైనా ఏదో ఒక కొరత ఉంటుంది.. బ్రహ్మ మనోభావాలతో సౌందర్యాన్ని రంగరించి ఆమెని సృష్టించి ఉంటాడు... అందువల్లనే ఆమె రూపురేఖా విలాసాల్లో ఏ లోటూ కనిపించదు...

అయినా - బ్రహ్మకొక్కడికే ఇంతటి సుందరిని తయారుచేసే సామర్ధ్యం లేదనుకుంటాను... మొదట్లో చంద్రుడు తన రూపాన్నీ ,,వెన్నెలనీ ఆమెకి ధారపోసి ఉంటాడు.. మన్మధుడు కోరికలూరే లావణ్యాన్ని సమకూర్చి ఉంటాడు.. చైత్రుడు సువాసనలన్నీ ఆమెలో రంగరించి ఉంచాడు... లేకపోతే బ్రహ్మ అనే ముసలివాడికేం తెలుసయ్యా బంగారానికి సుగంధాన్ని కలపడం ?

పాలసముద్రంలో పుట్టిన పద్మనేత్రుల అందం ,, మెరుపుతీగల్లో పుట్టిన సులోచనల సౌందర్యం,, చంద్రుని అంశాలు పంచుకుపుట్టిన నీలవేణుల రమణీయకత్వం ,, మన్మధుని చెరుకు వింటినుంచి పుట్టిన సుందరాంగుల లావణ్యం,, సూర్యుని తొడలు మాయంచేసి పుట్టిన యువతుల స్పురద్రూపం - అవన్నీ ఒకేరాశిగాచేసి,, ఎక్కడ ఏది ఎన్ని పాళ్ళుండాలో తూచి తూచి సృష్టించిన అపురూపశిల్పం వంటి అప్సర ఆ శకుంతల.

ఆమె వాలుగనులూ,, ఆ నవ్వుమొగం,, ఆ ఉబ్బు గుబ్బలూ,, ఆమె జడరంగూ,, ఆ శరీరవిలాశం,, ఆ వొద్దిక,, ఆ నడకతీరూ,, ఆ పలుకుల సౌరు - నే చెబితే వందమాగధుల్లా పొగుడుతున్నట్లుందిగానీ ఆమెనొక్కసారి చూస్తే ఆ మన్మధుడికైనా ' ఆహా ! ' అనే ఆశ్చర్యం కలగదటయ్యా ! " అని తనివిదీరనట్లు శకుంతలని వర్ణిస్తూ కాలాన్నే మర్చిపోతాడు ఆ దుష్యంతుడు. ""

పాపం మన శకుంతలకూడా ఆ కణ్వాశ్రమంలో చంద్రవంశోద్ధారకుడైన ఆ దుష్యంతుడిని తలుచుకుంటూ ఓర్పలేని విరహంతో కంటికి కునుకురాక,, తీయని ఊహలు ప్రజ్వరిల్లచేస్తున్న ఆ విరహతాపానికి ఆహుతి అయిపోతూ చాలా బాధ అనుభవిస్తూ ఉంటుంది.

రాయడానికి అవకాశం బాగా దొరికేసిందని ఈ విరహపు సందర్భాన్ని కూడా ఈ కవి ఎంతో గొప్పగా వర్ణించాడు...ఇదేకాదు... ఇంకా ఇలాంటివెన్నో గొప్ప కవిత్వపు వర్ణనలు ఉన్నాయి ఈ పుస్తకంలో..

ఒక్క ఈ పుస్తకమనే ఏముంది?? మన ప్రాచీనకవులు రాసిన కావ్యాలన్నీ ఇంకా ఎంతో గొప్ప వర్ణనలతో అద్భుతమైన రసపుష్టి కలిగి పరమాద్భుతంగా ఉంటాయి.

అయినా ఉదహరించడానికి ఎన్నో గొప్ప వర్ణనలు ఉన్నా కేవలం ఈ వర్ణనే ఎందుకు ఇలా రాశానంటే కనీసం ఇది చదివైనా "ఆహా !! మన కావ్యాలు ఇంత గొప్పగా ఉంటాయా? ఒకసారి చదివితే పోలే !! " అనే భావంతోనైనా నా వయసులో ఉన్న వ్యక్తులు కొందరైనా కనీసం ఒక్క కావ్యమైనా చదవాలనే అర్ధంలేని ఓ వెర్రి కోరిక నాలో బలంగా ఉండడంచేత...

తప్పకుండా చదివి చెప్తారు కదూ మీ అభిప్రాయాలని???

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి