14 జనవరి, 2017

యండమూరి వీరేంద్రనాధ్ గారు రాసిన ఆనందోబ్రహ్మలో సంక్రాంతి వర్ణన



" ప్రత్యూషం, ఆ రోజు సంక్రాంతి.

భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు
పసుపు! మిరపపంట కుంకుమా!!

గరిక పోచలమీద రాత్రి తాలూకు నీటి చుక్కలు
మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి. సంక్రాంతి
అవటంవల్ల మామూలుకన్నా ఊరు తొందరగా
మేల్కొంది. ఆడపిల్లలు పోటీపడి వేసిన ముగ్గులు
వీధిలోకి వ్యాపించి వున్నాయి.

అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకెవేసి
డొంకదారి బట్టింది. గెల్చిన రాజులా ఆమని, సర్వాంగ
భూషితయై రావటానికి తయారవుతూంది.

గోవు పేడతో చేసిన గొబ్బిళ్ళమీద అందంగా
పసుపుబొట్టు పెట్టి - పిండి, కూర కొనలూ,
తంగేడు పూలూ సర్ది, మీదే రేగుపళ్ళు పోసి,
పదారేళ్ళ పడుచు పిల్లలు పరికిణీ గలగలలు వెనుక
వాద్య సంగీతాలుగా శబ్దం చేస్తూంటే లయబద్దంగా
తిరుగుతూ పాడుతున్నారు.

"సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే
తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే.
చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే -"

మనసులో అసలు పాట అదికాదట. ఎవరో కవి అన్నాడు -
ముసి ముసి నవ్వుల్తో రవ్వంత కంఠం తగ్గించి
లోలోపల పాడే పాట వేరే ఇంకొకటట.

మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే...
గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే.

అదట అసలు కోరిక! 

పండక్కొచ్చిన కూతుళ్ళూ,
అల్లుళ్ళూ, పిల్లా మేకా మొత్తం యింటిల్లిపాది కోసం
తెల్లారే లేచి వంట మొదలు పెట్టిన అమ్మకీ, నిద్రలేచీ
పక్కమీద నుంచి ఇంకా లేవని నాన్నకీ వినపడకుండా,
తమలో తామే మోచేత్తో పొడుచుకుంటూ గుసగుస
నవ్వులమధ్య పాడే అసలు పాట అదట.

ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు డమరుకాన్నీ,
అట్నుంచి జంగందేవర గంటనీ పట్టుకుని
బయల్దేరారు. అన్నాళ్ళూ ఏమయ్యారో గానీ
బాలసంతువాడు, పెద్దమాలవాడు కూడా
దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్క చిక్కిన
గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి
ఇంటింటిముందూ ఆపి నమస్కారం
చేయిస్తున్నాడు. పక్కూళ్ళో జరిగే పొట్టేళ్ళ పందేనికి
కుర్రకారు అప్పుడే బయల్దేరుతున్నారు.
కోడిపందేలు సరేసరి.

అప్పటికే ఆలస్యమయిపోయిందని ఆయన వడివడిగా
నడుస్తున్నాడు. ఆయన కదుల్తూంటే వరణా
తరంగిణీ దరవికస్వర నూత్న కమలకషాయ
గంధము.....ప్రత్యూష పవనాంకురములు
పైకొనువేళ - అన్న ప్రవరాఖ్యవర్ణన గుర్తొస్తుంది.
అయితే ఆయన ప్రస్తుతం భాషాపరశేషభోగి! అందానికి
వారసుడు మాత్రం వెనుక నడుస్తూన్న సోమయాజి.
అతడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ఇంకా
కుర్రవాడు! అలేఖ్య తనూవిలాసుడవటానికి మరి
నాలుగయిదేళ్ళు పడుతుంది. అయినా అప్పుడే
అమ్మాయిలు గొబ్బిళ్ళు సర్దే మిషమీద, ముందున్న
ముసలాయన గమనించకుండా వెనుకనున్న ఆ
కుర్రాడిని ఓరగా చూస్తున్నారు.

ఇద్దరూ ఊరి పొలిమేరల కొచ్చారు. వారి ఇంటి
నుంచి అరగంట నడక. దూరంలో వుంది గోదారి.
అక్కడ పడవల రేవు లేదు. స్నానాల రేవు ఉంది. కానీ
జనం అంతదూరం వెళ్లరు. సన్నటి పాయ ఊరిలోకి
వస్తుంది. గోచీలు కట్టుకుని కుర్రవాళ్ళు ఆ
పాయలోకి దూకుతారు. అక్కడ అంతా కంగారు. ఆయన
కదినచ్చదు. అందుకే దూరం వెళ్తాడు.

ఊరు రాతగానే పొలాలు కోసిన మళ్ళలో ఒక గిత్త తోక
పైకెత్తి పరుగెడుతూంది. కందిచేలు కోతకి
సిద్దమయ్యాయి. పరిగలేరుకోవటానికి అప్పుడే పొలాల్లోకి
చేరారు కొందరు.

"ఈ రోజు కూడా బడి వుందిరా?"

"ఉంది తాతయ్యా!"

"సంక్రాంతి పూట బడి ఏమిట్రా?"

"ఈసారి మొదటిస్థానం మాకే రావాలని మావాళ్ళు చాలా
పట్టుదలగా వున్నారు తాతయ్యా అందులోనూ మా
అయ్యవారికి ఈ దేముళ్ళ మీదా, పండగలమీదా నమ్మకం
లేదు" అంటూ ఆయన మొహంలోకి చూశాడు. అయితే
ఆ మోహంలో తిరస్కారం ఏదీ కనపడలేదు.

"తనమీద తాను నమ్మకం పెంచుకున్న మనిషికి
దేముడి అవవరం లేదురా అబ్బీ. అయితే మీ
అయ్యవారు అంత ధీశాలా? లేక పిడివాదంతో తర్కంచేసే
మూర్ఖుడా?"

సోమయాజి తబ్బిబ్భై ఆయనవైపు చూశాడు. నాలుగు
వేదాల్నీ నలిగులిపట్టిన ఈ నలిమేలి దొర ఏ గొప్ప
హేతువాదికీ తీసిపోడు. అలా అని తన నమ్మకాల్తో
అవతలివారిని నొప్పించడు.

ఇంతలో రేవు దగ్గిరపడింది.

రేవులో మరికొందరు స్నానం చేస్తున్నారు.
సోమయాజి మిత్రులు కూడా వున్నారు అందులో.
ఆ రోజు గోదావరి కాస్త అలిగినట్టుంది. వడివడిగా
ప్రవహిస్తూంది.

గోదావరిని చూస్తే అతడికి తన తల్లి గుర్తొస్తుంది.
అతడికి తల్లి గురించి ఏమీ తెలీదు. అంతా చెప్పింది
తాతయ్యే ఆయన చెప్పినదాన్ని బట్టి ఆమె ఒక
అద్భుతమైన వ్యక్తి అయి వుండాలని తోస్తుంది.
ఆమె నుంచి దూరమయ్యాక పిన్నమ్మల్లో,
అక్కయ్యల్లో అమ్మని చూసుకోవాలని అతడు చాలా
ప్రయత్నించాడు. ఒక్కరూ సరిరాలేదు. చివరికి తన
తాతయ్యలోనే తల్లిని కనుగున్నాడు.

మోకాలి లోతుకి దిగాడాయన. దోసిలిలోకి తీసుకున్న నీటిలో
సూర్యుడు ప్రతిబింబిస్తూ వుండగా అన్నాడు -

"సంక్రాంతిలో విశేషమేమీ లేదురా మకరరాశిలోకి
సూర్యుడు ప్రవేసించటంలోనూ విశేషమేమీ లేదు.
కానీ కాసిని తిండిగింజలకోసం చెట్టుకోక పక్షిగా వెళ్ళిన
కొడుకులూ ఆడపిల్లలయిన ఈడపిల్లలూ, వాళ్ళ
కొడుకులూ అందరూ కలవటంలో విశేషం వుంది.
ఆదిరా పండగంటే! ఒక పండగ వెళ్ళగానే మరో
పండగకోసం ఎదురు చూడటంలో తృప్తి వుంది.
అదే లేకపోతే రోజులు నిస్సారంగా, మనకీ, పశువులకీ
తేడా లేకుండా గడిచిపోతాయి. "మనిషి బ్రతుకే ఒక పండగ
అని నిరూపించటం కోసమే పండుగ" అంటూ చెప్పి
ఆయన నీళ్ళలో మునిగాడు. "

చాలా చక్కగా వర్ణించారుకదూ సంక్రాంతి వాతావరణాన్ని 👌

శుభసాయంత్రం 😊

సంక్రాంతి శుభాకాంక్షలు 😄 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి