04 జూన్, 2016

కులాంతర వివాహాలు



నేనెరిగిన నా బాల్యమిత్రుడు ఒకడు ఈమధ్య నాకు ఫోన్ చేసి మాటల సందర్భంలో తాను ఓ కాపుల అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.... 

" అబ్బో...ఇంకేం...!!! శంభో శివ శంభో సినిమాలోలా టాటసుమోలు పెట్టి చేజ్కి రెడీ చెయ్యమంటావా ? అయితే " అన్నాను నేను నవ్వుతూ సరదాగా వాడితో ;)

" అదేరాబాబూ నా భయంకూడా...!!! ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు :( " అని అన్నాడు వాడు నాతో...

" మరి మీ ఇంట్లో ఇలాంటి పెళ్ళికి ఒప్పుకోరనే విషయం తెలిసి ఉండికూడా ఎలా ప్రేమించావురా ఆ అమ్మాయిని ? " అని నేనంటే " ఆ అమ్మాయి చాలా మంచిదిరా,,సాయం చేసే గుణం కూడా ఎక్కువ తనకి..నాతోపాటే బ్యాంక్లో పనిచేస్తోందిగా,,ఈ రెండేళ్ళలో తన ప్రవర్తన బాగా నచ్చి తనపై ప్రేమ పెరిగింది నాకు " అని అన్నాడు వాడు... 

ఇంకేం అనాలో అర్ధంకాలేదు నాకు...

అవున్నిజమే,,ప్రేమించడానికి పెద్ద కారణాలేం అవసరం నిజానికి? అది ఎప్పుడు,ఎక్కడ,ఎవరిమీద కలుగుతుందో విశ్లేషించుకుని చెప్పే విషయంకాదుకదా?? కానీ పెళ్ళి చేసుకోవాలంటే మాత్రం బోలెడన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది..

అందులో ముఖ్యమైనది సమాజప్రభావం...

తార్కికంగా ఆలోచిస్తే " ఇద్దరు వ్యక్తులు మేము ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ ధర్మబద్ధంగా సహజీవనం సాగిస్తూ చక్కటి కుటుంబాన్నీ,,తద్వారా ఓ ఆరోగ్యకరమైన,,నైతికపరమైన సమాజాన్ని ఏర్పర్చడంలో మావంతు పాత్ర పోషిస్తాము " అని అందరికీ తెలియచెప్పడమేగా పెళ్ళి చేసుకోవడం అంటే...

అలాంటి " వివాహబంధం విజయవంతమవ్వాలంటే కావాల్సింది గుణం కానీ కులమెలా అవుతుంది?? పరస్పర అవగాహనా,,ఒకరి తప్పులను మరొకరు మనస్పూర్తిగా మన్నించుకోగల క్షమ ఈ లక్షణాలు కదూ ఓ బంధాన్ని విజయవంతంగా నడిపించేవి??

ఇద్దరు వ్యక్తులు కలిసుండడానికి ఈ లక్షణాలు సరిపోతాయన్నప్పుడు ఇక మిగతా అర్ధంలేని ఈ చెత్త అంతా మనకెందుకు? " అని మెల్లగా మీ ఇంట్లో చెప్పి చూడరా "" అని అన్నాను నేను వాడితో నా తరపు సలహాగా..వాళ్ళ ఇంట్లో ఎలాగో ఒప్పుకోరని నాకు తెలుసు...

ఎందుకంటే వాళమ్మగారిని నేనెరుగుదును కదా?? చిన్నప్పుడు నేనెదురైనప్పుడు మాటల సందర్భం వచ్చినప్పుడల్లా " శాఖాంతరం చేసుకుంటే మన పితరుల ఆత్మలు తిరగబడతాయి ,, కనుక నువ్వు మన ఆరామద్రావిడుల అమ్మాయినే చేసుకో " అని కర్తవ్యబోధ చేసేది నాకు నేనేమీ ప్రత్యేకించి ఆమెని సలహాలేవీ అడగకపోయినా ..

అలాంటిది మావాడు శాఖాంతరంకాకుండా వర్ణాంతర వివాహమే చేసుకుంటానంటే ఒప్పుకుంటుందా ఆవిడ?

ఏమిటో కొందరు మనుష్యులు,,


" కులం అనేది కార్య విభాగం అని,,సమాజం సక్రమంగా నడవడానికని అప్పటి సమాజమూ,,ఆ మనుష్యులు ఏర్పరుచుకున్న ఓ వ్యవస్థే కులవ్యవస్థ " అని ఎప్పుడు తెలుసుకుంటారో...!!!


ఈనాడు ఆ వ్యవస్థకి తగ్గట్లు మన జీవనవిధానం లేకపోయినా ఇంకా అదే ఓ పెద్ద విషయంగా పట్టుకుని వేళ్ళాడ్డమేమిటని ఒక్కడైనా ధైర్యంగా ముందడుగు వెయ్యరేమిటో...


తమ ఈ చర్యవల్ల సమాజం ఏమంటుందో అని భయపడుతూ ఇలానే భయపడే భయస్తుల సమాజాన్ని నిర్మించుకోవట్లేదూ తరతరాలుగా దీనివల్ల??


ఒక్కడు మారినా ఇదంతా మారుతుంది కదా?? ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే ఆచరణలో మార్పు అదే వస్తుందికదా?? 


అయినా ఒక్కడూ మారడు...


ఏం చేస్తాం,,అంతవరకూ ఇలానే బాధపడాలేమో పాపం ఈ ప్రేమికులంతా పెద్దల నిర్ణయాన్ని ఎదిరించలేక,, ఇష్టమైనవాళ్ళని సహేతుకమైన కారణం కనపడకుండానే వదిలేస్తూ... 


మళ్ళీ జీవితంలో పునర్నిర్మాణంపై అవగాహన ఉన్నవాళ్లకైతే ఇలాంటి చర్యలు ఎదురైనా ఆ ప్రభావం నుంచీ ఎలగోలా బయటపడి మళ్ళీ జీవితాన్ని సక్రమంగా మలుచుకోగలరు కానీ అందరికీ అంత మనోనిబ్బరం సాధ్యమా?? 


పెద్దల మూర్ఖత్వాలకి బలి అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న యువతకీ,, పెద్దల నిర్ణయానికి తలొగ్గి ఇష్టంలేని పెళ్ళి చేసుకుని జీవితాతం జీవచ్ఛవాలలా బ్రతికే వ్యక్తులకీ సానుభూతితో ఈ పోష్ట్ అంకితం


- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి