వసంతఋతువు వొచ్చి వారం రోజులపైనే అయ్యింది అప్పుడే,,ఎంత అందంగా కనిపిస్తోందో మా ఊరు ఈ సమయంలో...
మామిడిపూలలోని పుప్పొడి గాలినిండా కమ్ముకుని ఉంటోంది ఉదయాన్నే. ఈ సువాసనాభరితమైన గాలిలో వేపపూల వాసనా,తెల్లని మునగపూల వాసనా కలిసిపోయి ఉదయాన్నే ఓ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
రావికొమ్మల కొనల్లో ఇప్పుడిప్పుడే ఎర్రటి లేలేత చిగురులు పుడుతున్నాయి...లేత మామిడి చిగురుటాకులు తిన్న కోకిలలు నేరేడుచెట్ల కొమ్మలలో దాక్కుని అవ్యక్త మధురమైన కూతలు కూస్తున్నాయి తమ గొంతు విప్పి స్వేచ్చగా.మర్రి చెట్లపైన ఒకదానినొకటి తరుముకుంటూ పరిగెత్తే ఉడుతలు వాటికి తెలియకుండానే ఎర్రటి మర్రికాయలను నేల రాల్చేస్తున్నాయి తమ అల్లరితో..
రాజు వెళ్తూంటే అతనిని అనుసరించే సేనలాగ గేదెల వెనుక కొంగలు చాలా హడావిడిగా పరిగెడుతున్నాయి ఆ గేదెలపై ముసిరే పురుగులను తినడానికని...
ఊళ్ళో చాలామంది ఇళ్ళల్లో ఎర్రటి రాధామనోహరపూలు గుత్తులు గుత్తులుగా పూచి ఆ భారంతో తలలు కిందకి వేళ్ళాడేస్తూ కనపడుతున్నాయి.విష్ణుకాంతం పూలపై చిన్న చిన్న సీతాకోకచిలుకలు ఒకదానికొకటి అందీ అందకుండా తోసుకుంటూ,,తప్పించుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నాయి...పూరేడు పొదల్లో దూరి పిచుకలు చాలా అల్లరి చేస్తున్నాయి...దాదాపుగా ఎవరిళ్ళళ్ళో చూసినా నీలగోరింటపూలు కనపడుతున్నాయి ఈ కాలంలో..
ఈ ఋతువులో సూర్యోదయం ఎంత బాగుంటోందో తెలుసా?
మా ఇంటికి దగ్గరగా కొన్ని వందల ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజావారు త్రవ్వించిన సువిశాలమైన ఓ చెరువు 3 గ్రామాలను కలుపుతూ వంద ఎకరాలలో విస్తరించి ఉంది...అక్కడ చూడాలి ఈ సూర్యోదయపు అందాన్ని...
తొలిసంధ్యా సమయంలో సూర్యుని నుంచి వచ్చే మెత్తటి సింధూరపు రంగు గల కాంతి ఆ చెరువు నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటే " ఆంజనేయస్వామి ఇక్కడకి దగ్గరలో ఉన్న కత్తిపూడి కొండలపై ఓ కాలూ,,అన్నవరం కొండలపై మరో కాలూ వేసి సూర్యుని దగ్గర వేదం నేర్చుకుంటున్నాడేమో...!!! అందుకే కాబోలు,,ఆయన వంటి రంగు ఇలా ఈ నీళ్ళల్లో కనిపిస్తోంది...!!! అని అనిపిస్తూ ఉంటుంది....
సూర్యాస్తమయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందిక్కడ...
సూర్యుడు అవతలి గట్టుకీ,ఇవతల గట్టుకీ మధ్య స్వర్ణవారధి కడుతూంటాడు ప్రతీ సాయంత్రమూ తన కిరణాలతో...చూడటానికే కళ్ళు మిరుమిట్లుగొలిపేంత ప్రకాశవంతమైన బంగారపు రంగు కాంతి ఆ నీళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది అసురసంధ్యవేళ ఇక్కడ..చూడటానికి చాలా అద్భుతమైన దృశ్యాలు ఇవి...
ఒక్క ఇవనే కాదు....చూసి,,స్పందించి,ఆనందించే లక్షణం హృదయానికుండాలేగానీ ప్రతీది ఆనందం కలిగించే విషయంగానే తోస్తోంది నాకిక్కడ....
శుభసాయంత్రం :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి