23 మార్చి, 2016


తెలుగు భాష ఎంత గొప్పగా ఉంటుంది? అని ఎవరైనా మిమ్మలని అడిగితే వారికో త్యాగరాజ స్వామి వారి కృతి ఒక్కటి పరిచయం చెయ్యండి చాలు...!!! ' తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా? ' అని వారే మిమ్మలని ఆశ్చర్యంతో తిరిగి ఎదురు ప్రశ్నిస్తారు కూడా...

అంత అద్భుతంగా ఉంటాయి త్యాగరాజ స్వామి వారి కృతులు..  సాధారణంగా పాడడానికి అన్నమాచార్యులవారి కీర్తనలంత సులువుగా ఉండవు త్యాగరాజ కృతులు..కానీ ఆయన రచించి ఆలపించిన ఆ కృతులను సాధన చేసేకొద్దీ గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది,,అది అనుభవంలోకి వస్తే కానీ అర్ధంకాదు కూడా...

అసలు కృతులా అవి?? కాదు...అమృత  ధారలు...ఆ ధారల్లో స్నానాలాడే అదృష్టం మనందరిదీ,,,

ఆ కృతులలో ఉండే పదాల ప్రవాహం,,అవి గొప్పగా ఇచ్చే శబ్దం,,అందులోని సాహిత్యం తాలూకు భావం ఇవి ఇచ్చిన ఆనందానికి ఒకసారి అలవాటైతే మళ్ళీ మరో దారి వెతుక్కోక్కర్లేదు ఆనందానికై మనం (" మందార మకరంద మాధుర్యమునతేలు మధుపము పోవునే మదనములకు?" అనే పోతనగారి పద్యంగుర్తుచెయ్యక్కర్లేదుగా ఇప్పుడు మీకు?) ....అంత అద్భుతమైన ఆత్మానందాన్ని,,సంతోషాన్ని కలగ చేస్తాయి త్యాగరాజ స్వామి వారి కృతులు :)

ఆ ఆనందానికి అలవాటుపడే నేను గత కొన్ని నెలలుగా త్యాగరాయ కృతులే మాత్రమే వింటున్నాను ఎక్కువగా...

ఎప్పుడైనా నాకు కాస్త చిరాకుగా,,బోర్గా అనిపిస్తే ఏదో ఓ 3 నిమిషాలలో ముగిసిపోయే త్యాగరాజ కృతి విన్నా కూడా ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది..

ఇక ఘన పంచ రత్న కీర్తనల సంగతి సరేసరి..నాకు వీలున్నప్పుడలా సాయంత్రం స్నానం చేశాక ఆ తడి తువ్వాలు కట్టుకుని,తడి శరీరంతోనే నా గదిలోకెళ్ళి మొత్తం లైట్లు ఆర్పేసి ఓచోట కూర్చుని నా ఎదురుగా చిన్న నూనె దీపం వెలిగించుకుని పంచరత్న కీర్తనలు వింటూ ఉంటాను...

అలా కళ్ళుమూసుకున్నాక,,గాలికి అటూ ఇటూ కదులుతూ వెలుతురిని గదిమొత్తం ప్రసరింపచేస్తున్న మెత్తటి ఆ దీపపు కాంతి వెలుగులో,,,ఆ నూనె దీపం నుంచి వచ్చే వాసనని అనుభవిస్తూ అలా ఆ నిశబ్ద వాతావరణంలో పంచరత్న కీర్తనలు వినడం బాగా ఇష్టం నాకు...

" సాధించెనె ఓ మనసా సాధించెనె " అన్నట్లు నా మనసుకూడా ఏ ఆలోచనలు రాని ఓ ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో :)  శరీరంకూడా తేలికైనట్లు అనిపిస్తూ ఉంటుంది,,శ్వాస పీలుస్తున్నాననే ధ్యాస కూడా ఎరుకలోకి రాకుండా ఏదో నిద్రలో ఉన్నట్లుగా ఉంటుంది అప్పుడు,,నిద్ర కూడా కాదది...కేవలం ఆనందం తాలూకు ఉద్వేగం ఏదో తెలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది గుండె దగ్గర...చిటికిన వేలు కదిపినా ఈ స్థితి చెదిరిపోతుందేమో అనే భావం కలిగి మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ ఉంటాను నాకు తెలియకుండానే ఆ సమయంలో...!!!

మానసిక మౌనం కలిగే ఆ స్థితి గురించి ఏమని చెప్పగలను??

అంత గొప్ప తాదాత్మ్యతలోని సంతృప్తి మీకూ అనుభవంలోకి వస్తే మీరే ఒప్పుకుంటారు నా ఈ మాటలని...ఓ సారి వీలైతే నేను చెప్పిన విధంగా ప్రయత్నించి చూడండి,,తర్వాత మీ అనుభవాన్ని ఇక్కడ కామెంట్గా రాయండి..

శుభసాయంత్రం :)

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి